Squash
-
రిటైర్మెంట్ వీడి మళ్లీ బరిలోకి దిగనున్న భారత స్క్వాష్ స్టార్
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం...భారత స్క్వాష్ (Squash) స్టార్ సౌరవ్ ఘోషాల్ (Sourav Ghoshal) ఆటకు గుడ్‌బై చెప్పాడు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో భాగంగా చికాగోలో జరిగిన విండీ సిటీ ఓపెన్‌లో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 38 ఏళ్ల ఘోషాల్ ఇప్పుడు మళ్లీ ఆటగాడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ వదిలి మైదానంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో పీఎస్ఏలో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్న ఘోషాల్ చాలెంజర్ ఈవెంట్ ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్‌లో బరిలోకి దిగుతున్నాడు. ‘టోర్నీల కోసం చేసే ప్రయాణాలు, ఆ పోటీని నేను మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నా. గత 20 ఏళ్లలో ఆటగాడిగా ఉన్నప్పుడు గడిపిన సమయంతో పోలిస్తే ఈ సారి 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ సమయంలో ఇంట్లో ఉన్నాను. ఈ సమయంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడిపా. కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా నాలో ఉందని భావిస్తున్నా. విరామ సమయంలో నా కెరీర్‌ను విశ్లేషించేందుకు ప్రయత్నించా. కాబట్టే ఇంకా ఆడాలనిపించింది. ఈ రెండో భాగం మొదటిదానికంటే బాగుంటుందని ఆశిస్తున్నా’ అని ఘోషాల్ చెప్పాడు. భారత్ తరఫున ఆడాలని... ఈ సారి పీఎస్ఏ టోర్నీలకంటే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా అతను పెట్టుకున్నాడు. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ స్క్వాష్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోషాల్... సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు గెలుచుకున్నాడు.భారత్ తరఫున దాదాపు అన్ని ఘనతలు అతని పేరిటే ఉన్నాయి. ‘పీఎస్ఏ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ తరఫున మాత్రం ఆడుతూ ఉండాలని భావించా. అయితే పీఎస్ఏలో కొనసాగితేనే జాతీయ జట్టు తరఫున ఎంపికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అర్థమైంది. భారత్ తరఫున ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. కొన్ని నెలల క్రితమే నా శిక్షణను మళ్లీ ప్రారంభించా. ఆరంభంలో ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టి ఆపై సాధన కొనసాగించా. దాదాపు ఆరు నెలల మైదానానికి దూరమై మళ్లీ ఆడటం అంత సులువు కాదు’ అని ఘోషాల్ పేర్కొన్నాడు.ఒలింపిక్స్ ఆశలు... 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి స్క్వాష్‌ను తప్పించినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను చేర్చడం కూడా ఘోషాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మేం స్వర్ణం సాధించలేదు. ఈ సారి గెలవవచ్చని ఆశించా. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేం. ఆసియా క్రీడల్లో మాత్రం రాణించే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో పతకం అనేది నిజంగానే పెద్ద లక్ష్యం. నేను మన దేశం తరఫున ఆడిన పతకం గెలవగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. కానీ దానికి దాదాపు మూడేళ్లుకు పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడైతే అంత దూరం ఆలోచించడం లేదు’ అని ఘోషాల్ అభిప్రాయపడ్డాడు. ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్ టోర్నీలో తాను విజయం సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
శౌర్య సంచలనం
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు శౌర్య బావా సంచలనం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో బాలుర సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2014లో కుష్ కుమార్ తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల శౌర్య క్వార్టర్ ఫైనల్లో 2–11, 11–4, 10–12, 11–8, 12–10తో లో వా సెర్న్ (మలేసియా)పై గెలుపొందాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శౌర్య మూడు మాŠయ్చ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. నిర్ణాయక ఐదో గేమ్‌లో శౌర్య 7–10తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే శౌర్య ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. బాలికల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 16 ఏళ్ల అనాహత్ 8–11, 9–11, 11–5, 12–10, 11–13తో నదీన్ ఎల్హమీ (ఈజిప్‌్ట) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ సింగ్
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్, జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్లో అనాహత్ సింగ్ 11–7, 12–10, 11–6తో సమంతా జాఫీ (అమెరికా)పై గెలిచింది. బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ శౌర్య బావా కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్లో శౌర్య 4–11, 11–7, 12–10, 11–6తో రస్టిన్ వైజర్ (అమెరికా)పై నెగ్గాడు. -
గుడ్‌ఫెలో క్లాసిక్ స్క్వాష్ టోర్నీ విజేత అభయ్
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఎ) సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు. -
రన్నరప్‌గా అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. బర్మింగ్హమ్లో జరిగిన ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల అనాహత్ సింగ్ అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో రజత పతకం గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–7, 11–13, 10–12, 11–5, 9–11తో రెండో సీడ్ నాదీన్ ఎల్హమీ (ఈజిప్ట్) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ చరిత్రలో అనాహత్కిది మూడో పతకం. 2019లో అండర్–11 విభాగంలో, 2023లో అండర్–15 విభాగంలో అనాహత్ స్వర్ణ పతకాలు సాధించింది. -
Singapore Squash Open 2023: సౌరవ్ పరాజయం
న్యూఢిల్లీ: సింగపూర్ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ నిష్క్రమించాడు. సింగపూర్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సౌరవ్ 3–11, 7–11, 10–12తో నాలుగో సీడ్ ముస్తఫా అసల్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ రమిత్ టాండన్ 3–11, 2–11, 4–11తో రెండో సీడ్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరవ్ 11–6, 7–11, 11–6, 11–5తో టాడీ హారిటి (అమెరికా)పై, రమిత్ 11–7, 12–10, 12–10తో రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)పై గెలుపొందారు. -
సూపర్ సౌరవ్...
భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్ యో ఎన్జీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ (భారత్) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్‌పాల్ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్–కమాల్ (మలేసియా) జంటపై నెగ్గింది. రెజ్లర్ అంతిమ్‌కు కాంస్యం మహిళల రెజ్లింగ్‌లో భారత రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం గెలిచింది. 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో 19 ఏళ్ల అంతిమ్ 3–1తో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బొలోర్‌తుయా బత్ఒచిర్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతక బౌట్లో 2–9తో కెయునిమ్జేవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మాన్సి అహ్లావత్ కాంస్య పతక బౌట్లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో 0–4 గోల్స్ తేడాతో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. పురుషుల మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) భారత అథ్లెట్లు మాన్ సింగ్ ఎనిమిదో స్థానంలో (2గం:16ని:59 సెకన్లు), అప్పచంగడ బెలియప్ప (2గం:20ని:52 సెకన్లు) 12వ స్థానంలో నిలిచారు. -
స్క్వాష్‌లో రెండు స్వర్ణాలపై గురి
ఆసియా క్రీడల స్క్వాష్ ఈవెంట్లో భారత్ రెండు స్వర్ణ పతకాలపై గురి పెట్టింది. మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లగా... భారత్‌కే చెందిన అనాహత్ సింగ్–అభయ్ సింగ్ జంట సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ కూడా తుది పోరుకు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్‌లో దీపిక–హరీందర్ ద్వయం 7–11, 11–7, 11–9తో లీ కా యి–వోంగ్ చి హిమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. అనాహత్–అభయ్ జోడీ 11–8, 2–11, 9–11తో అజ్మాన్ ఐఫా–మొహమ్మద్ కమాల్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరవ్ 11–2, 11–1, 11–6తో చి హిన్ హెన్రీ (హాంకాంగ్)పై గెలుపొందాడు. -
పసిడి టెన్నిస్ శభాష్ స్క్వాష్...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో రజతం మనకు దక్కింది. ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది. పాకిస్తాన్‌ను పడగొట్టి... ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్‌పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్‌తో అభయ్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఐదు గేమ్‌ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్‌ను ఓడించాడు. నాలుగో గేమ్‌లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్‌లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు. అంతకు ముందు తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్కర్పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్‌లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌఆసియా క్రీడలు ‘సిల్వర్’ సరబ్జోత్ – దివ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్జోత్ – దివ్యలను ఓడించింది. గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సరబ్జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. సత్తా చాటిన కార్తీక్, గుల్విర్ 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్‌కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం. కార్తీక్ కుమార్‌కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్‌తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్లో బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు. మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్‌పై విజయం సాధించారు. భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్‌తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్‌లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్‌లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది. బోపన్న సర్వీస్‌తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది. -
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
స్వర్ణం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య
హ్వాంగ్జౌ (చైనా): ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్ (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య) – హరీందర్‌పాల్ సింగ్ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్ యూయెన్ – రాచెల్ ఆర్నాల్డ్ (మలేసియా)పై విజయం సాధించారు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్ సీడ్ ఆయిరా అజ్మాన్ – షఫీక్ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్ అస్లామ్ – ఫైజా జఫర్ (పాకిస్తాన్)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్ సింగ్ – అభయ్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. -
World Squash Championships: పోరాడి ఓడిన సౌరవ్ ఘోషాల్
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ పోరాటం ముగిసింది. షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–9, 11–4, 6–11, 3–11, 10–12తో ప్రపంచ నంబర్‌వన్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో ఓడిపోయాడు. 36 ఏళ్ల సౌరవ్ నిర్ణాయక ఐదో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద అనవసర తప్పిదాలు చేసి వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఓటమిని ఖరారు చేసుకున్నాడు. -
బ్రిటిష్ ఓపెన్ విజేత అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అనాహత్ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. 14 ఏళ్ల అనాహత్ బ్రిటిష్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్–11 విభాగంలో టైటిల్ సాధించింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటిష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. -
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్‌తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్‌లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్‌ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్‌షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ ఓటమి
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల అనాహత్ సింగ్ 7–11, 11–6, 8–11, 8–11తో ఫెరూజ్ అబూల్కెర్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అనాహత్ రెండో రౌండ్లో 11–1, 11–3, 11–4తో మేరీ వాన్ రీత్ (బెల్జియం)పై, మూడో రౌండ్లో 11–5, 11–4, 11–8తో ఎమ్మా బార్ట్లే (ఇంగ్లండ్)పై గెలిచింది. -
కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం
కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్–దీపిక పల్లికల్ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్–కామెరాన్ పిలె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి కాంస్యం నెగ్గింది. తద్వారా భారత్ ఖాతాలో 50వ పతకం చేరింది. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్.. ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య అన్న విషయం తెలిసిందే. -
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో... లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్సెంటి అండ్ గ్రెనడైన్స్కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్లాక్తో తలపడనుంది. చదవండి: Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు -
మా మధ్య అభిప్రాయ బేధాల్లేవ్: దీపిక
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్డౌన్ సమయాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తున్నామని స్వ్కాష్ క్రీడాకారిణి, దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ తెలిపారు. ఎక్కువగా క్రీడలు చుట్టూ తిరుగుతూ వైవాహిక జీవితాన్ని పరిమితంగా గడపాల్సి వస్తూ ఉంటుందని, కానీ లాక్‌డౌన్‌తో తాము మరింత దగ్గరై ఒకరి అవసరాల గురించి మరొకరం మాట్లాడుకునే వీలుదొరికిందన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ ఫోకస్ చేసినట్లు పేర్కొన్న దీపికా.. ప్రొఫెషనల్ అథ్లెట్లుగా తమకు ఇది పెద్ద బ్రేక్‌గా అని అన్నారు. తాము ఎప్పుడూ తమ ఆటల గురించి ఎక్కువగా చర్చించుకోమని, కేవలం స్పోర్ట్స్ పర్సన్స్‌గా ఏమి కావాలో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తామన్నారు. (‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్ అన్నారు’) ‘ఈ లాక్డౌన్ సమయంలో ఇద్దరం కలిసి ఇంటి పనులను పంచుకుంటున్నాం. అథ్లెట్లకు ఎప్పుడైనా కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. లాక్డౌన్ మమ్మల్ని మేము మరింత తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఇప్పటివరకూ మేము బిజీ బిజీ షెడ్యూల్‌తోనే గడుపుతూ వచ్చాం. ఇప్పుడు ఎటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాం. మా మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు రాలేదు. మేమిద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంతో మా గేమ్స్ల్లో మరింత రాటుదేలే అవకాశం ఏర్పడింది. మా మధ్య ఫిర్యాదులు అనేవి ఉండవు. మేము ఇంటి దగ్గర ఉన్నామంటే మా మధ్య క్రీడల చర్చే రాదు. జీవితంలోని మిగతా విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ప్రొఫెషనల్ లైఫ్‌ను గౌరవించుకుంటాం తప్పితే వాటి గురించి చర్చలు పెట్టం’ అని దీపికా పల్లికల్ అన్నారు. 2015లో వీరిద్దరూ వివాహ బంధంతోo ఒక్కటైన సంగతి తెలిసిందే. (‘అదే రోహిత్‌ను సక్సెస్ఫుల్ కెప్టెన్ చేసింది’) -
ఇండియా టూర్ స్క్వాష్ టోర్నీ విజేత హరీందర్
ముంబై: సొంతగడ్డపై భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇండియా టూర్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ విజేతగా అవతరించాడు. ముంబైలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ హరీందర్ 11–5, 11–6, 11–7తో ఏడో సీడ్ టొమోటకా ఎండో (జపాన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో హనా రమదాన్ (ఈజిప్ట్) 11–8, 6–11, 11–4, 11–3తో లూసీ టర్మెల్ (ఇంగ్లండ్)ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. -
ఆసియా స్క్వాష్ చాంప్స్ సౌరవ్, జోష్నా
కౌలాలంపూర్: భారత స్క్వాష్ స్టార్స్ సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్... మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా జోష్నా చినప్ప రికార్డు నెలకొల్పారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 11–2, 11–8తో లియో చున్ మింగ్ (హాంకాంగ్)పై... రెండో సీడ్ జోష్నా 11–5, 8–11, 11–6, 11–6తో టాప్ సీడ్ ఆనీ అయు (హాంకాంగ్)పై గెలిచారు. -
టాప్–10లోకి సౌరవ్ ఘోషల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల విభాగంలో టాప్–10లోకి అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషల్ రికార్డు సృష్టించాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఘోషల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 10వ స్థానంలో నిలిచాడు. 2018–19 సీజన్లో పీఎస్ఏ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో, ప్రతిష్టాత్మక గ్రాస్‌హాపర్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సౌరవ్ ఇటీవల ప్రదర్శన అతనికి అత్యుత్తమ ర్యాంక్‌ను అందించింది. గతంలో మహిళల విభాగంలో భారత క్రీడాకారిణులు జోష్న చిన్నప్ప, దీపిక పల్లికల్ టాప్–10లో ఉన్నారు. -
నా కష్టమేంటో డీకేకి అప్పుడే తెలిసొచ్చింది : దీపికా
‘ఆరోజు నాతో పాటు మలేషియా టోర్నమెంట్‌కి కార్తిక్ కూడా వచ్చాడు. క్రికెటర్ కదా అందుకే మమ్మల్ని తీసుకువెళ్లడానికి బస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ అలా జరగకపోవడంతో ఏంటి ఇంకా బస్సు రాదేం అని అమాయకంగా నన్ను అడిగాడు. అప్పుడు తనకి అర్థమైంది స్వ్కాష్ క్రీడాకారుల కష్టమేంటో. ఇక అప్పటి నుంచి నా పట్ల తనకింకా గౌరవం పెరిగింది అంటూ భర్త దినేశ్ కార్తిక్ గురించి చెప్పుకొచ్చారు స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్. మిస్ ఫీల్డ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం వివాహ బంధంతో కార్తిక్ తన జీవితంలో అడుగుపెట్టాడని.. ప్రేమను కురిపించడంతో పాటుగా తననెంతో గౌరవిస్తాడని పేర్కొన్నారు. అయితే మలేషియా టోర్నమెంట్ సమయంలో మాత్రం తన అమాయకత్వాన్ని చూస్తే నవ్వొంచిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారత్‌లో చాలా మందికి క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే గుర్తొస్తొందనీ, వేరే క్రీడలకు ఇక్కడ అంతగా ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు. క్రికెటర్లకు ఉన్నన్ని సౌకర్యాలు ఇతర క్రీడాకారులకు ఉండవని, ఈ విషయం తెలిసిన తర్వాత డీకే తనను చూసి మరింతగా గర్వపడటం మొదలుపెట్టాడని వ్యాఖ్యానించారు. కాగా పీఎస్ఏ ర్యాంకింగ్స్‌లో టాప్- 10లో చోటు దక్కించుకున్న మొదటి మహిళా స్క్వాష్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన దీపికా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ వుమన్స్ డబుల్స్ కేటగిరీలో భారత్‌కు స్వర్ణాన్ని అందించారు. తాజాగా జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని అందించిన స్క్వాష్ మహిళల జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. -
ఐశ్వర్య బృందానికి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలికల స్క్వాష్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఐశ్వర్య బిమల్ పయ్యాన్ ప్రాతినిధ్యం వహించిన ఐబీఎస్‌ఓ జట్టు రన్నరప్‌గా నిలిచింది. చండీగఢ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఐబీఎస్‌ఓ జట్టు 5–11, 4–11, 5–11తో తమిళనాడు చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఐబీఎస్‌ఓ 11–8, 11–5, 11–6తో గుజరాత్‌పై గెలుపొందింది. -
స్క్వాష్‌లో రజతంతో సరి
జకార్తా: ఆసియా క్రీడల స్క్వాష్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు స్వర్ణ పతక పోరులో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దీపికా పళ్లికల్, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా బృందం ఆఖరి పోరులో పరాజయం చెందారు. దాంతో స్వ్కాష్‌లో తొలిసారి స్వర్ణం అందుకునే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 68 కాగా, అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 29 కాంస్య పతకాలున్నాయి. ఈ రోజు జరిగిన బాక్సింగ్ పోరులో భారత్ పసిడి సాధించింది. పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఇక బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. -
స్క్వాష్‌లో సంచలనం
జకార్తా: కఠినమైన ప్రత్యర్థి అనుకున్న మలేసియాను అతి సులువుగా ఓడించిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల స్క్వాష్‌లో తొలిసారి ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మొదటి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 12–10, 11–9, 6–11, 10–12, 11–9తో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఏషియాడ్ సింగిల్స్ విజేత నికోల్ డేవిడ్‌ను మట్టికరిపించింది. నాలుగో గేమ్‌లో 10–9 స్కోరుపై జోష్నా మ్యాచ్ బాల్ మీద ఉండగా... నికోల్ అద్భుతంగా పుంజుకుని మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెల్చుకుంది. ఐదో గేమ్‌లోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైనా... ఈసారి జోష్నా పట్టువిడవకుండా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో దీపికా పల్లికల్ 11–2, 11–9, 11–7తో లొ వీ వెర్న్‌ను ఓడించడంతో భారత్ 2–0తో గెలిచింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. పురుషుల విభాగంలో కాంస్యమే డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల స్క్వాష్ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 2–0 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 7–11, 9–11, 10–12తో మాక్స్ లీ చేతిలో... రెండో మ్యాచ్‌లో హరీందర్ పాల్ సంధూ 9–11, 11–9, 9–11, 11–13తో లియో అయు చేతిలో ఓడిపోయారు. -
స్క్వాష్‌లో పసిడి పోరుకు అమ్మాయిలు సై
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా స్క్వాష్ ఈవెంట్లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. జోష్నా చిన్నప్ప, దీపికా పళ్లికల్, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు.. ఆద్యంతం ఆకట్టకుంది. ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత బృందం ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత మహిళల స్క్వాష్ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే పసిడి పోరులో హాంకాంగ్-జపాన్ల మధ్య జరుగునున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. ఈ రోజు జరిగే స్క్వాష్ పురుషుల సెమీ ఫైనల్లో భారత్ జట్టు హాంకాంగ్‌తో ఆడనుంది. -
మూడు ‘కాంస్యాల’ స్క్వాష్
జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్ మింగ్ యు (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్లో ఒక దశలో సౌరవ్ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్ మింగ్ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్ వివరణ ఇచ్చాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ నికోల్ డేవిడ్ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం. -
దీపికా పళ్లికల్ కాంస్యంతో సరి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018 స్క్వాష్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి దీపికా పళ్లికల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దీపికా పళ్లికల్ 0-3 తేడాతో డేవిడ్ నికోలాన్(మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరి రజతం సాధించాలన్నా దీపికా ఆశలు నెరవేరలేదు. కాగా, కాంస్యం దక్కడంతో ఏడో రోజు ఆటలో భారత్ పతకాల బోణీ కొట్టింది. మరొక స్క్వాష్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో జ్యోష్నచిన్నప్ప పరాజయం చెందింది. మలేసియా క్రీడాకారిణి శివసాంగారి చేతిలో జ్యోష్న చిన్నప్ప 1-3 తేడాతో ఓటమి చెంది కాంస్యంతో సంతృప్తి చెందింది. ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, పదహారు కాంస్య పతకాలున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ రోజు ఆటలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, ఆపై జరిగిన మరో ప్రిక్వార్టర్ పోరులో పీవీ సింధు 21-12, 21-15 తేడాతో టంజంగ్ జార్జియా(ఇండోనేసియా)పై గెలిచి రౌండ్-16లోకి ప్రవేశించింది. -
‘నేను నా డ్రాగన్’: కార్తీక్
కోహ్లి-అనుష్క, ధోని-సాక్షిలాగా సెలబ్రిటీ జంట కాదు ఈ జంట. కానీ వీరిద్దరూ టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ఒకరు నిదహాస్ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు కప్ అందించిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కాగా మరోకరు స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్. వీరిరువురు తీరిక లేకుండా వారివారి ఆటల్లో బిజీగా ఉండటంతో అందరిలగా బయట ఎక్కువగా కనిపించరు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం కాస్త ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణితో కలిసి డెన్మార్క్ వీధుల్లో విహరిస్తున్నాడు ఈ సీనియర్ వికెట్ కీపర్. వీరిరువురు కలిసి దిగిన ఫోటోను దినేశ్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ‘నేను నా డ్రాగన్’ అంటూ పోస్ట్ చేశాడు. వీరు మరీ అంతగా సెలబ్రిటీ జంట కాకపోవడంతో అంతగా వైరల్ అవ్వలేదు. కానీ చూపరులను మాత్రం ఈ ఫోటో తెగ ఆకట్టుకోంటోంది. కార్తీక్ ఆకట్టుకుంటాడా.. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చివరిసారి 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టెస్టు సిరీస్ గెలిచింది. వసీం జాఫర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్తీక్ ఈ టెస్టు సిరీస్‌లో అకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగుల చేసింది కార్తీక్ కావడం విశేషం. ఇంగ్లండ్ సిరీస్ అనంతరం వరుస వైపల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన కార్తీక్ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయపడటంతో ఈ సీనియర్ ఆటగాడు అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి సాహా కోలుకోకపోవడంతో కీలక ఇంగ్లండ్ పర్యటనకు కూడా కార్తీక్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో దినేశ్ కార్తీక్ మరోసారి ఆకట్టుకుంటాడా? టీమిండియా చరిత్ర మరోసారి పునరావృతం చేస్తుందా వేచి చూడాలి. -
సెంథిల్ కుమార్ సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టైటిల్ సాధించాడు. అమెరికాలో జరిగిన మాడిసన్ ఓపెన్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఈ ఆసియా జూనియర్ చాంపియన్ సంచలన విజయాలతో కడదాకా దూసుకెళ్లాడు. ఫైనల్లో 20 ఏళ్ల సెంథిల్ 7–11, 13–11, 12–10, 11–4తో నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్ (దక్షిణాఫ్రికా)ను కంగుతినిపించాడు. మాజీ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ విజేత అయిన సెంథిల్ మొదటి రౌండ్లో మూడో సీడ్ బెర్నట్ జుమే (స్పెయిన్)కు షాకిచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మార్క్ ఫుల్లర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. ప్రపంచ 255 ర్యాంకర్ అయిన ఈ భారత ఆటగాడు గతంలో రెండుసార్లు పీఎస్ఏ ఈవెంట్లలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. ఈ సారి మాత్రం టైటిల్ సాధించేదాకా విశ్రమించలేదు. -
జోష్నా సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పెను సంచలనం సృష్టించింది. ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)పై కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న గునా అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 11–8, 11–8, 11–8తో నికోల్‌ను బోల్తా కొట్టించింది. ‘నికోల్‌ను నేను ఎలా ఓడించానో అర్థం కావడం లేదు’ అని జోష్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో జోష్నా
ఎల్ గౌనా (ఈజిప్టు): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పీఎస్ఏ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జోష్నా 11–5, 7–11, 9–11, 11–8, 11–9తో తొమ్మిదో ర్యాంకర్ అలీసన్ వాటర్స్ (ఇంగ్లండ్)ను కంగుతినిపించింది. మరో భారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ 9–11, 10–12, 6–11తో నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో తొలి రౌండ్లోనే ఓడింది. టాప్–10లో సాక్షి, సందీప్ న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, సందీప్ తోమర్ టాప్–10లో చోటు సంపాదించారు. మహిళల 58 కేజీల విభాగంలో సాక్షి ఐదో స్థానాన్ని సంపాదించగా... పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూఢిల్లీలో మేలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్నారు. -
కాస్త మెరుగు పడిన జోస్న!
న్యూఢిల్లీః భారత స్వ్రాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప ఈ సారి ర్యాంకుల్లో కొంత మెరుగు పడింది. ఇంతకు ముందున్న ర్యాంకు కంటే రెండు స్థానాలకు ఎదిగి ఇప్పుడు 11వ స్థానంలో నిలిచింది. ప్రొషెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ర్యాంకుల్లో జోస్న కొంతశాతం మెరుగు కనబరిచింది. గతవారం హాంకాంగ్ లో జరిగిన టోర్నీలో తనదైన ప్రతిభను ప్రదర్శించి ర్యాంకుల జాబితాలో స్క్వాష్ క్రీడాకారిణి జోస్న మరో మెట్టు ఎక్కగలిగింది. గతంలో 13వ ర్యాంకులో ఉన్న జోస్నతాజా జిబితాలో 11వ ర్యాంకును సాధించింది. తన ఇండియా టీమ్ మేట్ దీపికా పల్లికల్ కూడ తన స్థానంలో కాస్త మెరుగును కనబరిచి 18 వ ర్యాంకుకు ఎగబాకింది. అలాగే గాయంతో చికిత్స పొందుతున్న సౌరవ్ ఘోషల్ పురుషుల ర్యాంకుల్లో 17వ స్థానంలో ఉన్నాడు. -
నిరాశ పరిచిన బాక్సర్లు
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో మూడో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి మినహా.. మన బాక్సర్లంతా.. ఇంటిదారి పట్టారు. 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి.. ఫైనల్ చేరుకున్నాడు. సోలంకి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కి చెందిన బ్రాండన్ ను 3-0 తేడాతో ఓడించాడు. దీంతో సోలంకి కనీసం రజతపతకం పొందే అవకాశం ఉంది. ఇక ఇదే విభాగంలో 49కిలోల కేటగిరీలో భీమ్ చంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ లు సెమీస్ లో ఓడి క్యాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్ డబుల్స్ లో భారత్ జంట సెమీ ఫైనల్ కు చేరింది. పూల్ సీలో భాగంగా నార్ధన్ ఐర్లాండ్ జంటపై ..భారత్ జంట సెంధిల్ కుమార్, హర్షిత్ లు 11-0, 11-2 స్కోర్స్ తేడాతో సునాయాస విజయాన్ని సాధించారు. భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. -
2020 ఒలింపిక్స్‌లో స్క్వాష్: సౌరవ్ ఆశాభావం
కోల్‌కతా: ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ ఏంటని అందరూ అవహేళన చేస్తున్నా... 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఈ ఈవెంట్ ఉంటుందని భారత స్టార్ సౌరవ్ ఘోశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కొత్త క్రీడాంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్నాడు. ఐఓసీ కొత్త అధ్యక్షుడు మరికొన్ని క్రీడాంశాలు పెంచడంపై దృష్టిపెట్టడం తమకు లాభిస్తుందన్నాడు. -
స్వ్కాష్ లో భారత్ సరికొత్త చరిత్ర
ఇంచియాన్:స్వ్కాష్ లో భారత పురుషల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ మలేషియాతో తలపడిన భారత టీం 2-0 తేడాతో పరిపూర్ణ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మహిళల ఈవెంట్ లో తొలిసారి రజతాన్ని చేజిక్కించుకున్న భారత్.. పురుషుల ఈవెంట్ లో కూడా మెరిసి పసిడిని కూడా తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీం ఈవెంట్ లో సౌరవ్ ఘోశల్, హరివిందర్ పాల్ సింగ్ ,కుశ్ కౌర్, మహేష్ మనోన్కర్ లు భారత్ కు స్వర్ణాన్ని సాధించిపెట్టారు. ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు మూడు స్వర్ణాలు లభించాయి. -
స్క్వాష్‌లో ఆశ... షూటర్ల నిరాశ
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మహిళల స్క్వాష్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పతకానికి చేరువయింది. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు అలవోకగా తొలి రౌండ్‌ను అధిగమించారు. అయితే మొదటి నాలుగు రోజులు పతకాలు తెచ్చిన షూటర్లు... ఐదో రోజు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. స్క్వాష్: భారత్‌కు మరో పతకం దక్కే అవకాశాలు మరింతగా మెరుగయ్యాయి. మహిళల టీమ్ పూల్ ‘బి’లో భారత్ 2-1తో హాంకాంగ్‌ను, 3-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. నేడు చైనాతో జరిగే పూల్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు అగ్రస్థానం దక్కుతుంది. అప్పుడు ఫైనల్‌కు చేరడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పురుషుల స్క్వాష్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది. షూటింగ్: ఆంగ్నియాన్ షూటింగ్ రేంజ్లో బుధవారం జరిగిన పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగాల్లో భారత షూటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పురుషుల 25 మీ. ర్యాపిడ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లోనైతే కొద్దిలో కాంస్యం చేజారింది. వియత్నాంతో కలిసి 1704 పాయింట్లు సాధించిన భారత్ ‘ఇన్నర్ 10’ కౌంట్‌లో వెనకబడింది. దీంతో నాలుగో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఎవరూ ఫైనల్‌కు చేరలేదు. బ్యాడ్మింటన్: టీమ్ ఈవెంట్లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షట్లర్లు సింగిల్స్‌లోనూ తమ సత్తా చాటుతున్నారు. టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు సింగిల్స్ తొలి రౌండ్లో తమ తమ ప్రత్యర్థులపై నెగ్గి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఆరో సీడ్ సైనా 21-10, 21-8తో యు టెంగ్ లోక్ (మకావు)పై 20 నిమిషాల్లోనే గెలిచింది. ఎనిమిదో సీడ్ పీవీ సింధు 21-7, 21-13తో వోంగ్ కిట్ లెంగ్ (మకావు)పై 19 నిమిషాల్లోనే నెగ్గింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి-ప్రద్న్యా జోడి 16-21, 21-19, 14-21 జపాన్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో మను ఆత్రి-సుమీత్ రెడ్డి గెలిచారు. ఇతర క్రీడల ఫలితాలు ఆర్చరీ: మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించింది. ర్యాంకింగ్ రౌండ్లో మంచి ఫామ్‌ను కనబరిచిన దీపిక ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరో మహిళా ఆర్చర్ లక్ష్మీరాణి మజ్హి కూడా ఎలిమినేషన్‌కు అర్హత సాధించింది. టీమ్ ఈవెంట్లో ఐదో స్థానంలో నిలిచిన భారత్ (దీపిక, లక్ష్మీరాణి, బొంబ్యాల దేవి) క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌తో పోటీపడనుంది. అతాను దాస్, జయంత్ తాలుక్ దార్ వ్యక్తిగత విభాగంలో ఎలిమినేషన్ రౌండ్‌కు... రాయ్, దాస్, తాలుక్దార్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్‌కు చేరారు. బాక్సింగ్: మూడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టిన అఖిల్ 60 కేజీల విభాగంలో నేపాల్‌కు చెందిన పూర్ణ బహదూర్ లామాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. 56 కేజీల విభాగంలో శివ తాపాకు వాకోవర్ లభించింది. ఇద్దరూ ప్రి క్వార్టర్స్ చేరారు. టెన్నిస్: మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నటాషా పల్హా ఓడిపోయింది. డబుల్స్‌లో రిషిక సుంకర-శ్వేతా రాణా జోడి 6-4, 6-0తో పాకిస్థాన్‌కు చెందిన సారా మన్సూర్-ఉష్నా సొహైల్ ద్వయంపై అలవోకగా గెలిచి ప్రి క్వార్టర్స్ చేరింది. హాకీ: మహిళల హాకీలో భారత జట్టు 1-2తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. చివరి నిమిషంలో గోల్‌తో చైనా గెలిచింది. వాలీబాల్: భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిలిమినరీ గ్రూప్ సి మ్యాచ్‌లో భారత్ 25-10, 25-19, 25-17తో మాల్దీవులపై నెగ్గింది. భారత మహిళల జట్టు 0-3తో థాయ్‌లాండ్ చేతిలో చిత్తయింది. బాస్కెట్‌బాల్: పురుషుల బాస్కెట్‌బాల్ ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్‌లో భారత జట్టు 41-76తో ఇరాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. సెపక్తక్రా: పురుషుల, మహిళల సెపక్‌తక్రాలో భారత జట్లు నిరాశ పరిచాయి. డిఫెండింగ్ చాంపియన్లు అయిన పురుషుల, మహిళల థాయిలాండ్ జట్లు 3-0తోనే భారత జట్లను చిత్తు చేశాయి. స్విమ్మింగ్: పురుషుల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే ఫైనల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. వెయిట్‌లిఫ్టింగ్: 85 కేజీల గ్రూప్ బి విభాగంలో వికాస్ ఠాకూర్ 7వ స్థానంలో నిలిచాడు. -
సూపర్ సౌరవ్
అంచనాలకు అనుగుణంగా రాణించిన స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన ఈ కోల్‌కతా కుర్రాడు ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్యంతో సరిపెట్టుకోగా... షూటింగ్లో భారత్‌కు మరో కాంస్యం లభించింది. ఇంచియాన్: ఆసియా క్రీడల మూడో రోజు భారత అథ్లెట్లు కాస్త నిరాశపర్చినా స్క్వాష్‌లో మాత్రం ఎన్నడూ లేని ఘనతను సాధించారు. గ్లాస్ కోర్టులో బెబ్బులిలా దూకుతూ ఆద్యంతం ఆకట్టుకున్న టాప్‌సీడ్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ ఫైనల్‌కు చేరి కొత్త చరిత్రను లిఖించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచాడు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత కుర్రాడు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆసియా క్రీడల్లో ప్రత్యర్థి రికార్డు (2002, 06లో స్వర్ణం, 2010లో కాంస్యం) బాగున్నా ఏమాత్రం తడబడలేదు. పీఎస్ఏ ప్రొఫెషనల్ టూర్లలో రెండు సార్లు తలపడిన ఇద్దరు చెరో మ్యాచ్‌లో గెలిచారు. కానీ జూన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బెంగ్ చేతిలో ఓడిన సౌరవ్ ఈ మ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు. సెమీస్‌లో దీపికకు నిరాశ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపికా పల్లికల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో ఆమె 4-11, 4-11, 5-11తో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఫేవరెట్‌గా దిగిన నికోల్ కేవలం 25 నిమిషాల్లోనే భారత క్రీడాకారిణి ఆట కట్టించింది. 1998 బ్యాంకాక్ గేమ్స్ నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు టైటిల్స్ గెలిచిన నికోల్ అద్భుతమైన ఫామ్‌ను కనబర్చింది. కనీసం పల్లికల్‌కు కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కాంస్య పతకం సాధించిన దీపికకు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ‘డ్రాలో జరిగిన అవకతవకలపై పోరాడుతా. క్వార్టర్స్‌లో జోష్నపై గెలవడం నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమెను ఎదుర్కోలేనని చాలా మంది భావించారు. అయితే డ్రాలో జరిగిన పొరపాటు వల్ల భారత్‌కు మరో పతకం చేజారింది. డ్రాపై మాట్లాడిన తర్వాత కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటి నుంచి గట్టెక్కడానికి నా ట్రెయినర్ బసు శంకర్, నా కాబోయే భర్త దినేశ్ కార్తీక్ చాలా సహాయం చేశారు.’ - దీపిక -
కాంస్యంతో సరిపెట్టుకున్న దీపిక
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత్ కు స్క్వాష్‌లో పతకం దక్కింది. మహిళ సింగిల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్య పతకం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో జరిగిన సెమీఫైనల్లో 4-11 4-11 5-11తో దీపికా ఓటమి పాలయి కాంస్యంతో సరిపెట్టుకుంది. 25 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింగిల్ పాయింట్ కూడా కోల్పోకుండానే దీపికను నికోల్ డేవిడ్ ఓడించింది. క్వార్టర్స్‌లో సహచరురాలు జోష్న చిన్నప్ప ఓడించి దీపిక సెమీస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత్ కు ఇదే తొలి స్క్వాష్ పతకం కావడం విశేషం. -
స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం
సెమీస్‌కు చేరిన దీపిక, సౌరవ్ ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా స్క్వాష్‌లో మహిళలు వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చిన్నప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో నెగ్గి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో దీపిక ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో తలపడనుంది. ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా నికోల్ ఓడింది లేదు. ఇక పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ 11-6, 9-11, 11-2, 11-9 తేడాతో పాక్ ఆటగాడు నాసిర్ ఇక్బాల్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు. ఇతర క్రీడల్లో ఫలితాలు: టెన్నిస్: పురుషుల టీమ్ ఈవెంట్ రెండో రౌండ్లో భారత్ 3-0 తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఫుట్‌బాల్: థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఫుట్‌బాల్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్లో భారత్ 0-10 తేడాతో చిత్తుగా ఓడింది. స్విమ్మింగ్: ఆదివారం మూడు ఈవెంట్లలో బరిలోకి దిగిన భారత స్విమ్మర్లు పూర్తిగా నిరాశపరిచారు. పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో ప్రతాపన్ నాయర్ ఏడో స్థానంలో నిలిచాడు. 200మీ. ఫ్రీస్టయిల్ హీట్‌లో సౌరభ్ సంగ్వేకర్ ఐదో స్థానం, 200మీ. బటర్‌ఫ్లయ్ హీట్‌లో ఏగ్నెల్ డిసౌజా నాలుగో స్థానం పొందారు. రోయింగ్: పురుషుల సింగిల్స్ స్కల్క్ హీట్‌లో సవర్ణ్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే లైట్‌వెయిట్ పురుషుల క్వాడ్రపల్ స్కల్స్ హీట్‌లో రాకేశ్, విక్రమ్, లక్ష్మీనారాయణ్, తోమర్ శోకేందర్ నాలుగో స్థానంలో నిలిచారు. హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘డి’లో కొరియా చేతిలో 19-39 తేడాతో ఓడిపోగా మహిళల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ 26-26 స్కోరుతో టై అయింది. జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్: పురుషుల వ్యక్తిగత అర్హత, టీమ్ ఫైనల్లో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది. ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్ వ్యక్తిగత ఇంటర్మీడియట్లో శ్రుతి వోరా 13వ స్థానంలో, నాదియా హరిదాస్ 19, రాజేంద్ర శుభశ్రీ 29, వనిత మల్హోత్రా 30వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు. సైక్లింగ్: మహిళల కీరిన్ ఫైనల్స్‌లో దెబోరా తొమ్మిదో స్థానంలో రాగా మోహన్ మహిత 11వ స్థానంలో నిలిచింది. బాస్కెట్ బాల్: పురుషుల క్వాలిఫయింగ్ రౌండ్లో భారత జట్టు 67-73 తేడాతో సౌదీ అరే బియాతో ఓడింది. -
స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!
ఇంచియాన్:ఇప్పటిదాకా ఆసియా గేమ్స్‌లో మహిళలు స్క్వాష్ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చినప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో విజయం సాధించిన దీపిక తన ఖాతాలో కాంస్య పతకం ఖాయం చేసుకుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశ పెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ విభాగంలో క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. అయితే హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరభ్ ఘోశల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు. భారత ఆటగాడు ఘోషల్ 11-6 9-11 11-2 11-9 పాకిస్తాన్ ఆటగాడు నజీర్ ఇక్బాల్ ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్నాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది. -
భారత్‌కు 14వ పసిడి పతకం.. దీపిక-జోత్స్న సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 14వ పసిడి పతకం దక్కింది. శనివారం స్వర్ణాల వేటలో భారత బాక్సర్లు నిరాశపరిచినా, స్క్వాష్ క్రీడాకారిణులు మెరిశారు. కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్లో భారత జోడీ దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నారు. ఫైనల్ పోరులో దీపికా-చిన్నప్ప జంట 11-6, 11-8తో ఇంగ్లండ్ ద్వయం డంకాఫ్, మసారోను ఓడించారు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచిన భారత జోడీ రెండో గేమ్ ఆరంభంలో వెనుకబడ్డారు. అయితే 1-5 స్కోరు వద్ద భారత క్రీడాకారిణులు విజృంభించి ముందంజ వేశారు. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుని భారత్‌కు 14వ బంగారు పతకం అందించారు. -
మహిళల డబుల్స్పైనే ఆశలు
స్క్వాష్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే సింగిల్స్‌లో ఏ ఒక్కరూ పతకం గెలుచుకోలేకపోగా శుక్రవారం జరిగిన రెండు మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనూ భారత జంటలు ఓటమిపాలయ్యాయి. తొలుత హరిందర్‌పాల్ సంధు-జోష్న చినప్ప జోడి క్వార్టర్స్‌లో 11-7, 8-11, 6-11తో న్యూజిలాండ్ జంట మార్టిన్ నైట్-జోలె కింగ్ చేతిలో ఓడింది. మరో మిక్స్డ్ క్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషల్-దీపికా పల్లికల్ జోడి 6-11, 9-11తో ఆస్ట్రేలియా ద్వయం పాల్మెర్-గ్రిన్హామ్ చేతిలో ఓటమిపాలైంది. భారత్ ఆశలన్నీ ఇక మహిళల డబుల్స్పైనే ఉన్నాయి. -
షూటింగ్లో గురి కుదిరినా..
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో ఐదో రోజు సోమవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షూటింగ్లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించినా.. బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లలో నిరాశ ఎదురైంది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కాంస్య పతకం కోసం జరిగిన మిక్స్డ్ టీమ్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో భారత్ 2-3తో సింగపూర్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు విజయం సాధించినా.. ఇతర షట్లర్లు నిరాశపరిచారు. ఇక స్క్వాష్‌లో పురుషుల సింగిల్స్ కాంస్య పతకం పోరులో భారత ఆటగాడు ఘోషల్ 1-3తో బార్కర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. టేబుల్ టెన్నిస్‌లోనూ పురుషుల టీమ్ కాంస్య పతకం పోరులో భారత్ ఓటమి చవిచూసింది. -
స్క్వాష్... ఆరోగ్యానికి భేష్
రాకెట్స్, బాల్స్... సింగిల్స్, డబుల్స్ అనగానే టెన్నిసే గుర్తుకొస్తుంది. కానీ...ఇది టెన్నిస్ కాదు. నెట్ ఉండదు... ఏస్లూ ఉండవు. కానీ... షాట్ల మోత మోగుతుంది. ఆట హోరాహోరీగా సాగుతుంది. అయినా... ఆటగాళ్లు మాత్రం ముఖాముఖీగా తలపడరు! ఇద్దరు ఒకే వైపు ఉండి, భిన్నంగా సాగే ఆటే స్క్వాష్. శరీరాన్ని బాగా కష్టపెట్టే ఆట. కేలరీల్ని కరిగించే ఆట ఇది. కాబట్టే ‘ఫోర్బ్స్’ పత్రిక దీన్ని ఆరోగ్యప్రదాయిని (నెంబర్‌వన్ హెల్దీయెస్ట్ గేమ్)గా పేర్కొంది. శరీర సత్తాకు ఇది కచ్చితంగా పరీక్ష పెడుతుంది. అందుకే అసాధారణ స్థాయిలో ఒంట్లో కేలరీలు ఖర్చవుతాయి. గుండెను భద్రంగా ఉంచడంలోనూ స్క్వాష్‌కు మించిన ఆటేదీ లేదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసింది. మరి అలాంటి ఆటను ఎలా ఆడతారో తెలుసుకుందామా... వార్ రూమ్ హోరు ఇండోర్ గేమ్ స్క్వాష్. ఇంకా చెప్పాలంటే ఒక గదిలో ఆడే ఆట ఇది. ఓ వైపు గోడ, దానికిరువైపులా అద్దాల ఫ్రేములుంటాయి. గోడకెదురుగా ఆటగాళ్ల ప్రవేశ ద్వారం. ఇది కూడా అద్దాలతో చేసిందే! స్క్వాష్ నిబంధనల ప్రకారం గోడపై మూడు లైన్లుంటాయి. కింద టిన్ లైన్ (బాటమ్ లైన్), పైన హై లైన్ (దీన్ని ఔట్ లైన్ అంటారు) ... ఈ రెండింటి మధ్య సర్వీస్ లైన్ ఉంటాయి. గోడ ముందు ఉండే ఫ్లోర్ (సర్ఫేస్) నుంచి గోడ లైన్లపై ఆడే విధంగా సరిగ్గా ప్రవేశ ద్వారం సమీపంలో రెండు క్వార్టర్లు ఉంటాయి. ఇక్కడ నుంచే స్క్వాష్ ‘సర్వీస్’ మొదలవుతుంది. పక్కపక్కనే ప్రత్యర్థులు టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇలా ఏ క్రీడ అయినా ప్రత్యర్థులు ముఖాముఖీగా తలపడతారు. కానీ స్క్వాష్‌లో మాత్రం ప్రత్యర్థులిద్దరు పక్కపక్కనే నిల్చొని ఆడతారు. సింగిల్స్‌లో మొదట చెరో క్వార్టర్‌పై ఒక్కొక్కరు ఉంటారు. ఆ తర్వాత ఒకరి క్వార్టర్లోకి మరొకరు బంతి గమనాన్ని బట్టి వెళ్లొచ్చు. బంతిని లిఫ్ట్ చేయొచ్చు. ముందుగా క్రీడాకారులు తమ సర్వీస్‌ను సర్వీస్లైన్పైనే ఆడాలి. ఒకరు కొట్టిన సర్వీస్‌ను లేదంటే షాట్‌ను ఆ బంతి ల్యాండ్ అయిన ఒక బౌన్స్కే మరొకరు తిరిగి గోడకు కొట్టాలి. రెండు బౌన్స్‌లు పడేదాకా చూస్తే పాయింట్ గల్లంతే. గోడకు ముందున్న ఫ్లోర్ మొత్తాన్ని ఆటగాళ్లిద్దరూ ఉపయోగించుకోవచ్చు. ఒకరు కొట్టిన బంతిని మరొకరు కొట్టేందుకు పరస్పరం సహకరించుకోవాలి. అనుమానాస్పదంగా అవతలి ఆటగాడిని నిరోధించేలా ప్లేస్మెంట్ చేయడం, అడ్డంగా నిల్చోవడం లేదంటే ఆడనివ్వకుండా కదలడం రిఫరీలు గుర్తిస్తే పెనాల్టీ తప్పదు. పాయింట్ల కోతా తప్పదు. స్క్వాష్ విశేషాలు స్క్వాష్ పురాతనమైన ఆట. 1830లో లండన్‌లోని ఓ స్కూల్లో ఈ ఆటకు అంకురార్పణ జరిగింది. తదనంతరం అన్ని స్కూళ్లకు విస్తరించి క్రమంగా 19వ శతాబ్దంలో పాపులర్ క్రీడ అయింది. జల సమాధి అయిన సుప్రసిద్ధ ‘టైటానిక్’ షిప్‌లోనూ స్క్వాష్ కోర్టులు ఉండేవట. ఫ్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ఆధ్వర్యంలో పురుషుల ఈవెంట్, వుమన్ స్క్వాష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల టూర్ ఈవెంట్లు జరుగుతాయి. అంతర్జాతీయ స్క్వాష్ సమాఖ్య వీటిని పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 49,908 స్క్వాష్ కోర్టులున్నట్లు స్క్వాష్ సమాఖ్య వెల్లడించింది. అత్యధిక కోర్టులు ఇంగ్లండ్ (8500)లో ఉన్నాయి. స్క్వాష్ ఆటకు ప్రత్యేకమైన రబ్బరు బంతుల్ని వినియోగిస్తారు. వీటి చుట్టుకొలత 39.5 మి.మీ. నుంచి 40.5 మిల్లిమీటర్లు. ఈ బంతులు 23 గ్రా. నుంచి 25 గ్రాముల బరువుంటాయి. స్క్వాష్ సమాఖ్య సూచించిన ప్రమాణాల మేరకు రాకెట్లు ఉండాలి. మొత్తం బరువు 255 గ్రాములకు మించరాదు. సాధారణంగా క్రీడాకారులు 150 గ్రా. బరువు గల రాకెట్లనే వాడతారు. రోజూ ఓ గంట ఆడితే రికార్డు స్థాయిలో 3000 కేలరీలు ఖర్చవుతాయట. -
గుమ్మడిలా.. బొప్పాయి ఇలా..
ఇది గుమ్మడి కాయ అనుకుంటున్నారా.. కాదు. ఇది బొప్పాయి. కానీ గుమ్మడి కాయ ఆకారంలో ఉంది. చెట్టుకు ఉన్నప్పుడు చూస్తేనే ఇది బొప్పాయి కాయ అని గుర్తు పట్టగలం. చెట్టు నుంచి కోస్తే మాత్రం అచ్చం గుమ్మడి కాయలా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో కొప్పినీడి రాజబాబు ఇంటి పెరట్లోని చెట్టుకు అచ్చం గుమ్మడి కాయల్ని పోలిన బొప్పారుులు కాస్తున్నారుు. ఏటా 50 వరకూ ఇదే తరహాలో కాయలు కాస్తున్నాయని రాజబాబు చెప్పారు.