ఛా...నెట్ మరీ నెమ్మదిగా పనిచేస్తోంది!! ఇలా మీకెప్పుడైనా అనిపించిందా?అనిపించే ఉంటుంది లెండి....ఎందుకంటే మనం ఉండేది సింగపూర్‌లో కాదు కదా! ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది అక్కడే! మిగిలిన విషయాల మాటేమోగానీ..ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో...భారత్ స్థానం అక్షరాలా 68! సగటు వేగం సెకనుకు 62.45 మెగాబైట్స్ మాత్రమే! ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని నెట్‌స్పీడ్‌లను పరిగణలోకి తీసుకుని మరీ..స్పీడ్‌టెస్ట్ అనే సంస్థ రూపొందించిన జాబితా ఇది!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ వేగం అనేది మనం ఉన్న ప్రాంతంలోని పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. టాప్ ర్యాంక్‌లో ఉన్న సింగపూర్‌లో ఇది సెకనుకు 262.2 మెగాబైట్స్ కాగా..దక్షిణ అమెరికా దేశం క్యూబాలో వేగం కేవలం సెకనుకు 3.46 మెగాబైట్స్ మాత్రమే. ఈ భారీ అంతరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మౌలిక సదుపాయాల గురించి. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు పాతకాలపు రాగి తీగలను వాడుతున్నారా? లేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడుతున్నారా? అన్న అంశంపై వేగం ఆధారపడి ఉంటుంది.
రెండో కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సమాచారాన్ని సరఫరా చేసే సముద్రగర్భ తీగలకు ఎంత దగ్గరగా మనం ఉన్నామన్నది. ఎందుకంటే వీటిద్వారానే దాదాపు 97% సమాచారం ఒకచోటు నుంచి ఇంకోచోటికి వెళుతూంటుంది మరి! ఈ రెండు అంశాల్లోనూ భారత్‌కు కొంత సానుకూలత ఉంది. దేశంలో నెట్ ప్రసారాలకు వాడేది ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే అన్నది అందరికీ తెలిసిన విషయమే. సముద్రగర్భ కేబుల్స్ కూడా దేశానికి ఇరువైపుల ఉండే విశాల తీర ప్రాంతాల ద్వారానే వెళుతూంటాయి. నెట్ వేగాన్ని నిర్ణయించే మూడో విషయం దేశ భౌగోళిక స్వరూపం.
భారత్ లాంటి భారీ దేశాల్లో ఇంటర్నెట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించడం లేదా ఆధునీకరించడం అంత సులువైన పనేమీ కాదు. కేవలం 280 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న, జనాభా సాంద్రత అత్యధికంగా ఉన్న సింగపూర్ లాంటి దేశాలకు చాలా సుళువు. అందుకే అక్కడి నెట్ వేగం అంత ఎక్కువన్నమాట. చివరగా.. ప్రభుత్వ విధానాలు. ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం కూడా వేగాన్ని నిర్ణయిస్తూంటుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను వివిధ కారణాల వల్ల కుదించి ఇచ్చే తుర్కమెనిస్తాన్ వంటి దేశాల్లో సహజంగానే నెట్ వేగం తక్కువగా ఉంటుందన్నమాట.
స్పీడ్‌టెస్ట్ జాబితా రూపొందింది ఇలా...
ప్రపంచదేశాల్లో ఇంటర్నెట్ వేగాన్ని లెక్కించేందుకు స్పీడ్‌టెస్ట్ సంస్థ 190 దేశాల్లో సర్వే నిర్వహించింది. టెలిఫోన్ లేదా భూగర్భ కేబుళ్ల ద్వారా అందే ఇంటర్నెట్ సర్వీసులతోపాటు మొబైల్ కనెక్షన్లనూ పరిగణలోకి తీసుకుని జాబితా రూపొందించింది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితా ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక వేగంతో ఇంటర్నెట్ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోగల దేశం సింగపూర్. ప్రపంచం మొత్తమ్మీద ఇంటర్నెట్ సగటు వేగం సెకనుకు వంద మెగాబైట్ల కంటే చాలా ఎక్కువ. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. గత ఏడాది డిజిటల్ రంగంలో సృజనాత్మక ఆవిష్కరణల కోసమే సుమారు 252 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో కొంత భాగాన్ని టెలికామ్ రంగ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేటాయించింది. అత్యల్ప వేగమున్న క్యూబాలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఇప్పటికీ ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ మాత్రమే అందుబాటులో ఉంది. వేగం సెకనుకు 3.46 మెగాబిట్స్ మాత్రమే. సముద్రగర్భ కేబుళ్లతో అనుసంధానమూ ఇక్కడ తక్కువే. చాలా దేశాలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కేబుళ్లతో అనుసంధానం ఉంటే.. క్యూబాలో కేవలం ఒకే ఒక్క కేబుల్ ద్వారా సేవలందుతున్నాయి. ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల ద్వారా సెకనుకు గిగాబైట్ల వేగంతోనూ ఇంటర్నెట్ అందించవచ్చు.
5జీ వస్తే ఏమవుతుంది?
భారత్‌తోపాటు చాలా దేశాల్లో ప్రస్తుతం నాలుగోతరం ఇంటర్నెట్ టెక్నాలజీని వాడుతున్నారు. దీన్నే 4జీ అని కూడా పిలుస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా అందే గరిష్ట వేగం సెకనుకు వంద మెగాబిట్స్ మాత్రమే! మరి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 195.52 మెగాబైట్ల వేగం ఎలా వస్తోందని సందేహిస్తున్నారా? చాలా సింపుల్. రెండేళ్ల క్రితమే ఆ దేశం సెకనుకు 10 గిగాబైట్స్ డౌన్‌లోడింగ్ సామర్థ్యమున్న 5జీ టెక్నాలజీని ఉపయోగించడం మొదలుపెట్టింది. చైనా ఈ ఏడాది ఈ అత్యాధునిక మొబైల్ ఇంటర్నెట్ సేవలను అందించడం మొదలుపెట్టగా మొబైల్ ఇంటర్నెట్ వేగాల్లో టాప్–10 జాబితాలో ఉన్న దేశాల్లో 5జీ అమలు వివిధ స్థాయుల్లో అమల్లో ఉంది.
మొబైల్ ఇంటర్నెట్‌లో టాప్ దుబాయి!
ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందితే మొబైల్ ఇంటర్నెట్‌లో సెల్ టవర్ల ద్వారా లభిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. స్పీడ్‌టెస్ట్ సిద్ధం చేసిన జాబితా ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో అందరికంటే ముందున్నది యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (దుబాయి). సెకనుకు 195.52 మెగాబైట్ల వేగంతో ఇంటర్‌నెట్‌ను అందుకోవచ్చు. ఈ రంగంలో భారత్ పరిస్థితి మరీ అధ్వాన్నం. మొత్తం 140 దేశాల్లోని మొబైల్ ఇంటర్నెట్ వేగాలను స్పీడ్ టెస్ట్ జాబితాలో నమోదు చేస్తే అందులో సెకనుకు 17.96 మెగాబైట్లతో భారత్ 126వ స్థానంలో ఉంది. సుమారు రెండు మెగాబిట్ల అదనపు వేగంతో పాకిస్తాన్ 120వ స్థానంలో ఉండగా.. కీన్యా, ఇథియోపియా, క్యూబా, ఎల్ సాల్వడార్ వంటి పేద దేశాల్లోనూ సెకనుకు 20 మెగాబైట్ల కంటే ఎక్కువ వేగంతో నెట్ లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment