‘ఆరోజు నాతో పాటు మలేషియా టోర్నమెంట్‌కి కార్తిక్ కూడా వచ్చాడు. క్రికెటర్ కదా అందుకే మమ్మల్ని తీసుకువెళ్లడానికి బస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ అలా జరగకపోవడంతో ఏంటి ఇంకా బస్సు రాదేం అని అమాయకంగా నన్ను అడిగాడు. అప్పుడు తనకి అర్థమైంది స్వ్కాష్ క్రీడాకారుల కష్టమేంటో. ఇక అప్పటి నుంచి నా పట్ల తనకింకా గౌరవం పెరిగింది అంటూ భర్త దినేశ్ కార్తిక్ గురించి చెప్పుకొచ్చారు స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్.
మిస్ ఫీల్డ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం వివాహ బంధంతో కార్తిక్ తన జీవితంలో అడుగుపెట్టాడని.. ప్రేమను కురిపించడంతో పాటుగా తననెంతో గౌరవిస్తాడని పేర్కొన్నారు. అయితే మలేషియా టోర్నమెంట్ సమయంలో మాత్రం తన అమాయకత్వాన్ని చూస్తే నవ్వొంచిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారత్‌లో చాలా మందికి క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే గుర్తొస్తొందనీ, వేరే క్రీడలకు ఇక్కడ అంతగా ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు. క్రికెటర్లకు ఉన్నన్ని సౌకర్యాలు ఇతర క్రీడాకారులకు ఉండవని, ఈ విషయం తెలిసిన తర్వాత డీకే తనను చూసి మరింతగా గర్వపడటం మొదలుపెట్టాడని వ్యాఖ్యానించారు.
కాగా పీఎస్‌ఏ ర్యాంకింగ్స్‌లో టాప్- 10లో చోటు దక్కించుకున్న మొదటి మహిళా స్క్వాష్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన దీపికా 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ వుమన్స్ డబుల్స్ కేటగిరీలో భారత్‌కు స్వర్ణాన్ని అందించారు. తాజాగా జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని అందించిన స్క్వాష్ మహిళల జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment