All India Tennis Association
-
AITA: అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)లో అనూహ్య పరిణామం... అధ్యక్షుడు అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన టెన్నిస్ సంఘాలు శనివారం ఢిల్లీలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేశాయి. చిత్రంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించతలపెట్టిన రోజే ఈజీఎం ఏర్పాటు చేశారు. ఓవైపు ఎన్నికల కోసం ఏజీఎం నిర్వహించాల్సి ఉండగా... కోర్టు మార్గదర్శకాల మేరకు ఫలితాలను సీల్డ్ కవర్లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.కారణం ఇదే..మరోవైపు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాజ్యసభ ఎంపీ అనిల్ జైన్ తన కుటుంబంతో సహా చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జైన్ మాట్లాడుతూ ఉన్నపళంగా ఈజీఎం నిర్వహణ నియమావళికి విరుద్ధమన్నారు.ఇదంతా కుట్ర!ఇది నిర్వహించాలంటే కనీసం మూడు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని, ‘ఐటా’ నియమావళిలోని 15వ క్లాజ్ ప్రకారం ఇలాంటి సమావేశాలు చట్ట విరుద్ధం. ఈ నెల 23న నోటీసు ఇచ్చి అంతలోనే 28న ఈజీఎం నిర్వహించాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘ఇదంతా కుట్ర! నేను ఐటా, రాష్ట్రాల సంఘాల్లో స్పోర్ట్స్ కోడ్‌ను అమలు చేయాలని కోరినందుకే వారంతా కక్ష గట్టి నాపై బదులు తీర్చుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదుమరోవైపు.. రాష్ట్ర సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదన్నారు. ‘కోడ్‌కు ఎవరూ వ్యతిరేకంగా లేరు. కేంద్ర క్రీడాశాఖ ప్రకారం అమలు చేయాల్సిందే. అనిల్ జైన్ చెబుతున్నట్లు ఇదే సమస్య అయితే గత నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేదు? ఏజీఎం, ఎన్నికల ప్రక్రియను ప్రకటించినపుడు ఎందుకు చర్చించలేదు’ అని రాష్ట్ర సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఈసారి ‘ఐటా’ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, క్రీడాకారులకు మద్దతుగా ఇవ్వాలనుకుంటున్నామని తద్వారా భారత టెన్నిస్ ముఖచిత్రాన్ని మార్చుతామని ఆయన తెలిపారు. అయితే, అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకున్నట్లు తాజా సమాచారం. ఏఐటీఏ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో ఈ విషయాన్ని పంచుకున్నాయి. చదవండి: Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’! -
‘పాక్‌లో డేవిస్ కప్ ఆడాల్సిందే’
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో డేవిస్ కప్ పోరును మార్చే విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు ఎదురు దెబ్బ తగిలింది. పాక్ గడ్డపై డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’ పోటీలు ఆడాల్సిందేనని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) శనివారం స్పష్టం చేసింది. పాక్‌లో కాకుండా మరో తటస్థ వేదికపై ఆడేందుకు అనుమతించాలని ‘ఐటా’ గతంలో అప్పీలు చేసుకుంది. దీన్ని విచారించిన ఐటీఎఫ్ ట్రిబ్యునల్ గురువారం తమ నిర్ణయాన్ని వెలువరించింది. 15 మంది సభ్యులు గల డేవిస్ కప్ కమిటీ (డీసీసీ) ‘ఐటా’ అప్పీల్‌ను తోసిపుచ్చింది. ‘పాకిస్తాన్లో డేవిస్ కప్ టై పోటీలు నిర్వహించాలనే డీసీసీ నిర్ణయానికి బలమైన ఆధారాలున్నాయి. డీసీసీ ఎంపిక చేసిన వేదికపై ఆడటం అన్ని దేశాలకు వర్తిస్తుంది’ అని ట్రిబ్యునల్ వెల్లడించినట్లు పాకిస్తాన్ తెలిపింది. పాక్‌లో డేవిస్ కప్ పోటీ లు విజయవంతంగా జరి గాయని, అలాంటపుడు భారత్ అక్కడ ఆడటానికి విముఖత చూపడం అర్థరహితమని డీసీసీ అభిప్రాయపడింది. ‘భద్రత ఏర్పాట్లు ఆతిథ్య దేశం చూసుకుంటుంది. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకోవడం సబబు కాదు’ అని డీసీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ‘ఐటా’ ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ స్పందిస్తూ ‘క్రీడాశాఖతో ఈ విషయంపై చర్చిస్తాం. ఆ తర్వాతే జట్టును పంపడంపై మార్గదర్శకాలు వస్తాయి’ అని అన్నారు. భారత్ వెళ్లకపోతే పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. -
Billie Jean King Cup 2023 tennis: యమ్లపల్లికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా ఓషియానియా గ్రూప్ 1 ఫెడరేషన్ కప్ (బిల్లీ జీన్ కింగ్ కప్)లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. ఈ టీమ్‌లో అంకితా రైనా (ప్రపంచ 241వ ర్యాంకర్), కర్మన్ కౌర్ తాండి (268), రుతుజా భోస్లే (419), వైదేహి చౌదరి (492)తో పాటు హైదరాబాద్‌కు చెందిన సహజ యమ్లపల్లి (454)కి స్థానం లభించింది. నగరానికి చెందిన సహజ అమెరికాలోనే చదువుకుంటూ అక్కడే శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. వైదేహి ఇటీవలే తన రెండో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకోగా, భారత క్రీడాకారిణుల్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న సహజకు కూడా తొలి సారి అవకాశం లభించింది. ‘నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం భావించాం. అందుకే వైదేహి, సహజలను ఎంపిక చేశాం. వీరిద్దరు కొంత అనుభవం సాధిస్తే మున్ముందు తమ సీనియర్లను దాటి మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఉంది’ అని ఏఐటీఏ ప్రతినిధి నందన్ బల్ వెల్లడించారు. మరో వైపు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న విశాల్ ఉప్పల్‌ను తప్పించి అతని స్థానంలో షాలిని ఠాకూర్ చావ్లాను ఎంపిక చేయగా...కోచ్‌గా రాధిక కనిత్కర్ వ్యవహరిస్తుంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో ఏప్రిల్ 10నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు డేవిస్ కప్ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్‌తో పాటు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్, రోహన్ బోపన్నలు ఉన్నారు. దివిజ్ శరణ్ రిజర్వ్ సభ్యుడిగా ఉంటాడు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్ ఓపెన్‌లో పేస్ రన్నరప్‌గా నిలిచి డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. ‘రోహన్ బోపన్నకు పేస్‌తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్‌దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్ గెలిస్తే పేస్ డేవిస్‌కప్‌లో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 జాతీయ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్ (గుజరాత్) జోడీపై గెలుపొందింది. -
‘డబుల్’ ఫాల్ట్!
► సద్దుమణగని డేవిస్ కప్ వివాదం ► వ్యక్తిగత సంభాషణను భూపతి బయట పెట్టడంపై పేస్ ఆగ్రహం ► ఇద్దరిదీ తప్పంటున్న ఏఐటీఏ బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరులో విజయం సాధించి భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినా... ఈ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. పాత విభేదాలతోనే పేస్‌ను పక్కన పెట్టినట్లు వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో పేస్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి బయటపెట్టగా... ఇది ముమ్మాటికీ తప్పంటూ పేస్ విమర్శించాడు. మరోవైపు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), మాజీ ఆటగాళ్లు మాత్రం ఇద్దరినీ తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పేస్, భూపతి మరింత పరిణతితో వ్యవహరించాల్సిందని వారు విమర్శించారు. కావాలని చేయలేదు... డేవిస్ కప్ మ్యాచ్ ఆడే తుది జట్టులో పేస్‌కు అవకాశం ఇవ్వకుండా నలుగురు ఆటగాళ్లను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ హోదాలో మహేశ్ భూపతి ఎంచుకున్నాడు. అయితే తనతో పాత విభేదాల కారణంగానే ఇలా చేశారంటూ పేస్ ఆ రోజే విమర్శించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భూపతి దీనిపై వివరణ ఇస్తూ పేస్పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. ‘ఇందులో వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. నా ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతో తప్పనిసరి అయితే తప్ప వివరణ ఇవ్వలేదు. 1994లో తొలిసారి డేవిస్ కప్ జట్టులోకి వచ్చినప్పుడు నేను కూడా పేస్ అభిమానినే. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దానిపై నేను ఓ పుస్తకం రాయగలను. ‘గౌరవం’ అనే పదానికి అతనికి అర్థం కూడా తెలీదు. నాకు జట్టుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏఐటీఏ స్వేచ్ఛ ఇచ్చింది. అసలు పోరు మధ్యలోనే పేస్ జట్టును వదిలి వెళ్లిపోవడం ఏమిటి’ అని మహేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆగకుండా తుది జట్టు ఎంపికకు సంబంధించి తనకు, పేస్‌కు మధ్య వాట్సప్‌లో జరిగిన చాటింగ్‌ను కూడా అతను ఈ సందర్భంగా బయట పెట్టాడు. నన్ను ఎందుకు అవమానించారు? అయితే భూపతి వ్యవహారశైలి పట్ల పేస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత సంభాషణను ఒక డేవిస్ కప్ కెప్టెన్ ఎలా బయటపెడతాడంటూ పేస్ ప్రశ్నించాడు. పేస్ పదే పదే కోరినా అతనికి జట్టులో స్థానంపై ఇంకా స్పష్టత ఇవ్వలేనంటూ భూపతి ఇందులో చెబుతూ వచ్చాడు. ‘మా మధ్య మాటల్లో అన్నింటికంటే ఫామ్ ప్రధానమనే చెప్పాడు. కానీ నిజంగా జట్టును ఎంపిక చేసేటప్పుడు దీనిని పట్టించుకోలేదు. నేను బెంగళూరుకు రాక ముందే నిర్ణయం తీసేసుకున్నారని అర్థమవుతోంది. కానీ నాకు చోటు లేదని స్పష్టంగా చెప్పలేదు. ఇది నన్ను అవమానించడమే. ఇదంతా అవసరం లేదు కదా’ అని పేస్ వ్యాఖ్యానించాడు. డేవిస్ కప్‌లో తన పాత్ర గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా పేస్ వివరణ ఇచ్చాడు. ‘అతని ఏకపక్ష వాదనకు నేను మున్ముందు ప్రత్యుత్తరం ఇవ్వగలను. అయితే దేశం తరఫున ఎవరు ఏం చేశారో అభిమానులకు, ప్రజలందరికీ తెలుసు. దీనిపై మాట్లాడటం వృథా. చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు’ అని పేస్ స్పష్టం చేశాడు. సీనియర్లు ఇద్దరు ఈ విషయంలో మరింత పరిణతితో వ్యవహరించాల్సింది. మ్యాచ్ మధ్యలో పేస్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తన ఆలోచనలు, జట్టు ఎంపికపై మహేశ్ మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అయితే జట్టులో నువ్వు భాగం కాదంటూ పేస్‌కు భూపతి కాస్త మర్యాదగా ముందే చెబితే బాగుండేది. 27 ఏళ్ల పాటు దేశం తరఫున ఆడిన వ్యక్తికి ఆ గౌరవం పొందేందుకు తగిన అర్హత ఉంది. వాట్సప్ సంభాషణ గురించి మాకూ తెలుసు. తగిన సమయంలో కూర్చొని వారిద్దరితో మాట్లాడతాం. ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలనేది మా ఆలోచన. – హిరణ్మయి ఛటర్జీ, ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి నా దృష్టిలో ఈ వివాదం ముగిసిన అధ్యాయం. ఇప్పుడు పేస్, మహేశ్ మధ్య ఉన్న పాత గొడవలు ముఖ్యం కాదు. ప్రస్తుత స్థితిలో మన ఆటగాళ్లు వరల్డ్ గ్రూప్‌లోకి వెళ్లలేరు. ఫెడ్ కప్, గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించడంలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లను ప్రపంచ టాప్–50లోకి ఎలా తీసుకు రావాలనేదే లక్ష్యంగా ఉండాలి. అది జరిగితే అన్నీ చక్కబడతాయి. అప్పుడు మిగతాదంతా అనవసరం. – విజయ్ అమృత్‌రాజ్, భారత మాజీ ఆటగాడు పాత విభేదాలు మళ్లీ బయట పడటం దురదృష్టకరం. ఇందులో ఇద్దరి తప్పూ ఉంది. మహేశ్ వ్యవహారశైలి సరిగా లేదు. నువ్వు తుది జట్టులో లేవంటూ అతను పేస్‌కు ఒక మెయిల్ ఎందుకు పంపలేదు. రోహన్ బోపన్నను ఎంచుకోవాలని రెండు నెలల ముందే అనుకుంటే పేస్‌ను ఎటూ కాకుండా చేయడం ఎందుకు. తను ఆడతానని కచ్చితంగా తెలీనప్పుడు పేస్ బెంగళూరు వరకు ఎందుకు వెళ్లాడు. మ్యాచ్ మధ్యలోనే లియాండర్ వెళ్లిపోయాడని మహేశ్ విమర్శించడంలో అర్థం లేదు. అప్పటికే జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అక్కడే ఉండిపోయి అతను చేసేదేముంది. – ఆనంద్ అమృత్‌రాజ్, డేవిస్ కప్ మాజీ కెప్టెన్ -
పేస్ స్థానం పదిలమేనా?
భారత డేవిస్‌కప్ జట్టు ఎంపిక నేడు ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్‌లో పోరు న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ కొనసాగేది లేనిది నేడు తేలనుంది. సోమవారం సమావేశమయ్యే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆసియా ఓసియానియా జోన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు భారత్ తలపడనుంది. డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్రపంచ రికార్డుకు పేస్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్‌కు పరాజయం ఎదురైంది. దాంతో అతను ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోటీలో మరోసారి ప్రపంచ రికార్డుపై గురి పెట్టనున్నాడు. అయితే పేస్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సింగిల్స్‌లో ఫామ్‌లో ఉన్న యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ల బెర్త్‌లకు ఢోకా లేదు. సుమిత్ నాగల్ గాయంతో సెలక్షన్స్‌కు దూరం కాగా... హైదరాబాద్ యువ ఆటగాడు సాకేత్ మైనేని ఎంపికపై సందిగ్ధత నెలకొంది. సింగిల్స్, డబుల్స్ ఆడగల సాకేత్ ఇప్పుడు ఫిట్నెస్తో ఉన్నప్పటికీ... సెలక్టర్ల చూపు స్పెషలిస్ట్ ఆటగాళ్లపై ఉంది. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ సింగిల్స్ ఆటగాళ్లని తీసుకోవాలా లేక ఇద్దరు స్పెషలిస్ట్ డబుల్స్ ఆటగాళ్లతో సరిపెట్టాలా అన్న అంశాన్ని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతోంది. సీనియారిటీని పక్కన బెట్టి ర్యాంకింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే బోపన్న (24)కు జతగా పేస్ (62వ ర్యాంకు)ను కాదని దివిజ్ శరణ్ (54), పురవ్ రాజా (56)ల్లో ఒకరికి చోటు దక్కొచ్చు. సింగిల్స్‌లో ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ మూడో బెర్తు కోసం పోటీపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనకే ఓటేసే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ మ్యాచ్‌తో భారత జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
తప్పుకున్న అనిల్ ఖన్నా
న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) అధ్యక్ష పదవి నుంచి అనిల్ ఖన్నా తప్పుకున్నా రు. కేంద్ర క్రీడాశాఖ స్పోర్ట్స కోడ్ నిబంధనల వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం, క్రీడాశాఖలతో వైరం మంచిది కాదనే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రెండు సార్లు ఐటా అధ్యక్షుడిగా కొనసాగిన అనిల్ ఖన్నా... జీవిత కాల అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికవడం కూలింగ్ ఆఫ్ పీరియడ్‌కు విరుద్ధంగా ఉందని క్రీడాశాఖ తెలిపింది. స్పోర్ట్సకోడ్ అమలు పరచాల్సిందేనంటూ... ఇటీవల ఐటా గుర్తింపును రద్దు చేసింది. దీంతో మరింత వివాదాస్పదం కాకముందే ఖన్నా వైదొలగాలని నిర్ణరుుంచారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఐటా ఎగ్జిక్యూటీవ్ కమిటీని ఆయన కోరారు. -
ఏఐటీఏ ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు మృతి
హైదరాబాద్: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు(రాజాసాబ్) గురువారం కన్నుమూశారు. ఉదయం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో రాజాసాబ్ తుది శ్వాస విడిచారు. సానియా మీర్జాను ఇంటర్నేషనల్ స్టార్‌ని చేయడంలో రాజాసాబ్‌ది కీలక పాత్ర.