న్యూఢిల్లీ: ఆసియా క్రీడల చరిత్రలో ఎనిమిది పతకాలు సాధించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనున్నాడు. వేర్వేరు కారణాలతో పేస్ 2010, 2014 ఆసియా క్రీడల్లో ఆడలేదు. హైదరాబాద్‌కు చెందిన డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ఎంపిక చేయనుంది. ఇందులో పేస్‌కు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది.
అయితే సింగిల్స్‌లో ఇటీవల నిలకడగా రాణిస్తున్న యూకీ బాంబ్రీ మాత్రం యూఎస్ ఓపెన్‌లో అవకాశం దక్కితే ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని పేరు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. మరో భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న కూడా తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశాడు. యూకీ బాంబ్రీ లేకపోతే పురుషుల సింగిల్స్‌లో భారత ర్యాంక్‌ల ప్రకారం తమిళనాడు ఆటగాళ్లు రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వస్తారు. మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా, కర్మన్ కౌర్ థండీలకు అవకాశం ఉంది. 1994 నుంచి 2006 వరకు వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న లియాండర్ పేస్ 5 స్వర్ణాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment