భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్‌లో పసిడి పతకం సాధించాడు.
హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.
గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్‌ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
చివరిసారి భారత్‌లో 2021 మార్చి 17న భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment