Yuki bambri
-
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
చెంగ్డూ (చైనా): భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్ ఓపెన్, మ్యూనిక్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్స్ సాధించాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 32 ఏళ్ల యూకీ ఐదు స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫ్రాన్స్‌కు చెందిన డబుల్స్ భాగస్వామి అల్బానో ఒలివెట్టితో కలిసి యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో యూకీ ర్యాంక్ మెరుగైంది. భారత స్టార్ రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. -
క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
క్రొయేషియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోరీ్నలో పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉమగ్ నగరంలో బుధవారం జరిగిన తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో కొవాలిక్ (స్లొవేకియా)–కారాబెల్లి (అర్జెంటీనా) జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్–అర్జున్ ఖడే (భారత్) జోడీ 2–6, 2–6తో గిడో ఆండ్రెజి (అర్జెంటీనా)–వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
యూకీ–ఒలివెట్టి జోడీకి టైటిల్
స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో హంబెర్ట్–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. యూకీ–ఒలివెట్టిలకు 30,610 యూరోల (రూ. 27 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ తొలి రౌండ్లో 1–6, 4–6తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో యూకీ ద్వయం
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో ఫెడరికో జెబలాస్–బోరిస్ అరియాస్ (బొలీవియా) జంటను ఓడించింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ ఖాతాలో మూడో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–జూలియన్ క్యాష్ (బ్రిటన్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంటను ఓడించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. టైటిల్ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్ టోర్నీ (స్పెయిన్), నొంతబురి (థాయ్‌లాండ్) చాలెంజర్ టోర్నీలో కూడా డబుల్స్ టైటిల్ సాధించాడు. -
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
ఓటమి అంచుల నుంచి...
పారిస్: ఒక్క పాయింట్ కోల్పోతే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి నుంచి తేరుకున్న అలెగ్జాండర్ జ్వెరెవ్... తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–2, 3–6, 4–6, 7–6 (7/3), 7–5తో 26వ సీడ్ దామిర్ జుమ్హుర్ (బోస్నియా)పై కష్టపడి గెలిచాడు. తన కెరీర్లో ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జ్వెరెవ్ తొలిసారి టాప్–50లోపు ర్యాంకర్‌ను ఓడించాడు. 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ నిర్ణాయక ఐదో సెట్ పదో గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకున్నాడు. ఆ తర్వాత జుమ్హుర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఎనిమిది ఏస్‌లు సంధించిన జ్వెరెవ్... ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 73 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), పదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. 30వ సీడ్ ఫెన్నాండో వెర్దాస్కో (స్పెయిన్) 7–6 (7/4), 6–2, 6–4తో దిమిత్రోవ్‌ను... మార్కో చెచినాటో (ఇటలీ) 2–6, 7–6 (7/5), 6–3, 6–1తో కరెనో బుస్టాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–4, 6–7 (6/8), 7–6 (7/4), 6–2తో అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 6–7 (5/7), 6–3, 6–2తో బెరెటిని (ఇటలీ)పై, 19వ సీడ్ నిషికోరి (జపాన్) 6–3, 6–1, 6–3తో సిమోన్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్వితోలినా నిష్క్రమణ మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్లో 3–6, 5–7తో మిహెలా బుజర్‌నెస్కూ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–3తో పౌలిన్ పార్మెంటీర్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 7–6 (9/7)తో 21వ సీడ్ నయోమి ఒసాకా (అమెరికా)పై నెగ్గారు. యూకీ, బోపన్నలకు నిరాశ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ ద్వయం 5–7, 3–6తో మరాచ్ (ఆస్ట్రియా)–పావిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా (హంగేరి) జోడీ 2–6, 3–6తో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–షుయె జాంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దివిజ్ (భారత్)–షుకో అయోయామ (జపాన్) జోడీ 6–2, 3–6, 5–10తో స్రెబోత్నిక్ (స్లొవేనియా)–గొంజాలెజ్ (మెక్సికో) చేతిలో ఓడింది. -
తొమ్మిదేళ్ల తర్వాత...
కాలిఫోర్నియా (అమెరికా): భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఓ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఈ ఢిల్లీ ప్లేయర్ మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో యూకీ 6–4, 6–2తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో మరో క్వాలిఫయర్ నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)తో యూకీ తలపడతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 110వ స్థానంలో ఉన్న యూకీ గతంలో ఒకేఒక్కసారి 2009లో మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడినా... తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. షరపోవాకు షాక్... మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండుసార్లు ఈ టైటిల్ నెగ్గిన మరియా షరపోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా 6–4, 6–4తో ప్రపంచ 41వ ర్యాంకర్ షరపోవాపై సంచలన విజయం సాధించింది. -
కెరీర్లో తొలిసారి...
ఏటీపీ–500 టోర్నీ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ వాషింగ్టన్: మరో అద్భుత విజయంతో భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ సిటీ ఓపెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 200వ ర్యాంకర్ యూకీ 6–7 (5/7), 6–3, 6–1తో ప్రపంచ 100వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచాడు. ఈ గెలుపుతో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యూకీ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–500 పాయింట్ల టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఏటీపీ సర్క్యూట్లో ప్రైజ్‌మనీ, పాయింట్ల పరంగా టోర్నీలను ఐదు స్థాయిలుగా (గ్రాండ్‌స్లామ్స్ (2000 పాయింట్లు), వరల్డ్ టూర్ ఫైనల్స్ (1500 పాయింట్లు), వరల్డ్ టూర్ మాస్టర్స్ సిరీస్ (1000 పాయింట్లు), ఏటీపీ–500, ఏటీపీ–250 పాయింట్లు) విభజిస్తారు. ఇందులో సిటీ ఓపెన్ నాలుగోస్థాయి టోర్నీ. అంతేకాకుండా ఏటీపీ వరల్డ్ టూర్ ఈవెంట్ టోర్నీలో యూకీ వరుసగా మూడు విజయాలు నమోదు చేయడం... చెన్నై ఓపెన్ (2014లో) తర్వాత ఓ ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నీలో యూకీ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. పెల్లాతో రెండు గంటల తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాక ఒక్కసారిగా విజృంభించి వరుసగా రెండు సెట్లు గెల్చుకున్నాడు. రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, 22వ ర్యాంకర్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై యూకీ సంచలన విజయం సాధించిన సంగతి విదితమే. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 45వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో యూకీ ఆడతాడు. మరోవైపు ఇదే టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–మోనికా నికెలెస్క్యూ (రొమేనియా) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో సానియా–మోనికా ద్వయం 6–3, 6–2తో జేమీ లోబ్–యాష్లే వీన్హోల్డ్ (అమెరికా) జోడీపై గెలిచింది. -
యువ... జయహో
రివర్స్ సింగిల్స్‌లోనూ గెలిచిన రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ న్యూజిలాండ్‌పై 4–1తో భారత్ విజయం ఆసియా ఓసియానియా రెండో రౌండ్‌కు అర్హత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో పోరు తదుపరి దశకు భారత్ అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ సత్తా చాటాడు. డేవిస్ కప్‌లో ఆడుతోంది ఆరో మ్యాచ్ అయినప్పటికీ... కీలక పోరులో ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్‌లో మరో యువ ప్లేయర్ యూకీ బాంబ్రీ కూడా గెలుపొందడంతో భారత్ 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించి ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్‌కు అర్హత సంపాదించింది. పుణే: ప్రధాన సింగిల్స్ ప్లేయర్ సాకేత్ మైనేని చివరి నిమిషంలో గాయపడటంతో అందివచ్చిన అవకాశాన్ని యువ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా రాణించి కీలకమైన విజయాన్ని భారత్‌కు అందించి ఊరట కలిగించాడు. డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 తొలి రౌండ్లో భాగంగా ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపొందారు. ఫలితంగా టీమిండియా 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా వచ్చే ఏప్రిల్‌లో భారత్‌లోనే జరిగే రెండో రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం 2–1 ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రామ్‌కుమార్ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి రివర్స్ సింగిల్స్‌లో ప్రపంచ 276వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7–5, 6–1, 6–0తో ఫిన్ టియర్నీపై గెలిచాడు. సరిగ్గా రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు తొలి సెట్లోనే గట్టిపోటీనే ఎదురైంది. అయితే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్న రామ్‌కుమార్ 12వ గేమ్‌లో టియర్నీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ చెన్నై ప్లేయర్ చెలరేగిపోయాడు.రెండో సెట్లో ఒక గేమ్ మాత్రమే కోల్పోగా... మూడో సెట్లో ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయాన్ని అందించాడు. 12 ఏస్‌లు సంధించిన రామ్‌కుమార్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్ మొత్తంలో టియర్నీ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోలేదు. ఫలితం తేలిపోవడంతో రెండో రివర్స్ సింగిల్స్‌ను బెస్ట్ ఆఫ్–3 సెట్స్‌గా నిర్వహించారు. ప్రాధాన్యత లేకపోయినప్పటికీ యూకీ బాంబ్రీ పట్టుదలతో పోరాడి 7–5, 3–6, 6–4తో జోస్ స్థాతమ్‌ను ఓడించి భారత్‌కు 4–1తో విజయాన్ని ఖరారు చేశాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో యూకీ ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 4–4తో సమంగా ఉన్నపుడు యూకీ తన సర్వీస్‌లో 15–40తో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకున్నాడు. ఈ దశలో యూకీ చక్కటి ఆటతీరుతో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు పదో గేమ్‌లో స్థాతమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి రివర్స్ సింగిల్స్ ముగిశాక భారత జట్టు సభ్యులందరూ రామ్‌కుమార్‌ను గాల్లోకి ఎగరేసి సంబరం చేసుకున్నారు. రెండో రివర్స్ సింగిల్స్ పూర్తయ్యాక కోర్టులోనే భారత జట్టు సభ్యులందరూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న ఆనంద్ అమృత్‌రాజ్‌ను, కోచ్ జీషాన్ అలీ, వెటరన్ లియాండర్ పేస్‌లను కూడా జట్టు సభ్యులు గాల్లోకి ఎగరేసి తమదైనరీతిలో సంబరాలు చేసుకున్నారు. -
సింగిల్స్‌లో జిగేల్
అలవోకగా నెగ్గిన యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ భారత్‌కు 2–0 ఆధిక్యం న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. అంతా ఏకపక్షమే. సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు మరోసారి మెరిశారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోటీలో మొదటిరోజే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్ విజయం ఖాయమవుతుంది. అపుణే: పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుచున్న యూకీ బాంబ్రీ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామ్‌కుమార్ రామనాథన్ డేవిస్‌కప్‌లో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 తొలి రౌండ్లో భాగంగా తొలి రోజు శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు జయభేరి మోగించారు. తొలి సింగిల్స్‌లో యూకీ 6–4, 6–4, 6–3తో ఫిన్ టియర్నీపై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–4, 6–3తో జోస్ స్థాతమ్‌ను ఓడించాడు. ఈ విజయాలతో భారత్ 2–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. శనివారం డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్–విష్ణువర్ధన్ జంట బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే భారత్ ఏప్రిల్‌లో ఆసియా ఓసియానియా రెండో రౌండ్ పోటీలకు అర్హత పొందుతుంది. ఫిన్ టియర్నీతో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ ఆరంభంలో 1–3తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. తొమ్మిదో గేమ్‌లో టియర్నీ సర్వీస్ నిలబెట్టుకోగా, పదో గేమ్‌లో యూకీ తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్ మొదట్లో యూకీ మళ్లీ తడబడి వెంటనే పుంజుకున్నాడు. మూడో సెట్లో టియర్నీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన యూకీ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో యూకీ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు జోస్ స్థాతమ్‌తో గంటా 52 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 15 ఏస్‌లు సంధించాడు. అయితే సర్వీస్‌లో కాస్త తడబడి ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. కానీ తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వని రామ్... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన డేవిస్ కప్ కెరీర్లో రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. -
యూకీ బాంబ్రీ ఓటమి
న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. చైనాలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ యూకీ 3-6, 3-6తో నాలుగో సీడ్ థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఒకసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. -
సెమీస్‌లో యూకీ బాంబ్రీ
పుణే: ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ యూకీ 6-4, 7-6 (4)తో టి చెన్ (తైపీ)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి ఓడింది. -
రన్నరప్ యూకీ బాంబ్రీ
కావుషుంగ్ (తైవాన్): ఏటీపీ చాలెంజర్ ఈవెంట్లో భారత టెన్నిస్ యువ ఆటగాడు యూకీ బాంబ్రీ రన్నరప్‌గా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ను మట్టికరిపించిన నాలుగో సీడ్ బాంబ్రీ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో యూకీ 5-7, 4-6తో ప్రపంచ 75వ ర్యాంకర్ హియాన్ చుంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఫలితంతో యూకీ ఖాతాలో 75 పాయింట్లు చేరగా , ర్యాంకింగ్స్‌లోనూ టాప్-100 దగ్గరలోకి రానున్నాడు. వారం విశ్రాంతి అనంతరం 23 ఏళ్ల యూకీ తాష్కెంట్ చాలెంజర్ ఈవెంట్లో ఆడనున్నాడు. -
భారత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6తో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసిలీ చేతిలో పరాజయం చవిచూశాడు. చెక్ రిపబ్లిక్ విజయం ఖాయం కావడంతో సోమ్‌దేవ్, రోసోల్ మధ్య రెండో మ్యాచ్‌ను నిర్వహించలేదు. మరోవైపు తాజా విజయంతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ వరల్డ్ గ్రూప్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ‘డబుల్స్‌లో పేస్-బోపన్న ఓడటం వల్లే భారత్ మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఈ ఫలితం నన్ను నిరాశపర్చింది. తొలి రోజు స్కోరు 1-1తో ఉన్న తర్వాత రెండో రోజు డబుల్స్‌లో కచ్చితంగా గెలుస్తామని భావించాం. కానీ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉంది. వారి నుంచి ఇలాంటి ఆటతీరును అస్సలు ఊహించలేదు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ వ్యాఖ్యానించారు. -
సోమ్‌దేవ్ సంచలనం
ప్రపంచ 40వ ర్యాంకర్‌పై గెలుపు ♦ యూకీ బాంబ్రీ పరాజయం ♦ తొలి రోజు 1-1తో సమం ♦ భారత్, చెక్ రిపబ్లిక్ డేవిస్ కప్ పోరు ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఈ ఏడాది తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతిలో ఓడిపోయిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సొంతగడ్డపై మాత్రం అద్భుతమే చేశాడు. జాతీయ జట్టు కోసం ఆడే సమ యంలో... అదీ డేవిస్‌కప్ లాంటి ఈవెంట్లో ఆటగాళ్ల ర్యాంక్‌తో పనిలేదని సోమ్‌దేవ్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు చెక్ రిపబ్లిక్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో సోమ్ దేవ్ అద్వితీయ ఆటతీరు కారణంగా తొలి రోజును భారత్ 1-1తో సమంగా ముగించింది. తొలి మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ ఓడిపోయి నప్పటికీ... రెండో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ విశేషంగా రాణించి ప్రపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై వరుస సెట్లలో గెలిచి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. న్యూఢిల్లీ : తనకెంతో కలిసొచ్చిన ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) సెంటర్ కోర్టులో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈ సీజన్లో అతి పెద్ద విజయాన్ని సాధించాడు. 2010 నుంచి ఈ మైదానంలో పరాజయమెరుగని అతను అదే ఆనవాయితీని కొనసాగించి తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్, భారత్ మధ్య శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తొలి రోజు రెండు జట్లు ఒక్కో విజయాన్ని సాధించి 1-1తో సమంగా నిలిచాయి. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 125వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ 2-6, 1-6, 5-7తో 85వ ర్యాంకర్ లుకాస్ రొసోల్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో 164వ ర్యాంకర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 7-6 (7/3), 6-4, 6-3తో 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై సంచలన విజయం సాధించి స్కోరును 1-1తో సమంగా చేశాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంటతో లియాండర్ పేస్-రోహన్ బోపన్న (భారత్) ద్వయం తలపడుతుంది. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ►ఈ ఏడాది తాను ఆడిన 51 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 25 పరాజయాలు నమోదు చేసి అంత గొప్ప ఫామ్‌లో లేని సోమ్‌దేవ్ జట్టుకు అవసరమైన సమయంలో ఆపద్భాంధవుడి పాత్రను పోషించాడు. ఈ సీజన్లో తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతుల్లో ఓడిపోయిన సోమ్‌దేవ్.. ఈ ఫలితాల ప్రభావాన్ని డేవిస్ కప్‌లో చూపలేదు. ► {పపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీతో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. కోర్టులో చురుకైన కదలికలు, పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన రిటర్న్ షాట్లతో అలరించిన సోమ్‌దేవ్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ► 2 గంటల 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఫలితంగా ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సోమ్‌దేవ్ పైచేయి సాధించి తొలి సెట్‌ను 69 నిమిషాల్లో దక్కించుకున్నాడు. ► రెండో సెట్లోనూ ఇద్దరూ నాణ్యమైన ఆటతీరును కనబరిచారు. అయితే తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సోమ్‌దేవ్... జిరీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 55 నిమిషాల్లో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో సోమ్‌దేవ్ రెట్టించిన ఉత్సాహంతో ఆడాడు. జిరీ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని మూడో సెట్‌ను 38 నిమిషాల్లో ముగించిన సోమ్‌దేవ్ భారత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. ► మ్యాచ్ మొత్తంలో సోమ్‌దేవ్ 20 ఏస్‌లు సంధించి, కేవలం ఒకటే డబుల్ ఫాల్ట్ చేశాడు. 41 అనవసర తప్పిదాలు చేసినా, 65 విన్నర్స్‌తో ఫలితాన్ని ప్రభావితం చేశాడు. మరోవైపు ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన జిరీ వాసిలీ, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ► అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. తొలి రెండు సెట్లను 55 నిమిషాల్లోనే కోల్పోయిన యూకీ, మూడో సెట్లో కాస్త పోరాటపటిమ కనబరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. రొసోల్ 11 ఏస్‌లు సంధించి, యూకీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు యూకీ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి నిరాశ పరిచాడు. నా కెరీర్లో గొప్పగా సర్వీస్ చేసిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. నా ఆటతీరుపట్ల సంతృప్తితో ఉన్నాను. బరిలో దిగేముందు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ప్రత్యర్థి ర్యాంక్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో నేను గెలుస్తానని ఎవరూ ఊహించలేదు. దాంతో ఫలితం గురించి ఆలోచించకుండా, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నాను. శనివారం జరిగే డబుల్స్‌లో భారత్‌కే విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో ఎవరికైనా గెలిచే చాన్స్ ఉంది. ఇప్పటికీ చెక్ రిపబ్లిక్‌ను తక్కువ అంచనా వేయలేం. -సోమ్‌దేవ్ -
‘షాంఘై’ చాంప్ యూకీ
షాంఘై (చైనా) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... షాంఘై ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 3-6, 6-0, 7-6 (7/3)తో వుయ్ ది (చైనా)పై నెగ్గి టైటిల్‌ను గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఆరు ఏస్‌లు సంధించగా, వుయ్ ఒకదానితో సరిపెట్టుకున్నాడు. యూకీ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్. -
క్వార్టర్స్‌లో యూకీ
షాంఘై : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ యూకీ 7-5, 6-3తో జీ జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును చూ పెట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన యూకీ రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ 70 పాయింట్లు సాధిస్తే.. జెంగ్ 60తో సరిపెట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాకేత్ మైనేని 6-3, 3-6, 2-6తో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్-శ్రీరామ్ బాలాజీ 1-6, 1-6తో పీటర్ గోజోవిజిక్-జుర్జెన్ జాప్ చేతిలో పరాజయం చవిచూశారు. -
రెండో రౌండ్లో యూకీ
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ యూకీ 6-4, 6-3తో క్వాలిఫయర్ ఇవాన్ గకోవ్ (రష్యా)పై నెగ్గాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు దుర్బెక్ కరిమోవ్ 6-4, 4-6, 6-7 (6)తో దివిజ్ శరణ్‌పై నెగ్గాడు. -
యూకీ జోడికి డబుల్స్ టైటిల్
కర్షి (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ- ఆడ్రియన్ మెనాడెజ్ మెసిరాస్ (స్పెయిన్) జోడి... ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరి గిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ యూకీ-ఆడ్రియన్ 5-7, 6-3, 10-8తో సెర్గి బెటోవ్ (బెలారస్)- మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)పై నెగ్గారు. మ్యాచ్ స్కోరు 5-7, 1-1 ఉన్న దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే తిరిగి మొదలైన తర్వాత భారత జోడి అద్భుతమైన పోరాటంతో విజేతగా నిలిచింది. ఈ సీజన్లో యూకీకి ఇదే తొలి టైటిల్. -
యూకీ బాంబ్రీ శుభారంభం
సోమ్‌దేవ్, రామ్‌కుమార్ ఓటమి మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యువతార రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... యూకీ బాంబ్రీ మాత్రం శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ 4-6, 6-1, 8-6తో 15వ సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. రెండు గంటల తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 29 సార్లు దూసుకొచ్చిన యూకీ 18 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సోమ్‌దేవ్ 4-6, 6-3, 4-6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) చేతిలో; రామ్‌కుమార్ 5-7, 6-4, 4-6తో నిల్స్ లాంగర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. గతంలో మూడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన సోమ్‌దేవ్ ఈ ఏడాది బరిలోకి దిగిన రెండు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గతవారం స్వదేశంలో జరిగిన చెన్నై ఓపెన్‌లోనూ అతను తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యోషిహిటో నిషిఓకా (జపాన్)తో యూకీ ఆడతాడు. 128 మంది పాల్గొంటున్న క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ఈనెల 19న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేస్తారు.