federation cup
-
Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్‌ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిసారి భారత్‌లో 2021 మార్చి 17న భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు. -
స్వర్ణ పతకాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు అనూష, రష్మీ
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. భువనేశ్వర్‌లో ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష... మహిళల జావెలిన్ త్రోలో కె.రష్మీ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. అనూష 13.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షీనా (కేరళ; 13.32 మీటర్లు) రజతం... గాయత్రి శివకుమార్ (కేరళ; 13.08 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇక జావెలిన్ త్రో ఫైనల్లో రష్మీ జావెలిన్‌ను 54.75 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణ కానున్నాడు. మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడుతున్న నీరజ్ మంగళవారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో, బుధవారం జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు. -
మూడేళ్ల తర్వాత స్వదేశంలో నీరజ్ చోప్రా బరిలోకి
ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడనున్నాడు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు భువనేశ్వర్‌లో జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీలో నీరజ్ బరిలోకి దిగుతాడు. ఈనెల 10న దోహాలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌తో నీరజ్ కొత్త సీజన్‌ను మొదలు పెట్టనున్నాడు. డైమండ్ లీగ్ మీట్ ముగిశాక అతను నేరుగా దోహా నుంచి భారత్ చేరుకుంటాడు. చివరిసారి నీరజ్ భారత గడ్డపై 2021 మార్చి 17న జరిగిన ఫెడరేషన్ కప్‌లో పోటీపడి స్వర్ణ పతకం నెగ్గాడు. -
200 మీటర్ల విభాగంలో జ్యోతికి స్వర్ణ పతకం
Federation Cup 2023: జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇవి కూడా చదవండి: పరాజయంతో మొదలు... అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–4 గోల్స్‌తో పరాజయం పాలైంది. భారత్ తరఫున సంగీత (29వ ని.లో), షర్మిలా దేవి (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ మోనిక తన కెరీర్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. సెమీస్‌లో అవ్నీత్ కౌర్ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్నీత్ కౌర్... పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జావ్కర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో అవ్నీత్ 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై, ప్రథమేశ్ 149–148తో చోయ్ యోంగీ (దక్షిణ కొరియా)పై నెగ్గారు. భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. -
Billie Jean King Cup 2023 tennis: యమ్లపల్లికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా ఓషియానియా గ్రూప్ 1 ఫెడరేషన్ కప్ (బిల్లీ జీన్ కింగ్ కప్)లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. ఈ టీమ్‌లో అంకితా రైనా (ప్రపంచ 241వ ర్యాంకర్), కర్మన్ కౌర్ తాండి (268), రుతుజా భోస్లే (419), వైదేహి చౌదరి (492)తో పాటు హైదరాబాద్‌కు చెందిన సహజ యమ్లపల్లి (454)కి స్థానం లభించింది. నగరానికి చెందిన సహజ అమెరికాలోనే చదువుకుంటూ అక్కడే శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. వైదేహి ఇటీవలే తన రెండో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకోగా, భారత క్రీడాకారిణుల్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న సహజకు కూడా తొలి సారి అవకాశం లభించింది. ‘నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం భావించాం. అందుకే వైదేహి, సహజలను ఎంపిక చేశాం. వీరిద్దరు కొంత అనుభవం సాధిస్తే మున్ముందు తమ సీనియర్లను దాటి మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఉంది’ అని ఏఐటీఏ ప్రతినిధి నందన్ బల్ వెల్లడించారు. మరో వైపు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న విశాల్ ఉప్పల్‌ను తప్పించి అతని స్థానంలో షాలిని ఠాకూర్ చావ్లాను ఎంపిక చేయగా...కోచ్‌గా రాధిక కనిత్కర్ వ్యవహరిస్తుంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో ఏప్రిల్ 10నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. -
23 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు
పాటియాలా: ఫెడరేషన్ కప్ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్ హీట్‌లోనూ మరో స్టార్ స్ప్రింటర్ హిమదాస్ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది. -
నాలుగేళ్ల తర్వాత... ‘ఫెడ్ కప్’ టీమ్‌లో సానియా
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సానియా మీర్జా జాతీయ జట్టు తరఫున కూడా పునరాగమనానికి సిద్ధమైంది. ఫెడరేషన్ కప్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టులో డబుల్స్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ సానియాకు చోటు దక్కింది. చివరి సారిగా 2016లో చివరి సారిగా ఫెడ్ కప్ ఆడిన సానియా 2017 అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉంది. భారత సింగిల్స్ నంబర్‌వన్ ప్లేయర్ అంకితా రైనాతో పాటు రియా భాటియా, రుతుజ భోంస్లే, కర్మన్ కౌర్ తాండి టీమ్‌లో మిగిలిన నలుగురు సభ్యులు. హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ టీమ్‌కు మాజీ డేవిస్ కప్ ఆటగాడు విశాల్ ఉప్పల్ కెప్టెన్ గా, మరో మాజీ క్రీడాకారిణి అంకితా బాంబ్రి కోచ్‌గా వ్యవహరిస్తుంది. 2020లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌తో పాటు దానికి ముందు సన్నాహకంగా హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగుతున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించింది. -
తీవ్ర అసంతృప్తిలో పరుగుల రాణి
న్యూఢిల్లీ: ఒలింపిక్ అర్హత సాధించడం కోసం నిర్వహించే పోటీలు(ఫెడరేషన్ కప్) ఢిల్లీలో నిర్వహించడంపట్ల ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉష అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత కలుషిత వాతావరణం కలిగిన ప్రాంతమైన ఢిల్లీలో క్వాలిఫైయింగ్ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఇబ్బంది అని ఆమె అన్నారు. అసలు ఇక్కడ వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. 'ఒలింపిక్ క్వాలిఫైయింగ్ క్రీడల నిర్వహణ కోసం ఢిల్లీని ఎంచుకోవడం నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఢిల్లీ దుమ్ముధూళితో నిండిన భయంకరమైన వాతావరణం కలిగినది. దాదాపు అందరూ అథ్లెట్లు ముఖాలకు ముసుగులు ధరించి శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? వారు ఈ వెంట్ ను మరో ప్రాంతంలోగానీ, లేదా మరోసమయంలో గానీ నిర్వహిస్తే బాగుంటుంది' అని పీటీ ఉష చెప్పారు. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రస్తుతం ఈవెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో గాలి స్వఛ్ఛత చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నారు. -
భారత్ ఓటమి
అస్తానా (కజకిస్థాన్): ఫెడరేషన్ కప్ మహిళల టీమ్ టెన్నిస్‌లో భారత జట్టు వచ్చే ఏడాది కూడా ఆసియా ఓసియానియా గ్రూప్-2లోనే కొనసాగనుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సానియా నేతృత్వంలోని భారత జట్టు 1-2తో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్ 3-0తో తుర్క్మెనిస్థాన్పై గెలిచింది. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ జట్ల మధ్య ఫైనల్లో నెగ్గిన జట్టు వచ్చే ఏడాది గ్రూప్-1 దశకు అర్హత సాధిస్తుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ కీలకమ్యాచ్‌లో తడబడింది. తొలి సింగిల్స్‌లో యూడిస్ చోంగ్ 6-2, 6-1తో ప్రార్థనపై, రెండో సింగిల్స్‌లో లింగ్ జాంగ్ 6-4, 6-3తో అంకిత రైనాపై నెగ్గి హాంకాంగ్ విజయాన్ని ఖాయం చేశారు. డబుల్స్‌లో రిషిక సుంకర-అంకిత రైనా జంట 6-2, 6-1తో క్వాన్ యావు-హో చింగ్ వూ జోడిపై గెలిచినా ఫలితం లేకపోయింది. -
భారత్ హ్యాట్రిక్
అస్తానా (కజకిస్తాన్) : ఫెడరేషన్ కప్‌లో ఇండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆసియా ఓసియానియా గ్రూప్ 2 పూల్-డి చివరి లీగ్‌లో భారత్ 2-1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది. తొలి సింగిల్స్‌లో ప్రార్థన 6-1, 6-4తో డానీ హాలెండ్పై గెలిచి శుభారంభాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో అంకితా రైనా 1-6, 2-6తో ఎరకోవిచ్ చేతిలో ఓటమిపాలైంది. కీలకమైన డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థనతో కలిసి సానియా సత్తా చాటింది. 7-5, 6-1తో భారత్‌కు విజయాన్ని అందించింది. గ్రూప్ ఏ విజేత హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.