Allegation corruption
-
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
‘40% కమీషన్’పై న్యాయ విచారణ
బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు..హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్ సారథ్యంలోని కమిటీకి విచారణ బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 40 శాతం కమీషన్ కుంభకోణంపై విచారణ జరిపించడం కూడా ఉంది. భారీగా పనులు చేపట్టిన శాఖలపై ఈ కమిషన్ విచారణ చేపట్టనుంది. అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తమ నుంచి వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అప్పట్లో ప్రధానికి, సీఎంకు లేఖలు రాయడం గమనార్హం. పనులు ప్రారంభించకమునుపే 25 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు అందులో ఆరోపించారు. -
ఆయనే కావాలట !
వివాదాస్పద ‘సహకార’ అధికారి కోసం ఎమ్మెల్యేల సిఫారసులు మంత్రి బొజ్జలను కలిసిన ఆ నలుగురు పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదల కోసం పితాని పైరవీలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :వివాదాస్పద వ్యవహారశైలి, అవినీతి ఆరోపణలతో శాఖాపరమైన చర్యలకు లోబడి విధులకు దూరంగా ఉంటున్న ఓ సహకార శాఖ అధికారి కోసం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఎలాగైనా ఆ అధికారిని జిల్లాకు తీసుకురావాలని లేఖ అందించడం ఇప్పుడు సహకారవర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి.. సహకారశాఖ డెఫ్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాసరావు కొవ్వూరులో పనిచేసిన కాలంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెనుగొండ సహకార సంఘం ఎన్నిక సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. పెనుమంట్ర సహకార సంఘంలో కోట్లాదిరూపాయల బినామీ రుణాల వ్యవహారం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు గతేడాది ఆగస్టు నుంచి ఆయన్ను విధులకు దూరంగా ఉంచారు. విచారణలో వాస్తవాలు నిగ్గుతేలడంతో క్రమశిక్షణ చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రంగంలోకి దిగారు. పితానికి తోడుగా తనకు దూరపు బంధువు అని శ్రీనివాసరావు చెప్పుకునే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జత కలిశారు. వీరిద్దరికి కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా తోడయ్యారు. నలుగురూ కలిసి ఇటీవల హైదరాబాద్‌లో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఆరిమిల్లిని తిరిగి కొవ్వూరు డీఆర్‌గా నియమించాల్సిందిగా సిఫారసు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పితాని సత్యనారాయణ లెటర్‌హెడ్‌పై మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆ లేఖను మంత్రికి అందించినట్టు తెలిసింది. వాస్తవానికి బొజ్జల ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇదే ప్రస్తావన పితాని తీసుకురాగా, ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో పితాని మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లి మంత్రిపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. అవసరమైతే చినబాబు వద్దకు వెళ్లేందుకైనా పితాని సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆరిమిల్లిపైనే ఎందుకంత ప్రేమ? ఆరిమిల్లి చక్కబెట్టిన వ్యవహారాల్లో టీడీపీ నేతల పాత్ర ఉండటంతో ఎటు తిరిగి ఎటొస్తుందోనని ఎమ్మెల్యేలు ఆయన్ను రక్షించేపనిలో ఉన్నారని అంటున్నారు. పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదలపై హైకోర్టు అక్షింతలు వేసినా సంబంధిత శాఖ అధికారిగా ఆరిమిల్లి పట్టించుకోకుండా టీడీపీ నేతల కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ సొసైటీ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుస్తారనే భయంతో కొన్నాళ్లుగా పితాని ఆ ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయిస్తూ వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్ ఇటీవల ఆ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో రంగంలోకి దిగిన పితాని ఆ ఎన్నికను నిలుపుదల చేయాలని కూడా మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సహకార అధికారి, కొవ్వూరు డీఆర్‌లను తప్పించాలని ఒత్తిళ్లు ఆరిమిల్లి శ్రీనివాసరావును జిల్లాకు తీసుకురావాలని సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్, కొవ్వూరు డెఫ్యూటీ రిజిస్ట్రార్ జి.వి.రెడ్డెయ్యలను ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. పెనుగొండ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఇద్దరు అధికారులు ముందుకు వచ్చి నోటిఫికేషన్ జారీ చేయడంతోనే పితాని రంగంలోకి దిగి పావులు కదిపినట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పితాని సహా నలుగురు ఎమ్మెల్యేల సిఫారసులు ఏ మేరకు పనిచేశాయనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. -
మహిళా మెజిస్ట్రేట్‌కు ఉద్వాసన
తిరువొత్తియూరు మెజిస్ట్రేట్ కోర్టు మహిళా న్యాయమూర్తి జయసూర్యకు ఉద్వాసన పలికారు. అవినీతి ఆరోపణలపై సాగిన విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : చెన్నై తిరువొత్తియూరు అప్పాస్వామి ఆలయం వీధిలో మెజిస్ట్రేట్ కోర్టు ఉంది. ఇక్కడ మహిళా న్యాయమూర్తిగా జయ సూర్య రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంగా ఆమెపై ఆరోపణలు బయలు దేరాయి. కేసుల వ్యవహారంలో, నిర్ణయాలు, తీర్పులు, బెయిల్ తదితర విషయాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నట్టుగా బయలు దేరిన ఈ ఆరోపణలు హైకోర్టుకు సైతం చేరాయి. హైకోర్టు రిజిస్ట్రార్‌కు సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తుల ద్వారా నివేదికలు చేరి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం హఠాత్తుగా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భవతారణి, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ తిరువొత్తియూరు కోర్టులో పరిశీలనలు నిర్వహించారు. పొద్దు పోయే వరకు ఈ పరిశీలన, తనిఖీలు సాగి ఉన్నాయి. ఇందులో మహిళా న్యాయమూర్తి అవినీతి బండారం వెలుగులోకి వచ్చి ఉన్నది. పలు కేసుల్లో అవినీతి దొర్లి ఉన్నట్టు తే లడంతో పాటుగా ట్రెజరీకి పంపించాల్సిన జరిమానాల్లోనూ చేతి వాటం చూపించినట్టు తేలింది. అలాగే, కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి తాండవం చేసి ఉన్నట్టుగా గుర్తించి ఉన్నారు. ఈ తనిఖీల అనంతరం రాత్రి పొద్దు పోయాక, ఆమెకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ నిర్ణయం శనివారం ఉదయం తిరువొత్తియూరు కోర్టుకు చేరింది. జయ సూర్యను తాత్కాలికంగా తొలగిస్తూ, ఆ కోర్టు వ్యవహారాల బాధ్యతలను పూందమల్లి కోర్టు న్యాయమూర్తికి అదనంగా అప్పగించారు. మహిళా న్యాయమూర్తి అవినీతి ఊబిలో కూరుకు పోయి పదవిని కోల్పోయిన సమాచారం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.