సౌజన్య సంచలనం
ఐటీఎఫ్ టోర్నీ టైటిల్ సొంతం
ఫైనల్లో రెండో సీడ్ ప్రార్థనపై గెలుపు
కెరీర్‌లో రెండో సింగిల్స్ టైటిల్
ఔరంగాబాద్: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సౌజన్య 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ ప్రార్థన తోంబరే (భారత్)ను బోల్తా కొట్టించింది. 20 ఏళ్ల సౌజన్యకిది కెరీర్‌లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. గతేడాది ఈజిప్టులో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో ఆమె తొలిసారి విజేతగా నిలిచింది. 3 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌజన్య కీలకదశలో పాయింట్లు సాధించి నెగ్గింది. విజేతగా నిలిచిన సౌజన్యకు 12 డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ పాయింట్లు, 1,560 డాలర్ల (రూ. 95 వేలు) ప్రైజ్‌మనీ లభించాయి.
విజేత ప్రాంజల
ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నమెంట్‌లో సత్తాచాటింది. చండీగఢ్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-3 ఈవెంట్‌లో ఆమె టైటిల్ సాధించింది. తాజా టైటిల్ విజయంతో ఆమె ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 92వ స్థానానికి చేరింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ పోరులో టాప్ సీడ్ ప్రాంజల 3-6, 6-2, 6-3తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్యవి తంచయివత్‌పై చెమటోడ్చి గెలిచింది.
డేవిస్ కప్ జట్టులో సాకేత్
ముంబై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువ సంచలనం సాకేత్ మైనేనికి భారత డేవిస్‌కప్ జట్టులో స్థానం లభించింది. ఆసియా, ఓసియానియా గ్రూప్-1లో భాగంగా ఇండోర్‌లో జనవరి 31 నుంచి చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది.
లియాండర్ పేస్ వ్యక్తిగత కారణాలతో దూరం కాగా... మహేశ్ భూపతిని సెలక్టర్లు మరోసారి పట్టించుకోలేదు. రోహన్ బోపన్న తిరిగి జట్టులోకి వచ్చాడు. బోపన్నతో కలిసి డబుల్స్ ఆడేందుకు సాకేత్‌ను జట్టులోకి తీసుకున్నారు. సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ సింగిల్స్ ఆడతారు. జీవన్, సనమ్‌సింగ్‌లను రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు. నిజానికి జీవన్‌ను ఎంపిక చేస్తారని భావించినా... సెలక్టర్లు అనూహ్యంగా సాకేత్‌కు అవకాశం ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆడిన ప్రతిసారీ జీవన్‌పై గెలవడం సాకేత్‌కు కలిసొచ్చింది.
టెన్నిస్‌లో తెలుగు వెలుగులు
Published Sun, Jan 12 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement