davis cup
-
భారత్ 4 టోగో 0
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. టోగో జట్టుతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొందగా... రెండో రోజు ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జంట 6–2, 6–1తో ఎంలాపా అకోమోలో–ఇసాక్ పాడియో (టోగో) ద్వయంపై నెగ్గింది. దాంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు నాలుగో మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. నాలుగో మ్యాచ్‌లో కరణ్ సింగ్ 6–2, 6–3తో పాడియోను ఓడించాడు. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను ఆడకూడదని రెండు జట్లు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్స్ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ ప్లేయర్ రితి్వక్ చౌదరీ డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు. -
భారత్ X టోగో
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్‌లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్‌కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్‌లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్‌కుమార్ రామనాథన్ తలపడనున్నారు. -
డబ్బు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్
భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అతడు ఫీజును డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు నగాల్ కూడా దీన్ని తోసిపుచ్చలేదు. ‘స్టాండర్డ్ ప్రాక్టీస్’ కోసమే అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు కూడా!‘ఐటా’ విమర్శలుకాగా నగాల్ ఈ ఏడాది అదేపనిగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టైలకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఆడేందుకు నిరాకరించిన అతను ఇటీవల స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం సాకుతో దూరంగా ఉన్నాడు. అయితే చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడంపై ‘ఐటా’ బాహాటంగా విమర్శలు గుప్పించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సాకులు చెబుతున్న ఆటగాడు ఏటీపీ టోర్నీ ఆడేందుకు సై అంటున్నాడని నగాల్‌ను ఉద్దేశించి ‘ఐటా’ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లు కూడా డేవిస్ కప్ ఆడలేదు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడంతో భారత్ 0–4తో చిత్తుగా ఓడింది. రూ.45 లక్షలు అడిగాడుఈ నేపథ్యంలో.. ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ధూపర్ మాట్లాడుతూ ‘ఎవరైనా దేశానికి ఆడేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా చెప్పండి. సుమిత్ నగాల్ తనకు వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. చెల్లింపులు జరగలేదు కాబట్టే అతను ఆడటం లేదు.ఇదేం పద్ధతి. ఇది తప్పా ఒప్పా అనేది జాతి తెలుసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఆటగాళ్లకు ‘టాప్స్’ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు నిర్ణీత మొత్తం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి డేవిస్ కప్‌లో ఆడుతున్నందుకు పార్టిసిపేషన్ ఫీజుగా సుమారు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే చెల్లిస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ‘ఐటా’ వద్ద ఉంటున్నాయి’ అని వివరించారు. ఇదీ సుమిత్ వాదన... అందుకే ఫీజు అడిగాను‘ఐటా’ వ్యాఖ్యల్ని టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఖండించలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వాదన వినిపించాడు. ‘ఫీజు అడిగిన మాట వాస్తవమే. దీనిపై మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయి. నేను డిమాండ్ చేసిన పరిహారం కూడా ఆ కోవకే చెందుతుంది.స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే నేను డిమాండ్ చేశాను తప్ప... డబ్బులు గుంజాలనే ఉద్దేశం కాదు. దేశానికి ఆడటమనేది ఎవరికైనా గర్వకారణమే. అదో గొప్ప గౌరవం. అయితే నేను వెన్నునొప్పి వల్లే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేకపోయాను. ఇప్పుడు కూడా ఇదే సమస్య వల్ల చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాను’ అని వివరణ ఇచ్చాడు.చదవండి: చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం -
నగాల్ కావాలనే ఆడలేదు!
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్ ఉద్దేశపూర్వకంగానే వరుసగా డేవిస్ కప్ పోటీలకు దూరమవుతున్నాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆరోపించింది. గాయాలు, ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది నగాల్... పాకిస్తాన్, స్వీడెన్లతో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టై లకు గైర్హాజరయ్యాడు. ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన పోరులో భారత్ 0–4తో స్వీడెన్‌తో చిత్తుగా ఓడింది. సుమిత్, యూకీ బంబ్రీలాంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగితే కచ్చితంగా ఫలితాలు మరోలా ఉండేవని ‘ఐటా’ కార్యదర్శి అనిల్ ధూపర్ వివరించారు. స్టాక్‌హోమ్‌కు వెళ్లిన భారత జట్టులో ఒక్క రామ్‌కుమార్ రామనాథన్ మాత్రమే అనుభవజు్ఞడని, డబుల్స్ స్పెషలిస్టు శ్రీరామ్ బాలాజీని సింగిల్స్‌లో ఆడించామని చెప్పారు. ఆర్యన్ షా, సిద్ధార్థ్ విశ్వకర్మ అరంగేట్రం చేసిన ఆటగాళ్లని... అందువల్లే భారత్ చిత్తుగా ఓడిందని ఆయన అన్నారు. వెన్ను గాయాన్ని కారణంగా చూపించిన నగాల్ అదే సమయంలో చైనాలో ఏటీపీ టోర్నీ ఆడుతున్నాడని దుయ్యబట్టారు. డేవిస్ కప్ అనేది కేవలం ఒక టెన్నిస్ టోర్నమెంట్ కాదని... దేశానికి ప్రాతినిధ్యం వహించడమని చెప్పుకొచ్చారు. ముకుంద్ శశికుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని, వచ్చి డేవిడ్ కప్ ఆడాలని విజ్ఞప్తి చేసినా...అతనూ పట్టించుకోలేదని ధూపర్ విమర్శించారు. -
స్వీడన్ చేతిలో భారత్ ఆరో‘సారీ’
స్టాక్‌హోమ్: అగ్రశ్రేణి క్రీడాకారులు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ లేకుండానే డేవిస్‌కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో పోటీపడ్డ భారత జట్టుకు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వీడన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 0–4తో ఓడిపోయింది. డేవిస్‌కప్ టోర్నీ చరిత్రలో స్వీడన్ జట్టు చేతిలో భారత జట్టుకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. స్వీడన్‌తో పోటీపడ్డ ఆరుసార్లూ భారత జట్టు ఓడిపోయింది. ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు నాలుగు మ్యాచ్‌లు ఆడినా కనీసం ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులు ఓడిపోయారు. ఫలితంగా తదుపరి దశకు అర్హత పొందాలంటే ఆదివారం మూడు మ్యాచ్‌ల్లోనూ (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) భారత ప్లేయర్లు తప్పనిసరిగా గెలవాలి. అయితే డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ 3–6, 4–6తో ఆండ్రీ గొరాన్సన్–ఫిలిప్ బెర్గెవి జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్వీడన్ జట్టు 3–0తో విజయాన్ని ఖరారు చేసుకొని వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందింది. ఫలితం తేలిపోవడంతో నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన సింగిల్స్‌లో జాతీయ మాజీ చాంపియన్ సిద్ధార్థ్ విశ్వకర్మను బరిలోకి దించారు. డేవిస్‌కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధార్థ్ 2–6, 2–6తో ఇలియాస్ యామెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో భారత జట్టు వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించేందుకు ప్లే ఆఫ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. -
భారత్ 0 స్వీడన్ 2
స్టాక్‌హోమ్: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా స్వీడన్ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్ నేడు జరిగే ఒక డబుల్స్ మ్యాచ్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది. వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్ స్పెషలిస్ట్’ శ్రీరామ్ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్ ఇలియాస్ యెమెర్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 3–6తో లియో బోర్గ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది. -
భారత జట్టుకు ఎదురుదెబ్బ.. నంబర్ వన్ ప్లేయర్ దూరం
స్వీడన్‌తో ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో సతమతమవుతున్న అతను ఈ ఏడాది వరుసగా రెండోసారి డేవిస్ కప్ టోర్నీకి గైర్హాజరు కానున్నాడు. పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్లోనూ అతను బరిలోకి దిగలేదు. దీంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆర్యన్ షాను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. అదే విధంగా.. మానస్ ధామ్నేను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా స్టాక్‌హోమ్‌లో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో ఆతిథ్య స్వీడన్‌తో భారత్ తలపడుతుంది. ఇదివరకే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) భారత జట్టును ప్రకటించింది. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్‌ను కోచ్‌గా నియమించింది. అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా‘స్వీడన్‌తో జరిగే పోరుకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని వారాలుగా వెన్నునొప్పి బాధిస్తోంది. దీంతో డాక్టర్లు కనీసం రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నద్ధమయ్యేందుకు సరైన సమయంలేదు. కాబట్టే స్వీడన్ ఈవెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇటీవల యూఎస్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కూడా వెన్ను సమస్య వేధించింది. ఏదేమైనా డేవిస్ కప్ టోర్నీకి దూరమవడం చాలా బాధగా ఉంది. ఆ టోర్నీలో ఆడబోయే జట్టు రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని నగాల్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. -
భారత డేవిస్ కప్ జట్టులో నగాల్
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టాప్‌స్టార్ సుమిత్ నగాల్ తిరిగి డేవిస్ కప్ జట్టులోకి వచ్చేశాడు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్ వచ్చే నెల స్వీడన్‌తో తలపడనుంది. సెపె్టంబర్ 14, 15 తేదీల్లో స్టాక్‌హోమ్‌లోని ఇండోర్ హార్డ్ కోర్ట్ వేదికపై జరిగే ఈ పోటీలకు డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో నగాల్... ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరుకు దూరంగా ఉన్నాడు. అక్కడ గ్రాస్కోర్ట్పై అనాసక్తి కనబరిచిన సుమిత్ ఇప్పుడు హార్డ్‌కోర్ట్‌లో జరిగే పోటీలకు అందుబాటులోకి వచ్చాడు. భారత టాప్–3 ప్లేయర్, ప్రపంచ 476 ర్యాంకర్ శశికుమార్ ముకుంద్‌పై రెండు ‘టై’ల సస్పెన్షన్ ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. వరుసగా డేవిస్ కప్ టోరీ్నలకు గైర్హాజరు అవుతుండటంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐటా సెలక్షన్ కమిటీ సుమిత్ నగాల్, రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, నికీ పునాచా, సిద్ధార్థ్ విశ్వకర్మలను ఎంపిక చేసింది. రోహిత్ రాజ్‌పాల్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టుకు ఆర్యన్ షా రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటాడు. యూకీ అందుబాటులో లేకపోవడంతో రామ్‌కుమార్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగుతాడు. యూకీ తన గైర్హాజరుకు గల కారణాలు బయటికి వెల్లడించనప్పటికీ... పారిస్ ఒలింపిక్స్‌కు రోహన్ బోపన్నకు జోడీగా తనను పంపకపోవడంపై కినుక వహించినట్లు తెలిసింది. అయితే ఇందులో ‘ఐటా’ చేసిందేమీ లేదని వెటరన్ స్టార్ బోపన్న తన భాగస్వామిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకోవడంతో అతన్నే పంపాల్సివచ్చిందని ఐటా వర్గాలు వెల్లడించాయి. జీషాన్ అలీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో మాజీ ఢిల్లీ ప్లేయర్ అశుతోశ్ సింగ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.బాలచంద్రన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఐటా సెలక్షన్ కమిటీ అశుతోశ్ వైపు మొగ్గుచూపుతోంది. ప్రస్తుతానికి భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేశామని కోచ్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని ఐటా కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. -
Davis Cup 2024: భారత్ ప్రత్యర్థి స్వీడన్
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ వరల్డ్ గ్రూప్–1 పోటీల ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్య వివిధ దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టుకు స్వీడన్ జట్టు రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. స్వీడన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి వరకు స్వీడన్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పోరాడి ఓడిన సహజ సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ– 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. ముంబైలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 336వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 5–7తో ప్రపంచ 162వ ర్యాంకర్ పొలీనా కుదెర్మెతోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన రుతుజా 6–7 (6/8), 6–2, 1–6తో కేటీ వోలినెట్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక అర్హత
Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 521వ ర్యాంకర్ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఆరు ఏస్‌లు సంధించింది. వరల్డ్ గ్రూప్-1లో భారత్ డేవిస్‌కప్ టోర్నీలో భారత పురుషుల టెన్నిస్ జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్‌తో ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో 4–0తో గెలుపొందింది. చదవండి: భారత్‌కు మరో ఓటమి భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఏకైక గోల్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ రెండు గోల్స్, ఫేవాన్‌డెర్ ఒక గోల్ సాధించారు. -
60 ఏళ్ల తర్వాత తొలిసారి... పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఇస్లామాబాద్: లాంఛనం పూర్తి చేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్‌కప్ టోర్నీలో మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. పాకిస్తాన్‌తో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు 2–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో రోజు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ ద్వయం 6–2, 7–6 (7/5)తో అకీల్ ఖాన్–ముజమ్మిల్ జంటను ఓడించడంతో భారత్‌కు 3–0తో విజయం ఖరారైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్‌లో నికీ పునాచా 6–3, 6–4తో షోయబ్ మొహమ్మద్‌పై గెలవడంతో భారత్ ఆధిక్యం 4–0కు చేరింది. అప్పటికే ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. కాగా ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు భారత్ వెళ్లడం ఇదే తొలిసారి. VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59 — Press Trust of India (@PTI_News) February 4, 2024 -
భారత్ 2 పాక్ 0
ఇస్లామాబాద్: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత టెన్నిస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ పోటీలో తొలిరోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ విజయం సాధించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల ఈ పోటీలో ప్రస్తుతం భారత్ 2–0తో ఆధిక్యం సంపాదించింది. నేడు జరిగే మిగతా మూడు మ్యాచ్‌ల్లో (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) ఒకదాంట్లో గెలిచినా భారత జట్టు విజయం ఖరారవుతుంది. 1964 తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 461వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–7 (3/7), 7–6 (7/4), 6–0తో సింగిల్స్‌లో ర్యాంక్‌లేని ఐజామ్ ఉల్ హఖ్ ఖురేïÙని ఓడించాడు. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 20 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ఐజామ్ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ బాలాజీ 7–5, 6–3తో అకీల్ ఖాన్‌పై గెలిచాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరికీ ర్యాంక్ లేకపోవడం గమనార్హం. 75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు అకీల్ ఖాన్ సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో బర్కతుల్లా–ముజమ్మిల్ ముర్తజాలతో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ తలపడతారు. -
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సర్వం సిద్దం.. ఫేవరెట్‌గా టీమిండియా
ఇస్లామాబాద్: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్స్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేడు, రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్ ఆటకు సిద్ధమైంది. డేవిస్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్‌ది అజేయమైన రికార్డు. దాయాది జట్టుపై ఆడిన ఏడు సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు పాక్ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. అయితే సొంతగడ్డపై ఈ డేవిస్ టై జరగడం, తురుపు ముక్క ఐజాముల్ హక్ ఖురేషి బరిలో ఉండటంతో పాక్ గంపెడాశలు పెట్టుకుంది. గ్రాస్ కోర్టులో ఖురే విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఏమైన కఠిన సవాల్ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషి నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొదటి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్... ఐజాముల్ హక్ ఖురేషితో తలపడతాడు. అనంతరం జరిగే రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ బాలాజీ... అఖిల్ ఖాన్‌ను ఎదుర్కొంటాడు. శ్రీరామ్ బాలాజీ చాన్నాళ్లుగా డబుల్స్‌కే పరిమితమయ్యాడు. అయితే భారత సింగిల్స్ స్పెషలిస్టు అయిన సుమిత్ నగాల్... గ్రాస్‌కోర్టు కావడంతో పాక్ వెళ్లేందుకు విముఖత చూపాడు. దీంతో శ్రీరామ్‌ను సింగిల్స్ బరిలో దించాల్సి వస్తోంది. -
ఇస్లామాబాద్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
ఇస్లామాబాద్: డేవిస్‌కప్ గ్రూప్–1 ప్లేఆఫ్ పోరులో భాగంగా పాకిస్తాన్ జట్టుతో తలపడేందుకు 1964 తర్వాత భారత జట్టు మళ్లీ పాకిస్తాన్లో అడుగు పెట్టింది. రామ్‌కుమార్, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, దిగ్వి జయ్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత బృందంలో ఉన్నారు. చివరిసారిగా భారత్, పాక్‌లు 1964లో పాక్ గడ్డపై పోటీపడ్డాయి. 2019లోనూ పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించాల్సి ఉండగా... ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తటస్థ వేదిక కజకిస్తాన్‌కు మార్చింది. ఈ పోరులో భారత్ 4–1తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్లో భారత జట్టు ఆడాల్సిందేనని, వేదిక మార్చడం వీలుకాదని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌రోహిత్ రాజ్‌పాల్ వ్యక్తిగత కారణాలతో పాకిస్తాన్‌కు వెళ్లలేకపోవడంతో జీషాన్ అలీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కోచ్‌గా వచ్చిన జీషాన్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గానూ వ్యవహరిస్తాడు. -
‘పాక్‌లో డేవిస్ కప్ ఆడాల్సిందే’
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో డేవిస్ కప్ పోరును మార్చే విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు ఎదురు దెబ్బ తగిలింది. పాక్ గడ్డపై డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’ పోటీలు ఆడాల్సిందేనని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) శనివారం స్పష్టం చేసింది. పాక్‌లో కాకుండా మరో తటస్థ వేదికపై ఆడేందుకు అనుమతించాలని ‘ఐటా’ గతంలో అప్పీలు చేసుకుంది. దీన్ని విచారించిన ఐటీఎఫ్ ట్రిబ్యునల్ గురువారం తమ నిర్ణయాన్ని వెలువరించింది. 15 మంది సభ్యులు గల డేవిస్ కప్ కమిటీ (డీసీసీ) ‘ఐటా’ అప్పీల్‌ను తోసిపుచ్చింది. ‘పాకిస్తాన్లో డేవిస్ కప్ టై పోటీలు నిర్వహించాలనే డీసీసీ నిర్ణయానికి బలమైన ఆధారాలున్నాయి. డీసీసీ ఎంపిక చేసిన వేదికపై ఆడటం అన్ని దేశాలకు వర్తిస్తుంది’ అని ట్రిబ్యునల్ వెల్లడించినట్లు పాకిస్తాన్ తెలిపింది. పాక్‌లో డేవిస్ కప్ పోటీ లు విజయవంతంగా జరి గాయని, అలాంటపుడు భారత్ అక్కడ ఆడటానికి విముఖత చూపడం అర్థరహితమని డీసీసీ అభిప్రాయపడింది. ‘భద్రత ఏర్పాట్లు ఆతిథ్య దేశం చూసుకుంటుంది. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకోవడం సబబు కాదు’ అని డీసీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ‘ఐటా’ ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ స్పందిస్తూ ‘క్రీడాశాఖతో ఈ విషయంపై చర్చిస్తాం. ఆ తర్వాతే జట్టును పంపడంపై మార్గదర్శకాలు వస్తాయి’ అని అన్నారు. భారత్ వెళ్లకపోతే పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో సాకేత్
ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని జట్టులోకి పునరాగమనం చేశాడు. 2022 సెప్టెంబర్‌లో నార్వేతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రీ, నిక్కీ పునాచా, దిగి్వజయ్ ప్రతాప్ సింగ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
Davis Cup final 2023: డేవిస్ కప్ విజేత ఇటలీ
మలాగా (స్పెయిన్): డేవిస్ కప్‌లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్‌లో వరల్డ్ కప్‌లాంటి డేవిస్ కప్‌లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్పై విజయం సాధించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్‌ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్‌లు కొట్టాడు. సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్‌ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. -
పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్లు సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద్ పాకిస్తాన్లో డేవిస్ కప్ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’లో భాగంగా భారత్ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో తలపడాల్సివుంది. అయితే భారత్ తరఫున ఉత్తమ సింగిల్స్ ప్లేయర్లు అయిన సుమిత్ నగాల్ (141 ర్యాంకు), శశికుమార్ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు. అదే కారణమా? ఇక హార్డ్ కోర్టుల్లో రాణించే సుమిత్ ఈ కారణంతో పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్ ముకుంద్ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇలా చేయడం తప్పు ‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు. సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై సునాయాస విజయం సాధించింది. సెమీస్‌లో రష్మిక థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్ డిలెటా చెరుబిని (ఇటలీ)ని ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్‌కు చెందిన ఐదో సీడ్ జిబెక్ కులంబయెవాను కంగుతినిపించింది. -
డేవిస్ కప్ సెమీస్‌లో సెర్బియా
మలగ (స్పెయిన్): ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్‌కు చేర్చాడు. తద్వారా డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్ ఈవెంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో లోమిర్ కెమనొవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)ను ఓడించగా... రెండో సింగిల్స్‌లో జొకోవిచ్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్ లాజొవిక్తో కలిసి జొకోవిచ్ డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. డేవిస్ కప్ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్ స్టార్ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్‌గా ఈ టీమ్ ఈవెంట్లో రికార్డు స్థాయిలో జొకోవిచ్ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్‌నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్‌లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్‌లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. -
బోపన్న... విజయంతో వీడ్కోలు
లక్నో: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్‌ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6–2, 6–1తో బెన్చెట్రిట్–యూనెస్ లారూసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరఫున మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. డబుల్స్‌లో 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. సింగిల్స్‌లో 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. డేవిస్ కప్ నుంచి రిటైరయిన్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో బోపన్న టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తాడు. డబుల్స్ మ్యాచ్ తర్వాత జరిగిన సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్ దిల్మీపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్‌ను ఓడించడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. -
భారత్ 1 మొరాకో 1
లక్నో: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–2 టెన్నిస్ పోటీలో తొలి రోజు భారత్, మొరాకో క్రీడాకారులు ఒక్కో మ్యాచ్‌లో గెలిచారు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్ 7–6 (7/4), 5–7, 1–4తో యాసిన్ దిల్మీ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో ఆడమ్ మౌన్డిర్పై గెలుపొందాడు. దిల్మీతో జరిగిన మ్యాచ్‌లో ముకుంద్ నిర్ణాయక మూడో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో కాలి కండరాలు పట్టేయడంతో వైదొలిగాడు. నేడు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ బెన్‌చిట్రి–లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్‌తో శశికుమార్ తలపడతారు. -
బోపన్న చివరిపోరు...
లక్నో: ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్‌లో తన ప్రస్థానాన్ని ముగించడానికి భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న సిద్ధమయ్యాడు. మొరాకోతో నేడు మొదలయ్యే వరల్డ్ గ్రూప్–2 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2002లో తొలిసారి డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 43 ఏళ్ల బోపన్న 32 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం అందుకున్నాడు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ జరుగుతాయి. యాసిన్ దిల్మీతో శశికుమార్ ముకుంద్, ఆడమ్ మౌన్డిర్తో సుమిత్ నగాల్ ఆడతారు. ఆదివారం ఒక డబుల్స్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్‌ను నిర్వహిస్తారు. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ ఇలియట్ బెన్‌చిట్రి–యూనస్ లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో యాసిన్ దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్ మౌన్డిర్తో శశికుమార్ ముకుంద్ తలపడతారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మ్యాచ్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డేవిస్‌కప్ కెరీర్‌ను ముగిస్తున్న రోహన్ బోపన్నను సన్మానించారు. -
Davis Cup: వరల్డ్ గ్రూప్–2కు పడిపోయిన భారత్
హిలెరాడ్ (డెన్మార్క్): ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ డేవిస్ కప్‌లో 2019లో కొత్త ఫార్మాట్ మొదలుపెట్టాక... భారత జట్టు తొలిసారి వరల్డ్ గ్రూప్–2కు పడిపోయింది. డెన్మార్క్ జట్టుతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. తొలి రోజు రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 4–6, 6–3, 6–4తో ఆగస్ట్ హోమ్‌గ్రెన్‌ను ఓడించడంతో భారత్ స్కోరున 1–1తో సమం చేసింది. అయితే రెండో రోజు డబుల్స్ మ్యాచ్‌లో హోల్గర్ రూన్–ఇంగిల్డ్‌సెన్ జోడీ 6–2, 6–4తో 65 నిమిషాల్లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ ద్వయంపై గెలిచి డెన్మార్క్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో హోల్గర్ రూన్ 7–5, 6–3తో సుమిత్ నగాల్‌పై నెగ్గడంతో డెన్మార్క్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో... నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 7–6 (7/1)తో ఎల్మెర్ మోలెర్‌ను ఓడించాడు. -
Davis Cup 2023: తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి...
Davis Cup- ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్ 6–2, 6–4తో కొకినాకిస్‌పై నెగ్గాడు. ఇక రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ 6–3, 6–4తో అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. Take a bow, @denis_shapo 🤯🤩 Was this the shot of the #Final8? 💫#DavisCup #byRakuten | @TennisCanada pic.twitter.com/96vU0TU7AW — Davis Cup (@DavisCup) November 28, 2022 చదవండి: కామెరూన్‌ను కాపాడిన అబుబాకర్ దోహా: కామెరూన్ స్ట్రయికర్ విన్సెంట్ అబుబాకర్ సెర్బియా గెలుపురాతను మార్చేశాడు. 3–1తో సెర్బియా గెలుపుబాట పట్టిన దశలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ అబుబాకర్ ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు తోడయ్యాడు. దీంతో గ్రూప్ ‘జి’లో సోమవారం సెర్బియా, కామెరూన్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 3–3 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. సెర్బియా తరఫున పావ్లోవిచ్ (45+1వ ని.లో), మిలింకోవిచ్ (45+3వ ని.లో), మిత్రోవిచ్ (53వ ని.లో) గోల్ చేశారు. కామెరూన్ తరఫున క్యాస్టె లెటో (29వ ని.లో), అబుబాకర్ (63వ ని.లో), మోటింగ్ (66వ ని.లో) గోల్ సాధించారు. ర్యాంకింగ్, ఆటతీరు పరంగా కామెరూన్ కంటే సెర్బియా గట్టి ప్రత్యర్థి. ఇందుకు తగ్గట్లే తొలి అర్ధభాగాన్ని 2–1తో ముగించింది. రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే మిత్రోవిచ్ గోల్ చేయడంతో 3–1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో మైదానంలోకి వచ్చిన విన్సెంట్ సెర్బియాకు కొరకరాని కొయ్యగా మారాడు. 63వ నిమిషంలో గోల్ చేసిన అతను మూడు నిమిషాల వ్యవధిలో మోటింగ్ గోల్ చేసేందుకు సాయపడ్డాడు. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
డేవిస్‌కప్‌కు నాదల్ దూరం
వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌ల్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ బరిలోకి దిగడం లేదు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ సభ్యుడిగా ఉన్న సెర్బియాతో స్పెయిన్ ఆడుతుంది. అనంతరం కెనడా, కొరియా జట్లతో మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో స్పెయిన్‌లో జరిగే నాకౌట్ దశ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
డేవిస్ కప్‌లో నార్వేతో భారత్ పోరు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో భారత్ తలపడే ప్రత్యర్థి ఖరారైంది. ఈ పోరులో నార్వేతో భారత ఢీకొంటుంది. గురువారం ఈ ‘డ్రా’ విడుదల చేయగా, నార్వే వేదికగానే భారత్ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 16–18 మధ్య డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దాదాపు అదే తేదీల్లో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో జట్టు ఎంపిక భారత టెన్నిస్ సంఘానికి (ఏఐటీఏ) ఇబ్బందిగా మారనుంది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 10–14 మధ్య టెన్నిస్ మ్యాచ్ జరగనుండగా...తక్కువ వ్యవధిలో నార్వే చేరుకొని భారత్ ఆడటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పు చేసే విషయంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు ఏఐటీఏ విజ్ఞప్తి చేయనుంది. డేవిస్ కప్ చరిత్రలో భారత్, నార్వే ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడలేదు. ఆ జట్టులో వరల్డ్ నంబర్ 8 కాస్పర్ రూడ్ రూపంలో అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. -
డేవిస్ కప్‌లో రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే–ఆఫ్ టైలో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోరులో శుక్రవారం భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో క్రిస్టియాన్ సిగ్స్గార్డ్పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 170వ ర్యాంకర్ రామ్‌కుమార్ కేవలం 59 నిమిషాల్లోనే 824వ ర్యాంకింగ్ ప్లేయర్‌పై గెలిచాడు. సుదీర్ఘ విరామానంతరం... 2017 తర్వాత మళ్లీ డేవిస్ కప్ బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ రెండో సింగిల్స్‌లో 6–4, 6–4తో మికేల్ టొర్పెగార్డ్ను ఓడించాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ గెలిస్తే చాలు భారత్ రివర్స్ సింగిల్స్ ఆడే అవకాశం లేకుండానే విజయం సాధిస్తుంది. ఇదే జరిగితే భారత్ వరల్డ్ గ్రూప్–1లో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. చదవండి: national chess championship 2022: విజేతగా అర్జున్.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు -
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
చరిత్ర సృష్టించిన రష్యా.. 15 ఏళ్ల తర్వాత
మాడ్రిడ్: సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 15 ఏళ్ల తర్వాత రష్యా జట్టు మూడోసారి డేవిస్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మెద్వెదేవ్ సారథ్యంలోని రష్యా జట్టు 2–0తో క్రొయేషియాపై నెగ్గింది. గతంలో 2002, 2006లలో కూడా రష్యా విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 7–6 (7/5)తో బొర్నా గోజోపై నెగ్గి రష్యాకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (9/7), 6–2తో సిలిచ్‌పై విజయం సాధించి రష్యాకు డేవిస్ కప్‌ను అందించాడు. -
రెండు సింగిల్స్‌లోనూ భారత్‌కు నిరాశ
జాగ్రెబ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా క్రొయేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓటమి చవిచూశారు. తొలి సింగిల్స్‌లో 132వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 4–6, 2–6తో ప్రపంచ 277వ ర్యాంకర్ బోర్నా గోజో చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో 182వ ర్యాంకర్ రామ్ కుమార్ 6–7 (8/10), 6–7 (8/10)తో 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్ చేతిలో పోరాడి ఓడాడు. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన క్రొయేషియా... నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లేదా రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక దాంట్లో విజయం సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
భారత్ ముందుకెళ్లేనా?
జాగ్రెబ్ (క్రొయేషియా): డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ బెర్త్‌పై కన్నేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టుకు నేటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు రోజుల పాటు సాగే ఈ పోరులో భారత్... 2014 యూఎస్ ఓపెన్ విజేత మారిన్ సిలిచ్‌తో కూడిన క్రొయేషియాను ఎదుర్కోనుంది. అయితే మారిన్ సిలిచ్ మినహా మిగతా క్రొయేషియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయి ప్లేయర్లు కాకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, లియాండర్ పేస్, రోహన్ బొపన్న, రామ్‌కుమార్ రామనాథన్‌లతో కూడిన భారత్ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగనుంది. తన కెరీర్లో చివరి డేవిస్ కప్ సీజన్ ఆడుతున్న లియాండర్ పేస్ ఘనమైన ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండు సింగిల్స్... డబుల్స్... రెండు రివర్స్ సింగిల్స్ పద్ధతిన జరిగే ఈ పోరులో మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు మాడ్రిడ్ వేదికగా నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లు బరిలో దిగనున్నారు. భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో బోర్నా గోజోతో ప్రజ్నేశ్; రెండో మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్‌తో రామ్‌కుమార్ తలపడతారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మ్యాట్ పావిచ్–స్కుగోర్‌లతో లియాండర్ పేస్–రోహన్ బోపన్న... నాలుగో మ్యాచ్‌లో సిలిచ్‌తో ప్రజ్నేశ్; ఐదో మ్యాచ్‌లో గోజోతో రామ్‌కుమార్ ఆడతారు. చివరిసారిగా ఈ రెండు జట్లు 1995లో న్యూఢిల్లీ వేదికగా తలపడగా... అందులో భారత్ 3–2తో గెలుపొందింది. -
తుది జట్టులో పేస్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. మార్చి 6, 7 తేదీల్లో జాగ్రెబ్‌లో క్రొయేషియా జట్టుతో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో భారత తుది జట్టును ఏఐటీఏ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు పంపించింది. 24 జట్లు పాల్గొనే క్వాలిఫయర్స్‌లో గెలిచిన 12 జట్లు ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. సింగిల్స్‌లో భారత టాప్–3 ర్యాంకర్లు సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్... డబుల్స్‌లో భారత నంబర్‌వన్ రోహన్ బోపన్న, నాలుగో ర్యాంకర్ లియాండర్ పేస్‌లను భారత జట్టులో ఎంపిక చేశామని ఏఐటీఏ తెలిపింది. డబుల్స్‌లోభారత రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ‘ఈ సీజన్లో పేస్ బాగా రాణిస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాటా ఓపెన్‌లో దివిజ్ శరణ్ జంటపై పేస్ జోడీ గెలిచింది. బెంగళూరు ఓపెన్ చాలెంజర్ టోర్నీలో పేస్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది పేస్ కెరీర్లో చివరిది. 30 ఏళ్లుగా దేశానికి సేవ అందిస్తున్న వ్యక్తికి అత్యున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అతడిని ఎంపిక చేశాం. దివిజ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. డేవిస్ కప్‌లో క్రొయేషియా, భారత్ తలపడనుండటం ఇది రెండోసారి మాత్రమే. 1995లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2తో క్రొయేషియాను ఓడించింది. ఈ పోటీలో పేస్ సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి విజయం సాధించాడు. -
మూడు దశాబ్దాల ఆటకు వీడ్కోలు
29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ఒక టీనేజీ కుర్రాడు తొలిసారి భారత జట్టు తరఫున డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. డబుల్స్ మ్యాచ్‌లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలిసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు 46 ఏళ్ల ప్రాయంలోనూ కూడా అదే ఉత్సాహం, అదే జోరు... పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్... దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్న ఆ శరీరానికి అలసట వచ్చేసింది. వయసును గెలిచిన ‘ఆ కుర్రాడు’ వచ్చే ఏడాది తన మూడు దశాబ్దాల టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్... ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్... ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకుంటూ వస్తున్న రికార్డులకైతే అంతే కనిపించడం లేదు. అలసిపోవడం లేదు, ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజులే లేవు... ఈ మనిషికి ఎలా సాధ్యం. మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచి్చందని చాలా మంది భావించే ఆటలో 46 ఏళ్ల వయసు వచి్చనా గ్రాండ్‌గా ఆడి చూపిస్తున్న అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి డేవిస్ కప్‌లో కొత్త రికార్డు సృష్టించే వరకు టెన్నిస్‌లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెకర్, ఇవాన్ లెండిల్లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఇప్పుడు ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడుతూనే ఉంది. పేస్ ఆడేది డబుల్స్‌లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను ఆశ్చర్యంతో భారత క్రీడాభిమానులు చూశారు. కానీ టెన్నిస్‌లాంటి క్రీడలో 29 ఏళ్లుగా సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... పేస్ 1990లో జూనియర్ వింబుల్డన్... 1991లో జూనియర్ యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత సుదీర్ఘకాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్... ఇప్పటికీ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్... పేస్‌కు సంబంధించి ప్రతీ భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే వాలి బలం రెట్టింపు అయిపోయినట్లు... భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోరీ్నల సంగతి ఎలా ఉన్నా... దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్‌కప్ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంత బలమైన ఆటగాడు అయినా వీరోచిత ప్రదర్శనతో పేస్ డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్‌సెవిచ్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్‌లలో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచి్చన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్ సెమీస్ చేరడంలో పేస్‌దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి... 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో అటు వైపు కోర్టు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లు కమ్మాయి. శరీరంపై నియంత్రణ లేక నిలబడేందుకు భాగస్వామి మారి్టనా నవ్రతిలోవాను పట్టుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. చివరకు అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మారి్టనా నవ్రతిలోవా సిద్ధమైంది. దాని నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. వచ్చే ఏడాదే ఆఖరు... పేస్ ఆటతీరు భీకరమైన సరీ్వస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్ కుర్రాళ్ల ఆటగా మారిపోయిన ఈతరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ ఇటీవల మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో ఇంకా పదును మిగిలి ఉందనే చూపిస్తోంది. రాడ్ లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్, 100కు పైగా వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. ఇటీవల పదే పదే అతని రిటైర్మెంట్పై వార్తలు రావడం, దానిని అతను ఖండించడం చాలా సార్లు జరిగాయి. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటివి వినిపించడం సహజం. అయితే ఆటను పిచి్చగా ప్రేమించే పేస్, ఏ స్థాయిలోనైనా దానిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. డబుల్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 105వ ర్యాంకర్‌గా ఉన్న పేస్ వచ్చే ఏడాది కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాడు. కొన్ని విశేషాలు.... ►అంతర్జాతీయ టెన్నిస్‌లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడు. 18 గ్రాండ్‌స్లామ్‌లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్) గెలిచాడు. ►వరుసగా 7 ఒలింపిక్స్‌లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు. 1999లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. వరుసగా 19 సీజన్ల పాటు (1997–2015) ఏడాదికి కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచాడు. ►తన ప్రొఫెషనల్ కెరీర్లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించాడు. ఇందులో సింగిల్స్‌లో ఒక టైటిల్ ఉండగా... మిగతా 54 టైటిల్స్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ►సింగిల్స్ విభాగంలో పేస్ 101 మ్యాచ్‌ల్లో గెలిచి... 99 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. డబుల్స్‌లో పేస్ 767 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 455 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో పేస్ 85,71,006 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 61 కోట్ల 11 లక్షలు) సంపాదించాడు. ►1990లో జపాన్‌పై డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన పేస్ 57 సార్లు డేవిస్ కప్ బరిలోకి దిగాడు. 92 మ్యాచ్‌ల్లో గెలిచి (సింగిల్స్‌లో 48; డబుల్స్‌లో 44)... 35 మ్యాచ్‌ల్లో (సింగిల్స్‌లో 22; డబుల్స్‌లో 12) ఓడిపోయాడు. డేవిస్‌కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (44) సాధించిన ప్లేయర్‌గా పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ►ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేరి్పన క్రమశిక్షణ, చేసిన మార్గదర్శనం, కల్పించిన వాతావరణం ఇవన్నీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వారు నా పట్ల కనబరిచిన అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పటికీ మరువలేను. అమ్మా–నాన్న... మీరు లేకుంటే నేనూ లేను. ఐ లవ్ యూ. మా అక్కలకు థ్యాంక్స్ చెప్పాలి. జాక్వి, మరియాలిద్దరు నాకంటే పెద్దవాళ్లు. వాళ్లే నన్నింతలా మార్చేశారు. జీవన ప్రయాణంలో ఎత్తుపల్లాలు అర్థమయ్యేలా చేశారు. నేనో పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు బాగా సహకరించారు. తల్లిదండ్రులు చెప్పిన నైతిక విలువల్ని నేనూ పాటించేలా చేశారు. ఐ లవ్ యూ సిస్టర్స్. ఇక నా గారాలపట్టి... కుమార్తె అయానా! పాప లవ్స్ యూ. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అంశం కూతుర్ని కలిగి ఉండటం అనేది నీ వల్లే నాకు అర్థమైంది. అయానా నీవే నాకు స్ఫూర్తి. నా కెరీర్లో మిగిలున్నది 2020 టెన్నిస్ క్యాలెండరే! కేవలం ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడతాను. నా జట్టుతో చేసే ఆఖరి క్రీడా పయనాన్ని గొప్పగా మలచుకుంటా. సహచరులు, మిత్రులు, అభిమానులతో ఆనందంగా గడుపుతా. నా సుదీర్ఘ ప్రయాణానికి అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అభిమానులకు విన్నపం. నాతో ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటే ‘లియాండర్ మెమోరిస్’కు షేర్ చేయండి. నేను నా మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటాను. ‘గుడ్‌బై ఇయర్‌గా 2020 నాకు ఉద్వేగంగా గడువనుంది. భారంగా నేను రాకెట్‌ను విడువనున్నాను. – ట్విట్టర్లో లియాండర్ పేస్ పేస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల డబుల్స్ ► ఆస్ట్రేలియన్ ఓపెన్: 2012 ►ఫ్రెంచ్ ఓపెన్: 1999, 2001, 2009 ►వింబుల్డన్: 1999 ►యూఎస్ ఓపెన్: 2006, 2009, 2013 మిక్స్డ్ డబుల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్: 2003, 2010, 2015 ►ఫ్రెంచ్ ఓపెన్: 2016 ►వింబుల్డన్: 1999, 2003, 2010, 2015 ►యూఎస్ ఓపెన్: 2008, 2015 ►పేస్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అర్జున అవార్డు...1996–1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’... 2001లో ‘పద్మశ్రీ’... 2014లో ‘పద్మభూషణ్’ అవార్డులు అందజేసింది. -
రెండు గేమ్‌లే కోల్పోయి...రెండింటిలోనూ గెలిచి...
ఊహించినట్టే జరిగింది. పేరుకు చిరకాల ప్రత్యర్థి అయినా... పాకిస్తాన్‌తో భారత టెన్నిస్ జట్టు ఓ ఆటాడుకుంది. కేవలం రెండంటే రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో 2–0తో ఆధిక్యం సంపాదించింది. నేడు రెండు రివర్స్ సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్ జరుగుతాయి. ఒక దాంట్లో భారత్ నెగ్గినా... వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు సిద్ధమవుతుంది. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లను పంపించిన పాకిస్తాన్ టెన్నిస్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనామకులైనప్పటికీ భారత యువ తారలు సహజశైలిలో ఆడి అలవోక విజయాలు అందుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత్ 2–0తో ఆధిక్యాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్‌పై గెలిచాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఇంకా పేరు కూడా నమోదుకాని షోయబ్ రెండు సెట్లలోనూ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమీత్ రెండో సెట్లో రెండు గేమ్‌లను కోల్పోయాడు. మూడో మ్యాచ్‌గా నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్–జీవన్ నెడుంజెళియన్ జోడీ అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ జంటతో ఆడుతుంది. -
డేవిస్ కప్‌లో స్పెయిన్ ‘సిక్సర్’
మాడ్రిడ్ (స్పెయిన్): ప్రపంచ పురుషుల టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను స్పెయిన్ జట్టు ఆరోసారి సొంతం చేసుకుంది. తుది పోరులో స్పెయిన్ 2–0తో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అగుట్ 7–6 (7/3), 6–3తో ఫెలిక్స్ అగుర్పై నెగ్గి స్పెయిన్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ 6–3, 7–6 (9/7)తో షపోవలోవ్ (కెనడా)ను ఓడించాడు. గతంలో స్పెయిన్ 2000, 2004, 2008, 2009, 2011లలో విజేతగా నిలిచింది. -
నూర్ సుల్తాన్‌లో భారత్, పాక్ డేవిస్ కప్ పోరు
పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య (పీటీఎఫ్)కు మరోసారి చుక్కెదురైంది. భద్రతాకారణాలరీత్యా భారత్, పాకిస్తాన్ డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌ను ఇస్లామాబాద్‌లో కాకుండా తటస్థ వేదికపైనే నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆదేశించింది. తటస్థ వేదికను సూచించాలని నవంబర్ 4న పీటీఎఫ్ను కోరింది. అయితే పీటీఎఫ్ తటస్థ వేదికను ఖరారు చేయకుండా... ఇస్లామాబాద్‌లోనే మ్యాచ్ నిర్వహించాలని ఐటీఎఫ్‌కు మరోసారి అప్పీల్ చేసుకుంది. కానీ పీటీఎఫ్ అప్పీల్‌ను ఐటీఎఫ్ కొట్టివేసింది. పాకిస్తాన్ సమాఖ్య వేదికను సూచించకపోవడంతో ఐటీఎఫ్ సొంత నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వేదికగా కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌ను ఐటీఎఫ్ ఎంపిక చేసింది. న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ వేదిక ఖరారైంది. కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లో ఈనెల 29, 30వ తేదీల్లో ఈ మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ గత సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సింది. అయితే భద్రతా కారణాలరీత్యా పాకిస్తాన్లో ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఐటీఎఫ్ నవంబర్ 29, 30 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ఈనెల 4న ప్రకటించింది. పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య (పీటీఎఫ్)ను తటస్థ వేదికను ఎంచుకోవాలని కూడా కోరింది. అయితే ఐటీఎఫ్ తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, ఇస్లామాబాద్‌లోనే మ్యాచ్‌ను నిర్వహించాలని కోరుతూ పీటీఎఫ్ అప్పీల్ చేసింది. ఎలాంటి అభద్రతాభావం లేకుండా భారత యాత్రికులు పాకిస్తాన్‌కు వస్తున్నారని... భారత ఆటగాళ్లు పాక్‌లో ఆడేందుకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పీటీఎఫ్ వాదించింది. ‘ఇస్లామాబాద్ నుంచి మ్యాచ్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఐటీఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని పీటీఎఫ్ డేవిస్ కప్ కమిటీకి అప్పీల్ చేసింది. అయితే ఐటీఎఫ్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ పీటీఎఫ్ అప్పీల్‌ను కొట్టి వేసింది. తటస్థ వేదికపైనే మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది’ అని ఐటీఎఫ్ తెలిపింది. ‘పీటీఎఫ్ తటస్థ వేదిక పేరును సూచించకపోవడంతో డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఐటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌ను కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లోని జాతీయ టెన్నిస్ కేంద్రంలో నిర్వహించాలని డేవిస్ కప్ కమిటీ నిర్ణయం తీసుకుంది’ అని ఐటీఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం కజకిస్తాన్‌లో అతి శీతల వాతావరణం ఉండటంతో మ్యాచ్‌ను బయట కాకుండా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. రెండోసారి... భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్ తటస్థ వేదికపై జరగనుండటం ఇది రెండోసారి. 1973లోనూ భారత్, పాక్ డేవిస్ కప్ మ్యాచ్‌ను తటస్థ వేదిక మలేసియాలో నిర్వహించారు. ఓవరాల్‌గా ఈ రెండు జట్లు డేవిస్ కప్‌లో ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఆరుసార్లూ భారతే గెలిచి అజేయంగా ఉంది. -
పాక్‌తో పోరుకు బోపన్న దూరం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జట్టుతో ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ నుంచి భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న వైదొలిగాడు. భుజం గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌కు బోపన్న సమాచారం ఇచ్చాడు. 39 ఏళ్ల బోపన్న స్థానంలో జీవన్ నెడుంజెళియన్ జట్టులోకి వచ్చాడు. -
మరీ ఇంత దారుణమా?: మహేశ్ భూపతి
న్యూఢిల్లీ: తనను భారత డేవిస్‌కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడంపై మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ కెరీర్‌కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్‌కప్ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ‘ నన్ను భారత డేవిస్‌కప్ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే ఆ పని ముందే చేయాల్సింది. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీతో జరిగిన డేవిస్‌కప్‌లో భారత్ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. ఇప్పుడు దాన్ని సాకుగా చూపుతూ ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక్కడ ఐటా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారిగా నన్ను తప్పించడం వెనుక కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్‌కప్ మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్ వెళ్లలేమని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు తేల్చిచెప్పాను దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటీఎఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా. ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు. నవంబర్ 4వ తేదీన నన్ను కెప్టెన్‌గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్ హిరోన్మయ్ ఛటర్జీ ఫోన్లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు విధానాన్ని ఐటా అవలంభిస్తోంది’ అని మహేశ్ భూపతి విమర్శించాడు. -
తటస్థ వేదికపై భారత్, పాక్ డేవిస్ కప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పాక్‌లో జరగాల్సిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ పోరు తటస్థ వేదికకు మారింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇస్లామాబాద్ నుంచి డేవిస్ మ్యాచ్‌లను తరలించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో పోరు నిర్వహణ కష్టమని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీఎఫ్ స్వతంత్ర భద్రతా సలహాదారులు నివేదిక ఇచ్చారు. దాంతో తటస్థ వేదికపై ఈనెల 29, 30వ తేదీల్లో దాయాదుల సమరం జరుగుతుందని సోమవారం అధికారికంగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం నుంచి ఈవెంట్‌ను తరలిస్తే తటస్థ వేదికను ఎంపిక చేసే హక్కు ఆ దేశానికే కలి్పస్తారు. మరో ఐదు రోజుల్లో ఏ దేశంలో నిర్వహించేది పాకిస్తాన్ వెల్లడించాల్సి వుంటుంది. దీన్ని డేవిస్ కప్ కమిటీ ఆమోదిస్తుంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా రోహిత్ రాజ్‌పాల్ వ్యవహరిస్తాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది. -
పాక్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తమ విజ్ఞప్తిని తిరస్కరించి... పాకిస్తాన్లో తప్పనిసరిగా డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడాల్సివస్తే... అక్కడికి ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నిర్ణయించింది. ‘కశ్మీర్ హోదా’ అంశంలో దాయాదుల మధ్య సంబధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో జరగాల్సిన ఈ ఇండో–పాక్ డేవిస్ పోరును భద్రతా కారణాలతో ఐటీఎఫ్ వచ్చే నెలకు వాయిదా వేసింది. తటస్థ వేదిక వద్ద నిర్వహించాలని ఐటా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై వచ్చేనెల 4న ఐటీఎఫ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడనున్నాయి. అయితే ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఐటీఎఫ్ ఇస్లామాబాద్‌కే ఓటేసే అవకాశముంది. ఇందులో భారత్ ఆడనంటే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఐటా కీలక ఆటగాళ్లను కాకుండా ‘ద్వితీయ శ్రేణి’ జట్టుతో అక్కడ డేవిస్ కప్ పోరును మమ అనిపించాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఐటా ఉన్నతాధికారులు ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేశారు. ఇందులో నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి కూడా పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపేందుకు వీసా ప్రక్రియను ప్రారంభించామని ఐటా కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. నవంబర్ 29, 30 తేదీల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య టెన్నిస్ పోటీలు జరుగుతాయి. -
పాక్‌తో భారత్ డేవిస్‌కప్ పోరు
నాగ్‌పూర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు డేవిస్ కప్‌లో తలపడనున్నాయి. విదేశీ గడ్డపై ఆడాల్సిన ఈ టెన్నిస్ పోరులో భారత్... పాక్‌తో పోటీపడుతుంది. అయితే పాక్‌లో భారత్ ఆడే పరిస్థితి లేకపోవడంతో తటస్థ వేదికపై ఈ పోరు జరిగే అవకాశముంది. చివరి సారిగా భారత్ 1964లో పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడింది. తాజా ‘డ్రా’లో భాగంగా భారత్, పాక్‌లు ఈ సెప్టెంబర్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. గతంలో మలేసియా (1973) తటస్థ వేదికపై చిరకాల ప్రత్యర్థులు తలపడ్డాయి. -
భారత్ ఆటకట్టు
సాధారణంగా డేవిస్ కప్ మ్యాచ్‌లు హార్డ్ కోర్టులో జరుగుతాయి. ఇటలీకి ఆ కోర్టుల్లో పట్టుంది. వారిని ఓడించే వ్యూహంతో భారత్... కోల్‌కతాలో గ్రాస్ కోర్టులపై ఆడించింది. కానీ, ఈ ఎత్తుగడలేమీ పారలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో భారత్ విఫలమైన వేళ... చెలరేగిన ఇటలీ తొలిసారి డేవిస్ కప్ వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కోల్‌కతా: తొలిరోజు రెండు మ్యాచ్‌ల్లోనూ చేదు ఫలితాలే ఎదురైనా... శనివారం డబుల్స్ మ్యాచ్ ఊపిరిపోసింది. కానీ రివర్స్ సింగిల్స్‌తో కథ మళ్లీ మొదటికొచ్చింది. చివరకు ఇటలీతో జరిగిన డేవిస్ కప్ పోరులో భారత్ 1–3తో పరాజయం చవి చూసింది. ప్రత్యర్థికి అంతగా పట్టులేని గ్రాస్ కోర్టులోనూ చక్కని విజయాలతో ఇటలీ డేవిస్‌కప్ వరల్డ్ ఫైనల్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి అర్హత సంపాదించింది. మొదటి రోజే 0–2తో వెనుకబడిన భారత శిబిరంలో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ ఆశలు రేపింది. కలకత్తా సౌత్క్లబ్లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ 4–6, 6–3, 6–4తో సిమోన్ బొయెలీ–మాటియో బెరెటిని జంటపై విజయం సాధించింది. తొలి సెట్ ఓటమి తర్వాత ఒక్కసారిగా భారత ద్వయం పుంజుకుంది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. చివరకు గంటా 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న–దివిజ్ జంట 2–1 సెట్లతో జయభేరి మోగించింది. దీంతో భారత్ 1–2తో టచ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ రివర్స్ సింగిల్స్ ఫలితం భారత్‌ను ముంచింది. ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి 6–1, 6–4తో భారత టాప్ ర్యాంకర్, ప్రపంచ 102వ ర్యాంకు ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ను ఓడించడంతో పరాజయం ఖాయమైంది. తొలి సెట్లో సెప్పి ధాటికి భారత ఆటగాడు నిలువలేకపోయాడు. శరవేగంతో సెట్‌ను ముగించిన ఇటలీ ఆటగాడికి రెండో సెట్లో కాస్త పోటీ ఎదురైంది. చివరకు 62 నిమిషాల్లో సెట్‌తో పాటు మ్యాచ్‌ను ముగించాడు. ఫలితం తేలిపోవడంతో రెండో రివర్స్ సింగిల్స్‌ను ఆడించలేదు. ఈ విజయంతో ముఖాముఖీ పోటీల్లో ఇటలీ ఆధిపత్యం 5–1కు పెరిగింది. భారత్ ఇదే కలకత్తా సౌత్క్లబ్ కోర్టులో 1985లో జరిగిన డేవిస్ పోరులో గెలిచింది. కానీ ఈ పరాజయంతో ప్రపంచ 19వ ర్యాంకరైన భారత్ జోన్ గ్రూప్‌కు పడిపోయింది. మాడ్రిడ్ (స్పెయిన్)లో నవంబర్‌లో జరిగే 12 జట్ల ఫైనల్స్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఇటలీ పాల్గొంటుంది. సింగిల్స్‌లో కనీసం ఒక మ్యాచ్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ తొలిరోజు (శుక్రవారం) రెండు సింగిల్స్ల్లోనూ ఓడటం ప్రతికూలించింది. 0–2తో వెనుకబడి పుంజుకోవడమనేది మానసికంగా కష్టసాధ్యమైంది. ఇప్పుడిప్పుడే భారత టెన్నిస్ మెరుగుపడుతోంది. నిజానికి బాక్సర్లు, రెజ్లర్లకు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం టెన్నిస్ ప్లేయర్లకు ఆర్థిక సహకారం ఇవ్వడం లేదు. టెన్నిస్‌లో సింగిల్స్ ఆటగాళ్లకు టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ద్వారా చేయూతనివ్వాలి. ఎందుకంటే సింగిల్స్ ఆటగాళ్లకు సరైన అండదండలు లేవు. ‘ఐటా’ దగ్గరేమో నిధులుండవు. ప్రభుత్వం ప్రజ్నేశ్, రామ్కుమార్లకూ సాయమందిస్తే ఫలితాలు మరోలా ఉంటాయి. – మహేశ్ భూపతి,భారత నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ -
సింగిల్స్‌పై దృష్టి పెట్టాలి
కోల్‌కతా: భారత టెన్నిస్‌లో ఇక సింగిల్స్‌పై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం వచ్చిందని డేవిస్ కప్ కెప్టెన్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి నైపుణ్యం కలిగిన కనీసం పది మంది వర్ధమాన సింగిల్స్ ఆటగాళ్లు భారత్‌కు అవసరమన్నారు. ‘ఇప్పటివరకు గొప్ప విజయాలు డబుల్స్ కేటగిరీలోనే సాధ్యమయ్యాయి. కేవలం నలుగురి ద్వారానే ఈ ఘనతలన్నీ భారత్ ఖాతాలో చేరాయి. డబుల్స్ విభాగంలోనే భారత్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. ఇక ఈ విభాగంలో మనం గెలిచే టైటిళ్లు యువ ఆటగాళ్లపై అంతగా ప్రభావం చూపలేవు. ఇది మారాలి. సింగిల్స్‌పై దృష్టి పెట్టాలి. పెద్ద టోర్నీల్లో నిలకడగా విజయాలు సాధించే సింగిల్స్ ఆటగాళ్లు భారత్ నుంచి రావాలి. టాప్–100లో కనీసం 10 మంది యువ ఆటగాళ్లు చోటు దక్కించుకునే పరిస్థితులు కల్పిస్తేనే భవిష్యత్‌లో భారత టెన్నిస్ బాగుంటుంది’ అని తన కెరీర్లో 12 టైటిళ్లను గెలుచుకున్న భూపతి ఆకాంక్షించారు. భారత్ తరఫున పేస్ 18 డబుల్స్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా, భూపతి రెండోస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత్ సింగిల్స్ నెం.1 ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 109వ స్థానంలో ఉండగా, రామ్‌కుమార్ రామనాథన్ 131వ ర్యాంకులో ఉన్నాడు. మహిళల విభాగంలో గతవారం సింగపూర్ టైటిల్ గెలిచిన అంకిత రైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 168వ స్థానంలో, కర్మన్‌కౌర్ థండి 205వ స్థానంలో నిలిచారు. ఈ పరిస్థితిపై భూపతి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు తన మాజీ భాగస్వామి, వెటరన్ ప్లేయర్ లియాండర్ పేస్‌ని భూపతి ప్రశంసించారు. పేస్‌లో ఇంకా గెలవాలనే కసి, తపన ఉన్నాయని, టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్‌లోనూ పేస్ పాల్గొని చరిత్ర సృష్టిస్తాడని అన్నాడు. -
లక్ష్యం టాప్–50
కోల్‌కతా: స్వదేశంలో వచ్చే వారం ఇటలీతో జరుగనున్న డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో రాణిస్తానని అంటున్నాడు టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్. గ్రాస్ కోర్టులపై తాను మెరుగైన ఆటగాడినని పేర్కొంటూ, ఇటీవల గ్రాస్ కోర్టుపై ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపలొవ్ (కెనడా)ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. మోకాలి గాయంతో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన ప్రజ్నేశ్... దాన్నుంచి కోలుకుని ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగి గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేశాడు. అయితే, తొలి రౌండ్లోనే 6–7 (7/9), 3–6, 3–6తో ఫ్రాన్సెస్ టియాఫొ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. వచ్చే సారి మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 104లో ఉన్న ప్రజ్నేశ్, తన లక్ష్యం టాప్–50లోకి చేరుకోవడమేనని వివరించాడు. ఇందులోభాగంగా ముందుగా టాప్–100లోకి రావడంపై దృష్టిపెట్టానన్నాడు. -
ఒక్క గెలుపు లేకుండానే...
క్రాల్‌జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్‌లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి. ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. -
భారత్(vs)సెర్బియా
బెల్గ్రేడ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, సెర్బియా జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. సెర్బియా తరఫున యూఎస్ ఓపెన్ తాజా చాంపియన్ నొవాక్ జొకోవిచ్ బరిలోకి దిగడంలేదు. భారత్ తరఫున సింగిల్స్‌లో రామ్‌కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సాకేత్ మైనేని... డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ బరిలోకి దిగనున్నారు. -
డేవిస్ కప్ జట్టులో మార్పులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో అనూహ్యంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన జట్టు నుంచి యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్, సుమీత్ నాగల్ తప్పుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి క్రాలేవోలో సెర్బియాతో ఈ పోరు జరుగనుంది. యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్‌లు గాయాల కారణంగా దూరం కాగా... సుమీత్ మాత్రం స్టాండ్‌బైగా జట్టుతో పాటు కొనసాగడం ఇష్టం లేక తప్పుకున్నాడు. దీంతో తెలుగు తేజం సాకేత్ మైనేనితో పాటు శ్రీరామ్ బాలాజీ వారీ స్థానాలను భర్తీ చేయ నున్నారు. అర్జున్ ఖడే స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. 2014లో బెంగళూరులో సెర్బియాతోనే జరిగిన డేవిస్‌కప్ మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడింది. -
అప్పుడు చెప్పలేదు కదా!
ఆర్థర్ ఆష్ ఓ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. అమెరికా జాతీయుడు. అమెరికా డేవిస్ కప్ జట్టుకు ఎంపికైన తొలి నీగ్రో ఇతను. అలాగే టెన్నిస్ చరిత్రలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి నీగ్రో జాతీయుడు కూడా ఇతనే కావడం విశేషం. ఓమారు బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఇతనికి రక్తం కావలసివచ్చింది. అలా రక్తం ఎక్కించినప్పుడు ఇతనికి ఎయిడ్స్ వచ్చింది. అయితే ఎయిడ్స్ వచ్చిన వాళ్లు బాధకూడదని, వారిని చైతన్యపరచడంకోసం ఇతను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇతనిని ఓ పాత్రికేయుడు కలిసి ‘మీకీ జబ్బు వచ్చినందుకు ఆ భగవంతుడిని కోపగించుకున్నారా?‘ అని ప్రశ్నించాడు. దానికి ఆష్ జవాబిస్తూ తొలి నీగ్రో జాతీయుడిగా వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పని నేను ఈరోజు ఎయిడ్స్‌తో బాధపడుతున్నాను కదాని దేవుడిని నిందించడం అర్థరహితమని అన్నాడు. ఖర్మఫలాన్ని అనుభవించకతప్పదని అన్నాడు ఆష్. మనం చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితాలు పొందుతామని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నాడు. విజయాలు సాధించినప్పుడు ఉప్పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కృంగిపోవడం తగదని, దేనినైనా ఒకేలా స్వీకరించకతప్పదని అతను చెప్పాడు. – యామిజాల జగదీష్ -
లియాండర్ పేస్.. అరుదైన ఫీట్
బీజింగ్ : భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించారు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. డేవిస్ కప్‌లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడి కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్ పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. తద్వారా ఇరాన్ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్‌లో అత్యధిక డబుల్స్ విజయాల( 42) రికార్డును పేస్ తిరగరాశారు. తద్వారా 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. పేస్ డేవిస్ కప్ విజయాల ట్రాక్‌ను పరిశీలిస్తే... 1990లో డేవిస్ కప్‌లో జీసన్ అలీతో తొలిసారి జతకట్టిన పేస్ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. అత్యధికంగా మహేశ్ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. దీంతో ఈసారి డేవిస్‌కప్‌లో పేస్ పాల్గొనడం పై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) డేవిస్‌కప్ పోరుకు పేస్‌ను ఎంపిక చేసింది. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు డేవిస్ కప్ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్‌తో పాటు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్, రోహన్ బోపన్నలు ఉన్నారు. దివిజ్ శరణ్ రిజర్వ్ సభ్యుడిగా ఉంటాడు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్ ఓపెన్‌లో పేస్ రన్నరప్‌గా నిలిచి డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. ‘రోహన్ బోపన్నకు పేస్‌తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్‌దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్ గెలిస్తే పేస్ డేవిస్‌కప్‌లో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం. -
మన కథ ప్లే–ఆఫ్ వరకే...
►కెనడా చేతిలో భారత్ 2–3తో ఓటమి ► డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ఎడ్మాంటన్ (కెనడా): డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్ పోరాటం వరుసగా నాలుగోసారి ప్లే–ఆఫ్‌లోనే ముగిసింది. కెనడాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో భారత్ 2–3తో ఓడిపోయింది. దాంతో వచ్చే ఏడాది భారత్ మళ్లీ ఆసియా ఓసియానియా గ్రూప్ నుంచి డేవిస్‌కప్ పోరు ప్రారంభిస్తుంది. ఈ విజయంతో ఆతిథ్య కెనడా జట్టు వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సంపాదించింది. రివర్స్ సింగిల్స్‌లో తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలొచ్చాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 6–7 (1/7), 3–6తో ప్రపంచ 51వ ర్యాంకర్ షపొవలోవ్ చేతిలో కంగుతిన్నాడు. ఒక్క రెండో సెట్ మినహా మిగతా సెట్లలో రామ్ కుమార్ తన ప్రత్యర్థి ధాటికి చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో కెనడా నెగ్గడంతో మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండానే భారత్ కథ ముగిసినట్లయింది. అనంతరం జరిగిన నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 6–4, 4–6, 6–4తో బ్రేడెన్ ష్నర్పై గెలిచాడు. పరాజయంపై భారత నాన్–ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి మాట్లాడుతూ ‘పోటీ జరిగిన ఈ మూడు రోజులు మాకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం’ అని అన్నారు. -
చెరొకటి గెలిచారు
భారత్, కెనడా 1–1తో సమం ► రామ్ కుమార్ విజయం ► పోరాడి ఓడిన యూకీ బాంబ్రీ ► డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ఎడ్మాంటన్ (కెనడా): డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే–ఆఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో యువ సత్తా ఆకట్టుకుంది. తొలిరోజు ఆటతీరుతో ఆసక్తిని పెంచింది. చెరో విజయంతో భారత్, కెనడా జట్లు 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోరులో యూకీ బాంబ్రీ పరాజయం చవిచూడగా, రామ్‌కుమార్ రామనాథన్ విజయం సాధించాడు. రెండో సింగిల్స్‌లో యూకీ 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 6–4, 1–6తో ప్రపంచ 51 ర్యాంకర్ డెనిస్ షపొవలోవ్ చేతిలో పోరాడి ఓడాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ నిరాశ చెందని యూకీ బాంబ్రీ... స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. ఐదు సెట్లదాకా సాగిన ఈ ఆసక్తికర మ్యాచ్‌లో ప్రపంచ 157వ ర్యాంకర్ అయిన భారత ఆటగాడు మూడు, నాలుగు సెట్లలో తనకన్నా ఎంతో మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడిని వణికించాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో అప్పటికే అలసిపోయిన యూకీ పరాజయం చవిచూడటంతో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఫలితాన్ని పక్కనబెడితే నాలుగు గంటల పాటు (3 గం.52 ని.) జరిగిన ఈ పోరులో యూకీ పోరాటం అద్వితీయం. స్పెయిన్ స్టార్ నాదల్‌నే (మాంట్రియల్ మాస్టర్స్‌లో) మట్టికరిపించిన కెనడా యువ సంచలనానికి ముచ్చెమటలు పట్టించాడు. విజయం కోసం తుదికంటా పోరాడాడు. అంతకుముందు తొలి సింగిల్స్ బరిలోకి దిగిన 154వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 7–6 (7/4), 7–5, 7–5తో బ్రెడెన్ ష్నర్పై విజయం సాధించాడు. తొలి సెట్లో ఓడిన భారత ఆటగాడు తర్వాత ఒక్కో సెట్ విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 3 గంటల 16 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో వరుసగా మూడు సెట్లు గెలిచి భారత్‌కు శుభారంభమిచ్చాడు. తొలి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కుర్రాళ్ల పోరాటం అద్భుతం. ఓటమి కోరల్లోంచి మ్యాచ్‌ను రామ్‌నాథన్ తన చేతుల్లోకి తెచ్చుకున్న తీరు అసాధారణం. యూకీ కూడా అదే పని చేశాడు. ఇందులో ఫలితమే తేడా. పోరాటం ఇంచుమించు ఒకటే’ అని భూపతి అన్నాడు. -
సాకేత్, యూకీ పునరాగమనం
లియాండర్ పేస్‌కు దక్కని స్థానం న్యూఢిల్లీ: కెనడాతో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తలపడే భారత జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని, సింగిల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. కెనడాలోని ఎడ్మంటన్‌లో సెప్టెంబరు 15 నుంచి 17 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు డబుల్స్ దిగ్గజం లియాండర్ పేస్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. సాకేత్, యూకీలతోపాటు రామ్‌కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న జట్టులోని మిగతా సభ్యులు. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ రిజర్వ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. గత ఏప్రిల్‌లో స్వదేశంలో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయాల కారణంగా సాకేత్, యూకీ ఆడలేదు. ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆరుగురు సభ్యులున్న జట్టులో పేస్‌ను ఎంపిక చేసినా నలుగురు ఆటగాళ్లున్న తుది జట్టులో అతడికి స్థానం లభించలేదు. ‘ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. భవిష్యత్‌లో పేస్ పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ మహేశ్ భూపతి కోరడంతో డబుల్స్ విభాగంలో ఒకరినే ఎంపిక చేశాం. ఈసారి యూకీ, రామ్‌కుమార్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్–బోపన్న జంట బరిలోకి దిగుతుంది’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. -
‘డబుల్’ ఫాల్ట్!
► సద్దుమణగని డేవిస్ కప్ వివాదం ► వ్యక్తిగత సంభాషణను భూపతి బయట పెట్టడంపై పేస్ ఆగ్రహం ► ఇద్దరిదీ తప్పంటున్న ఏఐటీఏ బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరులో విజయం సాధించి భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినా... ఈ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. పాత విభేదాలతోనే పేస్‌ను పక్కన పెట్టినట్లు వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో పేస్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి బయటపెట్టగా... ఇది ముమ్మాటికీ తప్పంటూ పేస్ విమర్శించాడు. మరోవైపు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), మాజీ ఆటగాళ్లు మాత్రం ఇద్దరినీ తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పేస్, భూపతి మరింత పరిణతితో వ్యవహరించాల్సిందని వారు విమర్శించారు. కావాలని చేయలేదు... డేవిస్ కప్ మ్యాచ్ ఆడే తుది జట్టులో పేస్‌కు అవకాశం ఇవ్వకుండా నలుగురు ఆటగాళ్లను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ హోదాలో మహేశ్ భూపతి ఎంచుకున్నాడు. అయితే తనతో పాత విభేదాల కారణంగానే ఇలా చేశారంటూ పేస్ ఆ రోజే విమర్శించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భూపతి దీనిపై వివరణ ఇస్తూ పేస్పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. ‘ఇందులో వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. నా ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతో తప్పనిసరి అయితే తప్ప వివరణ ఇవ్వలేదు. 1994లో తొలిసారి డేవిస్ కప్ జట్టులోకి వచ్చినప్పుడు నేను కూడా పేస్ అభిమానినే. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దానిపై నేను ఓ పుస్తకం రాయగలను. ‘గౌరవం’ అనే పదానికి అతనికి అర్థం కూడా తెలీదు. నాకు జట్టుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏఐటీఏ స్వేచ్ఛ ఇచ్చింది. అసలు పోరు మధ్యలోనే పేస్ జట్టును వదిలి వెళ్లిపోవడం ఏమిటి’ అని మహేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆగకుండా తుది జట్టు ఎంపికకు సంబంధించి తనకు, పేస్‌కు మధ్య వాట్సప్‌లో జరిగిన చాటింగ్‌ను కూడా అతను ఈ సందర్భంగా బయట పెట్టాడు. నన్ను ఎందుకు అవమానించారు? అయితే భూపతి వ్యవహారశైలి పట్ల పేస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత సంభాషణను ఒక డేవిస్ కప్ కెప్టెన్ ఎలా బయటపెడతాడంటూ పేస్ ప్రశ్నించాడు. పేస్ పదే పదే కోరినా అతనికి జట్టులో స్థానంపై ఇంకా స్పష్టత ఇవ్వలేనంటూ భూపతి ఇందులో చెబుతూ వచ్చాడు. ‘మా మధ్య మాటల్లో అన్నింటికంటే ఫామ్ ప్రధానమనే చెప్పాడు. కానీ నిజంగా జట్టును ఎంపిక చేసేటప్పుడు దీనిని పట్టించుకోలేదు. నేను బెంగళూరుకు రాక ముందే నిర్ణయం తీసేసుకున్నారని అర్థమవుతోంది. కానీ నాకు చోటు లేదని స్పష్టంగా చెప్పలేదు. ఇది నన్ను అవమానించడమే. ఇదంతా అవసరం లేదు కదా’ అని పేస్ వ్యాఖ్యానించాడు. డేవిస్ కప్‌లో తన పాత్ర గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా పేస్ వివరణ ఇచ్చాడు. ‘అతని ఏకపక్ష వాదనకు నేను మున్ముందు ప్రత్యుత్తరం ఇవ్వగలను. అయితే దేశం తరఫున ఎవరు ఏం చేశారో అభిమానులకు, ప్రజలందరికీ తెలుసు. దీనిపై మాట్లాడటం వృథా. చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు’ అని పేస్ స్పష్టం చేశాడు. సీనియర్లు ఇద్దరు ఈ విషయంలో మరింత పరిణతితో వ్యవహరించాల్సింది. మ్యాచ్ మధ్యలో పేస్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తన ఆలోచనలు, జట్టు ఎంపికపై మహేశ్ మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అయితే జట్టులో నువ్వు భాగం కాదంటూ పేస్‌కు భూపతి కాస్త మర్యాదగా ముందే చెబితే బాగుండేది. 27 ఏళ్ల పాటు దేశం తరఫున ఆడిన వ్యక్తికి ఆ గౌరవం పొందేందుకు తగిన అర్హత ఉంది. వాట్సప్ సంభాషణ గురించి మాకూ తెలుసు. తగిన సమయంలో కూర్చొని వారిద్దరితో మాట్లాడతాం. ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలనేది మా ఆలోచన. – హిరణ్మయి ఛటర్జీ, ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి నా దృష్టిలో ఈ వివాదం ముగిసిన అధ్యాయం. ఇప్పుడు పేస్, మహేశ్ మధ్య ఉన్న పాత గొడవలు ముఖ్యం కాదు. ప్రస్తుత స్థితిలో మన ఆటగాళ్లు వరల్డ్ గ్రూప్‌లోకి వెళ్లలేరు. ఫెడ్ కప్, గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించడంలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లను ప్రపంచ టాప్–50లోకి ఎలా తీసుకు రావాలనేదే లక్ష్యంగా ఉండాలి. అది జరిగితే అన్నీ చక్కబడతాయి. అప్పుడు మిగతాదంతా అనవసరం. – విజయ్ అమృత్‌రాజ్, భారత మాజీ ఆటగాడు పాత విభేదాలు మళ్లీ బయట పడటం దురదృష్టకరం. ఇందులో ఇద్దరి తప్పూ ఉంది. మహేశ్ వ్యవహారశైలి సరిగా లేదు. నువ్వు తుది జట్టులో లేవంటూ అతను పేస్‌కు ఒక మెయిల్ ఎందుకు పంపలేదు. రోహన్ బోపన్నను ఎంచుకోవాలని రెండు నెలల ముందే అనుకుంటే పేస్‌ను ఎటూ కాకుండా చేయడం ఎందుకు. తను ఆడతానని కచ్చితంగా తెలీనప్పుడు పేస్ బెంగళూరు వరకు ఎందుకు వెళ్లాడు. మ్యాచ్ మధ్యలోనే లియాండర్ వెళ్లిపోయాడని మహేశ్ విమర్శించడంలో అర్థం లేదు. అప్పటికే జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అక్కడే ఉండిపోయి అతను చేసేదేముంది. – ఆనంద్ అమృత్‌రాజ్, డేవిస్ కప్ మాజీ కెప్టెన్ -
పేస్ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్!
⇒డేవిస్ కప్ జట్టులో చోటు దక్కని లియాండర్ ⇒27 ఏళ్లలో ఇదే తొలిసారి ⇒బోపన్నకే ప్రాధాన్యతనిచ్చిన మహేశ్ భూపతి ⇒తీవ్రంగా విరుచుకుపడ్డ పేస్ భారత డేవిస్ కప్ చరిత్రలో ఒక శకం ముగిసింది! దాదాపు మూడు దశాబ్దాలుగా జట్టులో అంతర్భాగమై పలు చిరస్మరణీయ విజయాలు అందించిన లియాండర్ పేస్‌కు మ్యాచ్ బరిలోకి దిగే తుది జట్టులో స్థానం లభించలేదు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోరులో డబుల్స్ మ్యాచ్‌లో పేస్‌ను కాదని రోహన్ బోపన్నను నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ఎంచుకున్నారు. బెంగళూరులో పరిస్థితులే కారణమంటూ మహేశ్ వివరణ ఇచ్చినా... తనతో పాత విభేదాల వల్ల కావాలనే పక్కన పెట్టినట్లు పేస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేవిస్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్న సమయంలో చోటు కోల్పోయిన ఈ దిగ్గజం ఇక ముందు దేశం తరఫున ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు! బెంగళూరు: లియాండర్ పేస్ తొలి సారిగా భారత్ తరఫున 1990లో జపాన్‌తో జైపూర్‌లో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ బరిలోకి దిగాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను అందుబాటులో ఉన్న ప్రతీ సారి బరిలోకి దిగాడు. గాయంలాంటి కారణాలతో తనంతట తాను తప్పుకోవడం మినహా ఫామ్ పేరుతో పేస్‌ను ఒక్కసారి కూడా తప్పించలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టారు. నేటి నుంచి ఆదివారం వరకు ఇక్కడ జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 మ్యాచ్‌లో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టును గురువారం నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించారు. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ కలిసి ఆడతారు. సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్ కాంస్య పతకం, 18 గ్రాండ్‌స్లామ్‌ల టైటిల్స్ విజేత పేస్ కంటే కూడా బోపన్న వైపు భూపతి మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పేస్ 53వ స్థానంలో ఉండగా, బోపన్న 24వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‘ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. రోహన్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. అతని ఎంపికకు అదే ప్రధాన కారణం. పేస్‌ను తప్పించాలనేది చాలా కఠిన నిర్ణయం. అందుకే దానిని తీసుకునేందుకు ఆలస్యమైంది. నేను మొదటి నుంచి ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లనే ఎంచుకోవాలని భావిస్తూ వచ్చాను. ఎందుకంటే వీరిలో ఇద్దరికి డేవిస్‌కప్‌లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఇద్దరు డబుల్స్ స్పెషలిస్ట్‌లను తీసుకునే సాహసం చేయలేకపోయాను. అయితే టాప్–5లో ఉంటే తప్ప డబుల్స్ స్పెషలిస్ట్‌లు అనేదానిని నేను నమ్మను’ అని భూపతి వివరించారు. పేస్ బుధవారమే నగరానికి వచ్చాడని, అతనితో పోలిస్తే గత ఆదివారంనుంచి కలిసి సాధన చేస్తున్న రోహన్, బాలాజీలకే మంచి విజయావకాశాలు ఉంటాయని భూపతి అభిప్రాయ పడ్డారు. పేస్ కాస్త ముందుగా వచ్చి ఉంటే తమ ఆలోచనలో కూడా మార్పు ఉండేదేమోనన్న మహేశ్... ఈ మ్యాచ్‌కు దూరమైనంత మాత్రాన పేస్ కెరీర్ ముగిసినట్లు కాదని అన్నారు. ఇందుకా నన్ను పిలిచింది! డేవిస్ కప్ జట్టునుంచి తనను తొలగించడం పట్ల లియాండర్ పేస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కావాలని తప్పించేందుకే అర్హతా ప్రమాణాలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని అతను విమర్శించాడు. తనకు, భూపతికి మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం కావచ్చని పేస్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘జట్టు ఎంపిక ఒకసారేమో ర్యాంకింగ్స్ ప్రకారం జరుగుతుంది. మరోసారి వారి ఇష్టాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతుంది. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కాకుండా ఎడమ వైపు కోర్టులో ఎవరు ఆడతారు, కుడి వైపు కోర్టులో ఎవరు ఆడతారు అనేదానిపై చర్చించి నిర్ణయిస్తారు. ఇప్పుడేమో ఫామ్‌ను బట్టి తీసుకుంటారు. ఫామ్ మాటకొస్తే ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుసు’ అని పేస్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గత వారమే పేస్ లియోన్‌లో జరిగిన మెక్సికో చాలెంజర్ టైటిల్‌ను గెలిచాడు. కొందరు ఇక్కడి వాతావరణం గురించి మాట్లాడుతున్నారని, అయితే సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న లియోన్‌లో టోర్నీ నెగ్గిన తనకు 920 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో ఆడటంలో సమస్య ఎలా ఎదురవుతుందని పేస్ వ్యంగ్యంగా అన్నాడు. కేవలం దేశంపై ప్రేమతో తాను సుదీర్ఘ ప్రయాణం చేసి మెక్సికోనుంచి వచ్చానని, ఇలా అవమానించకుండా ఫోన్లోనే చోటు లేదని చెప్పేస్తే సరిపోయేదని అతను చెప్పాడు. ‘పరిణామాలు ఎలా ఉన్నా దేశం పట్ల నా ప్రేమ షరతులు లేనిది. అందుకే ఇంత దూరం వచ్చాను. ఒక ఫోన్ చేసి నేను కావాలా వద్దా అని చెబితే ఇంత రచ్చ జరగకపోయేది కదా. అయితే నేను మున్ముందు ఇంకా ఎక్కువగా శ్రమిస్తాను. మళ్లీ భారత్ తరఫున డేవిస్ కప్ ఆడతాననే నమ్మకముంది’ అని పేస్ ఉద్వేగంగా చెప్పాడు. నేడు ఎవరితో ఎవరు? రామ్‌కుమార్& తేమూర్ ఇస్మయిలోవ్ (తొలి సింగిల్స్) ప్రజ్నేశ్ గుణేశ్వరన్& ఫైజీవ్ (రెండో సింగిల్స్) -
డేవిస్‌కప్ మ్యాచ్‌కు యూకీ బాంబ్రీ దూరం
మోకాలి గాయం కారణంగా భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఉజ్బెకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈనెల 7 నుంచి 9 వరకు బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ కీలక పోరు కోసం ఆదివారం సన్నాహక శిబిరం ప్రారంభమైన రోజే యూకీ నిష్క్రమించడంతో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. యూకీ గైర్హాజరు కారణంగా రిజర్వ్ ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బోపన్నలలో ఒకరు ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. అయితే ఎవరు ఆడతారనే దానిపై వ్యాఖ్యానించేందుకు భారత నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నిరాకరించారు. మరోవైపు జట్టులో ఏడో ఆటగాడిగా ప్రాక్టీస్ కోసం ఎంపికైన విష్ణువర్ధన్ కూడా ఆదివారం గాయపడ్డాడు. -
రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్‌కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. -
లియాండర్ పేస్ భవితవ్యం తేలేది నేడే...
డేవిస్‌కప్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందడానికి లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించేందుకు పేస్‌కు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉజ్బెకిస్తాన్‌తో బెంగళూరులో జరిగే ఆసియా ఓసియానియా పోటీలో భారత్ తలపడనుంది. నలుగురు సభ్యులతో కూడిన తుది జట్టును మంగళవారం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించనున్నారు. ఒకే డబుల్స్ స్పెషలిస్ట్‌ను ఎంపిక చేస్తే మాత్రం రోహన్ బోపన్న లేదా పేస్లలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. -
భారత్‌కు పదో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా జూనియర్ డేవిస్ కప్ అండర్–16 టోర్నమెంట్లో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది. ఇక్కడి డీఎల్టీఏ కాంప్లెక్స్‌లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 0–2తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో క్రిస్ వీ షింగ్ జాంగ్ 6–4, 6–4తో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీపై గెలుపొందగా.... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో జార్జ్ డంకన్ స్టౌప్ 6–7 (4/7), 6–3, 6–0తో సచిత్ శర్మను ఓడించాడు. కాగా ఈ టోర్నీలో జపాన్ 2–1తో ఆస్ట్రేలియాపై గెలిచి విజేతగా నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీ, చైనా జట్లు సెప్టెంబర్‌లో హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగే వరల్డ్ గ్రూప్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. -
పేస్ స్థానం పదిలమేనా?
భారత డేవిస్‌కప్ జట్టు ఎంపిక నేడు ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్‌లో పోరు న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులో లియాండర్ పేస్ కొనసాగేది లేనిది నేడు తేలనుంది. సోమవారం సమావేశమయ్యే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆసియా ఓసియానియా జోన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు భారత్ తలపడనుంది. డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్రపంచ రికార్డుకు పేస్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్‌కు పరాజయం ఎదురైంది. దాంతో అతను ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోటీలో మరోసారి ప్రపంచ రికార్డుపై గురి పెట్టనున్నాడు. అయితే పేస్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. సింగిల్స్‌లో ఫామ్‌లో ఉన్న యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ల బెర్త్‌లకు ఢోకా లేదు. సుమిత్ నాగల్ గాయంతో సెలక్షన్స్‌కు దూరం కాగా... హైదరాబాద్ యువ ఆటగాడు సాకేత్ మైనేని ఎంపికపై సందిగ్ధత నెలకొంది. సింగిల్స్, డబుల్స్ ఆడగల సాకేత్ ఇప్పుడు ఫిట్నెస్తో ఉన్నప్పటికీ... సెలక్టర్ల చూపు స్పెషలిస్ట్ ఆటగాళ్లపై ఉంది. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ సింగిల్స్ ఆటగాళ్లని తీసుకోవాలా లేక ఇద్దరు స్పెషలిస్ట్ డబుల్స్ ఆటగాళ్లతో సరిపెట్టాలా అన్న అంశాన్ని సెలక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతోంది. సీనియారిటీని పక్కన బెట్టి ర్యాంకింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే బోపన్న (24)కు జతగా పేస్ (62వ ర్యాంకు)ను కాదని దివిజ్ శరణ్ (54), పురవ్ రాజా (56)ల్లో ఒకరికి చోటు దక్కొచ్చు. సింగిల్స్‌లో ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ మూడో బెర్తు కోసం పోటీపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనకే ఓటేసే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ మ్యాచ్‌తో భారత జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
-
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
ఒట్టావా: కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్.. తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుసగా రెండు సెట్లు కోల్పోయిన షపోవాలవ్.. మూడో సెట్లో కూడా వెనుకబడిపోయాడు. మూడో సెట్లో షపోవాలవ్ 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ క్రమంలోనే అతిగా స్పందించి బంతిని అంపైర్ గాబస్ కూర్చొన్న స్టాండ్ వైపు గట్టిగా కొట్టాడు. ఆ బంతి కాస్తా అంపైర్ ముఖానికి బలంగా తాకడంతో అతను విలవిల్లాడిపోయాడు. తొలుత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఒట్టావాలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంపైర్ ఎడమ కన్నుపై తీవ్రంగా వాచినట్లు కెనడా డేవిస్ కప్ సభ్యుడొకరు తెలిపారు. కాగా, అంపైర్ ను బంతితో కొట్టిన డెనిస్ షపోవాలవ్ ను డేవిస్ కప్ నుంచి బహిష్కరించారు. -
'మహేశ్ భూపతికి అర్హత ఉంది'
చెన్నై: భారత టెన్నిస్‌కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ భూపతిని భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నియమించడాన్ని లియాండర్ పేస్ సమర్ధించాడు. భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా చేసే అన్ని అర్హతలూ భూపతికి ఉన్నాయని పేర్కొన్నాడు. దాంతో పాటు తన వీడ్కోలుపై కూడా సూచాయగా కొన్ని విషయాలను పేస్ వెల్లడించాడు. 'నేను ప్రస్తుతం సరదాగా కోసం ఆడుతున్నాను. నేను గేమ్‌ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంకా ఆడుతున్నా. నేను వీడ్కోలు తీసుకునే నిర్ణయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో అందరికీ చెప్పే టెన్నిస్ జీవితం నుంచి వైదొలుగుతా. మీరంతా నన్ను 20 ఏళ్లుగా అభిమానిస్తున్నారు. రాబోవు కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. డేవిస్ కప్ కెప్టెన్‌గా చేసే అన్ని అర్హతలు మహేశ్ భూపతికి ఉన్నాయి. డేవిస్ కప్ కు భూపతికి ఎందుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ చేయకూడదు' అని భూపతి పేర్కొన్నాడు. -
'నన్ను ఎందుకు తప్పించారు?'
న్యూఢిల్లీ:తనను భారత డేవిస్ కప్ జట్టు నుంచి తప్పించడంపై టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. డేవిస్ కప్ కు అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న బోపన్న.. ర్యాంకులు ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి, మిగతా వారిపై వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశాడు. అయితే దీనిపై భారత డేవిస్ కప్ కోచ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ మాత్రం ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ప్రతీసారి సెలక్టర్లు ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ సర్దుకునే యత్నం చేశారు. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే కచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసినట్లు జీషన్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన భారత డేవిస్ కప్ జట్టులో రోహన్ బోపన్నకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇందులో లియాండర్ పేస్ , సాకేత్ మైనేని, రామ్ నాథన్ రామ్ కుమార్, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్, యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు, ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టులను ఏఐటీఏ ఎంపిక చేసింది. ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా, బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీలో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
పుణేలో డేవిస్ కప్ మ్యాచ్
పుణే: భారత్, న్యూజిలాండ్ జట్ల జరిగే ఆసియా ఒసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌కు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఈ డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది. -
పరాజయం పరిపూర్ణం
న్యూఢిల్లీ: శనివారమే విజయాన్ని ఖాయం చేసుకొని డేవిస్ కప్‌లో వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించిన స్పెయిన్ జట్టు నామమాత్రపు రివర్స్ సింగిల్స్‌లోనూ జోరు కనబరిచింది. భారత్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసి సగర్వంగా తిరిగి వెళ్తోంది. 1965 తర్వాత స్పెయిన్‌తో మళ్లీ తలపడిన భారత్ డేవిస్‌కప్‌లో 0-5తో వైట్‌వాష్ కావడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2003లో నెదర్లాండ్‌సతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లోనూ భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఓవరాల్‌గా డేవిస్ కప్‌లో చరిత్రలో 0-5తో భారత్ ఓడటం ఇది 21వసారి. నామమాత్రపు మ్యాచ్‌లు కావడంతో తొలి రివర్స్ సింగిల్స్‌లో సాకేత్ మైనేని బదులు కొత్త ఆటగాడు సుమిత్ నాగల్‌ను భారత్ బరిలోకి దించగా.. స్పెయిన్ జట్టు డబుల్స్ స్పెషలిస్ట్ మార్క్ లోపెజ్‌ను ఆడించింది. డేవిస్ కప్‌లో కేవలం రెండోసారి సింగిల్స్ మ్యాచ్ ఆడిన మార్క్ లోపెజ్ 6-3, 1-6, 6-3తో సుమిత్‌ను ఓడించి స్పెయిన్ ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. రెండో రివర్స్ సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్ 6-2, 6-2తో రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించి స్పెయిన్ విజయాన్ని పరిపూర్ణం చేశాడు. -
పేస్పై నాదల్ ప్రశంసలు
న్యూఢిల్లీ:భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్పై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రశంసల వర్షం కురిపించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో లియాండర్ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడాడు. టెన్నిస్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న లియాండర్తో తలపడటం తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నాని నాదల్ పేర్కొన్నాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 6-4, 6-4 తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై విజయం సాధించింది. మూడు గంటలకు పైగా సాగిన పోరులో భారత జంట పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ద్వయంలో ఒకడైన పేస్‌ను నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు. 'లియాండర్ గొప్ప మ్యాచ్ ఆడాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఆ మ్యాచ్ చాలా కఠినమైన మ్యాచ్ . లియాండర్ జంట చాలా బాగా ఆడింది. లియాండర్ పేస్ దేశంలో అతనితో కలిసి ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. డబుల్స్ విభాగంలో అతి పెద్ద స్టార్లలో పేస్ ఒకడు. టెన్నిస్ చరిత్రలో లియాండర్ అత్యుత్తమ ఆటగాడు' అని నాదల్ తెలిపాడు. -
నాదల్ ప్రత్యర్థి రామ్‌కుమార్
డబుల్స్‌లో పేస్‌కు జతగా సాకేత్ నేటి నుంచి భారత్-స్పెయిన్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ న్యూఢిల్లీ: స్పెయిన్‌తో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ప్రారంభ సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు. నేటి (శుక్రవారం) నుంచి 18 వరకు స్థానిక ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగే ఈ పోటీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫైతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో రోజు జరిగే డబుల్స్‌లో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్, సాకేత్ మైనేని జంటగా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్స ఫెలికియానో లోపెజ్, మార్క్ లోపెజ్‌తో ఆడనున్నారు. రివర్స్ సింగిల్స్‌లో సాకేత్.. నాదల్‌తో, రామ్‌నాథన్.. ఫైతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ‘మేం అండర్డాగ్సగా బరిలోకి దిగబోతున్నాం. తొలి రోజు 1-1తో ముగిస్తే మాకు మంచి అవకాశం ఉంటుంది. అందుకే తొలి రోజే కీలకం’ అని సాకేత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ టై చాలా ముఖ్యమని నాదల్ తెలిపాడు. భారత్‌కు కష్టమే..: ఐదుసార్లు డేవిస్ కప్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రపంచ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టును ఎదుర్కోవాలంటే భారత్ శక్తికి మించి ప్రదర్శన చేయాల్సిందే. 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రాఫెల్ నాదల్, డేవిడ్ ఫై (13వ ర్యాంకు), ఫెలికియానో లోపెజ్ (డబుల్స్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత), మార్క్ లోపెజ్ (డబుల్స్‌లో 15వ ర్యాంకర్)లతో కూడిన స్పెయిన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. పేస్ మినహా మిగతా భారత ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఇబ్బంది పెట్టే అంశం. 51 ఏళ్ల తర్వాత స్పెరుున్ జట్టుకు భారత్ ఆతిథ్యమివ్వబోతుండగా గెలుపోటములతో సంబంధం లేకుండా టెన్నిస్ అభిమానులకు మాత్రం స్టార్ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టు కనువిందు చేయడం ఖాయం. ఓవరాల్‌గా భారత్‌పై 2-1 తేడాతో స్పెరుున్ ఆధిక్యంలో ఉంది. -
నేనింకా నిత్య విద్యార్థినే...
* నాదల్ నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి * భారత దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ కెరీర్... 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్... వరుసగా ఏడు ఒలింపిక్స్‌లు ఆడిన ఏకైక టెన్నిస్ ప్లేయర్... డేవిస్ కప్‌లో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన రికార్డు సమం.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో ఘనతలు ఎన్నో ఉన్నాయి. 43 ఏళ్ల వయస్సులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆడుతోన్న పేస్... తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు రాఫెల్ నాదల్ లాంటి ఆటగాళ్ల నుంచీ నేర్చుకోవడానికి సిద్ధమేనని తెలిపాడు. స్పెరుున్ జట్టుతో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత జట్టు తలపడనున్న నేపథ్యంలో పేస్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... అందరూ చూసేందుకు రావాలి: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్... ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ చాంపియన్ జంట ఫెలిసియానో లోపెజ్, మార్క్ లోపెజ్‌లతో స్పెరుున్ ఇక్కడకు రావడం వారి ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఒకరకంగా ఈ మ్యాచ్ జరిగే మూడు రోజులు టెన్నిస్ అభిమానులకు పండగే. నేనే గనుక జూనియర్ ప్లేయర్ అరుుఉంటే ప్రతి రోజూ ఈ స్టార్స్ ఆటను చూసేందుకు వచ్చేవాడిని. నాదల్ ఏ రకంగా ఆడతాడో, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో చూసేందుకు అందరూ రావాలి. యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి: నాదల్, ఫెరర్లాంటి మేటి ప్లేయర్లకు భారత యువ ఆటగాళ్లు సాకేత్ మైనేని, రామ్‌కుమార్ పరీక్ష పెట్టే అవకాశం వచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఫలితం గురించి ఆలోచించకుండా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఏ రకంగా ఆడాలో తెలుసుకోవడానికి యువ ఆటగాళ్లందరూ నాదల్, ఫెరర్ల ఆటతీరును పరిశీలించాలి. జట్టులో అత్యంత సీనియర్‌ను కాబట్టి నేను యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా ఉంటాను. జూనియర్ ఆటగాళ్లు నాకంటే బాగా ఆడుతూ, జట్టులో స్థానం లేదని చెప్పినరోజు నేనే వైదొలుగుతాను. -
భారత్ ప్రత్యర్థి స్పెయిన్
డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురైంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టుతో భారత్ తలపడనుంది. డేవిస్ కప్‌లో ఇప్పటివరకు భారత్, స్పెయిన్ ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. చివరిసారి 1965లో స్పెయిన్‌తో తలపడిన భారత్ 2-3తో ఓడిపోయింది. స్పెయిన్ జట్టులో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్, ప్రపంచ 15వ ర్యాంకర్ రొబెర్టో బాటిస్టా అగుట్, ప్రపంచ 21వ ర్యాంకర్ ఫెలిసియానో లోపెజ్ ఉన్నప్పటికీ... గాయాల కారణంగా నాదల్, ఫెరర్ బరిలో దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నాదల్, ఫెరర్ లేకపోయినప్పటికీ స్పెయిన్‌ను ఓడించాలంటే భారత క్రీడాకారులు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎలాంటి కోర్టుపై మ్యాచ్‌లు నిర్వహించాలో ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత ఏఐటీఏ నిర్ణయిస్తుంది. -
బోపన్న ‘సింగిల్స్’ విజయం
డేవిస్ కప్‌లో భారత్ 4-1తో కొరియాపై గెలుపు చండీగఢ్: తొలి రెండు రోజులు విజయాలతో అదరగొట్టిన భారత డేవిస్ కప్ జట్టు ఆఖరి రోజు మాత్రం ఒక్క గెలుపుతోనే సంతృప్తి పడింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో రోహన్ బోపన్న 3-6, 6-4, 6-4తో హంగ్ చుంగ్‌పై గెలవగా... రెండో మ్యాచ్‌లో రామ్‌కుమార్ 3-6, 7-5, 6-7 (2/7)తో యంగ్ కు లిమ్ చేతిలో ఓడాడు. దీంతో కొరియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం దక్కించుకుంది. సాకేత్ మైనేని సకాలంలో కోలుకోకపోవడంతో నాలుగేళ్ల తర్వాత బోపన్న సింగిల్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. 2012లో ఉజ్బెకిస్తాన్‌తో బోపన్న చివరిసారి సింగిల్స్ మ్యాచ్ ఆడాడు. డేవిస్‌కప్‌లో బోపన్నకిది 10వ సింగిల్స్ విజయం. చుంగ్‌తో గంటా 23 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ భారీ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 27 ఏస్‌లు సంధించాడు. లిమ్తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇద్దరూ చెరో సెట్‌ను సాధించారు. కానీ మూడోసెట్ టైబ్రేక్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌లు అదుపు తప్పడంతో మూల్యం చెల్లించుకున్నాడు. -
సగర్వంగా.. తిరంగా..
డేవిస్ కప్ ప్లే ఆఫ్‌కు భారత్ * కొరియాపై 3-0తో గెలుపు * పేస్-బోపన్న అలవోక విజయం చండీగఢ్: భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో భారత్ 3-0తో కొరియాపై విజయం సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం సాధించగా... శనివారం జరిగిన డబుల్స్ పోరులో లియాండర్ పేస్ - రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4తో కొరియా జోడీ హంగ్ చుంగ్ - సియోంగ్ చాన్ హంగ్‌లపై గెలిచి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం నామమాత్రపు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. తడబాటు లేకుండా... అనుభవం, నైపుణ్యంతో భారత జోడీ డబుల్స్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ ద్వయం మంచి సమన్వయంతో ఆడారు. మేఘావృతమైన వాతావరణం, ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా చేసుకున్న బోపన్న గంటకు 200 కి.మీ.ల వేగంతో సర్వీస్‌లు చేశాడు. పేస్ అద్భుతమైన వ్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో బోపన్న రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడం, మూడోసెట్లో పేస్ ఒకసారి సర్వీస్ చేజార్చుకోవడం మినహా భారత్ జోడి ఎక్కడా ఇబ్బందిపడలేదు. మ్యాచ్ మొత్తంలో ఈ ఇద్దరు తమ సర్వీస్‌ల్లో కేవలం 17 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. మూడో సెట్లో కాస్త అలసత్వం చూపిన ఇద్దరు 10 పాయింట్లు చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో బోపన్న 9, పేస్ 3 ఏస్‌లు సంధించారు. తొలిసెట్ ఎనిమిదో గేమ్‌లో హంగ్ సర్వీస్‌ను పేస్ వ్యాలీ విన్నర్‌తో బ్రేక్ చేశాడు. దీంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి గేమ్‌లో అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండోసెట్ మూడో గేమ్‌లో మళ్లీ హంగ్ సర్వీస్‌ను పేస్ బ్రేక్ చేశాడు. వేగంగా పరుగెత్తుతూ సంధించిన లో వ్యాలీని ప్రత్యర్థులు అందుకోలేకపోయారు. స్వల్ప ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగిస్తూ భారత్ రెండోసెట్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడోసెట్ తొలి గేమ్‌లోనే చుంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి బోపన్న జంట ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో గేమ్‌లో బోపన్న బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్నా... ఆరో గేమ్‌లో పేస్ సర్వీస్ కోల్పోయాడు. చివరకు పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య సమన్వయం బాగా కుదిరింది. అదే లేకపోతే ఇలాంటి విజయాలు సాధించడం కష్టం. ఈ మ్యాచ్‌లో మేం పెద్దగా కష్టపడలేదు. మా బలం మేరకు మాత్రమే ఆడాం. తక్కువ స్థాయి ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలో తెలుసు కాబట్టి ఎక్కడా ఇబ్బంది పడలేదు. - బోపన్న మేం బాగా ఆడాం. మూడు సెట్లలోనే మ్యాచ్ గెలిచాం. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మా సత్తాను మరింత చూపెట్టేవాళ్లం. కుడి, ఎడమ మేళవింపు ఎప్పుడైనా ఇబ్బందిగానే ఉంటుంది. చుంగ్ మంచి కోణాల్లో షాట్లు కొట్టాడు. హంగ్ కాస్త స్లో. సింగిల్స్‌లో మా వాళ్లు బాగా ఆడారు. కొరియాపై 3-0తో గెలవడమంటే అంత సులువుకాదు. - పేస్ -
రియోలోనూ ఎగరాలి
దక్షిణ కొరియాపై భారత్ జట్టు డేవిస్ కప్ విజయం సాధించడం ఊహించిన ఫలితమే. ఈ పోరులో ప్రధానంగా అందరూ దృష్టి సారించింది పేస్, బోపన్న జోడీ మీద. గతంలోనూ డేవిస్కప్లలో పేస్, బోపన్న కలిసి ఆడారు, విజయాలు సాధించారు. కానీ గత నాలుగేళ్లుగా భారత టెన్నిస్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. ఈ ఇద్దరూ కలిసి ఏ మేరకు సమన్వయంతో ఆడతారనే సందేహం చాలామందికి ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడబోనంటూ బోపన్న తేల్చేయడం, ఈసారి రియో ఒలింపిక్స్‌కు ముందు తనకు జోడీగా సాకేత్ మైనేని కావాలని బోపన్న కోరడం లాంటి పరిణామాలు భారత టెన్నిస్‌లో ఆందోళన పెంచాయి. అయితే భారత టెన్నిస్ సంఘం పట్టుబట్టి మరీ బోపన్నను ఒప్పించి పేస్‌తో కలిపి రియోకి పంపుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఇద్దరూ కలిసి ఆడటానికి లభించిన చివరి అవకాశం కొరియాతో మ్యాచ్. ఇందులో ఇద్దరూ అంచనాలకు తగ్గట్లుగా రాణించారు. నిజానికి నాణ్యత పరంగా కొరియా జోడీ ఏ మాత్రం భారత జోడీకి పోటీ ఇవ్వదని తెలిసినా... కోర్టులో సమన్వయానికి, ఒకరి ఆటను ఒకరు అర్థం చేసుకోవడానికి లభించిన అవకాశాన్ని పేస్, బోపన్న సద్వినియోగం చేసుకున్నారనే భావించాలి. పేస్ ఘన చరిత్ర లియాండర్ పేస్ రియో ఒలింపిక్స్ ద్వారా చరిత్ర సృష్టించబోతున్నాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొనబోతున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు పేస్. అలాగే భారత్ నుంచి ఏ క్రీడలో అయినా ఓ ఆటగాడు ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొనడం అద్భుతమైన విషయం. 1992 నుంచి లండన్ ఒలింపిక్స్ వరకు ఆరుసార్లు పాల్గొన్న పేస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం గెలిచాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో జాదవ్ రెజ్లింగ్‌లో పతకం గెలిచిన తర్వాత... మళ్లీ భారత్‌కు వ్యక్తిగత పతకం అందించిన క్రీడాకారుడిగా పేస్ చరిత్ర సృష్టించాడు. ఒక్క ఒలింపిక్స్ అనే కాదు... డేవిస్ కప్‌లలోనూ పేస్‌ది గొప్ప రికార్డు. మామూలు టోర్నీలలో, గ్రాండ్‌స్లామ్‌లలో ఓడిపోయిన మేటి క్రీడాకారుల మీద డేవిస్‌కప్‌లో పేస్ సంచలన విజయాలు సాధించాడు. తనకంటే చాలా మెరుగైన, బలమైన ఆటగాళ్లని ఓడించిన ఘనత పేస్‌ది. భారత జాతీయ జెండా కనిపిస్తూ ఉంటే పేస్‌లోని నైపుణ్యం మరింత బయటకు వస్తుందనేది వాస్తవం. అందుకే భారత క్రీడాచరిత్రలోనే గొప్పవాడిగా పేస్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ఇక బోపన్నకు రియో వరుసగా రెండో ఒలింపిక్స్. లండన్‌లో భూపతితో జోడీగా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి భారత్‌కు టెన్నిస్‌లో డబుల్స్‌లో రియోకు వెళ్లే అవకాశం రావడానికి కారణం బోపన్న. పేస్ వరుసగా ఏడో ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడంటే దానికి బోపన్న ర్యాంకింగ్ కారణం. నిజానికి పేస్‌తో కలిసి ఆడే ఏ ఆటగాడైనా కోర్టులోకి దిగితే ఆ దిగ్గజం స్ఫూర్తితో మరింత బాగా ఆడతాడు. రియోలో బోపన్న కూడా అలాగే ఆడతాడని ఆశిద్దాం. కొరియాపై గెలిచిన తర్వాత పేస్, బోపన్నలతో పాటు భారత బృందం అంతా త్రివర్ణ పతాకంతో టెన్నిస్ కోర్టులో తిరుగుతూ ఉంటే చూసిన ప్రతి భారతీయుడూ గర్వపడ్డాడు. మరో నెల రోజుల్లో రియోలోనూ పేస్, బోపన్న ఇదే త్రివర్ణాన్ని రెపరెపలాడించాలి. అప్పుడే సగటు భారత క్రీడాభిమానికి సంతోషం, సంబరం. - సాక్షి క్రీడావిభాగం -
భారత్ అదుర్స్
చండీగఢ్: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్‌లో భారత అదరగొడుతుంది. దక్షిణ కొరియాతో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో భారత్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి సత్తా చాటిన భారత జట్టు.. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో కూడా విజయం సాధించింది. భారత పురుషుల డబుల్స్ లో భాగంగా లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4 తేడాతో హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ ద్వయాన్ని మట్టికరిపించింది. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన పేస్ జంట.. రెండు, మూడు సెట్లలో పోరాడి గెలిచింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అంచనాలను తగ్గట్టు రాణించి చక్కటి గెలుపును సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా 17 పాయింట్లను మాత్రమే తమ సర్వీస్‌ల ద్వారా కోల్పోయిన భారత జట్టు ఆద్యంత నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తద్వారా భారత్ 3-0 ఆధిక్యం సాధించిన భారత్.. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన డేవిస్ కప్ పోరులో భారత ఆటగాడు రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. ఇక రెండో సింగిల్ మ్యాచ్ లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో యోంగ్‌కు లిమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో సాకేత్ విజయం ఖరారైంది. ఆదివారం నాటి సింగిల్స్ మ్యాచ్‌లో సియోంగ్ చాన్ హాంగ్ తో సాకేత్ మైనేని తలపడతాడు. -
కుర్రాళ్లపైనే భారం!
నేటి నుంచి కొరియాతో డేవిస్ కప్ పోరు డబుల్స్‌లో బోపన్న జతగా పేస్ చండీగఢ్: కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం... బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం, సమన్వయ లోపం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భారత్... కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సమస్యలున్నా ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్‌లు గైర్హాజరీతో.. 21 ఏళ్ల రామ్‌కుమార్‌కు డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. చెన్నైకి చెందిన ఇతనికి అనుభవం లేకపోయినా నైపుణ్యానికి మాత్రం కొదువలేదు. ఇక సాకేత్ మైనేని అనుభవం ఉన్నా... భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలా అత్యవసరం. ఓవరాల్‌గా సీనియర్లు లేకపోవడంతో ఇప్పుడు ఈ కుర్రాళ్లపై భారత్ నమ్మకం పెట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్టుకు అనుభవం లేకపోవడం, సొంతగడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఈ ఇద్దరికి కలిసొచ్చే అంశం. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హరియాణా, పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ డేవిస్ కప్‌కు సంబంధించిన డ్రాను విడుదల చేశారు. దీని ప్రకారం కొరియా నుంచి భారత్‌కు పెద్దగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు. 2008 తర్వాత భారత్‌లో గ్రాస్‌కోర్టుపై డేవిస్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో న్యూఢిల్లీలో జరిగిన పోరులో భారత్ 3-2తో జపాన్ను ఓడించింది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ (217)... సియోంగ్ చెన్ హాంగ్ (427)తో; రెండో సింగిల్స్‌లో సాకేత్... యంగ్ యూ లిమ్తో తలపడతారు. జత కుదిరేనా..! సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్-రోహన్ బోపన్నలు మరోసారి డేవిస్ కప్‌లో జతగా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది. గతంలో పేస్-బోపన్న... చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా... సెర్బియాతో పోరులో మాత్రం అద్భుతంగా ఆడారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఆడాలని అందరూ కోరుకుంటున్నా... ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రియో ఒలింపిక్స్ కోసం బోపన్న.. సాకేత్ పేరును సూచించగా ఏఐటీఏ జోక్యం చేసుకుని పేస్‌ను జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కొరియాపై భారత్ గెలవాలంటే పేస్-బోపన్న డబుల్స్‌లో సత్తా చాటాలి. శనివారం జరిగే డబుల్స్‌లో పేస్-బోపన్న జంటతో... హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్లు తలపడతారు. బుధవారమే చండీగఢ్‌కు చేరుకున్న పేస్.. గంటన్నర పాటు ప్రాక్టీస్ చేశాడు. గతాన్ని మర్చిపోయి కలిసి ఆడతామని పేస్, బోపన్న చెబుతున్నా.. మైదానంలో ఏమేరకు సమన్వయం కుదురుతుందో చూడాలి. -
దేశం కోసం ఈగో పక్కనపెట్టి!
పురుషుల డబుల్స్ టెన్నిస్ విభాగంలో రియో ఒలింపిక్స్ బెర్త్ కోసం భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోన్నా చివరికి స్థానం దక్కించుకున్నాడు. మరో డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న.. పేస్ తో జతకట్టేది లేదని గతంలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం. ఇద్దరూ తమ ఈగోలను పక్కనపెట్టి ఆటకోసం ముందుకు రావడంతో పరిస్థితి 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్లు కనిపిస్తోంది. తాజాగా వారిద్దరూ డేవిస్ కప్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఛండీగఢ్ క్లబ్ లో ప్రాక్టీస్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పేస్ సాధించిన విజయాలను చూసిన వాళ్లు అతడిని ఖచ్చితంగా గౌరవిస్తారు. ప్రపంచంలోనే డబుల్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో పేస్ ఒకడు' అని బోపన్న చెప్పాడు. అయితే పేస్ తో కలిసి ఆడనని తానెప్పుడూ చెప్పలేదని, మరో భాగస్వామిని తన ఆటతీరు బాగుంటుందని, సౌకర్యంగా ఉంటుందని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు. గత విషయాల గురించి తాను మాట్లాడాలని భావించట్లేదని, దేశం కోసం అనగానే ఏ ఆటగాడయినా కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని పేస్ అంటున్నాడు. వందల కోట్ల ప్రజల కోసం ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఈగోలను పక్కన పెడతామని చెప్పుకొచ్చాడు. బోపన్న చాలా శ్రమిస్తాడంటూ తన భాగస్వామిని పేస్ ప్రశంసించాడు. -
భారత్‌కు టాప్ సీడింగ్
న్యూఢిల్లీ : డేవిస్ కప్ గ్రూప్ 1 ఆసియా/ఓసియానియా జోన్లో భారత టెన్నిస్ జట్టుకు టాస్ సీడింగ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ టోర్నీ డ్రాను సాంటియాగోలో నేటి (బుధవారం) నుంచి జరిగే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఏజీఎం ముగింపు రోజున వెల్లడిస్తారు. ఉజ్బెకిస్తాన్‌కు రెండో సీడ్ దక్కింది. ఈ రెండు జట్లకు తొలి రౌండ్లో బై లభించింది. ఇటీవల జరిగిన ప్లేఆఫ్‌లో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిన భారత జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆసియా స్థాయి గ్రూప్-1లో భారత్, ఉజ్బెకిస్తాన్లతో పాటు చైనా, కొరియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
111 ఏళ్ల తర్వాత బెల్జియం, 37 ఏళ్ల తర్వాత బ్రిటన్ డేవిస్ కప్ ఫైనల్లోకి ప్రవేశం బ్రస్సెల్స్, గ్లాస్గో : సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘డేవిస్ కప్’లో ఈసారి బెల్జియం, బ్రిటన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన సెమీఫైనల్లో బ్రిటన్ 3-2తో ఆస్ట్రేలియాపై విజయం సాధించగా... బ్రస్సెల్స్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెల్జియం 3-2తో అర్జెంటీనాను ఓడించింది. స్వదేశంలో ఈ ఏడాది నవంబరు 27 నుంచి 29 వరకు జరిగే ఫైనల్లో బెల్జియం... బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 115 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో 111 ఏళ్ల తర్వాత బెల్జియం ఫైనల్‌కు చేరుకుంది. చివరిసారి బెల్జియం 1904లో జరిగిన ఫైనల్లో 0-5తో అమెరికా చేతిలో ఓడిపోయింది. మరోవైపు 37 ఏళ్ల తర్వాత బ్రిటన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చివరిసారి బ్రిటన్ 1978లో జరిగిన ఫైనల్లో 1-4తో అమెరికా చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండీ ముర్రే 7-5, 6-3, 6-2తో బెర్నాడ్ టామిక్ను ఓడించడంతో బ్రిటన్ 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో థనాసి కోకినాకిస్ (ఆస్ట్రేలియా) 7-5, 6-4తో డాన్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలిచినా ఫలితం లేకపోయింది. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో బెల్జియం ప్లేయర్ స్టీవ్ డార్సిస్ గెలుపొంది తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డార్సిస్ 6-4, 2-6, 7-5, 7-6 (7/3)తో ఫెడెరికో డెల్బోనిస్‌ను ఓడించాడు. అంతకుముందు నాలుగో మ్యాచ్‌లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-3, 6-2, 6-1తో ష్వార్ట్జ్మన్పై గెలుపొంది స్కోరును 2-2తో సమం చేశాడు. -
భారత్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ అర్హత పోటీలో భాగంగా చెక్ రిపబ్లిక్ తో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6 తేడాతో జరీ వెస్లీపై ఓటమి పాలై భారత ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ గెలుపుతో 3-1 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన చెక్ రిపబ్లిక్ .. డేవిస్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన సింగిల్స్ లో ఇరు జట్లు చెరో పాయింట్ తో సమానంగా నిలిచినా, డబుల్స్ లో లియాండర్ పేస్- రోహన్ బోపన్నా జోడీలు ఓటమి చెంది చెక్ రిపబ్లిక్ కుఆధిక్యం కట్టబట్టారు. దీంతో ఈరోజు జరిగే రివర్స్ సింగిల్స్ పోరు కీలకంగా మారింది. దీనిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-లూకా రసూల్ ల మధ్య జరగాల్సిన మరో మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వెస్లీతో రెండు గంటల 14 నిమిషాల పాటు జరిపిన పోరులో బాంబ్రీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్ ను కోల్పోయి ఆదిలోనే వెనుకబడ్డ బాంబ్రీ ఆ తరువాత ప్రతిఘటించినా కుదరలేదు. యూకీ బాంబ్రీ సర్వీసుల్లో అనవసర తప్పిదాలు చేసి ఓటమిని కొనితెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆద్యంత నియంత్రణలో ఆటన కొనసాగించిన వెస్లీ సరైన సమయంలో ఎదురుదాడికి దిగుతూ బాంబ్రీని ఒత్తిడిలోకి నెట్టాడు. స్వదేశంలో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ లో విఫలం చెందిన భారత్..వచ్చే సంవత్సరం జరుగనున్న ఆసియా-ఒసియానా గ్రూప్-1 పోరుకే భారత్ పరిమితమైంది. 2011లో సెర్బియా తో జరిగిన తొలి రౌండ్ లో 4-1 తేడాతో ఓటమి పాలైన అనంతరం డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించడానికి భారత్ చేసిన తొలిసారి ప్రయత్నంలో విఫలం చెందింది.