పేస్ స్థానం పదిలమేనా?
భారత డేవిస్‌కప్ జట్టు ఎంపిక నేడు
ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్‌లో పోరు
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ కొనసాగేది లేనిది నేడు తేలనుంది. సోమవారం సమావేశమయ్యే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆసియా ఓసియానియా జోన్‌లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు భారత్ తలపడనుంది. డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్రపంచ రికార్డుకు పేస్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో విష్ణువర్ధన్‌తో జతకట్టిన పేస్‌కు పరాజయం ఎదురైంది. దాంతో అతను ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోటీలో మరోసారి ప్రపంచ రికార్డుపై గురి పెట్టనున్నాడు. అయితే పేస్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సింగిల్స్‌లో ఫామ్‌లో ఉన్న యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌ల బెర్త్‌లకు ఢోకా లేదు. సుమిత్ నాగల్ గాయంతో సెలక్షన్స్‌కు దూరం కాగా... హైదరాబాద్ యువ ఆటగాడు సాకేత్ మైనేని ఎంపికపై సందిగ్ధత నెలకొంది.
సింగిల్స్, డబుల్స్ ఆడగల సాకేత్ ఇప్పుడు ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ... సెలక్టర్ల చూపు స్పెషలిస్ట్ ఆటగాళ్లపై ఉంది. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ సింగిల్స్ ఆటగాళ్లని తీసుకోవాలా లేక ఇద్దరు స్పెషలిస్ట్ డబుల్స్ ఆటగాళ్లతో సరిపెట్టాలా అన్న అంశాన్ని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతోంది. సీనియారిటీని పక్కన బెట్టి ర్యాంకింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే బోపన్న (24)కు జతగా పేస్ (62వ ర్యాంకు)ను కాదని దివిజ్ శరణ్ (54), పురవ్ రాజా (56)ల్లో ఒకరికి చోటు దక్కొచ్చు. సింగిల్స్‌లో ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ మూడో బెర్తు కోసం పోటీపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనకే ఓటేసే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ మ్యాచ్‌తో భారత జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు.