![Telangana player Sahaja Yamalapalli wins another sensational victory](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/4/sahaja.jpg.webp?itok=gHVpPOq-)
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మరో సంచలన విజయం సాధించింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 6–3, 5–7, 6–3తో ప్రపంచ 190వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ మరియా మాటీస్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహజ మూడో సీడ్, 214వ ర్యాంకర్ హీన్ షి (చైనా)ను బోల్తా కొట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 153వ ర్యాంకర్ కథింక వోన్ డెష్‌మన్ (లిష్టన్‌స్టయిన్)తో సహజ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment