భారత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6తో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసిలీ చేతిలో పరాజయం చవిచూశాడు. చెక్ రిపబ్లిక్ విజయం ఖాయం కావడంతో సోమ్‌దేవ్, రోసోల్ మధ్య రెండో మ్యాచ్‌ను నిర్వహించలేదు.
మరోవైపు తాజా విజయంతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ వరల్డ్ గ్రూప్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ‘డబుల్స్‌లో పేస్-బోపన్న ఓడటం వల్లే భారత్ మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఈ ఫలితం నన్ను నిరాశపర్చింది. తొలి రోజు స్కోరు 1-1తో ఉన్న తర్వాత రెండో రోజు డబుల్స్‌లో కచ్చితంగా గెలుస్తామని భావించాం. కానీ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉంది. వారి నుంచి ఇలాంటి ఆటతీరును అస్సలు ఊహించలేదు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ వ్యాఖ్యానించారు.