ఆ విషయం తెలియదు.. అయినా తప్పు చేశా
మాస్కో: అవగాహన లేకుండా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినందుకు నిషేధం ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యను నిందించింది. నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను చేర్చినట్టుగా తనను అప్రమత్తం చేయడంలో ఐటీఎఫ్ తగిన ప్రయత్నాలు చేయలేదని షరపోవా పేర్కొంది.
2016 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా షరపోవా నిషేధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమెపై రెండేళ్లు సస్పెన్షన్ విధించారు. తర్వాత నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని నేరుగా అథ్లెట్లకు తెలియజేసి ఉంటే బాగుండేదని షరపోవా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏదేమైనా తెలుసుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకం వాడటం తనదే తప‍్పని, ఇందుకు బాధ్యత తనదేనని వాపోయింది. ఈ నెల చివర్న జరిగే టోర్నీలో షరపోవా ఆడనుంది.