ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్‌లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మరో రజతం మనకు దక్కింది.
ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది.
పాకిస్తాన్‌ను పడగొట్టి...
ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్‌పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్‌తో అభయ్ తలపడ్డాడు.
హోరాహోరీగా సాగిన ఐదు గేమ్‌ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్‌ను ఓడించాడు. నాలుగో గేమ్‌లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్‌లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు.
అంతకు ముందు తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్‌కర్‌పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్‌లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
హాంగ్జౌఆసియా క్రీడలు
‘సిల్వర్’ సరబ్‌జోత్ – దివ్య
భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్‌లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్‌జోత్ – దివ్యలను ఓడించింది.
గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన సరబ్‌జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి.
సత్తా చాటిన కార్తీక్, గుల్విర్
1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్‌కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్‌లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం.
కార్తీక్ కుమార్‌కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్‌తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్‌లో బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు.
మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం
ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్‌పై విజయం సాధించారు.
భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్‌తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్‌లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్‌లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్‌లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది.
బోపన్న సర్వీస్‌తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది.
Comments
Please login to add a commentAdd a comment