బెట్టింగ్‌లో కీలకంగా లగుడు రవి, బొబ్బిలి రవి
కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న పవన్, నాగబాబు
ఇంకా పరారీలోనే నిందితులు
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
80 అకౌంట్లను పరిశీలించిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్రికెట్ బెట్టింగ్‌లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.
ఇంకా లెక్కతేలాల్సిందే..!
వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్‌ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్‌ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్‌ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదుపులోకి తీసుకోకుండా..!
సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్‌లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.
మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఎవరీ కాకినాడ కార్తీక్!
ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్‌కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్‌కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్‌ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment