సందీప్ ఘోష్ అనాథ మృతదేహాలను అమ్ముకున్నారు
ఆస్పత్రి వ్యర్థాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు పంపారు
ఆస్పత్రి మాజీ అధికారి అఖ్తర్ అలీ సంచలన ఆరోపణ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు.
దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.
ప్రతి టెండర్‌లో 20 శాతం కమిషన్
‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.
కొత్త ప్రిన్సిపల్ తొలగింపు
కోల్‌కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్‌బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్‌జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్‌స్పెక్టర్‌ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment