అమెజాన్ సంస్థ ప్రతినిధికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
దావోస్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం
భారీ ఫలితం సాధించినట్లు వెల్లడి
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఒప్పందాల్లో ఇదే రికార్డన్న సర్కార్
వివిధ కంపెనీలతో పలు కీలక ఒప్పందాలు
గత ఏడాదితో పోలిస్తే నాలుగింతలు పెరిగిన పెట్టుబడులు
49,500 ఉద్యోగాల కల్పనకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది.
గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు
దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది.
వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది.
అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్
‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది.
వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్‌ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment