
ఆర్‌జీ కర్ హత్యోదంతంలో కోర్టు తీర్పు
అరుదైన కేసేమీ కాదన్న కోర్టు
బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం
పశ్చిమబెంగాల్ సర్కారుకు ఆదేశం
ఉరిశిక్ష విధించాలి: బాధితురాలి తల్లిదండ్రులు
హైకోర్టుకు వెళ్తామని ప్రకటన
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ బోధనాస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవితఖైదు పడింది. స్థానిక సీల్దా కోర్డు సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. దోషిగా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను, సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఆ కోవకు వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ అభిప్రాయపడ్డారు.
2024 ఆగస్ట్ 9న బోధనాస్పత్రి సెమినార్ హాల్‌లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేయడం తెలిసిందే. కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ను ఈ కేసులో దోషిగా జడ్జి శనివారం నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64 (అత్యాచారం), 66 (మరణానికి కారణమవడం), 103 (1) (హత్య) కింద దోషిగా తేల్చారు. సోమవారం మధ్యాహ్నం శిక్ష ఖరారు చే శారు.
నిందితుడు, బాధితురాలి కుటుంబం, సీబీఐ ల వాదనలు విన్నమీదట తీర్పు వెలువరించారు. సంజయ్ బతికినంతకాలం జైళ్లోనే గడపాలని పే ర్కొన్నారు. అతనికి రూ.50,000 జరిమానా కూడా విధించారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘బాధితురాలు విధి నిర్వహణలో చనిపోయినందున రూ.10 లక్షలు, అత్యాచారానికి గురైనందుకు రూ.7 లక్షలు ఆమె కుటుంబానికి పరిహారమివ్వాలి’’ అని పేర్కొన్నారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వీలుంది.
అప్పీలు చేస్తాం: బాధిత కుటుంబం
జీవితఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దోషికి ఉరిశిక్ష వేయాల్సిందే. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తాం. నేరంలో ఇతర భాగస్వాములను వదిలేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? వైద్యురాలు విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది. దీనివెనక పెద్ద కుట్ర దాగుంది’’ అని జూనియర్ వైద్యురాలి తండ్రి అన్నారు.
‘‘నష్టపరిహారం మాకు వద్దు. మిగతా నేరస్తులూ బోనెక్కేదాకా పోరాడతాం’’ అన్నారు. వైద్యురాలి తల్లి కోర్టుకు రాలేదు. తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మీరంతా వెళ్లిపొండి’’ అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహించారు. ‘‘ఘటన జరిగినప్పుడు సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో కచ్చితంగా ఇతరుల పాత్ర ఉంది. వాళ్లనూ చట్టం ముందు నిలబెట్టాలి’’ అని వైద్యురాలి అక్కలు డిమాండ్ చేశారు.
వైద్యుల తీవ్ర అసంతృప్తి
పని ప్రదేశాల్లో తమ భద్రత గాల్లో దీపమని చాటిచెప్పిన ఈ ఉదంతంలో దోషికి ఉరిశిక్ష పడక పోవడం దారుణమంటూ ఆర్‌జీ కర్ ఆస్పత్రి వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ఒక్కని పని కాదు. వ్యవస్థీకృత నేరమిది. ఈ కుట్రలో చాలామంది పాత్ర ఉంది. పరిహారం ప్రకటించేసి జీవితఖైదు విధించడం అసంబద్ధం. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం’’ అని సీనియర్ వైద్యుడు రాజీవ్ పాండే అన్నారు.
మా వాళ్లయితే ఉరి వేయించేవాళ్లు: మమత
తామైతే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కచ్చి తంగా ఉరిశిక్ష వేయించేవాళ్లమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘మేమంతా దోషికి ఉరిశిక్షే కోరుకున్నాం. కేసును సీబీఐ మా నుంచి బలవంతంగా లాక్కుంది. సమగ్రంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. గట్టిగా వాదించలేదు. కోల్‌కతా పోలీసులైతే సమగ్రంగా దర్యాప్తు చేసేవాళ్లు’’ అన్నారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆగ్రహం వెలిబుచ్చారు.
‘‘ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు అసలు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, వెనకుండి సహకరించిన మమతను విచారించాలి’’ అని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన మర్నాడు సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. విచారణ నత్తనడకన సాగుతోందని, బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను, ఇతరలను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment