ఏషియాడ్‌కు పేస్‌ దూరం | Leander Paes pulls out of Asian Games | Sakshi
Sakshi News home page

ఏషియాడ్‌కు పేస్‌ దూరం

Published Fri, Aug 17 2018 3:25 AM | Last Updated on Fri, Aug 17 2018 3:25 AM

Leander Paes pulls out of Asian Games - Sakshi

లియాండర్‌ పేస్‌

పాలెమ్‌బాంగ్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ కొత్త వివాదాన్ని రేపాడు. డబుల్స్‌లో తన భాగస్వామిని ఎంపిక చేసిన తీరును నిరసిస్తూ ఏకంగా పోటీలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంట్‌లో తనకు సరితూగే డబుల్స్‌ పార్ట్‌నర్‌ను ఎంపిక చేయలేదంటూ ‘ఐటా’పై విమర్శలు గుప్పించాడు. ఇండోనేసియా ఆతిథ్యమివ్వనున్న ఈ క్రీడల నుంచి పేస్‌ ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం మరో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం లేదు. భారత టెన్నిస్‌ జట్టు గురువారం ఇండోనేసియా చేరుకుంది. అయితే ఈ జట్టుతో పాటు వెటరన్‌ స్టార్‌ వెళ్లలేదు. 2010, 2014 ఆసియా క్రీడల్లోనూ పాల్గొనని లియాండర్‌ వరుసగా మూడోసారీ ప్రతిష్టాత్మక క్రీడలకు దూరమయ్యాడు.

దీనిపై వెటరన్‌ స్టార్‌ మాట్లాడుతూ ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... నేను ఆసియా క్రీడల్లో బరిలోకి దిగడం లేదు. సరైన డబుల్స్‌ భాగస్వామి లేకే క్రీడల నుంచి తప్పుకుంటున్నా. నాకు సరితూగే డబుల్స్‌ భాగస్వామిని చూడాలని ఇది వరకే ‘ ఐటా’ను కోరినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అందువల్లే వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌ జోడీ కట్టడంతో విశేష అనుభవజ్ఞుడైన పేస్‌కు సుమిత్‌ నాగల్, సింగిల్స్‌ స్పెషలిస్ట్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌లలో ఒకరిని జత చేయాలనుకున్నారు. దీంతో అతను ఆడలేనంటూ తప్పుకున్నాడు. 1994లో జరిగిన హిరోషిమా ఆసియా క్రీడల నుంచి 2006 దోహా క్రీడల వరకు ప్రతీ ఈవెంట్‌ల్లోనూ పాల్గొన్న 45 ఏళ్ల పేస్‌ 5 స్వర్ణ పతకాలను గెలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement