డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ –1 ప్లే ఆఫ్స్
తొలిసారి బరిలోకి దిగుతున్న తెలుగు కుర్రాడు రిత్విక్
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్‌లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఆడనున్నారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్‌లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.
శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్‌తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్‌కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు.
శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్‌లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్‌కుమార్ రామనాథన్ తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment