టీడీపీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ మాత్రమే నంబర్ టూగా చెలామణీ అవుతున్నారు. ఆయనకు సంబంధం లేకపోయినా అన్నీ శాఖల్లోనూ అలవిమాలిన జోక్యం చేసుకుంటున్నారు. ఒక్కసారిగా పార్టీమీద పట్టు సాధించాలని స్టేట్ మొత్తం తన కంట్రోల్లో ఉండాలని ఆయన చాలా తాపత్రయపడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటున్నాయి.
ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు తరువాత నంబర్ టూగా అధికారికంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్‌లో సెకెండ్ పొజిషన్ ఉంది. అయితే, తనకు అధికారికంగా పవన్ కన్నా తక్కువ గుర్తింపు ఉండటంతో దాన్ని అధిగమించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. నేడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. అందులో ఎన్టీఆర్ ఫొటోకు అటు ఇటుగా చంద్రబాబు.. లోకేష్ ఫోటోలు ఉంచారు.. అంటే పార్టీలో లోకేష్‌ను ఇంకోమెట్టు ఎక్కించేసారన్నమాట.
పవన్ దూకుడుకు బ్రేకులు..
రాష్ట్రంలో తెలుగుదేశం సభ్యత్వాలు కోటి దాటాయని.. ఇదంతా లోకేష్ ఘనత అని చెబుతూ ఆయన్ను ఉన్నపళంగా అందలం ఎక్కిస్తున్నారు. మరోవైపు, కొంతమంది వీరవిధేయులు అయితే నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నా ఇండిపెండెంట్‌గా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల తొక్కిసలాట సందర్భంలో టీటీడీ ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని.. అవసరం అయితే తానే హోంశాఖను తీసుకుంటానని ప్రకటించడం వంటివి చంద్రబాబుతో పాటు లోకేష్‌కు లోలోన కోపం తెప్పించినా ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో మిన్నకున్నారని అంటున్నారు.
ఇక, కేబినెట్‌లో ఒకే ఒక డిప్యూటీ ఉండటం.. పైగా పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావడంతో ఆయన కాస్త స్వేచ్ఛగా.. మాట్లాడినా.. చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు. పైగా ఆయన్ను నియంత్రించడం.. వంటివి చేస్తే మళ్లీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి కావడంతో ఆయన్ను అలాగే ఉంచి అయన పక్కన డిప్యూటీ హోదాలో లోకేష్‌ను నిలబెడితే ఆటోమేటిక్‌గా పవన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని.. ఇప్పుడు డిప్యూటీగా చేసేస్తే.. మున్ముందు చంద్రబాబు వయసు రీత్యా పదవి నుంచి తప్పుకున్నా లోకేష్‌ను సీఎంగా చేసేయవచ్చు అని టీడీపీ ఆలోచనగా ఉంది. ఇక కేబినెట్‌లో తనకు పోటీగా ఇంకో వ్యక్తిని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ ఎలా స్పందిస్తారో అనేది చూడాల్సి ఉంది.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment