సోమ్‌దేవ్ సంచలనం | Somdev sensation | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ సంచలనం

Published Sat, Sep 19 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

సోమ్‌దేవ్ సంచలనం

సోమ్‌దేవ్ సంచలనం

ప్రపంచ 40వ ర్యాంకర్‌పై గెలుపు
♦ యూకీ బాంబ్రీ పరాజయం
♦ తొలి రోజు 1-1తో సమం
♦ భారత్, చెక్ రిపబ్లిక్ డేవిస్ కప్ పోరు
 
 ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఈ ఏడాది తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతిలో ఓడిపోయిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సొంతగడ్డపై మాత్రం అద్భుతమే చేశాడు. జాతీయ జట్టు కోసం ఆడే సమ యంలో... అదీ డేవిస్‌కప్ లాంటి ఈవెంట్‌లో ఆటగాళ్ల ర్యాంక్‌తో పనిలేదని సోమ్‌దేవ్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు చెక్ రిపబ్లిక్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో సోమ్ దేవ్ అద్వితీయ ఆటతీరు కారణంగా తొలి రోజును భారత్ 1-1తో సమంగా ముగించింది. తొలి మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ ఓడిపోయి నప్పటికీ... రెండో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ విశేషంగా రాణించి ప్రపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై వరుస సెట్‌లలో గెలిచి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు.
 
 న్యూఢిల్లీ : తనకెంతో కలిసొచ్చిన ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్‌టీఏ) సెంటర్ కోర్టులో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈ సీజన్‌లో అతి పెద్ద విజయాన్ని సాధించాడు. 2010 నుంచి ఈ మైదానంలో పరాజయమెరుగని అతను అదే ఆనవాయితీని కొనసాగించి తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్, భారత్ మధ్య శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తొలి రోజు రెండు జట్లు ఒక్కో విజయాన్ని సాధించి 1-1తో సమంగా నిలిచాయి.

 తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 125వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ 2-6, 1-6, 5-7తో 85వ ర్యాంకర్ లుకాస్ రొసోల్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో 164వ ర్యాంకర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 7-6 (7/3), 6-4, 6-3తో 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై సంచలన విజయం సాధించి స్కోరును 1-1తో సమంగా చేశాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంటతో లియాండర్ పేస్-రోహన్ బోపన్న (భారత్) ద్వయం తలపడుతుంది. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.

►ఈ ఏడాది తాను ఆడిన 51 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 25 పరాజయాలు నమోదు చేసి అంత గొప్ప ఫామ్‌లో లేని సోమ్‌దేవ్ జట్టుకు అవసరమైన సమయంలో ఆపద్భాంధవుడి పాత్రను పోషించాడు. ఈ సీజన్‌లో తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతుల్లో ఓడిపోయిన సోమ్‌దేవ్.. ఈ ఫలితాల ప్రభావాన్ని డేవిస్ కప్‌లో చూపలేదు.
► {పపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీతో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. కోర్టులో చురుకైన కదలికలు, పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన రిటర్న్ షాట్‌లతో అలరించిన సోమ్‌దేవ్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు.
► 2 గంటల 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఫలితంగా ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సోమ్‌దేవ్ పైచేయి సాధించి తొలి సెట్‌ను 69 నిమిషాల్లో దక్కించుకున్నాడు.
► రెండో సెట్‌లోనూ ఇద్దరూ నాణ్యమైన ఆటతీరును కనబరిచారు. అయితే తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సోమ్‌దేవ్... జిరీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 55 నిమిషాల్లో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో సోమ్‌దేవ్ రెట్టించిన ఉత్సాహంతో ఆడాడు. జిరీ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని మూడో సెట్‌ను 38 నిమిషాల్లో ముగించిన సోమ్‌దేవ్ భారత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు.
► మ్యాచ్ మొత్తంలో సోమ్‌దేవ్ 20 ఏస్‌లు సంధించి, కేవలం ఒకటే డబుల్ ఫాల్ట్ చేశాడు. 41 అనవసర తప్పిదాలు చేసినా, 65 విన్నర్స్‌తో ఫలితాన్ని ప్రభావితం చేశాడు. మరోవైపు ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన జిరీ వాసిలీ, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
► అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. తొలి రెండు సెట్‌లను 55 నిమిషాల్లోనే కోల్పోయిన యూకీ, మూడో సెట్‌లో కాస్త పోరాటపటిమ కనబరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. రొసోల్ 11 ఏస్‌లు సంధించి, యూకీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు యూకీ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి నిరాశ పరిచాడు.
 
  నా కెరీర్‌లో గొప్పగా సర్వీస్ చేసిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. నా ఆటతీరుపట్ల సంతృప్తితో ఉన్నాను. బరిలో దిగేముందు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ప్రత్యర్థి ర్యాంక్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో నేను గెలుస్తానని ఎవరూ ఊహించలేదు. దాంతో ఫలితం గురించి ఆలోచించకుండా,  స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నాను. శనివారం జరిగే డబుల్స్‌లో భారత్‌కే విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో ఎవరికైనా గెలిచే చాన్స్ ఉంది. ఇప్పటికీ  చెక్ రిపబ్లిక్‌ను తక్కువ అంచనా వేయలేం.
                 -సోమ్‌దేవ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement