Indian tennis team
-
భారత్ X టోగో
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్‌లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్‌కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్‌లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్‌కుమార్ రామనాథన్ తలపడనున్నారు. -
లియాండర్ పేస్‌కు చోటు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల చరిత్రలో ఎనిమిది పతకాలు సాధించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనున్నాడు. వేర్వేరు కారణాలతో పేస్ 2010, 2014 ఆసియా క్రీడల్లో ఆడలేదు. హైదరాబాద్‌కు చెందిన డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ఎంపిక చేయనుంది. ఇందులో పేస్‌కు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. అయితే సింగిల్స్‌లో ఇటీవల నిలకడగా రాణిస్తున్న యూకీ బాంబ్రీ మాత్రం యూఎస్ ఓపెన్‌లో అవకాశం దక్కితే ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని పేరు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. మరో భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న కూడా తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశాడు. యూకీ బాంబ్రీ లేకపోతే పురుషుల సింగిల్స్‌లో భారత ర్యాంక్‌ల ప్రకారం తమిళనాడు ఆటగాళ్లు రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వస్తారు. మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా, కర్మన్ కౌర్ థండీలకు అవకాశం ఉంది. 1994 నుంచి 2006 వరకు వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న లియాండర్ పేస్ 5 స్వర్ణాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. -
భారత టెన్నిస్ జట్టులో ప్రాంజల
పుణే: ఆసియా ఓసియానియా గ్రూప్–1 ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు చోటు లభించింది. అంకిత రైనా, కర్మన్‌కౌర్, ప్రార్థన జట్టులోని మిగతా సభ్యులు. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. 18 ఏళ్ల ప్రాంజల గతేడాది ఒక సింగిల్స్ టైటిల్‌తోపాటు నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. -
భారత్‌కు టాప్ సీడింగ్
న్యూఢిల్లీ : డేవిస్ కప్ గ్రూప్ 1 ఆసియా/ఓసియానియా జోన్లో భారత టెన్నిస్ జట్టుకు టాస్ సీడింగ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ టోర్నీ డ్రాను సాంటియాగోలో నేటి (బుధవారం) నుంచి జరిగే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఏజీఎం ముగింపు రోజున వెల్లడిస్తారు. ఉజ్బెకిస్తాన్‌కు రెండో సీడ్ దక్కింది. ఈ రెండు జట్లకు తొలి రౌండ్లో బై లభించింది. ఇటీవల జరిగిన ప్లేఆఫ్‌లో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిన భారత జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆసియా స్థాయి గ్రూప్-1లో భారత్, ఉజ్బెకిస్తాన్లతో పాటు చైనా, కొరియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. -
భారత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6తో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసిలీ చేతిలో పరాజయం చవిచూశాడు. చెక్ రిపబ్లిక్ విజయం ఖాయం కావడంతో సోమ్‌దేవ్, రోసోల్ మధ్య రెండో మ్యాచ్‌ను నిర్వహించలేదు. మరోవైపు తాజా విజయంతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ వరల్డ్ గ్రూప్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ‘డబుల్స్‌లో పేస్-బోపన్న ఓడటం వల్లే భారత్ మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఈ ఫలితం నన్ను నిరాశపర్చింది. తొలి రోజు స్కోరు 1-1తో ఉన్న తర్వాత రెండో రోజు డబుల్స్‌లో కచ్చితంగా గెలుస్తామని భావించాం. కానీ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉంది. వారి నుంచి ఇలాంటి ఆటతీరును అస్సలు ఊహించలేదు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ వ్యాఖ్యానించారు.