మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్లో భారత జోడీ దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 14వ పసిడి పతకం దక్కింది. శనివారం స్వర్ణాల వేటలో భారత బాక్సర్లు నిరాశపరిచినా, స్క్వాష్ క్రీడాకారిణులు మెరిశారు. కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు.
మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్లో భారత జోడీ దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నారు. ఫైనల్ పోరులో దీపికా-చిన్నప్ప జంట 11-6, 11-8తో ఇంగ్లండ్ ద్వయం డంకాఫ్, మసారోను ఓడించారు. తొలి గేమ్లో సునాయాసంగా గెలిచిన భారత జోడీ రెండో గేమ్ ఆరంభంలో వెనుకబడ్డారు. అయితే 1-5 స్కోరు వద్ద భారత క్రీడాకారిణులు విజృంభించి ముందంజ వేశారు. వరుస గేమ్ల్లో మ్యాచ్ను సొంతం చేసుకుని భారత్కు 14వ బంగారు పతకం అందించారు.