
ప్రయాగ్‌రాజ్: అంబేద్కర్ జయింతి(Ambedkar Jayanti)కి ముందురోజు ఆ మహనీయుని ఆశయాలకు తూట్లు పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. దేశంలోని కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి నేటికీ దళితులు బలవుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకున్న దళితుని హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని కర్చన తహసీల్‌లోని ఇసోటా లోహగ్‌పూర్ గ్రామంలో దళిత రైతు దేవీ శంకర్ (35) హత్యకు గురయ్యాడు. గ్రామానికి సమీపంలోని ఒక తోటలో అతని మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవీ శంకర్‌ను అగ్రవర్ణానికి చెందిన ఏడుగురు హత్య చేశారు.
పోస్ట్‌మార్టం నివేదిక(Postmortem report)లో దేవీప్రసాద్ ఊపిరాడక మృతిచెందినట్లు నిర్థారణ అయ్యింది. అతని శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఒక మహిళతో జరిగిన వివాదం ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ, అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని, స్థానికుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.
దేవీ శంకర్ భార్య ఐదేళ్ల క్రితం మరణించగా, అతని ముగ్గురు పిల్లలు అతను కలిసివుంటున్నారు. దేవీప్రసాద్ సోదరుడు శ్యామ్‌జీ పోలీసులతో మాట్లాడుతూ తన సోదరునిపై కుట్రపన్ని హత్యచేశారని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గ్రామస్తులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) ఈ హత్యను అత్యంత విచారకరం, ఆందోళనకరమని పేర్కొంటూ రాష్ట్రంలో పటిష్టమైన చట్ట వ్యవస్థను స్థాపించాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తూ సంఘటనా స్థలంలో మద్యం సీసా దొరికిందని, హత్యకు ముందు నిందితులు, బాధితుడు కలిసి మద్యం సేవించివుంటారన్నారు. నిందితులు దేవీ శంకర్‌ను ఇటుకతో కొట్టి, గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలను నాశనం చేసేందుకు, నిందితులు దేవీశంకర్ మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి