International Tennis
-
ఇన్ఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్వైటెక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్.. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళా టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్‌ను నియమించుకుంది. కొన్నేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్‌ను ప్రమోట్ చేయడంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినివ్వనుంది. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(ఎస్టీఈఎం–స్టెమ్)లలో వెనుకబడిన మహిళల కోసం ప్రోగ్రామ్‌లను సృష్టించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. మహిళా సాధకులపై స్వైటెక్ అత్యంత ప్రభావశీలిగా నిలుస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వైటెక్‌తో కలిసి ఇన్ఫోసిస్ యువతకు ప్రధానంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌కు కీలకమైన స్టెమ్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించారు. 22ఏళ్ల స్వైటెక్ నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకోవడంతోపాటు.. 2022 ఏప్రిల్ నుంచి ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. -
135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
Barbora Strycova: టెన్నిస్‌కు స్ట్రికోవా గుడ్‌బై
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ‘నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్ట్రికోవా తెలిపింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్‌ను గెలిచింది. డబుల్స్‌లో స్ట్రికోవా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడంతోపాటు 31 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్‌లో రెండింటిలో (2016–సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది. -
సానియా జంట శుభారంభం
హోబర్ట్: భారత స్టార్ సానియా మీర్జా విజయంతో అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. డబుల్స్ తొలి రౌండ్లో సానియా–నదియా జోడీ 2–6, 7–6 (7/3), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ఒక్సానా కలష్నికోవా (జార్జియా)–మియు కాటో (జపాన్) జంటపై గెలిచింది. 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో చివరిసారి ఆడిన 33 ఏళ్ల సానియా ఆ తర్వాత 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చి ఆటకు విరామం ఇచ్చింది. -
మళ్లీ శ్రమించి...
రెండో రౌండ్లోనూ ఐదు సెట్లలో గట్టెక్కిన ఫెడరర్ ⇒ ఏడో సీడ్ దిమిత్రోవ్‌కు షాక్ ⇒ యూఎస్ ఓపెన్ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా, మాజీ విజేతలు జొకోవిచ్, ఆండీ ముర్రే గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉన్న రోజర్ ఫెడరర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. మిఖాయిల్ యూజ్నీతో జరిగిన రెండో రౌండ్లో ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఐదు సెట్లలో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి రౌండ్లో ఫెడరర్‌ను 19 ఏళ్ల అమెరికా కుర్రాడు ఫ్రాన్సిస్ టియాఫో హడలెత్తించగా... రెండో రౌండ్లో 35 ఏళ్ల యూజ్నీ ఈ స్విస్ స్టార్‌కు చుక్కలు చూపించాడు. అయితే పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 71 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన 36 ఏళ్ల ఈ అపార అనుభవజ్ఞుడు రెండు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించడం విశేషం. న్యూయార్క్: తన 18 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో ఫెడరర్ ఒక్కసారి మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఐదు సెట్లు ఆడి గెలుపొందాడు. అదీ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌లో వావ్రింకాపై, ఫైనల్లో నాదల్‌పై ఐదు సెట్లు పోరాడి విజయం సాధించడం జరిగింది. ఏడు నెలల తర్వాత ఫెడరర్ మరోసారి ఈ విన్యాసాన్ని పునరావృతం చేశాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరుకోవడానికి తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 36 ఏళ్ల ఫెడరర్ 6–1, 6–7 (3/7), 4–6, 6–4, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నెగ్గిన ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో 70వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. యూజ్నీతో ఆడిన 17 సార్లూ ఫెడరరే గెలుపొందడం విశేషం. మూడో రౌండ్లో స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల ఫెలిసియానో లోపెజ్‌తో ఫెడరర్ ఆడతాడు. లోపెజ్‌తో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 12–0తో ఆధిక్యంలో ఉన్నాడు. యూజ్నీతో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టిన ఈ స్విస్ స్టార్ 68 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. ‘తొలి రౌండ్లో కంటే బాగా ఆడినందుకు సంతృప్తిగా ఉంది. అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కష్టంగా అనిపించింది. చివరకు గట్టెక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మూడో రౌండ్ చేరుకునే వరకు నేను అంచనా వేసినదానికంటే ఎక్కువగా అలసిపోయాను. అయితే గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాను. ఈ విషయంలో నాకెలాంటి ఆందోళన లేదు’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్లో 4–6, 6–3, 6–2, 6–2తో ప్రపంచ 121వ ర్యాంకర్ తారో డానియల్ (జపాన్)పై కష్టపడి గెలిచాడు. ‘అన్ని మ్యాచ్‌లు క్లిష్టంగానే ఉంటాయి. అయితే గ్రాండ్‌స్లామ్ స్థాయి టోర్నీల్లో అందరూ తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు చూస్తారు’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 3–6, 7–6 (7/5), 6–7 (2/7), 7–6 (7/4), 6–3తో 4 గంటల 19 నిమిషాల్లో గిడో పెల్లా (అర్జెంటీనా)పై నెగ్గగా.. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–5, 7–6 (7/3), 6–3తో ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను బోల్తా కొట్టించడం విశేషం. 2009 చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–2, 6–3, 7–6 (7/3)తో అడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 4–6, 7–5తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచారు. అన్‌సీడెడ్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) 3–6, 6–1, 7–6 (7/5), 6–2తో 15వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... 18వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 6–7 (3/7), 6–4, 2–6, 7–5తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై కష్టపడి గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో క్విటోవా మహిళల సింగిల్స్ విభాగంలో 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో క్విటోవా 6–0, 6–4తో 18వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. కుజ్నెత్సోవా ఇంటిముఖం... మరోవైపు ఎనిమిదో సీడ్, 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 3–6, 6–3, 3–6తో కురుమి నారా (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో టాప్–8 సీడింగ్స్ క్రీడాకారిణుల్లో ఐదుగురు మూడో రౌండ్‌లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఆరో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఏడో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోగా... ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లో పరాజయం పాలైంది. ప్రపంచ నంబర్‌వన్, గతేడాది రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 6–4తో క్వాలిఫయర్ నికోల్ గిబ్స్ (అమెరికా)పై శ్రమించి గెలిచింది. షెల్బీ రోజర్స్, గావ్రిలోవా రికార్డు... మహిళల సింగిల్స్ విభాగంలో షెల్బీ రోజర్స్ (అమెరికా), దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) ‘రికార్డు’లో భాగస్వాములయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షెల్బీ 7–6 (8/6), 4–6, 7–6 (7/5)తో గావ్రిలోవాను ఓడించి మూడో రౌండ్లోకి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు జొహనా కొంటా (బ్రిటన్), ముగురుజా (స్పెయిన్) పేరిట ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఆ మ్యాచ్‌లో ముగురుజాపై కొంటా గెలిచింది. -
ఆ విషయం తెలియదు.. అయినా తప్పు చేశా
మాస్కో: అవగాహన లేకుండా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినందుకు నిషేధం ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యను నిందించింది. నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను చేర్చినట్టుగా తనను అప్రమత్తం చేయడంలో ఐటీఎఫ్ తగిన ప్రయత్నాలు చేయలేదని షరపోవా పేర్కొంది. 2016 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా షరపోవా నిషేధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమెపై రెండేళ్లు సస్పెన్షన్ విధించారు. తర్వాత నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని నేరుగా అథ్లెట్లకు తెలియజేసి ఉంటే బాగుండేదని షరపోవా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏదేమైనా తెలుసుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకం వాడటం తనదే తప్పని, ఇందుకు బాధ్యత తనదేనని వాపోయింది. ఈ నెల చివర్న జరిగే టోర్నీలో షరపోవా ఆడనుంది. -
ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నిధి, వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు నిధి చిలుముల, శ్రీ వైష్ణవి పెద్దిరెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నిధి 6-2, 7-5తో కర్మాన్ కౌర్ (భారత్)పై నెగ్గగా... వైష్ణవి 7-6 (7/2), 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జి యావో వాంగ్ (చైనా) గాయం కారణంగా వైదొలిగింది. మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-3, 1-6, 6-2తో రష్మీ చక్రవర్తి (భారత్)ని ఓడించింది. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి-రుతుజా ద్వయం 6-0, 6-4తో రష్మీ చక్రవర్తి-కాల్వ భువన జోడిపై నెగ్గి సెమీఫైనల్లోకి చేరింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో రిషికతో వైష్ణవి; ఫాతిమా (ఒమన్)తో నిధి తలపడతారు. -
రెండో సెట్ గెలవకుంటే...
పారిస్: జొకోవిచ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తాను రెండో సెట్ గెలవకుంటే ట్రోఫీ నెగ్గలేకపోయేవాడినని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అన్నాడు. ఆటలో అలుపొచ్చినట్లే కెరీర్ కూడా ముగింపుకొస్తుందని చెప్పుకొచ్చాడు. ఎక్కడైనా మార్పు అనేది తథ్యమని... అది సహజమని అన్నాడు. పాత తరం నిష్ర్కమిస్తుంటే కొత్త తరం దాన్ని భర్తీ చేస్తుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో గ్రేటెస్ట్ స్టార్లతో కూడిన తమ శకం ముగింపు దశకు చేరుకుందని స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. వయసు పైబడుతున్న ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ముర్రే (బ్రిటన్), నాదల్‌లతో కూడిన ‘గోల్డెన్ ఎరా’కు శుభం కార్డు తప్పదని స్వయంగా 28 ఏళ్ల నాదలే అంటున్నాడు. పాత నీరు పోతే కొత్త నీరు సహజమన్న చందంగా దిగ్గజ చతుష్టయాన్ని భర్తీ చేసే కుర్రాళ్లు త్వరలోనే తెరమీదికి వస్తారని రాఫెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో 14వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని అందుకున్న ఈ స్పెయిన్ సంచలనం మార్పును ఆహ్వానించాలని... నేర్పును అందిపుచ్చుకోవాలని ఒక విధంగా యువతకు సందేశాత్మక ధోరణిలో మాట్లాడాడు. 2005లో 19వ యేట ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిమ్యాచ్ ఆడిన ఈ దిగ్గజం ఒక్కసారి మినహా 66 సార్లు విజయబావుటా ఎగురవేశాడు. -
రెండో రౌండ్లో స్నేహ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి స్నేహ పడమట శుభారంభం చేసింది. ఇండోనేసియాలోని బాలిక్పపాన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్నేహ 6-3, 1-6, 6-4తో లెహ్ డా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన స్నేహ రెండో సెట్లో తడబడినా నిర్ణాయక సెట్లో పైచేయి సాధించింది. గురువారం జరిగే రెండో రౌండ్లో నాలుగో సీడ్ బార్బరా బోనిక్ (సెర్బియా)తో స్నేహ తలపడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతోన్న ఇతర భారత క్రీడాకారిణులు అంకిత రైనా, నటాషా పల్హా కూడా ముందంజ వేశారు. టాప్ సీడ్ అంకిత రైనా 7-5, 6-2తో షర్మదా బాలూ (భారత్)పై, నటాషా 6-2, 6-3తో ఎబ్బీ మైయెర్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
డబుల్స్ విజేత రిషిక జోడి
సింగిల్స్‌లో ఫైనల్‌కు ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రిషిక సుంకర సత్తా చాటుతోంది. సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరడంతోపాటు డబుల్స్‌లో షర్మదా బాలుతో కలిసి విజేతగా నిలిచింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్ఎంటీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మద జోడి 6-1, 7-5 తేడాతో ప్రార్థనా తొంబరే-శ్వేతా రాణా ద్వయంపై విజయం సాధించింది. ఇక సింగిల్స్ సెమీఫైనల్లో రిషిక 6-1, 6-0 తేడాతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రార్థనా తొంబరే 7-6(5), 7-5 తేడాతో నటాషా ఫల్హాను ఓడించి తుదిపోరుకు చేరింది. రిషిక, నటాషాల మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తాచాటింది. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆమె డబుల్స్‌లో ఓజస్విని సింగ్‌తో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలోని ఆర్.కె.ఖన్నా టెన్నిస్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 6-2, 6-3తో ఏపీ సహచర క్రీడాకారిణి స్నేహ పడమటపై గెలుపొందింది. బాలికల డబుల్స్‌లో రెండో సీడ్ ప్రాంజల-ఓజస్వినీ జోడి 6-4, 6-1తో భారత్‌కే చెందిన దేవాన్షి భీంజియాని- జీల్ దేశాయ్ ద్వయంపై విజయం సాధించింది. మరో డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నిధి సురపనేని- జెన్నిఫర్ లూకమ్ (భారత్) జంట 3-6, 3-6తో మూడో సీడ్ తమచన్ మొంకూంతోడ్- ప్లోబ్రంగ్ ప్లిప్యూచ్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో పరాజయం చవిచూసింది. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల థాయ్‌లాండ్‌కు చెందిన ఐదో సీడ్ తమచన్తో, డబుల్స్‌లో ప్రాంజల జోడి వసంతి షిండే-ధ్రుతి (భారత్) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలోనూ సత్తాచాటింది. బాలికల డబుల్స్‌లో ప్రాంజల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ ప్రాంజల-ఓజస్విని సింగ్ జోడి 6-2, 6-0తో సిమ్రాన్ కౌర్ (భారత్)- రియా దోషి (సింగపూర్) జంటపై అలవోక విజయం సాధించింది. అయితే స్నేహ పడమట జోడి నిరాశపరిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన మూడో సీడ్ తమచన్ మొంకూంతోద్- ప్లొబ్రంగ్ ప్లిప్యూచ్ ద్వయం 6-2, 6-3తో స్నేహ-సృష్టి స్లారియా (భారత్) జంటపై నెగ్గింది. జెన్నిఫర్ లూకమ్ (భారత్)తో జతకట్టిన ఏపీ అమ్మాయి నిధి సురపనేని జోడి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నిధి జంట 4-6, 6-4, (12-10)తో సంజన (భారత్)-క్వాన్ యూ (హాంకాంగ్) ద్వయంపై గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో శర్మల్ (శ్రీలంక) 6-3, 6-1తో జ్ఞానభాస్కర్ (భారత్)పై నెగ్గాడు. -
సెమీస్‌లో విఘ్నేశ్-వినాయక్ జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విఘ్నేశ్-కాజా వినాయక్ శర్మ జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తిరుచ్చిలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విఘ్నేశ్-వినాయక్ ద్వయం 5-7, 7-6 (10/8), 10-8తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)-జానిస్ లినిగెర్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. అయితే సింగిల్స్‌లో మాత్రం విఘ్నేశ్, వినాయక్‌లకు ఓటమి ఎదురైంది. రెండో రౌండ్లో విఘ్నేశ్ 3-6, 0-6తో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) చేతిలో... వినాయక్ 2-6, 3-6తో శ్రీరామ్ బాలాజీ (భారత్) చేతిలో ఓటమి చవిచూశారు. -
రన్నరప్ సనమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు సనమ్ సింగ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టొరంటోలో శనివారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ పీటర్ పొలాస్కీ (కెనడా) 6-2, 6-2తో రెండో సీడ్ సనమ్ సింగ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సనమ్ 6-3, 3-6, 7-5తో ఐదో సీడ్ మైకేల్ షాబాజ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ సీజన్లో రెండో ఐటీఎఫ్ టైటిల్ చేజిక్కించుకోవాలనుకున్న భారత ఆటగాడి ఆశలపై పొలాస్కీ నీళ్లు చల్లాడు. వరుస సెట్లలో సనమ్ ఆటకట్టించాడు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో సనమ్ తొలి టైటిల్ గెలిచాడు. -
క్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ఆంధప్రదేశ్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భువన 6-4, 6-4తో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-0, 2-6, 7-6 (7/2)తో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవి (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఇతర క్రీడాకారిణులు అనుష్క భార్గవ, మహిత దాడిరెడ్డి, సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఎతీ మెహతా (భారత్) 6-3, 6-0తో అనుష్కపై, ప్రార్థన తోంబ్రే (భారత్) 2-6, 6-2, 7-6 (7/4)తో సౌజన్యపై, శ్వేతా రాణా (భారత్) 7-6 (7/4), 7-5తో మహిత రెడ్డిపై నెగ్గారు. -
సెమీస్‌లో సౌజన్య జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌజన్య భవిశెట్టి-రిషిక సుంకర జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈజిప్టులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సౌజన్య-రిషిక ద్వయం 6-1, 7-6 (7/4)తో మహిత రెడ్డి (భారత్)-ఎల్కీ లెమెన్స్ (బెల్జియం) జోడిపై గెలిచింది. సింగిల్స్ తొలి రౌండ్లో సౌజన్య 6-4, 1-6, 6-1తో నాలుగో సీడ్ సుసాన్ సెలిక్ (స్వీడన్)ను బోల్తా కొట్టించగా... రిషిక 6-1, 7-5తో రోనా బెరిషా (బ్రిటన్)పై నెగ్గింది.