sahaja yamalapalli
-
సెమీస్‌లో సహజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మరో సంచలన విజయం సాధించింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 6–3, 5–7, 6–3తో ప్రపంచ 190వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ మరియా మాటీస్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహజ మూడో సీడ్, 214వ ర్యాంకర్ హీన్ షి (చైనా)ను బోల్తా కొట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 153వ ర్యాంకర్ కథింక వోన్ డెష్మన్ (లిష్టన్స్టయిన్)తో సహజ తలపడుతుంది. -
సహజ సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సహజ 5–7, 6–0, 6–2తో మూడో సీడ్ హీన్ షి (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో సహజ 6–3, 6–4తో కమోన్‌వన్ యోద్పెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. -
సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అబీర్టో టాంపికో ఓపెన్ డబ్ల్యూటీఏ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సహజ పరాజయం పాలైంది. టాప్ సీడ్, ప్రపంచ 97వ ర్యాంకర్ నూరియా పారిజా దియాజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 5–7, 4–6తో ఓటమి చవిచూసింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్ర్యాంక్లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు. సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లాస్ఏంజె లిస్లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సహజ (భారత్)–జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్) జోడీ 1–6, 7–5, 8–10తో అరియానా–కేలా క్రాస్ (కెనడా) జంట చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఐటీఎఫ్ టోర్నీ లో సహజ రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. జూలైలో ఇండియానాలో జరిగిన ఇవాన్స్విల్లె టోర్నీలో సహజ–హిరోకో (జపాన్) ద్వయం ఫైనల్లో ఓడిపోయింది. -
భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్‌గా సహజ
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ సహజ యామలపల్లి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల సహజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 302వ ర్యాంక్‌కు చేరుకుంది. చాలా కాలంగా భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న 31 ఏళ్ల అంకిత రైనా 24 స్థానాలు పడిపోయి 307వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సీజన్లో సహజ 27 మ్యాచ్‌ల్లో గెలిచి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతవారం డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన పుంటా కానా ఓపెన్ ఐటీఎఫ్ టోర్నీలో సహజ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇక ఇండియా నంబర్ వన్ ర్యాంకర్‌గా నిలవడం తనకు సంతోషంగా ఉందని.. కీలకమైన మైలురాయిని చేరుకున్నానని సహజ హర్షం వ్యక్తం చేసింది. అయితే, ర్యాంకుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని.. ఆటపై మాత్రమే దృష్టి సారిస్తానని తెలిపింది. -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
డబ్ల్యూటీఏ టూర్లో సహజ అరంగేట్రం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 స్థాయి టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి అరంగేట్రం చేసింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ డబ్ల్యూటీఏ–250 టోర్నీ క్వాలిఫయింగ్‌లో సహజ బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 305వ ర్యాంక్‌లో ఉన్న సహజ తొలి రౌండ్లో 2–6, 1–6తో ప్రపంచ 91వ ర్యాంకర్ జెస్సికా (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. -
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఇవాన్స్విల్లె పట్టణంలో ఈ టోర్నీ జరిగింది. డబుల్స్ ఫైనల్లో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ 2–6, 0–6తో అలీసియా లినానా (స్పెయిన్)–మెలానీ క్రివోజ్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 7–5, 2–6, 6–7 (6/8)తో ఇరీనా షమనోవిచ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 టోర్నీ లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికాలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 318వ ర్యాంకర్ సహజ 6–3, 7–6 (7/5)తో ప్రపంచ 177వ ర్యాంకర్, రెండో సీడ్ ఎలిజబెత్ మాండ్లిక్ (అమెరికా)పై గెలిచింది. డబుల్స్‌లో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ సెమీఫైనల్లోకి చేరింది. -
మెయిన్ ‘డ్రా’కు సహజ అర్హత
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ100 బోనితా స్ప్రింగ్స్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ప్రపంచ 309వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో క్రిస్టినా రోస్కా (అమెరికా)పై గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రషి్మక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. చివరి రౌండ్లో రషి్మక 4–6, 4–6తో విక్టోరియా (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక... డబుల్స్ సెమీస్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... సహజ యామలపల్లి సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి, డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రష్మిక 6–1, 2–6, 6–1తో మర్వాయోవా (స్లొవేకియా)పై గెలిచింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అకీకో ఒమాయి–మె యామగుచి (జపాన్) జోడీపై నెగ్గింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ 1–6, 4–6తో మనన్‌చాయ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ–జీల్ దేశాయ్ (భారత్) జోడీ 6–1, 6–2తో సౌమ్య (భారత్)–మె హసెగావ (జపాన్) జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక , సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. -
పోరాడి ఓడిన సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. గురుగ్రామ్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 5–7, 6–3, 0–6తో టాప్ సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత నంబర్‌వన్ అంకిత రైనా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో అంకిత 4–6, 6–2, 6–4తో జాక్వెలిన్ (స్వీడన్)పై గెలిచింది. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 329వ ర్యాంకర్ సహజ 7–6 (10/8), 7–5తో భారత్‌కే చెందిన రియా భాటియాను ఓడించింది. మరోవైపు తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ శ్రీవల్లి రషి్మక రెండో రౌండ్లో 6–1, 3–6, 6–7 (5/7)తో ఏడో సీడ్ జాక్వెలిన్ కబాజ్ అవాద్ (స్వీడన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సహజ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు ప్లేయర్లు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6–4, 6–2తో జపాన్‌కు చెందిన కొషిషి అయుమిపై గెలుపొందగా, శ్రీవల్లి రష్మిక 6–1, 6–2తో క్వాలిఫయర్ యమజకి ఐకుమి (జపాన్)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్ బరిలోనూ దిగిన రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక–వైదేహి చౌదరి జోడీ 6–0, 6–1తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన భారత జంట కశిష్ భాటియా–సాహిర సింగ్‌పై గెలిచింది. టాప్‌సీడ్ అంకిత రైనా (భారత్)– కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) జంట 2–6, 6–3, 11–9తో జీల్ దేశాయ్ (భారత్)–ఒకువకి రినొన్ (జపాన్) ద్వయంపై గెలిచింది. మిగతా సింగిల్స్ పోటీల్లో రియా భాటియా 7–6 (7/5), 6–4తో భారత క్వాలిఫయర్ అంజలిని ఓడించింది. హుమేరా బహర్మస్ 1–6, 0–6తో కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడింది. -
Aquatic Championship: రజతం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి. -
ITF Women's Tourney 2023: పోరాడి ఓడిన సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సహజ 6–7 (8/10), 3–6తో డయానా మర్సిన్కెవిచా (లాతి్వయా) చేతిలో ఓడిపోయింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకితా రైనా 6–3, 6–0తో వన్షిత (భారత్)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరింది. -
Billie Jean King Cup 2023 tennis: యమ్లపల్లికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా ఓషియానియా గ్రూప్ 1 ఫెడరేషన్ కప్ (బిల్లీ జీన్ కింగ్ కప్)లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. ఈ టీమ్‌లో అంకితా రైనా (ప్రపంచ 241వ ర్యాంకర్), కర్మన్ కౌర్ తాండి (268), రుతుజా భోస్లే (419), వైదేహి చౌదరి (492)తో పాటు హైదరాబాద్‌కు చెందిన సహజ యమ్లపల్లి (454)కి స్థానం లభించింది. నగరానికి చెందిన సహజ అమెరికాలోనే చదువుకుంటూ అక్కడే శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. వైదేహి ఇటీవలే తన రెండో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకోగా, భారత క్రీడాకారిణుల్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న సహజకు కూడా తొలి సారి అవకాశం లభించింది. ‘నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం భావించాం. అందుకే వైదేహి, సహజలను ఎంపిక చేశాం. వీరిద్దరు కొంత అనుభవం సాధిస్తే మున్ముందు తమ సీనియర్లను దాటి మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఉంది’ అని ఏఐటీఏ ప్రతినిధి నందన్ బల్ వెల్లడించారు. మరో వైపు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న విశాల్ ఉప్పల్‌ను తప్పించి అతని స్థానంలో షాలిని ఠాకూర్ చావ్లాను ఎంపిక చేయగా...కోచ్‌గా రాధిక కనిత్కర్ వ్యవహరిస్తుంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో ఏప్రిల్ 10నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. -
చాంపియన్ సహజ
గురుగ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి చాంపియన్‌గా అవతరించింది. గురుగ్రామ్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల సహజ 6–3, 7–6 (7/5)తో మూడో సీడ్ విక్టోరియా (స్లొవేకియా)పై విజయం సాధించింది. సహజ కు 3,935 డాలర్ల (రూ. 3 లక్షల 10 వేలు) ప్రైజ్ మనీ 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఐటీఎఫ్ టోర్నీ సింగిల్స్ చాంపియన్ సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్ ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్లో ఇదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
సహజ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి రెండు టైటిళ్లతో మెరిసింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సహజ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో టాప్‌సీడ్ ప్రతిభ ప్రసాద్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యతో జతకట్టి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో సహజ–సాయిదేదీప్య (తెలంగాణ) జంట 7–6 (7/5), 7–5తో టాప్ సీడ్ షాజిహా బేగం–షేక్ హుమేరా (తెలంగాణ) జోడీకి షాకిచ్చింది. పురుషుల విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్‌కు నిరాశ ఎదురైంది. సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ 6–3, 4–6, 2–6తో భరత్ కుమారన్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో నిక్షీప్–జూడ్ రేమండ్ జంట 7–6 (7/5), 6–4తో కవిన్ మసిలమణి–భరత్ కుమారన్ జోడీపై విజయం సాధించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) కార్యదర్శి అశోక్ కుమార్ మఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీఏ సంయుక్త కార్యదర్శి వి. నారాయణదాస్ పాల్గొన్నారు.