ఆ దేశ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకుండానే 195 దేశాలు సందర్శించే అవకాశం
ఆ తర్వాత స్థానంలో జపాన్...193 దేశాలు వీసా లేకుండా విజిట్ చేసే ఛాన్స్...
ప్రపంచర్యాంకుల్లో 85వ స్థానంలో నిలిచిన భారత్...మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లొచ్చు...
హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో వివిధ అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : విదేశీ పర్యటనలు, దేశ పౌరులుగా గుర్తింపు విషయంలో పాస్‌పోర్ట్ అనేది కీలక డాక్యుమెంట్‌గా నిలుస్తోంది. దేశ సరిహద్దుల్లో ఐడెంటీ, వలసదారులను రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ముఖ్యమైన పత్రంగా మారిన విషయం తెలిసిందే. విదేశాలకు విద్య, వైద్యం, పర్యాటకం, తీర్థయాత్రలు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేందుకు, మళ్లీ స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు పాస్‌పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి. వివిధ అధికారిక లేక వ్యక్తిగత, కుటుంబపరమైన విధులు, అవసరాలకు కూడా ఇది అధికారిక గుర్తింపుగా ఉపయోగపడుతోంది. మొత్తంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ‘టికెట్ టు ద వరల్డ్’గా పరిగణిస్తున్నారు.
సింగపూర్ అనే చిన్నదేశం ప్రపంచస్థాయిలో పాస్‌పోర్ట్‌ల గుర్తింపు, వాటి విలువ విషయంలో ‘బాద్‌షా’గా నిలుస్తోంది. ఈ దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే వీసా లేకుండానే 195 దేశాలు సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ గుర్తింపు కారణంగా సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా సింగపూర్ ప్రథమ స్థానంలో కొనసాగుతుండడం ఓ విశేషం.
» పాస్‌పోర్ట్‌ల విలువ, గుర్తింపు విషయంలో ఆ తర్వాతి స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఈ దేశ పాస్ట్‌పోర్ట్ ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే వీలుంది.
»ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్‌లాండ్, దక్షిణకొరియాల పాస్ట్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండానే 192 దేశాలు సందర్శించొచ్చు.
» ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లగ్జ మ్‌బర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పాస్‌పోర్ట్‌లు కలిగిన వారు వీసా అవసరం లేకుండానే 191 దేశాల్లో పర్యటించొచ్చు.
» బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంది.
‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’ఇలా...
ఒకదేశ పౌరుడు స్వేచ్ఛగా ఇతర దేశాల్లో విహరించడం ఆధారంగా... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించి జాబితాను ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’విడుదల చేస్తోంది. ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు...అక్కడకు చేరుకునేలోగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే అవకాశం ప్రాతిపదికన వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లకు ఈ ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులు జరుపుతున్న పర్యటనలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఐఏటీఏ) సమకూర్చిన సమాచారం, వివరాలు, గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్‌లను ఈ సంస్థ నిర్థారిస్తోంది. వివిధ అంశాలతోపాటు, ఫలానా దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న పౌరుడు వీసా లేకుండానే ఏఏ దేశాలకు వెళ్లగలుగుతారు,
ఆయా దేశాలతో ఈ పౌరుడి దేశానికున్న దౌత్యపరమైన సంబంధాలు, ఏ మేరకు అంతర్జాతీయ ఒప్పందాలు కలిగి ఉన్నాయనే దాని ప్రాతిపదికన సమగ్ర విధానాన్ని పాటించి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను సిద్ధం చేస్తున్నారు.
మరింత దిగజారిన భారత్ ర్యాంకింగ్
హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్–2025 నివేదికను బట్టి చూస్తే...భారత్ ర్యాంకింగ్ మరో 5 ర్యాంకులు దిగజారి 85వ ర్యాంక్ (2024లో 80వ ర్యాంక్) వద్ద నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 103 స్థానంలో, బంగ్లాదేశ్ 100వ స్థానంలో ఉన్నాయి. అదే 2021లో ఇండియా 90వ ర్యాంక్ సాధించి మరింత అడుగున నిలిచింది. ఇదిలా ఉంటే 2006 భారత్ 71వ ర్యాంక్‌లో నిలిచి ఒకింత సత్తా చాటింది.
రంగుల వారీగా చూస్తే...
మొత్తంగా 84 దేశాలు నీలంరంగు (బ్లూరంగు షేడ్స్) పాస్‌పోర్ట్‌లతో అత్యధిక రంగులు ఉపయోగిస్తున్న దేశాలుగా ప్రథమస్థానంలో నిలిచాయి. 68 దేశాలు ఎరుపురంగు కలిగిన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉంటే..40 దేశాల పాస్‌పోర్ట్‌లు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి. కేవలం ఏడు దేశాల పాస్ట్‌పోర్ట్‌లే నలుపు (బ్లాక్) రంగులో ఉండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment