టీమిండియా వెటరన్ క్రికెటర్.. ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు దినేశ్ కార్తిక్ ఇవాళ(జూన్ 1న) 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాలోకి(2004) చాలాకాలం క్రితమే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంఎస్ ధోని హయాంలో కార్తిక్ ఆడడం అతని దురదృష్టం అని చెప్పొచ్చు. దాదాపు ధోని, దినేశ్ కార్తిక్‌లు టీమిండియాలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా అసమాన రీతిలో వెలిగిపోయిన ధోనికి వెనకాల కార్తిక్ చీకటిలో మిగిలిపోయాడు.
మధ్య మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి పెద్దగా రాణించలేకపోయాడు. అలా అని కార్తిక్ ఆటతీరును తీసిపారేయల్సినంతగా ఎప్పుడు అనిపించలేదు. ధోని నీడలోనే ఎక్కువకాలం ఆడిన దినేశ్ కార్తిక్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది మాత్రం 2018 నిదహాస్ ట్రోపీ. ట్రై సిరీస్ ఫార్మాట్‌లో జరిగిన టోర్నీకి రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని దూరంగా ఉన్నాడు. దీంతో కార్తిక్‌కు తుది జట్టులో అవకాశం వచ్చింది.
కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన టీమిండియాను తన నాకౌట్ ఇన్నింగ్స్‌తో గెలిపించడమే గాక టైటిల్ అందించాడు. 2 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో కార్తిక్ 8 బంతుల్లోనే 29 పరుగులు బాదాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ భారీ సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్ల కలను నెరవేరకుండా చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 2004లో అరంగేట్రం చేసిన దినేశ్ కార్తిక్ టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 38 టి20లు ఆడాడు.
ఇటీవలే ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున సూపర్ ఫినిషర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో దినేశ్ కార్తిక్ 16 మ్యాచ్‌లాడి 330 పరుగులు సాధించాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరున వచ్చిన కార్తిక్ ఎవరు ఊహించని రీతిలో సూపర్ ఫినిషర్‌గా మారాడు. 37 ఏళ్ల వయసులోనూ అదరగొట్టే స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన కార్తిక్‌ను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది. ఇక జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికైన కార్తిక్ రాణించాలని కోరుకుంటూ.. ''హ్యాపీ బర్త్‌డే దినేశ్ కార్తిక్''
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు
క్రికెట్ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలోనూ అదే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒక ఫెయిల్యూర్ మ్యారేజ్ నుంచి సక్సెస్‌ఫుల్ లవ్‌స్టోరీ వరకు కార్తిక్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. 2007లో నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో కార్తిక్ బంధం కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. మరో టీమిండియా మాసీ క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖితాకు ఉన్న లవ్ అఫైర్ కార్తిక్‌ను డైవర్స్ తీసుకునేలా చేసింది. 2012లో నికితా నుంచి విడాకులు తీసుకున్న కార్తిక్ జీవితంలోకి భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎంట్రీ ఇచ్చింది.
2013లో వీరిద్దరి మధ్య ఆసక్తికర రీతిలో ప్రేమ చిగురించింది. ఆ సంవత్సరం స్క్వాష్ క్రీడలో మరింత పదును పెంచుకునేందుకు దీపికా పల్లికల్ ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు వచ్చింది. అదే సమయంలో దినేశ్ కార్తిక్ కూడా టీమిండియాతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడేందుకు లీడ్స్‌కు వచ్చాడు. అక్కడ తొలిసారి దీపికను చూసిన కార్తిక్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమెపై ఇష్టంతో ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి స్క్వాష్ గేమ్ ఆడేవాడు.
అలా ప్రేమ బంధంలో మునిగిపోయిన ఈ జంట 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవలే దినేశ్ కార్తిక్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలకు తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా కబీర్ పల్లికల్ కార్తిక్, జియాన్ పల్లికల్ కార్తిక్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం కార్తిక్, దీపికా పల్లికల్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
చదవండి: Dinesh Karthik: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment