ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు | Meat Shops Banned Amid Aero India 2025 This Is The Reason | Sakshi
Sakshi News home page

ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు

Published Sat, Jan 18 2025 5:02 PM | Last Updated on Sat, Jan 18 2025 5:16 PM

Meat Shops Banned Amid Aero India 2025 This Is The Reason

బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బెంగళూరు మహానగరపాలక సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగర శివారులో దాదాపు ఇరవై రోజులపాటు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య బెంగళూరు శివారు యలహంకలో 15వ ఎడిషన్‌ ఎరో ఇండియా షో జరగనుంది. అయితే.. ఎయిర్‌షో జరిగే ఈ ప్రాంతం నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ బెంగళూరు పాలక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

కారణం..
ఏరో ఇండియా సందర్భంగా గగనతలంలో వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అయితే మాంసాహారం కోసం వచ్చే పక్షులు, మరీ ముఖ్యంగా కైట్స్‌ లాంటి పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. 

యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ పరిధిలో.. కేవలం విక్రయాలు జరిపేవాళ్లకు మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డించే హోటల్స్‌, రెస్టారెంట్లకు కూడా ఈ రూల్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. నగరంలోని చెత్తాచెదారాన్ని యలహంక పరిధిలో డంప్‌ చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. బీబీఎంపీ యాక్ట్‌ 2020, ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్స్‌ 1937 రూల్‌ 91 ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది.

1994 నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన విమానాలు, యుద్ధ విమానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో.. రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఎరోస్పేస్‌ కంపెనీల నడుమ భారీ ఒప్పందాలకు ఏరో ఇండియా కేంద్రం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement