
విద్యుత్ ఉద్యోగుల ముఖాముఖిలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దీంతో అటెండర్ నుంచి సీఎండీ వరకు అందరూ సమానమే అనే భావన
ఎస్పీడీసీఎల్ సిబ్బందితో ముఖాముఖిలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలోని సిబ్బందికి యూనిఫాం (ఒకే రూపం దుస్తులు) అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డిస్కంలో పనిచేస్తున్న అటెండర్ మొదలు సీఎండీ వరకు అందరూ ఒకటే అన్న భావన తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూనిఫాం డిజైన్ చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారం తీసుకుంటామని చెప్పారు. సోమవారం ప్రజాభవన్‌లో ఎస్పీడీసీఎల్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ క్షణం కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించామన్నారు. ఈ ఏడాది మార్చిలో 17,162 మెగావాట్లకు పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు సిబ్బందిని భట్టి అభినందించారు.
రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ విస్తరణతో పాటు డేటా సెంటర్స్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు కావాల్సిన విద్యుత్ గురించి ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.