
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే..
రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు.

Comments
Please login to add a commentAdd a comment