దక్షిణ భారతంతో హిందీ తగువు | Development is mainly linked to modern school education | Sakshi
Sakshi News home page

దక్షిణ భారతంతో హిందీ తగువు

Published Sat, Mar 22 2025 3:32 AM | Last Updated on Sat, Mar 22 2025 3:32 AM

Development is mainly linked to modern school education

దక్షిణ భారతదేశానికి (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ) ఉత్తర భారతదేశానికి ప్రధానంగా కనబడే వైరుద్ధ్యం భాషతో ముడిపడి ఉంది. లిపిలోగానీ, పద ప్రయోగంలో గానీ, ఉత్పత్తి సంబంధితఅవగాహనలోగానీ దక్షిణ భారత భాషలు ఉత్తర భారత భాషలకంటే భిన్నమైనవి.లిపి రూపంలో దక్షిణ భారత భాషలకు ప్రాకృత పాళీ భాషతో సంబంధమున్నా అవిక్రమంగా భిన్నమైన అక్షర రూపం తీసుకున్నాయి. బహుశా దక్షిణ భారత భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం – సంస్కృతం ఈ దేశంలో కాలిడక ముందున్న హరప్పన్‌ భాషతో ముడిపడిఉండవచ్చు. ఈ సంబంధం మీద తమిళనాడులో ఈ మధ్యనే కొంత లోతైన పరిశోధన మొదలైంది.

హిందీ, మరాఠీ, గుజరాతి, రాజస్థానీ పూర్తిగా సంస్కృత ఆధా రిత భాషలు. అక్షర రూపంగానీ, పదకోశంగానీ, అవి బోధించిన జీవన విధానంగానీ సంస్కృత భాష సంస్కృతి నుండి రూపొందించ బడ్డాయి. బెంగాలీ, ఒరియా ఈ భాషా విధానాలకు కాస్త భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అవి పదకోశంలో హిందీతో మైత్రిలో ఉన్నట్టు కనిపిస్తాయి. లిపి భిన్నమైందే. 

అయితే అవి కూడా మాగధి, ప్రాకృతి నుండే ఎదిగాయని వాళ్ళు భావిస్తారు. సంస్కృతం ఇండో–యూరో పియన్‌ భాష అని, బెంగాలీ పూర్తిగా భారతీయ భాష అనీ బెంగాలీలు కూడా భావిస్తారు. అయితే తమిళం లాగా బెంగాలీకి అతి ప్రాచీన చరిత్ర ఉన్నట్టు కనిపించదు. సంగమ సాహిత్యం లాంటి ప్రాచీన ఉనికి ఆధారాలు బెంగాలీకి లేవనే చెప్పాలి.

ఆంగ్లాన్ని అక్కున చేర్చుకున్న దక్షిణాదిదక్షిణ భారత భాషలు అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఆ భాషల వ్యవసాయక మైత్రి వల్ల బాగా మారింది. ఈ ఐదు రాష్ట్రాలు సమతుల్యంగా వ్యవసాయ అభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో, ఇంగ్లిష్‌ భాషను కూడా త్వరగా తమలో లీనం చేసుకోవడంలో ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటి మీద హిందీ భాషను రుద్దినప్పుడు ఒక్క తమిళనాడులోనే పెరియార్‌ రామసామి ఉద్యమం ద్వారా బల మైన వ్యతిరేకత వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో అటువంటి నాయకత్వం లేక హిందీని మోస్తూ వచ్చాయి.

1960 దశకంలో నేను చిన్న గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగు అక్షరాల తరువాత హిందీ అక్షరాలు నేర్పారు. ఆ తరువాత చాలా దూరపు గ్రామంలో ఉన్న మిడిల్‌ స్కూల్లో చేరాక ఇంగ్లిష్‌ అక్షరాలు నేర్పడం ప్రారంభమైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ అక్షర జ్ఞానంలో హిందీ నేర్చుకోవడం కష్టతరంగా ఉండింది. ఇంగ్లిష్‌ అక్షరాలు నేర్చుకోవడం అన్నింటికంటే సులభంగా ఉండింది. 

పదకొండో తరగతి వరకూ హిందీ ఒక సబ్జెక్టుగా చదివినా అది నాకు జీవితంలో ఎటువంటి పనిలో, నేర్పులో ఉపయోగపడ లేదు. నా జ్ఞానాన్ని విస్తృతపర్చలేదు. ఇంగ్లిష్‌లో, తెలుగులో ఎక్కువ జ్ఞానం సంపాదించడానికి నిజానికి హిందీ అడ్డుపడింది. పరీక్షా సమ యాల్లో 25 మార్కులు సంపాదించి పాస్‌ కావడం ఒక టార్చర్‌గా మారేది. నాతో చదువుకున్న మెజారిటీ విద్యార్థుల అనుభవం అదే. 

తమిళనాడు హిందీని స్కూళ్లలో బోధించ నిరాకరించి ఇంగ్లిష్, తమిళ భాషలపై మాత్రమే దృష్టి పెట్టినందున తమిళ బ్రాహ్మణులతో పాటు, తమిళులందరూ లాభపడ్డారు. బహుశా అందులో ఇప్పుడు పెరియార్‌ను దూషణలాడే నిర్మలా సీతారామన్, ఇంగ్లిష్‌ బాగా నేర్చు కున్నందువల్లే విదేశీ మంత్రి అయిన జయశంకర్‌ కూడా ఉన్నారు. పెరియార్‌ తమిళ భాషను బార్బారిక్‌ (ఆటవిక) భాష అన్నారని నిర్మలా సీతారామన్‌ కొత్త సిద్ధాంతం చెబుతున్నారు.

వాళ్లెందుకు ఇక్కడిది నేర్చుకోలేదు?
నేను మూడు భాషల చదువుతో ఆంధ్రప్రదేశ్‌లో కుస్తీ పడుతున్న రోజుల్లో ఉత్తరాది హిందీ రాష్ట్రాల విద్యార్థులు మాత్రం ద్విభాషా విద్యా విధానంలో చదువుకున్నారు. వాళ్లకు ఏ దక్షిణ భారత భాషనూ మూడో భాషగా నేర్చుకునే అవసరం లేకుండింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి. ఈ మధ్యనే ఉత్తరాదిలో నామమాత్రంగా ఏదో ఒక మూడో భాష పాఠశాల స్థాయిలో ఉండాలని నిర్ణయిస్తే హరియాణా మూడవ భాషగా పంజాబీని చేర్చుకుంది.

ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఏ మూడో భాషను త్రిభాషా విధానాల్లో చేర్చారో తెలియదు. అది ఏదైనా అదే సంస్కృత–హిందీ లిపి, పద కోశం ఉన్నవాటిని మూడో భాషగా నామమాత్రంగా పెట్టుకుంటారు. హిందీని దేశ భాషగా అందరి మీదా రుద్దే హిందీవాదుల మాయా వాదం ఇది. ఇది స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశకంలో కూడా జరిగింది. ఇప్పుడు ఆరెస్సెస్‌/బీజేపీ హయాంలో మళ్ళీ మొదలైంది. ఇంకా పెరుగుతుంది. ‘ఏక జాతి, ఏక భాష’ సిద్ధాంతంలో ఇదంతా భాగం.

దక్షిణాది రాష్ట్రాలు చాలా రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటేముందున్నాయనే విషయం తెలుసు. బొంబాయి, గుజరాత్, ఇతర ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్ని పూర్తిగా ఇంగ్లిష్‌ బోధించే ప్రైవేట్‌ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీ వాదులమనే డ్రామా ఆడుతున్నారు. త్రిభాషా నాటకమంతా దక్షి ణాది అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆడుతున్నది.

అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడివడి ఉన్నది. ఆ స్కూలు విద్య దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంకంటే మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కూలు విద్యను పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు స్కూళ్లలో ఇంగ్లిష్‌/ప్రాంతీయ భాషల సెక్షన్‌లను సమాంతరంగా నడుపుతున్నాయి. ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం విద్య నుండి శ్రమజీవుల కుటుంబాలను, కులాలను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం విద్య దక్షిణాదికంతా పాకింది. 

ఈ విద్యను హిందీ ఆధి పత్యవాదం అడ్డుకోజూస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో మెడిసిన్, ఇంజినీరింగ్‌ విద్యను తమిళ భాషలో బోధించాలని దేశ హోంమంత్రి అమిత్‌ షా కొత్త వాదన ప్రారంభించారు. అది ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. అమిత్‌ షా ఎలా బలవంతం చేస్తారు? నిర్మలా సీతారామన్‌ పెరియార్‌పై కూడా దాడి చేస్తున్నారు.

హిందీ మీద అంత ప్రేమ ఉన్న నిర్మలా సీతారామన్‌ తన కూతుర్ని హిందీ మీడియంలో ఎందుకు చదివించలేదు? పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో చదివించి, బ్రిటన్‌ చదువులకు ఎందుకు పంపారు? ఆరెస్సెస్‌ సిద్ధాంతాన్ని అధికారం నిలబెట్టుకోవడానికి వాడుకుంటే అది ఆమె ఇష్టం. కానీ మొత్తం దక్షిణ భారతదేశాన్ని దెబ్బతీసే ఆ సిద్ధాంతాలను ఆమె కూడా రోజువారీ వల్లించడం బాగాలేదు.

అన్నింటికీ తలూపుతున్న బాబు!
హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్‌ సీట్లను తగ్గించే డీలిమిటేషన్‌ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడ వలసి ఉంది. అయితే చంద్రబాబు మద్దతుపై ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ ఆయన వారు ఏమి చేసినా మద్దతు ఇస్తున్నారు. ఒకప్పుడు ‘నేనే కింగ్‌ మేకర్‌ని’ అన్న బాబు ఇప్పుడు మోదీ, అమిత్‌ షా చెప్పింది బడి పిల్లాడిలా పాటిస్తున్నారు. ఆయన ఎంపీలు కూడా ఆయన చేతిలో ఉన్నట్టు కనిపించడం లేదు. సొంత మెజారిటీ లేని బీజేపీ... ఆరెస్సెస్‌ ఎజెండాను అమలు చేసి దక్షిణ భారతాన్ని దెబ్బతీస్తే అందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అవుతుంది.

హిందీ వ్యవహారం గానీ, డీలిమిటేషన్‌ గానీ ప్రమాదకరమైనవి. పవన్‌ కల్యాణ్‌ ఆరెస్సెస్‌ను మించిన రామభక్తుడై మోదీ, మోహన్‌ భాగవత్‌ సైతం అసహ్యించుకునే వేషాలు వేస్తున్నారు. వారి హిందీ, డీలిమిటేషన్‌ వాదనలు తమ వాదనలైనట్టు నటిస్తున్నారు.స్టాలిన్‌ మొదలెట్టిన పోరాటానికి ఒక్క ఏపీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయి. ఇది ముదిరితే ఈ పోరులో చంద్రబాబు ముందుగా మునిగిపోతారు. దక్షిణ భారతదేశం ఆయన్ని ఒక ద్రోహిగా నిలబెడుతుంది.

» అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడి పడి ఉంది. ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్నిఇంగ్లిష్‌ ప్రైవేట్‌ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీవాదులమనే డ్రామా ఆడుతున్నారు.

» హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్‌ సీట్లను తగ్గించే డీలిమిటేషన్‌ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడవలసి ఉంది. కానీ, ఒకప్పుడు ‘నేనే కింగ్‌ మేకర్‌ని’ అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి అన్నింటికీ తలాడిస్తున్నారు.

-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
-ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement