వారం రోజులవుతున్నా చిన్నారి అంజుమ్ హంతకులను గుర్తించని పోలీసులు
వారి వ్యవహారశైలిపై సర్వత్రా సందేహాలు
దర్యాప్తు తీరును కనీసం పట్టించుకోని ప్రభుత్వం
తూతూమంత్రంగా సాగుతున్న హత్య కేసు విచారణ
బాలికలు, మహిళల భద్రతలో టీడీపీ కూటమి సర్కారు ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్‌ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు.
.. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు.
సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు..
నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.
చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్‌ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్‌ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.
ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..
పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్‌ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment