సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు.
అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
మహిళా సంఘాల నిరసన
మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్‌ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు.


