సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హెయిన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో ఎస్టీ టెలిమీడియా క్యాంపస్ ఏర్పాటు కానుండటమే ఉదాహరణ: సీఎం రేవంత్
సింగపూర్ పర్యటన రెండో రోజున పలు సంస్థలు,ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర బృందం భేటీలు
రూ.3,500 కోట్లతో ఎస్టీ టెలిమీడియా ‘గ్లోబల్ డేటా సెంటర్’ ఏర్పాటుకు ఒప్పందం
ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో స్థాపనకు నిర్ణయం
సింగపూర్ వాణిజ్య మంత్రితోనూ సీఎం రేవంత్ బృందం భేటీ
వివిధ రంగాల్లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానం
సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులపై అధ్యయనం కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు నిర్ణయం
రాష్ట్రంలో సెమీకండక్టర్ల రంగ పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఎస్‌ఐఏ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని, సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలి మీడియా భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకురావడం దీనిని చాటి చెబుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఎస్టీ టెలి మీడియా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది.
ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ‘గ్లోబల్ డేటా సెంటర్’ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు.
భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కానుండటం... ఇక్కడి మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగాల్లో వస్తున్న మార్పుల్లో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇక తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, సీఈవో బ్రూనో లోపెజ్ ప్రశంసించారు.
భారీగా విస్తరణ దిశగా..
ఇప్పటికే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎస్టీ టెలీమీడియా కొత్త క్యాంపస్ ఏర్పాటుతో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. వంద మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే కొత్త క్యాంపస్ సామర్థ్యాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెంచనుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో తమ డేటా సెంటర్లను ఒక గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా వచ్చే పదేళ్లలో ఎస్టీ టెలీమీడియా సుమారు 3.2 బిలియన్ డాలర్లను (సుమారు రూ.27 వేల కోట్లు) పెట్టుబడిగా పెడుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం రేవంత్
సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హెయిన్‌తో సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో.. తెలంగాణ, సింగపూర్ ప్రభుత్వాలు కలసి పనిచేసేందుకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ వివరించారు.
తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హెయిన్ స్పందిస్తూ.. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై అందిన ఆహ్వానాన్ని పరిశీలిస్తామని, తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి వనరుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై ఆసక్తి చూపడంతోపాటు పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలసి పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవడంపై చర్చించారు.
సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి సింగపూర్ ఆసక్తి
సింగపూర్ పర్యటనలో భాగంగా శనివారం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌ఐఏ)తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అందించే సహకారం, ప్రోత్సాహకాలు, ఇతర అనుకూలతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కీలక కేంద్రంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధులు... సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపారు. ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు, విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయని ఈ భేటీ అనంతరం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment