mlas support
-
మాకు 170 మంది మద్దతుంది
సాక్షి ముంబై/ఔరంగాబాద్: ముఖ్యమంత్రి పీఠంపై రాజీపడేది లేదని శివసేన మరోసారి స్పష్టం చేసింది. తమకు 170 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఒప్పందం శివసేనతో జరగలేదంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాటమార్చడం వల్లనే బీజేపీతో చర్చలను నిలిపి వేశామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని తాము వదిలేది లేదన్నారు. శివసేన అధికార పగ్గాలు చేపట్టేదీ లేనిదీ తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్‌లో మాట్లాడారు. నేడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ‘మహా’డ్రామా కొలిక్కివస్తుందని అంచనావేస్తున్నారు. పవార్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో, ఫడ్నవీస్ బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీకానున్నారు. దీంతో అందరి దృష్టీ దేశ రాజధానిపై ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఐదు ప్రత్యామ్నాయాలను సామ్నా పత్రికలో రౌత్ వివరించారు. ► శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్ ఫిగర్ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ► 2014 ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇలా జరిగితే సుప్రియా సూలేకు కేంద్రంలో, అజిత్ పవార్‌కు రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. కాని, అలాంటి అవకాశమే లేదని స్వయంగా శరద్ పవార్ చెబుతున్నారు. ► బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యం. ► బీజేపీ, శివసేన పంతం మాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా శివసేన డిమాండ్లపై బీజేపీ ఆలోచించాల్సి ఉంది. సీఎం పదవిని విభజించాల్సి రావచ్చు. ఇది అత్యంత ఉత్తమ ప్రత్యామ్నాయం. ► అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు. -
ఆయనే కావాలట !
వివాదాస్పద ‘సహకార’ అధికారి కోసం ఎమ్మెల్యేల సిఫారసులు మంత్రి బొజ్జలను కలిసిన ఆ నలుగురు పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదల కోసం పితాని పైరవీలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :వివాదాస్పద వ్యవహారశైలి, అవినీతి ఆరోపణలతో శాఖాపరమైన చర్యలకు లోబడి విధులకు దూరంగా ఉంటున్న ఓ సహకార శాఖ అధికారి కోసం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఎలాగైనా ఆ అధికారిని జిల్లాకు తీసుకురావాలని లేఖ అందించడం ఇప్పుడు సహకారవర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి.. సహకారశాఖ డెఫ్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాసరావు కొవ్వూరులో పనిచేసిన కాలంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెనుగొండ సహకార సంఘం ఎన్నిక సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. పెనుమంట్ర సహకార సంఘంలో కోట్లాదిరూపాయల బినామీ రుణాల వ్యవహారం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు గతేడాది ఆగస్టు నుంచి ఆయన్ను విధులకు దూరంగా ఉంచారు. విచారణలో వాస్తవాలు నిగ్గుతేలడంతో క్రమశిక్షణ చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రంగంలోకి దిగారు. పితానికి తోడుగా తనకు దూరపు బంధువు అని శ్రీనివాసరావు చెప్పుకునే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జత కలిశారు. వీరిద్దరికి కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా తోడయ్యారు. నలుగురూ కలిసి ఇటీవల హైదరాబాద్‌లో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసి ఆరిమిల్లిని తిరిగి కొవ్వూరు డీఆర్‌గా నియమించాల్సిందిగా సిఫారసు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పితాని సత్యనారాయణ లెటర్‌హెడ్‌పై మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆ లేఖను మంత్రికి అందించినట్టు తెలిసింది. వాస్తవానికి బొజ్జల ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇదే ప్రస్తావన పితాని తీసుకురాగా, ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో పితాని మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లి మంత్రిపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. అవసరమైతే చినబాబు వద్దకు వెళ్లేందుకైనా పితాని సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆరిమిల్లిపైనే ఎందుకంత ప్రేమ? ఆరిమిల్లి చక్కబెట్టిన వ్యవహారాల్లో టీడీపీ నేతల పాత్ర ఉండటంతో ఎటు తిరిగి ఎటొస్తుందోనని ఎమ్మెల్యేలు ఆయన్ను రక్షించేపనిలో ఉన్నారని అంటున్నారు. పెనుగొండ సహకార ఎన్నిక నిలుపుదలపై హైకోర్టు అక్షింతలు వేసినా సంబంధిత శాఖ అధికారిగా ఆరిమిల్లి పట్టించుకోకుండా టీడీపీ నేతల కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ సొసైటీ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుస్తారనే భయంతో కొన్నాళ్లుగా పితాని ఆ ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయిస్తూ వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్ ఇటీవల ఆ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో రంగంలోకి దిగిన పితాని ఆ ఎన్నికను నిలుపుదల చేయాలని కూడా మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సహకార అధికారి, కొవ్వూరు డీఆర్‌లను తప్పించాలని ఒత్తిళ్లు ఆరిమిల్లి శ్రీనివాసరావును జిల్లాకు తీసుకురావాలని సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఇదే సందర్భంలో జిల్లా సహకార అధికారి కె.లూథర్, కొవ్వూరు డెఫ్యూటీ రిజిస్ట్రార్ జి.వి.రెడ్డెయ్యలను ఇక్కడి నుంచి బదిలీ చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. పెనుగొండ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఇద్దరు అధికారులు ముందుకు వచ్చి నోటిఫికేషన్ జారీ చేయడంతోనే పితాని రంగంలోకి దిగి పావులు కదిపినట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పితాని సహా నలుగురు ఎమ్మెల్యేల సిఫారసులు ఏ మేరకు పనిచేశాయనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.