నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం | Tamil New Year Puthandu 2025 History, Significance And Know About Interesting Facts In Telugu | Sakshi
Sakshi News home page

నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం

Published Mon, Apr 14 2025 8:03 AM | Last Updated on Mon, Apr 14 2025 11:03 AM

Puthandu 2025 History and Significance know all about Tamil New year

ఈరోజు (ఏప్రిల్‌ 14) తమిళుల నూతన సంవత్సరం.. తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు’(Puthandu)గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్‌లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని "కై-విశేషం" అని పిలుస్తారు.  కాగా తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ, సొంత భాషకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో తమిళులంతా  తమ భాషలోనే పరస్పరం ‘పుతండు’ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. 

పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు(Lord Brahma) విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని  భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.

పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement