
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్
అభిప్రాయం
కేంద్రానికీ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య ఏకీ భావ, సానుకూల వాతావరణం రోజురోజుకీ చెదిరి పోతున్నది. ఈ నేపథ్యంలో – తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావే శాన్ని ఏర్పాటు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజా స్వామిక కూటమి (ఎన్డీయే)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశంలోని తక్కిన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలు పంపారు.
నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభ జనకు రంగం సిద్ధం చెయ్యటం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవటం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. సమావేశానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్య మంత్రులనూ, ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులనూ స్టాలిన్ ఆహ్వానించారు.
2056 వరకు వాయిదా వేయాలి!
నియోజకవర్గాల పునర్విభజన విషయాని కొస్తే, లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల సంఖ్యను 1973లో ఏర్పాటైన మూడవ డీలిమిటే షన్ కమిషన్ 1971 జనగణన ప్రకారం నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ అన్ని రాష్ట్రాల్లో పక డ్బందీగా అమలయ్యేలా చూడటం కోసం ఇంది రాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2001 జనాభా లెక్కల నాటి వరకు స్తంభింపజేసింది.
జనాభాను తగ్గించుకుంటే దేశ ప్రజలు పరిమిత వనరులతో సుఖంగా బతకగలరనే ఉద్దేశంతో ఉత్తరాదిలో కూడా దానిని సాధించేవరకు పార్లమెంటరీ నియో జకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, 2001 లెక్కల తర్వాత కూడా ఉత్తరాది పరిస్థితిలో మార్పు కనిపించక పోవడంతో అప్పటి వాజపేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు స్తంభింపజేసింది. ఇప్ప టికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
ఇక ఇప్పుడు నియోజక వర్గాల విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 20 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. పునర్విభజన వల్ల ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే అదనంగా 60 స్థానాలు పొందుతుందని అంచనా. అంతేకాదు, లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 19 శాతం తగ్గిపోయి, హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అన్యాయాన్ని తొలగించడం కోసం నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను 2056 వరకు వాయిదా వేయాలని స్టాలిన్ కోరుతున్నారు. అందుకే ఈ ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ సమావేశం.
ఇప్పటికే కేంద్రం నుంచి అందుతున్న నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతుండటం స్పష్టంగానే కనిపిస్తోంది. తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి 2024లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 25 శాతం, సెంట్రల్ జీఎస్టీ ద్వారా 27 శాతం నిధులు కేంద్రానికి అందగా, వాటి నుంచి ఈ రాష్ట్రాలకు 15 శాతం నిధులే వచ్చాయి. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రం నుంచి 36 శాతం నిధులు పొందాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటులో తెలియజేసింది.
ఆంగ్లమే కొనసాగుతుందన్న హామీ!
ఇక తమిళనాడు పాటిస్తున్న ద్విభాషా విధా నానికి చాలా చరిత్రే ఉంది. 1937లో, 1968లో త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రాష్ట్రం దానిని వదిలించుకుంది. 1937లో, అంటే బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించిన సి.రాజగోపాలాచారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పెరియార్ రామస్వామి సహా పలువురు పెద్దలు, ప్రతిపక్ష జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో మూడేళ్ల పాటు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. దానితో హిందీ తప్పనిసరి అనే ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అధికార భాషపై రాజ్యాంగ సభలో వాడి, వేడి చర్చ జరిగింది. ఫలితంగా 1950 (రాజ్యాంగ అవతరణ సంవత్సరం) నుంచి 15 ఏళ్ల కాలం హిందీని అధి కార భాషగా, ఆంగ్లాన్ని అసోసియేట్ అధికార భాషగా కొనసాగించాలని నిర్ణయం తీసుకు న్నారు. దాంతో 1965 తర్వాత దేశానికి హిందీ ఏకైక అధికార భాష కాబోవడాన్ని హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి.
ఆ కారణంగా 1965 తర్వాత సైతం ఆంగ్లాన్ని కొనసాగించడానికి నిర్ణ యిస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో అధికార భాషా చట్టాన్ని తెచ్చారు. అయినా దక్షి ణాదికి హిందీ భయం వదల్లేదు. 1965 దగ్గరపడ టంతో మద్రాస్ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఉద్యమం తిరిగి పుంజుకున్నది. 70 మంది ఆందో ళనకారులు ప్రాణాలర్పించారు. దానితో హిందీ యేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఆంగ్లం అధికార భాషగా కొనసాగుతుందని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి పరిస్థితిని సద్దుమణిగించారు.
ఆధునిక తమిళనాడు రూపశిల్పి సి.ఎన్. అన్నా దురై 1963లో పార్లమెంటులో అధికార భాషల బిల్లుపై చర్చలో మాట్లాడారు. 42 శాతం భారత ప్రజలు మాట్లాడుతున్న భాష గనుక హిందీని జాతీయభాషగా చేయాలనే డిమాండ్‌ను తన సహేతుక వాదనతో తిప్పికొట్టారు. హిందీ మాట్లాడే ప్రజలంతా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఒకే చోట కేంద్రీకృతమయ్యారని, దేశమంతటా విస్తరించి లేరని, అందుచేత హిందీ జాతీయభాష కాజాలదని స్పష్టం చేశారు. ఈ వాదన ఇప్పటికీ వర్తిస్తుంది.
దక్షిణాది ప్రయోజనాలు పట్టని టీడీపీ
వెనుక ఇంత చరిత్ర ఉండగా, ఎన్నికల్లో లబ్ధి కోసం స్టాలిన్ ఈ సమావేశం పెడుతున్నారనటం రాజకీయమే అవుతుంది. కేంద్రం అవలంబిస్తున్న ఫెడరల్ వ్యతిరేక విధానాలపై రాష్ట్రాలను సమై క్యం, సంఘటితం చేయడానికే స్టాలిన్ సారథ్య పాత్ర వహిస్తున్నారు. ‘తెలుగుదేశం’ మూల పురు షుడు ఎన్టీ రామారావు ఏనాడో ‘కేంద్రం మిథ్య’ అన్నారు. రాష్ట్రాల స్వేచ్ఛకు, స్వతంత్ర మను గడకు ప్రాధాన్యమిచ్చే ఫెడరల్ వ్యవస్థను ఆయన గౌరవించారు.
ఈ విషయంలో కేంద్రాన్ని సైతం ఢీకొన్నారు. కానీ ఇప్పటి ఆ పార్టీ నేతలు హిందీని జాతీయ భాషగా అంగీకరించని రాష్ట్రాల హక్కును, ఆ యా భాషల స్వతంత్రాన్ని హరించే ప్రయత్నాలకు అడ్డుచెప్పకపోగా అదే భారతీయత అనే పోకడలను అనుసరిస్తున్నారు. కూటమి భాగస్వాములుగా ఉంటున్నారే తప్ప, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు.
గార శ్రీరామమూర్తి
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment