సాకేత్, యూకీ పునరాగమనం
లియాండర్ పేస్‌కు దక్కని స్థానం
న్యూఢిల్లీ: కెనడాతో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తలపడే భారత జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని, సింగిల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. కెనడాలోని ఎడ్మంటన్‌లో సెప్టెంబరు 15 నుంచి 17 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు డబుల్స్ దిగ్గజం లియాండర్ పేస్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. సాకేత్, యూకీలతోపాటు రామ్‌కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న జట్టులోని మిగతా సభ్యులు. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ రిజర్వ్ సభ్యులుగా వ్యవహరిస్తారు.
గత ఏప్రిల్‌లో స్వదేశంలో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయాల కారణంగా సాకేత్, యూకీ ఆడలేదు. ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆరుగురు సభ్యులున్న జట్టులో పేస్‌ను ఎంపిక చేసినా నలుగురు ఆటగాళ్లున్న తుది జట్టులో అతడికి స్థానం లభించలేదు. ‘ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. భవిష్యత్‌లో పేస్ పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ మహేశ్ భూపతి కోరడంతో డబుల్స్ విభాగంలో ఒకరినే ఎంపిక చేశాం. ఈసారి యూకీ, రామ్‌కుమార్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్–బోపన్న జంట బరిలోకి దిగుతుంది’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్‌పీ మిశ్రా తెలిపారు.