వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ప్రపంచ టీమ్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో పాల్గోనుంది. తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగడం ఇది 15వ సారి. తాజాగా ఆమె వాషింగ్టన్ కాజిల్స్ తరఫున పోటీపడనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 12న ప్రారంభం కానుంది. సాధారణంగా దేశంలోని పలు నగరాల్లో ఈ పోటీలు జరిగేవి. అయితే ఈసారి కరోనా మహమ్మారి దృష్ట్యా ఒకే వేదికలో (వెస్ట్ వర్జీనియా) అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇది డబ్ల్యూటీఏ, ఏటీపీ పరిధిలోని టోర్నీ కాదు. కాబట్టి ఇక్కడి గెలుపోటములతో ఎలాంటి పాయింట్లు జతకావు. ర్యాంకింగ్ ప్రభావితం కాదు.
ఔట్‌డోర్ కోర్టులో జరిగే పోటీలకు 500 మంది ప్రేక్షకుల్ని, ఇండోర్ కోర్టులో జరిగే పోటీలకు 250 మందిని అనుమతిస్తారు. వర్షం కురిస్తే మ్యాచ్‌ల్ని ఇండోర్ కోర్టుల్లో నిర్వహిస్తారు. ఫేస్ మాస్క్‌లుంటేనే ప్రేక్షకులకు ఎంట్రీ ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. గతవారం 40వ పడిలోకి ప్రవేశించిన వీనస్ 2011లో అరుదైన కీళ్ల వ్యాధితో బాధపడుతోంది. అప్పట్నుంచి అడపాదడపా కొన్ని ఎంపిక చేసిన టోర్నీల్లోనే ఆడుతోంది. ఈమె ఖాతాలో ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. సోదరి సెరెనాతో కలిసి 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు కూడా గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment