న్యూఢిల్లీ: ఆసియా ఓషియానియా గ్రూప్ 1 ఫెడరేషన్ కప్ (బిల్లీ జీన్ కింగ్ కప్)లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. ఈ టీమ్‌లో అంకితా రైనా (ప్రపంచ 241వ ర్యాంకర్), కర్మన్ కౌర్ తాండి (268), రుతుజా భోస్లే (419), వైదేహి చౌదరి (492)తో పాటు హైదరాబాద్‌కు చెందిన సహజ యమ్లపల్లి (454)కి స్థానం లభించింది. నగరానికి చెందిన సహజ అమెరికాలోనే చదువుకుంటూ అక్కడే శిక్షణ తీసుకుంటోంది.
హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. వైదేహి ఇటీవలే తన రెండో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకోగా, భారత క్రీడాకారిణుల్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న సహజకు కూడా తొలి సారి అవకాశం లభించింది. ‘నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం భావించాం. అందుకే వైదేహి, సహజలను ఎంపిక చేశాం. వీరిద్దరు కొంత అనుభవం సాధిస్తే మున్ముందు తమ సీనియర్లను దాటి మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఉంది’ అని ఏఐటీఏ ప్రతినిధి నందన్ బల్ వెల్లడించారు. మరో వైపు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న విశాల్ ఉప్పల్‌ను తప్పించి అతని స్థానంలో షాలిని ఠాకూర్ చావ్లాను ఎంపిక చేయగా...కోచ్‌గా రాధిక కనిత్కర్ వ్యవహరిస్తుంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ఏప్రిల్ 10నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment