కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.
‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్‌బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.
మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.
తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్‌ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.
కోల్‌కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్‌లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.
కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్‌కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది.
మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్‌కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది.
ప్రస్తుతం సంజయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్‌ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్‌కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment