Co-operative Development Officer
-
బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ!
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ సుమారు రూ. 520 కోట్లు డిపాజిట్లుగా సేకరించినట్లు సమాచారం. 1999లో ప్రారంభమైన ఈ సొసైటీకి రాష్ట్రవ్యాప్తంగా 29 శాఖలు ఉన్నాయి. 19,911మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీలతో డిపాజిట్లు సేకరించింది. 12.5 శాతం వడ్డీ వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, వివిధ వర్గాలు ప్రజలు తమ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సొసైటీ చైర్మన్‌గా ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా ఆర్.బి.విశాలాక్షి, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, డైరెక్టర్లు కలిపి పాలకవర్గంలో మొత్తం 11మంది ఉన్నారు. కొంత కాలంగా వీరెవ్వరూ అందుబాటులో లేకపోవడంతో సభ్యుల్లో ఆందోళన నెలకొంది. 2 నెలలుగా డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించకపోవడంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగారు. ఇటీవల పిఠాపురం బ్రాంచ్ వద్ద డిపాజిటర్లు ఆందోళన చేశారు. బుధవారం సర్పవరం జంక్షన్‌లోని కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అయినా వారికి ఎవరూ సమాధానం చెప్పకపోవడం, పాలకవర్గం అందుబాటులో లేకపోవడంతో సొసైటీ బోర్డు తిప్పేసిందన్న ప్రచారం జోరందుకుంది. అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు కాకినాడ బ్రాంచ్‌లో పనిచేసే సుధాకర్ అనే ఉద్యోగి జయలక్ష్మి సొసైటీలో అవకతవకలు జరిగినట్టు సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిజంగా జయలక్ష్మి సొసైటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? మరేదైనా కారణం ఉందా? ఎందుకు సకాలంలో ఎఫ్డీ సొమ్ములు చెల్లించలేకపోతున్నారు? అనేది విచారణలో తేలనుంది. 95 మ్యాక్స్ చట్టం ప్రకారం సభ్యులు, పాలకవర్గం నిర్వహించుకునే బ్యాంకింగ్ లావాదేవీలకు సహకార అధికారుల ప్రమేయం ఉండదు. అయితే ఫిర్యాదు నేపథ్యంలో కాకినాడ డీసీవో దుర్గాప్రసాద్ ఆదేశాలతో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలోని ముగ్గురు ఉద్యోగుల బృందం బుధవారం రికార్డులు తనిఖీ చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరో ఇద్దరు ఉద్యోగులను గురువారం కాకినాడకు పంపేందుకు సహకార శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీసీవో తెలిపారు. తనిఖీలు పూర్తయ్యేందుకు వారం రోజులు పడుతుందని అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్ తెలిపారు. మరోవైపు కాకినాడ సర్పవరం జంక్షన్ కార్యాలయంలోని ఒక కీలక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
ఆయనే కావాలట !
వివాదాస్పద ‘సహకార’ అధికారి కోసం ఎమ్మెల్యేల సిఫారసులు మంత్రి బొజ్జలను కలిసిన ఆ నలుగురు పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదల కోసం పితాని పైరవీలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :వివాదాస్పద వ్యవహారశైలి, అవినీతి ఆరోపణలతో శాఖాపరమైన చర్యలకు లోబడి విధులకు దూరంగా ఉంటున్న ఓ సహకార శాఖ అధికారి కోసం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఎలాగైనా ఆ అధికారిని జిల్లాకు తీసుకురావాలని లేఖ అందించడం ఇప్పుడు సహకారవర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి.. సహకారశాఖ డెఫ్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాసరావు కొవ్వూరులో పనిచేసిన కాలంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెనుగొండ సహకార సంఘం ఎన్నిక సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. పెనుమంట్ర సహకార సంఘంలో కోట్లాదిరూపాయల బినామీ రుణాల వ్యవహారం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు గతేడాది ఆగస్టు నుంచి ఆయన్ను విధులకు దూరంగా ఉంచారు. విచారణలో వాస్తవాలు నిగ్గుతేలడంతో క్రమశిక్షణ చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రంగంలోకి దిగారు. పితానికి తోడుగా తనకు దూరపు బంధువు అని శ్రీనివాసరావు చెప్పుకునే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జత కలిశారు. వీరిద్దరికి కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా తోడయ్యారు. నలుగురూ కలిసి ఇటీవల హైదరాబాద్‌లో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఆరిమిల్లిని తిరిగి కొవ్వూరు డీఆర్‌గా నియమించాల్సిందిగా సిఫారసు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పితాని సత్యనారాయణ లెటర్‌హెడ్‌పై మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆ లేఖను మంత్రికి అందించినట్టు తెలిసింది. వాస్తవానికి బొజ్జల ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇదే ప్రస్తావన పితాని తీసుకురాగా, ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో పితాని మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లి మంత్రిపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. అవసరమైతే చినబాబు వద్దకు వెళ్లేందుకైనా పితాని సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆరిమిల్లిపైనే ఎందుకంత ప్రేమ? ఆరిమిల్లి చక్కబెట్టిన వ్యవహారాల్లో టీడీపీ నేతల పాత్ర ఉండటంతో ఎటు తిరిగి ఎటొస్తుందోనని ఎమ్మెల్యేలు ఆయన్ను రక్షించేపనిలో ఉన్నారని అంటున్నారు. పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదలపై హైకోర్టు అక్షింతలు వేసినా సంబంధిత శాఖ అధికారిగా ఆరిమిల్లి పట్టించుకోకుండా టీడీపీ నేతల కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ సొసైటీ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుస్తారనే భయంతో కొన్నాళ్లుగా పితాని ఆ ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయిస్తూ వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్ ఇటీవల ఆ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో రంగంలోకి దిగిన పితాని ఆ ఎన్నికను నిలుపుదల చేయాలని కూడా మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సహకార అధికారి, కొవ్వూరు డీఆర్‌లను తప్పించాలని ఒత్తిళ్లు ఆరిమిల్లి శ్రీనివాసరావును జిల్లాకు తీసుకురావాలని సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్, కొవ్వూరు డెఫ్యూటీ రిజిస్ట్రార్ జి.వి.రెడ్డెయ్యలను ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. పెనుగొండ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఇద్దరు అధికారులు ముందుకు వచ్చి నోటిఫికేషన్ జారీ చేయడంతోనే పితాని రంగంలోకి దిగి పావులు కదిపినట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పితాని సహా నలుగురు ఎమ్మెల్యేల సిఫారసులు ఏ మేరకు పనిచేశాయనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.