
జాతీయ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్
చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్ బాబు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన రేస్‌లో రామ్ బాబు 35 కిలోమీటర్ల దూరాన్ని... 2 గంటల 32 నిమిషాల 53.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచాడు. 2022 ఆసియా క్రీడల్లో మంజు రాణితో కలిసి మిక్స్‌డ్ రేస్‌వాక్‌లో కాంస్యం నెగ్గిన రామ్ బాబు... జాతీయ పోటీల్లోనూ అదే జోరు కనబర్చాడు. అయితే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (2 గంటల 29 నిమిషాల 56 సెకన్లు)ను మాత్రం సవరించలేకపోయాడు.
20 కిలోమీటర్ల విభాగంలో... సెబాస్టియన్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 1 గంట 21 నిమిషాల 46.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. అమిత్ (1 గంట 21 నిమిషాల 51.46 సెకన్లు), అమన్‌జ్యోత్ సింగ్ (1 గంట 22 నిమిషాల 12.72 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
వచ్చే నెలలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు 1 గంట 24 నిమిషాల 50 సెకన్లు అర్హత మార్క్ కాగా... ఈ ముగ్గురూ దానికంటే మెరుగైన టైమింగ్ నమోదు చేసుకున్నారు. మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో రవీనా (1 గంట 35 నిమిషాల 58.80 సెకన్లు) స్వర్ణం గెలుచుకుంది.
మహిళల విభాగంలో 35కు బదులు 34 కిలోమీటర్లు!
మహిళల విభాగంలో ఫలితాలు వెల్లడించలేదు. మహిళా వాకర్లు రేసును పూర్తి చేయకుండానే ముగింపు గీత దాటడంతో ఫలితాలు నిలిపివేశారు. మొదట సాంకేతిక కారణాలతో మహిళల విబాగంలో ఫలితాలను నిలిపివేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టారు. 35 కిలోమీటర్ల రేసుకు బదులు మహిళలు 34 కిలోమీటర్లను మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ రేసులో పాయల్ 2 గంటల 51 నిమిషాల 48.76 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలు పరిగణనలోకి రావు. 2024లోనూ ఇక్కడ జరిగిన జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు తప్పుడు గణాంకాలు నమోదు కావడంతో... ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ సంఘం సమయాలను సవరించింది.