వివాదాస్పద ‘సహకార’ అధికారి కోసం ఎమ్మెల్యేల సిఫారసులు
మంత్రి బొజ్జలను కలిసిన ఆ నలుగురు
పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదల కోసం పితాని పైరవీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :వివాదాస్పద వ్యవహారశైలి, అవినీతి ఆరోపణలతో శాఖాపరమైన చర్యలకు లోబడి విధులకు దూరంగా ఉంటున్న ఓ సహకార శాఖ అధికారి కోసం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఎలాగైనా ఆ అధికారిని జిల్లాకు తీసుకురావాలని లేఖ అందించడం ఇప్పుడు సహకారవర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి..
సహకారశాఖ డెఫ్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాసరావు కొవ్వూరులో పనిచేసిన కాలంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెనుగొండ సహకార సంఘం ఎన్నిక సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. పెనుమంట్ర సహకార సంఘంలో కోట్లాదిరూపాయల బినామీ రుణాల వ్యవహారం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు గతేడాది ఆగస్టు నుంచి ఆయన్ను విధులకు దూరంగా ఉంచారు.
విచారణలో వాస్తవాలు నిగ్గుతేలడంతో క్రమశిక్షణ చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రంగంలోకి దిగారు. పితానికి తోడుగా తనకు దూరపు బంధువు అని శ్రీనివాసరావు చెప్పుకునే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జత కలిశారు. వీరిద్దరికి కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా తోడయ్యారు.
నలుగురూ కలిసి ఇటీవల హైదరాబాద్‌లో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఆరిమిల్లిని తిరిగి కొవ్వూరు డీఆర్‌గా నియమించాల్సిందిగా సిఫారసు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పితాని సత్యనారాయణ లెటర్‌హెడ్‌పై మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆ లేఖను మంత్రికి అందించినట్టు తెలిసింది. వాస్తవానికి బొజ్జల ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇదే ప్రస్తావన పితాని తీసుకురాగా, ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో పితాని మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లి మంత్రిపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. అవసరమైతే చినబాబు వద్దకు వెళ్లేందుకైనా పితాని సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఆరిమిల్లిపైనే ఎందుకంత ప్రేమ?
ఆరిమిల్లి చక్కబెట్టిన వ్యవహారాల్లో టీడీపీ నేతల పాత్ర ఉండటంతో ఎటు తిరిగి ఎటొస్తుందోనని ఎమ్మెల్యేలు ఆయన్ను రక్షించేపనిలో ఉన్నారని అంటున్నారు. పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదలపై హైకోర్టు అక్షింతలు వేసినా సంబంధిత శాఖ అధికారిగా ఆరిమిల్లి పట్టించుకోకుండా టీడీపీ నేతల కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ సొసైటీ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుస్తారనే భయంతో కొన్నాళ్లుగా పితాని ఆ ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయిస్తూ వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్ ఇటీవల ఆ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో రంగంలోకి దిగిన పితాని ఆ ఎన్నికను నిలుపుదల చేయాలని కూడా మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
సహకార అధికారి, కొవ్వూరు డీఆర్‌లను తప్పించాలని ఒత్తిళ్లు
ఆరిమిల్లి శ్రీనివాసరావును జిల్లాకు తీసుకురావాలని సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్, కొవ్వూరు డెఫ్యూటీ రిజిస్ట్రార్ జి.వి.రెడ్డెయ్యలను ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. పెనుగొండ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఇద్దరు అధికారులు ముందుకు వచ్చి నోటిఫికేషన్ జారీ చేయడంతోనే పితాని రంగంలోకి దిగి పావులు కదిపినట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పితాని సహా నలుగురు ఎమ్మెల్యేల సిఫారసులు ఏ మేరకు పనిచేశాయనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.
ఆయనే కావాలట !
Published Mon, Jan 25 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement
Advertisement