ఆందోళన చేస్తున్న డిపాజిటర్లు
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ సుమారు రూ. 520 కోట్లు డిపాజిట్లుగా సేకరించినట్లు సమాచారం. 1999లో ప్రారంభమైన ఈ సొసైటీకి రాష్ట్రవ్యాప్తంగా 29 శాఖలు ఉన్నాయి. 19,911మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీలతో డిపాజిట్లు సేకరించింది. 12.5 శాతం వడ్డీ వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, వివిధ వర్గాలు ప్రజలు తమ సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
సొసైటీ చైర్మన్‌గా ఆర్‌ఎస్‌ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా ఆర్.బి.విశాలాక్షి, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, డైరెక్టర్లు కలిపి పాలకవర్గంలో మొత్తం 11మంది ఉన్నారు. కొంత కాలంగా వీరెవ్వరూ అందుబాటులో లేకపోవడంతో సభ్యుల్లో ఆందోళన నెలకొంది. 2 నెలలుగా డిపాజిట్‌లు కూడా తిరిగి చెల్లించకపోవడంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగారు. ఇటీవల పిఠాపురం బ్రాంచ్ వద్ద డిపాజిటర్లు ఆందోళన చేశారు. బుధవారం సర్పవరం జంక్షన్‌లోని కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అయినా వారికి ఎవరూ సమాధానం చెప్పకపోవడం, పాలకవర్గం అందుబాటులో లేకపోవడంతో సొసైటీ బోర్డు తిప్పేసిందన్న ప్రచారం జోరందుకుంది.
అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు
కాకినాడ బ్రాంచ్‌లో పనిచేసే సుధాకర్ అనే ఉద్యోగి జయలక్ష్మి సొసైటీలో అవకతవకలు జరిగినట్టు సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిజంగా జయలక్ష్మి సొసైటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? మరేదైనా కారణం ఉందా? ఎందుకు సకాలంలో ఎఫ్‌డీ సొమ్ములు చెల్లించలేకపోతున్నారు? అనేది విచారణలో తేలనుంది. 95 మ్యాక్స్ చట్టం ప్రకారం సభ్యులు, పాలకవర్గం నిర్వహించుకునే బ్యాంకింగ్ లావాదేవీలకు సహకార అధికారుల ప్రమేయం ఉండదు.
అయితే ఫిర్యాదు నేపథ్యంలో కాకినాడ డీసీవో దుర్గాప్రసాద్ ఆదేశాలతో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలోని ముగ్గురు ఉద్యోగుల బృందం బుధవారం రికార్డులు తనిఖీ చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరో ఇద్దరు ఉద్యోగులను గురువారం కాకినాడకు పంపేందుకు సహకార శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీసీవో తెలిపారు. తనిఖీలు పూర్తయ్యేందుకు వారం రోజులు పడుతుందని అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్ తెలిపారు. మరోవైపు కాకినాడ సర్పవరం జంక్షన్ కార్యాలయంలోని ఒక కీలక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment