Commonwealth Games-2014
-
కామన్వెల్త్ విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులందరినీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి అభినందించారు. ఈ క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన రాజ్ సింగ్‌కు పంపిన సందేశంలో ప్రణబ్ పతక విజేతల ప్రదర్శనను కొనియాడారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న వారికి, పతకాలు గెలిచిన వారికి నా హృదయపూర్వక అభినందనలు. పోటీల సందర్భంగా భారత క్రీడాకారులు కనబరిచిన ధృడ సంకల్పం వారి విజయాలకు దోహదం చేసింది’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన గర్వపడేలా చేసింది. పతక విజేతలందరికీ నా అభినందనలు’ అని ప్రధాని నరేంద్ర మోడి ట్వీట్ చేశారు. -
దేశం పరువు తీసిన వీరేంద్రపై వేటు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత క్రీడాకారుల బృందంతో కలసి స్కాట్లాండ్ వెల్లిన రెజ్లింగ్ రెఫరీ వీరేంద్ర మాలిక్‌పై వేటుపడింది. స్కాట్లాండ్లో లైంగిక వేధింపులకు పాల్పడి వీరేంద్ర మాలిక్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దేశం పరువు తీసిన మాలిక్‌పై రెజ్లింగ్ సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. స్కాట్లాండ్ పోలీసుల కస్టడీలో ఉన్న మాలిక్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కాట్లాండ్లోనే దాడి కేసులో భారత్ ఒలింపిక్ సంఘం సీనియర్ అధికారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్
-
కశ్యప్ ‘కనకం’ మోగించె...
గురువుతో కానిది శిష్యుడు సాధ్యం చేసి చూపించాడు. 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. సత్తా ఉన్నా... గొప్ప విజయాలు సాధించడం లేదని తనపై ఉన్న అపప్రథను తొలగించుకున్నాడు. గ్లాస్గో వేదికపై తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ మెరిశాడు. అంతిమ సమరంలో ఆధిక్యం దోబూచులాడినా... సంయమనం కోల్పోకుండా... సావధాన ఆటతీరుతో తన రాకెట్ ప్రతాపాన్ని చూపించాడు. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో ‘కంచు’తో సరిపెట్టుకున్న కశ్యప్ ఈసారి ‘కనకం’ మోగించాడు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పసిడి ముగింపు ఇవ్వడమే కాకుండా ప్రకాశ్ పదుకొనే, సయ్యద్ మోడిలాంటి దిగ్గజాల సరసన చేరాడు. మరోవైపు మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి రజతంతో సంతృప్తి పడగా... సింగిల్స్‌లో సింధు, గురుసాయిదత్ నెగ్గిన కాంస్యాలతో భారత్ ఈసారీ తమ ఖాతాలో నాలుగు పతకాలు జమ చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం ►32 ఏళ్ల తర్వాత ఈ ఘనత ►మహిళల డబుల్స్‌లో జ్వాల జోడికి రజతం గ్లాస్గో: అంచనాలను నిజం చేస్తూ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 2010 న్యూఢిల్లీ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన కశ్యప్ ఈసారి స్వర్ణ పతకాన్ని సాధించడం విశేషం. ప్రకాశ్ పదుకొనే (1978), సయ్యద్ మోడి (1982)ల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన మూడో ప్లేయర్‌గా 27 ఏళ్ల ఈ హైదరాబాదీ ఘనత సాధించాడు. కశ్యప్ గురువు పుల్లెల గోపీచంద్ 1998 కౌలాలంపూర్ గేమ్స్‌లో కాంస్యం సాధించగా... పసిడి పతకం నెగ్గి కశ్యప్ తన కోచ్ కలను నిజం చేశాడు. నిలకడగా ఆడి... ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) గైర్హాజరీలో... ఈ క్రీడల్లో టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన కశ్యప్ అంతిమ సమరంలో ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. పదునైన స్మాష్‌లు, నెట్‌వద్ద అప్రమత్తత, కోర్టుకిరువైపులా చురుకైన కదలికలతో నిలకడగా పాయింట్లు నెగ్గిన కశ్యప్ కేవలం 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తడబాటుకు లోనై... తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన కశ్యప్ రెండో గేమ్‌లో మాత్రం తడబాటుకు లోనయ్యాడు. కశ్యప్ లోపాలను పసిగట్టిన వోంగ్ పక్కా వ్యూహంతో ఈ గేమ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అనవసర తప్పిదాలతో కశ్యప్ కూడా తన ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకోవడంతో రెండో గేమ్‌ను వోంగ్ 17 నిమిషాల్లో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. కీలకదశలో పైచేయి... నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు పోరాడారు. ఒకదశలో కశ్యప్ 8-11తో వెనుకబడినా ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడుతూ స్కోరును 14-14తో సమం చేయగలిగాడు. ఆ తర్వాత షటిల్‌ను సరిగ్గా అంచనా వేస్తూ కీలకదశలో పాయింట్లు నెగ్గుతూ కశ్యప్ 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే వోంగ్ మరో మూడు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేశాడు. కానీ ఉత్కంఠభరిత క్షణాల్లో కశ్యప్ సంయమనంతో ఆడి వరుసగా రెండు పాయింట్లు సంపాదించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేశాడు. జ్వాల జోడికి నిరాశ నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం అదే ఫలితాన్ని గ్లాస్గోలో పునరావృతం చేయలేకపోయింది. ఫైనల్లో జ్వాల-అశ్విని జంట 17-21, 21-23తో వివియన్ కా మున్ వూ-ఖె వూ వూన్ (మలేసియా) జోడి చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లో జ్వాల జోడికి ఐదు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్, మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు కాంస్య పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌కు నాలుగు పతకాలు వచ్చాయి. రూ. 25 లక్షల నజరానా కశ్యప్‌కు రూ. 25 లక్షలు, గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్పలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, కాంస్య పతక విజేతలు పి.వి.సింధు, గురుసాయిదత్‌లకు రూ. 5 లక్షల చొప్పున... క్వార్టర్స్‌లో ఓడిన కె.శ్రీకాంత్, పి.సి.తులసిలకు లక్ష రూపాయల చొప్పున అందజేయనున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. హెచ్‌డీబీఏ ‘లగ్జరీ కారు’... హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) తరఫున కశ్యప్‌నకు లగ్జరీ కారును బహుమతిగా అందించనున్నట్లు హెచ్‌డీబీఏ అధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. అభినందనల వెల్లువ... కశ్యప్‌ను ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు కోరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా కశ్యప్‌కు అభినందనలు తెలిపారు. నా కల నిజమైంది దేశం తరఫున స్వర్ణం గెలవాలని నా చిన్నప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు ఆ కల నెరవేరింది. ఇంత పెద్ద మ్యాచ్‌లో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీకి వచ్చేటప్పుడు పసిడి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా శక్తి మేరకు ఆడలేదనే అనుకుంటున్నా. అయినా పతకం సాధించా. ఈ విజయం నాకు చాలా ముఖ్యం. చాలా అవసరం కూడా. పతకం గెలవడం ద్వారా నాపై ఉన్న అంచనాలను అందుకున్నా. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద టోర్నీలు, చాంపియన్‌షిప్‌లు సాధించాలని కోరుకుంటున్నా. - కశ్యప్ ‘మావాడి కష్టం ఫలించింది’ ‘కశ్యప్‌ది చాలా కష్టపడే తత్వం. భారీ విజయాలు రాకపోయినా ఇన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాడు. ఆరంభంలో చాలా బాగా ఆడటం, టోర్నీ సెమీస్‌లోనో, ఫైనల్లోనో బలమైన ప్రత్యర్థితో పోరాడి ఓడటం చాలాసార్లు జరిగింది. విజయం అంచుల దాకా వచ్చి దురదృష్టవశాత్తూ గెలవలేకపోవడం ఎన్నో పెద్ద ఈవెంట్లలో జరిగింది. ఈసారి మాత్రం వాడి శ్రమకు తగిన ఫలితం లభించింది. అందుకే కామన్వెల్త్ స్వర్ణంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఢిల్లీలో కూడా చాలా కొద్దితేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా బంగారు పతకమే దక్కింది. ఇంకా చెప్పాలంటే అతనిలో ప్రతిభ, టెక్నిక్కు లోటు లేదు. కానీ ఫలితమే కాస్త ఆలస్యమైంది. వాడికి ‘ఆస్థమా’ సమస్య ఉన్నా కేవలం ఆటపై అంకితభావంతోనే దానిని అధిగమించాడు. చాలా రోజుల తర్వాత మా కుటుంబంలో ఈ విజయం ఆనందం పంచింది.’ - ఉదయశంకర్, సుభద్ర (కశ్యప్ తల్లిదండ్రులు) -
బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన తెలుగుతేజం
-
హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు నిరాశపరిచింది. కామన్వెల్త్ 2014 లో భాగంగా ఇక్కడ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఘోరంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. డిఫెండింగ్ చాంప్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై భారత్ ఏమాత్రం పోరాటపటిమ ప్రదర్శించకుండా 4-0 తేడాతో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచింది. గత మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆకట్టుకున్న భారత హాకీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాను నిలువరించడంలో విఫలమై టోర్నీలో రజతంతో తృప్తి చెందారు. వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ ఫైనల్స్‌కు చేరిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించినా.. తుది మెట్టును అధిగమించడంలో పూర్తి వైఫల్యం చెందింది. -
బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన కశ్యప్
గ్లాస్కో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ , తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19 తేడాతో డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్నకశ్యప్ బ్యాడ్మింటన్ విభాగంలో తొలి పసిడిని అందించి భారత కీర్తిని రెపరెపలాడించాడు. ఈ పోటీలో తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న కశ్యప్.. రెండో సెట్ లో దారుణంగా విఫలమైయ్యాడు. అనంతరం నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో కశ్యప్ దూకుడగా ఆడి వాంగ్ ను మట్టికరిపించాడు. ఈ తాజా పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 15 కు చేరింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 21-17, 21-18తో ప్రపంచ 26వ ర్యాంకర్ రాజీవ్ ఊసెప్ (ఇంగ్లండ్)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. -
గ్లాస్గో : ఐదో స్థానంలో భారత్
-
టీటీలో శరత్ జోడీకి రజతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్-ఆంథోని అమల్ రాజ్ జోడి రజత పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్-ఆంథోని జంట 11-8, 7-11, 9-11, 5-11తో సింగపూర్‌కు చెందిన యాంగ్ జి-ఝాన్ జియాన్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో... శరత్ కమల్ 6-11, 8-11, 11-4, 9-11, 11-6, 10-12తో పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) చేతిలో పోరాడి ఓడాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ స్వర్ణంతో సహా మొత్తం ఐదు పతకాలు సాధించిన భారత్ ఈసారి ఆ జోరు చూపలేకపోయింది. కేవలం ఒక పతకంతో సరిపెట్టుకుంది. -
వరుసగా రెండోసారి...
కామన్వెల్త్ గేమ్స్ హాకీ ఫైనల్లో భారత్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆట ప్రారంభమైన 18 నిమిషాల్లోనే ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఆడి మ్యాచ్‌ను దక్కించుకుంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 3-2తో నెగ్గిన భారత్ తుది పోరుకు అర ్హత సాధించింది. దీంతో వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ ఫైనల్స్‌కు చేరిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అటు డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌కు చేరింది. రూపిందర్ సింగ్ పాల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ భారత్ తరఫున గోల్స్ చే శారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో కివీస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి 2వ నిమిషంలోనే సైమన్ చిల్డ్ గోల్ ద్వారా ఖాతా తెరిచింది. 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని 2-0 ఆధిక్యం సాధించింది. అయితే 27వ నిమిషంలో డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ కొట్టిన షాట్‌ను నెట్ దగ్గర ప్రత్యర్థి ఆటగాడు ఛాతీతో ఆపడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ అవకాశం దక్కింది. దీన్ని రూపిందర్ గోల్‌గా మలిచి 1-2తో ఆధిక్యాన్ని తగ్గించాడు. ద్వితీయార్ధంలో భారత్ దూకుడు పెంచింది. 42వ నిమిషంలో మన్‌ప్రీత్ సింగ్ ఇచ్చిన యాంగ్యులర్ పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇదే జోరులో ఆడిన భారత్‌కు 47వ నిమిషంలో 3-2 ఆధిక్యం లభించింది. ఎస్వీ సునీల్ పాస్‌ను ఆకాశ్‌దీప్ రివర్స్ ఫ్లిక్ ద్వారా నెట్లోకి పంపి భారత శిబిరంలో ఆనందం నింపాడు. చివర్లో మ్యాచ్ హోరాహోరీగా జరిగినా భారత్ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. -
11 నెలల తర్వాత...
గ్లాస్గో: దాదాపు 11 నెలల తర్వాత ట్రాక్‌లో అడుగుపెట్టిన స్ప్రింట్ స్టార్ ఉసేన్ బోల్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆకట్టుకున్నాడు. 4 x100 మీటర్ల రిలేలో జమైకా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హీట్స్‌లో తొలి 100 మీటర్ల పరుగును ప్రారంభించిన రోచ్ మధ్యలో నొప్పితో వెనుకబడినా... చివరి 100మీ. పరుగులో బోల్ట్ దుమ్మురేపాడు. అందరికంటే ముందున్న నైజీరియా అథ్లెట్ మార్క్ జెల్క్స్ను వెనక్కి నెడుతూ అలవోకగా లక్ష్యాన్ని అందుకున్నాడు. దీంతో జమైకా జట్టు 38.99 సెకన్లలో రేసును ముగించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈవెంట్‌కు మూడు రోజుల ముందు కామన్వెల్త్ గేమ్స్‌ను ‘షిట్’ అంటూ వ్యాఖ్యానించిన బోల్ట్... రేసు తర్వాత గ్లాస్గోపై ప్రశంసలు కురిపించాడు. అద్భుతం.. అమోఘం అంటూ... లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నంత ఆనందంగా ఉందని కితాబిచ్చాడు. రోచ్ నొప్పి గురించి మాట్లాడుతూ... ‘బాధలో కూడా ఎలా పరుగెత్తాలో మా కోచ్ నేర్పించాడు. అందుకే మేం ప్రపంచ చాంపియన్లుగా ఉన్నాం’ అని బోల్ట్ అన్నాడు. -
అడుగు దూరంలో...
ఫైనల్లో కశ్యప్ జ్వాల జోడి కూడా సింధుకు కాంస్యం గ్లాస్గో: భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్... కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 21-17, 21-18తో ప్రపంచ 26వ ర్యాంకర్ రాజీవ్ ఊసెప్ (ఇంగ్లండ్)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 83 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకున్నారు. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత కుర్రాడు తర్వాతి రెండు గేమ్‌ల్లో పోరాట పటిమను ప్రదర్శించాడు. 34 నిమిషాల పాటు జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 71 స్ట్రోక్స్ నమోదయ్యాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కశ్యప్... డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలిస్తే 32 ఏళ్ల తర్వాత పురుషుల విభాగంలో స్వర్ణం గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. మహిళల డబుల్స్ సెమీస్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 21-7, 21-12తో లా పి జింగ్-లూ యిన్ లిమ్ (మలేసియా)ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించారు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 27 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట కట్టించారు. ప్రత్యర్థుల సర్వీస్‌లో 16 పాయింట్లు రాబట్టిన భారత ద్వయం... తమ సర్వీస్‌లో 26 పాయింట్లు నెగ్గారు. సుదీర్ఘ ర్యాలీలతో పాటు షార్ట్ వ్యాలీలతో ఆకట్టుకున్నారు. సింధు, గురు సాయిదత్లకు కాంస్యాలు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడిన హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు కాంస్యం గెలుచుకుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 23-21, 21-9తో జింగ్ యీ టీ (మలేసియా)పై నెగ్గింది. 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు గట్టిపోటీ ఎదురైంది. సింగిల్ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడటంతో ఓ దశలో 19-19, 20-20, 21-21తో సమమైంది. అయితే రెండు బలమైన క్రాస్ షాట్లతో సింధు గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో జింగ్ నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో 11-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో హైదరాబాదీ 6 పాయింట్లు చేజార్చుకున్నా.. మళ్లీ పుంజుకుని వరుస పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో సింధు 20-22, 20-22తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల కాంస్య పతక పోరులో ఆర్.ఎం.వి.గురుసాయిదత్ 21-15, 14-21, 21-19తో రాజీవ్ ఊసెఫ్ (ఇంగ్లండ్)పై నెగ్గాడు. రెండో గేమ్ కోల్పోయిన భారత ప్లేయర్ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గట్టిగా పోరాడాడు. ఆరంభంలో 7-8తో వెనుకబడ్డా పుంజుకుని 11-11తో సమం చేశాడు. ఆ తర్వాత నాలుగు పాయింట్లు నెగ్గి 16-12 స్కోరుతో నిలిచాడు. తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. -
పసిడి లేని ‘పంచ్’
బాక్సింగ్‌లో నాలుగు రజతాలు అన్ని ఫైనల్స్‌లోనూ భారత బాక్సర్ల ఓటమి 1998 తర్వాత స్వర్ణం లేకపోవడం ఇదే తొలిసారి గ్లాస్గో: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్లు పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన నలుగురూ రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. పురుషుల విభాగంలో లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు)... మహిళల విభాగంలో లైష్రామ్ సరిత దేవి (60 కేజీలు) టైటిల్ పోరులో ఓడిపోయి రజత పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల సెమీఫైనల్లో ఓడిన పింకీ రాణికి కాంస్యం లభించిన సంగతి తెలిసిందే. మొత్తానికి 1998 కౌలాలంపూర్ గేమ్స్ తర్వాత తొలిసారి భారత బాక్సర్లు ‘పసిడి పతకం’ లేకుండా స్వదేశానికి తిరిగి రానున్నారు. 2002, 2006, 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు కనీసం ఒక స్వర్ణమైనా గెలిచారు. ఫైనల్స్‌లో దేవేంద్రో 0-3 (28-29, 27-30, 28-29)తో డిఫెండింగ్ చాంపియన్ ప్యాడి బార్నెస్ (నార్తర్న్ ఐర్లాండ్) చేతిలో; సరిత దేవి 0-3 (37-39, 37-39, 37-39)తో షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా) చేతిలో; మన్దీప్ 0-3 (27-30, 27-29, 26-30)తో స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ (ఇంగ్లండ్) చేతిలో; విజేందర్ 0-3 (27-29, 28-29, 28-29)తో ఆంటోనీ ఫౌలెర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన మన్దీప్ ఫైనల్లో తేలిపోయాడు. ఫిట్జ్‌గెరాల్డ్ పంచ్‌ల ధాటికి ఈ హర్యానా బాక్సర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. రెండో రౌండ్లోనైతే ఇంగ్లండ్ బాక్సర్ సంధించిన పంచ్‌కు మన్దీప్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత తేరుకున్నా ఆత్మరక్షణకే ప్రాధాన్యమిచ్చి ఓటమిని ఖాయం చేసుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు నెగ్గిన బార్నెస్ అనుభవం ముందు దేవేంద్రో పోరాటపటిమ అతనికి స్వర్ణాన్ని అందించలేకపోయింది. తొలి, చివరి రౌండ్లలో కేవలం పాయింట్ తేడాతో వెనుకబడిన దేవేంద్రో రెండో రౌండ్లో మాత్రం బార్నెస్ ధాటికి జవాబివ్వలేకపోయాడు. షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన ఫైనల్లో సరిత రెండు నిమిషాల వ్యవధిగల నిర్ణీత నాలుగు రౌండ్లలో తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం కనబరిచింది. అయితే చివరి రెండు రౌండ్లలో షెల్లీ వాట్స్ దూకుడు ముందు సరిత ఎదురునిలువడంలో విఫలమైంది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన ఆస్ట్రేలియా తొలి మహిళా బాక్సర్‌గా షెల్లీ వాట్స్ గుర్తింపు పొందింది. -
భారత్‌కు 14వ పసిడి పతకం.. దీపిక-జోత్స్న సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 14వ పసిడి పతకం దక్కింది. శనివారం స్వర్ణాల వేటలో భారత బాక్సర్లు నిరాశపరిచినా, స్క్వాష్ క్రీడాకారిణులు మెరిశారు. కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్లో భారత జోడీ దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నారు. ఫైనల్ పోరులో దీపికా-చిన్నప్ప జంట 11-6, 11-8తో ఇంగ్లండ్ ద్వయం డంకాఫ్, మసారోను ఓడించారు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచిన భారత జోడీ రెండో గేమ్ ఆరంభంలో వెనుకబడ్డారు. అయితే 1-5 స్కోరు వద్ద భారత క్రీడాకారిణులు విజృంభించి ముందంజ వేశారు. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుని భారత్‌కు 14వ బంగారు పతకం అందించారు. -
బాక్సింగ్‌లో భారత్‌కు రెండు రజతాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడంలో మరోసారి నిరాశపరిచారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో మణిపూర్ బాక్సర్లు సరితా దేవి, దేవేంద్రో సింగ్ ఓటమి చవిచూసి రజత పతకాలక పరిమితమయ్యారు. మహిళల 57-60 కిలోల విభాగంలో సరితా దేవి 1-3 తో ఆస్ట్రేలియా బాక్సర్ షెల్లీ వాట్స్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో దేవేంద్రో 1-2తో ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ పాడీ బార్నెస్ చేతిలో ఓడాడు. దీంతో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఇదే రోజు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఫైనల్ బౌట్ జరగనుంది. -
హాకీలో అదరగొట్టిన అబ్బాయిలు..
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత్ 3-2తె న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు సిమోన్, నిక్ హేగ్ చెరో గోల్ చేసి జట్టుకు 2-0 ఆధిక్యం అందించారు. అయితే ఆ తర్వాత భారత్ పుంజుకుని న్యూజిలాండ్ జోరుకు అడ్డుకట్ట వేసింది. ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ తలా గోల్ చేసి భారత్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. మరోవైపు భారత్ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో భారత్ సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ ఆస్త్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. భారత పవర్‌లిఫ్టర్ సకీనా ఖటన్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల లైట్‌వెయిట్ (61 కిలోల వరకు) కేటిగిరిలో సకీనా మొత్తం 88.2 కిలోల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నైజీరియా లిఫ్టర్ ఈస్తర్ ఒయెబా (136 కిలోలు), ఇంగ్లండ్ లిఫ్టర్ నటాలీ బ్లాక్ (100.2 కిలోలు) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. -
సింధు సె'మిస్'.. కశ్యప్‌కు పతకం ఖాయం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్ ఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకోగా, పీవీ సింధుకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-17, 21-18 స్కోరుతో ఇంగ్లండ్ షట్లర్ రాజీవ్ ఓసెఫ్పై పోరాడి గెలిచాడు. గంటా 23 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ మూడు గేమ్‌లలో మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్ బెర్తు దక్కించుకున్నాడు. కాగా మహిళల సింగిల్స్ సెమీస్‌లో యువ సంచలనం సింధు 20-22, 20-22 స్కోరుతో కెనడా షట్లర్ లీ చేతిలో పోరాడి ఓడింది. 54 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో సింధు తలపడనుంది. -
లాన్ బౌల్స్‌లో చేజారిన కాంస్యం
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాన్‌బౌల్స్‌లో తొలిసారి పతకం సాధించే సువర్ణావకాశం కొద్దిలో భారత్ చేజారింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నలుగురు సభ్యుల పురుషుల కాంస్య పతక పోరులో భారత్ 14-15తో ఓటమిపాలైంది. కమల్‌కుమార్ శర్మ, చందన్కుమార్సింగ్, సమిత్ మల్హోత్రా, దినేశ్కుమార్లతో కూడిన భారతజట్టు ఎనిమిదో ఎండ్ ముగిసేటప్పటికి 11-5తో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి ఎండ్‌లో ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను, కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. -
సర్దార్‌పై సస్పెన్షన్
న్యూజిలాండ్‌తో సెమీస్‌కు దూరం గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ప్రమాదకరమైన ఆటతీరును కనబర్చినందుకు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఒక్క మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. దీంతో శనివారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రమాదకరమైన ఆటతీరుతో ఎల్లోకార్డుకు గురైన సర్దార్... దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ దాన్ని పునరావృతం చేశాడు. దీంతో నిర్వాహకులు రెండు మ్యాచ్‌ల పాటు సస్పెన్షన్ విధించారు. అయితే భారత మేనేజ్మెంట్ దీనిపై జ్యూరీకి అప్పీలు చేయడంతో శిక్షను ఒక్క మ్యాచ్‌కు పరిమితం చేశారు. భారత మహిళలకు ఐదో స్థానం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. శుక్రవారం 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-1తో స్కాట్లాండ్పై విజయం సాధించింది. అనుపా బార్లా (53వ ని.), పూనమ్ రాణి (55వ ని.) టీమిండియా తరఫున ఫీల్డ్ గోల్స్ చేయగా, నిక్కి కిడ్ (57వ ని.) పెనాల్టీ కార్నర్‌తో స్కాట్లాండ్కు ఏకైక గోల్ అందించింది. -
స్వర్ణం గురించే ఆలోచించాను...
గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో సంతృప్తి పడిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... స్కాట్లాండ్లో మాత్రం అనుకున్నది సాధించాడు. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ... కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన రెండో అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ డిస్క్‌ను 63.64 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం నెగ్గిన సంగతి విదితమే. 1958 కార్డిఫ్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచాక... ఈ క్రీడల్లో భారత అథ్లెట్‌కు బంగారు పతకం రావడం ఇదే ప్రథమం. ‘ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాలనే ఏకైక ఆలోచన గత ఏడెనిమిది నెలలుగా నా మదిలో మెదులుతోంది. పసిడి నెగ్గడం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇక కొన్ని రోజులు సేదతీరుతాను. నాకిష్టమైన భోజనం చేస్తాను’ అని 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న 31 ఏళ్ల వికాస్ గౌడ తెలిపాడు. మైసూరులో జన్మించిన వికాస్ ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో నివాసం ఉంటున్నాడు. వికాస్ తండ్రి శివ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెటిక్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. -
‘రజత’ సీమ
డిస్కస్ త్రోలో రెండో స్థానం అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో పతకం కృష్ణ పూనియా విఫలం వేదిక మారింది. ఫలితం మారింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన డిస్కస్ త్రోయర్ సీమా పూనియా (అంటిల్) ఈసారి మరో మెట్టు ఎగబాకింది. గ్లాస్గోలో అద్వితీయ ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన స్టార్ డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా తీవ్రంగా నిరాశపరిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా రెండో రోజు భారత డిస్కస్ త్రోయర్లు రాణించారు. గురువారం పురుషుల విభాగంలో వికాస్ గౌడ పసిడి పతకం నెగ్గగా... శుక్రవారం మహిళల విభాగంలో సీమా పూనియా (అంటిల్) ‘రజత’ దరహాసం చేసింది. మొత్తం 12 మంది పాల్గొన్న ఫైనల్లో సీమా తన ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను అత్యధికంగా 61.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన డానీ శామ్యూల్స్ (64.88 మీటర్లు) స్వర్ణం సాధించగా... జేడ్ లాలీ (ఇంగ్లండ్-60.48 మీటర్లు) కాంస్యం సంపాదించింది. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఈ క్రీడాంశంలో భారత క్రీడాకారిణులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు. కానీ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయారు. కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న కృష్ణ పూనియా నిరాశపరిచింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఆమె అత్యుత్తమంగా డిస్క్‌ను 57.84 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఇక మహిళల హైజంప్‌లో సహనా కుమారి కూడా పతకం నెగ్గలేకపోయింది. ఆమె 1.86 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడింది. సరిత పంచ్ అదిరింది 60 కేజీల విభాగంలో ఫైనల్లోకి మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 60 కేజీల విభాగంలో లైష్రామ్ సరితా దేవి ఫైనల్లోకి దూసుకెళ్లగా... 51 కేజీల విభాగంలో పింకీ జాంగ్రా సెమీఫైనల్లో ఓడిపోయింది. మరియా మచోంగా (మొజాంబిక్)తో జరిగిన సెమీఫైనల్లో సరిత 3-0 (40-33, 40-32, 40-34)తో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. మచోంగాతో జరిగిన బౌట్లో సరిత ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకదశలో సరిత పంచ్‌లు తాళలేక మచోంగా రింగ్‌లో సరిగ్గా నిలబడలేకపోయింది. రిఫరీ వార్నింగ్ తర్వాత మచోంగా బౌట్‌ను కొనసాగించినా సరిత ధాటికి ఆమె కోలుకోలేకపోయింది. పురుషుల 49 కేజీల సెమీఫైనల్లో దేవేంద్రో సింగ్ 3-0 (30-27, 30-27, 30-27)తో యాష్లే విలియమ్స్ (వేల్స్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. పోరాడి ఓడిన పింకీ మిచెల్లా వాల్ష్ (ఇంగ్లండ్)తో జరిగిన సెమీఫైనల్లో పింకీ 0-2తో ఓడింది. రెండు నిమిషాల వ్యవధిగల నాలుగు రౌండ్స్ గల ఈ బౌట్లో పింకీ ప్రతి రౌండ్లో గట్టిపోటీనిచ్చినా కీలకదశలో వాల్ష్ పైచేయి సాధించింది. బౌట్‌ను పర్యవేక్షించిన కెనడా, హంగేరి జడ్జిలు 40-36, 39-37 స్కోర్లతో వాల్ష్ వైపు మొగ్గారు. కజకిస్థాన్ జడ్జి మాత్రం ఇద్దరికీ 38-38 పాయింట్లు ఇచ్చింది. సెమీస్‌లో ఓడిన పింకీకి కాంస్య పతకం ఖాయమైంది. సెమీస్‌లో కశ్యప్, సింధు, గురుసాయిదత్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, పి.వి.సింధు, గురుసాయిదత్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-10, 21-9తో అన్నా రంకిన్ (న్యూజిలాండ్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో కశ్యప్ 21-13, 21-14తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలుపొందగా, గురుసాయిదత్ 21-15, 8-21, 21-17తో చోంగ్ వీ ఫెంగ్ (మలేసియా) నెగ్గాడు. అయితే కిడాంబి శ్రీకాంత్ 10-21, 21-12, 12-21తో డెరెక్ వాంగ్ (సింగపూర్) చేతిలో, పి.సి.తులసి 21-18, 19-21, 19-21తో జింగ్ యీ టీ (మలేసియా) చేతిలో క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యారు. -
కశ్యప్, సింధు ముందంజ
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ముందంజ వేశారు. సింగిల్స్‌లో తెలుగుతేజాలు సెమీస్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ 11 సింధు 21-10, 21-9 స్కోరుతో అన్నా రాంకిన్పై సునాయాస విజయం సాధించింది. సింధు 24 నిమిషాల్లోనే వరస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో మిచెల్లి లీతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ 21-13, 21-14తో లీవ్‌ను చిత్తు చేశాడు. -
మహిళల హాకీలో మనోళ్లకు ఐదో స్థానం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓదార్పు విజయంతో నిష్ర్కమించింది. శుక్రవారం ఐదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2-1తో ఆతిథ్య స్కాట్లాండ్పై విజయం సాధించింది. గ్రూపు దశలో రాణించలేకపోయిన భారత్ నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. ఆట ప్రథమార్ధంలో ఇరు జట్టు గోల్ చేయలేకపోయాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణితో ఆడగా, స్కాట్లాండ్కు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. విరామం తర్వాత భారత్ రెండు గోల్స్ చేయగా, స్కాట్లాండ్ ఓ గోల్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో భారత్ విజయంతో ఇంటిదారిపట్టింది. -
భారత బాక్సర్ పింకీకి కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్ల పతకాల వేట మొదలైంది. మహిళల 51 కిలోల విభాగంలో భారత బాక్సర్ పింకీ జాంగ్రా కాంస్యం నెగ్గింది. కాగా పింకీ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో పింకీ .. ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ వాల్ష్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే రోజు మరో నలుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో తలపడనున్నారు. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు బరిలో ఉన్నందున స్వర్ణాలు వచ్చే అవకాశముంది. ఓడినా కాంస్యం పతకం దక్కుతుంది. -
ఢిల్లీలో ఆశీష్.. గ్లాస్గోలో దీప సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎక్కువగా పతకాలు గెలిచే క్రీడాంశాల్లో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ ముఖ్యమైనవి. అథ్లెటిక్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు రావడం లేదు. ఇక జిమ్నాస్టిక్స్‌లో అయితే ఇంతకుముందు భారత క్రీడాకారులు ఫైనల్స్ దాకా పోవడమే గొప్ప. అయితే జిమ్నాస్టిక్స్లోనూ భారత్ శకం ఆరంభమైంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జిమ్నాస్ట్ ఆశీష్ కుమార్, తాజా గ్లాస్గో ఈవెంట్లో దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా ఆశీష్, తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పారు. ఆశీష్ రజత, కాంస్య పతకాలు.. దీప కాంస్య పతకం గెల్చుకుని జిమ్నాస్టిక్స్ పతకాలు గెలిచే సత్తా భారత్‌కు ఉందని నిరూపించారు. ఇది శుభ పరిణామం. గ్లాస్గోలో దీప మహిళల వాల్ట్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తి పడింది. అయితే పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
హాకీ సెమీస్‌లో భారత్
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2 తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు విజయాలతో పూల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తరువాత రెండో స్థానంలో నిలవడం ద్వారా సెమీస్‌కు అర్హత పొందింది. సఫారీలపై మ్యాచ్‌లో రఘునాథ్ (4వ నిమిషం), రూపిందర్‌పాల్ (8వ), రమణ్‌దీప్ సింగ్ (22వ), ఎస్.వి.సునీల్ (26వ)లు వరుసగా గోల్స్ సాధించడంతో తొలి అర్ధభాగంలోనే భారత్ 4-0 ఆధిక్యం సాధించింది. రెండో అర్ధభాగంలో దక్షిణాఫ్రికా రెండు గోల్స్ సాధించినా.. మన్‌ప్రీత్ సింగ్ 58వ నిమిషంలో భారత్‌కు మరో గోల్ అందించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. సెమీఫైనల్లో బారతజట్టు న్యూజిలాండ్‌తో తలపడతుంది. -
దీప కొత్త చరిత్ర
జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ ఆర్టిస్టిక్ విభాగంలో కాంస్యం గ్లాస్గో: జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తిపడింది. ఫ్రాగపనీ (ఇంగ్లండ్-14,633), బ్లాక్ (కెనడా-14,433) వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకున్నారు. పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విభాగంలో వైట్లాక్ (ఇంగ్లండ్-15,533), మెర్గాన్ (కెనడా-15,133), బిషప్ (న్యూజిలాండ్-14,550) వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. -
పట్టర పసిడి హైస్సా...
భారత రెజ్లర్లకు మరో రెండు స్వర్ణాలు ఒక రజతం, ఓ కాంస్యం కూడా తొలి రోజు లభించిన ‘పసిడి’ పట్టును రెండో రోజు నిలుపుకోవడంలో విఫలమైన భారత రెజ్లర్లు ఆఖరి రోజు మాత్రం దుమ్ముదులిపారు. ఉడుంపట్టుతో కనక వర్షం కురిపించారు. ఈసారి గేమ్స్‌లో పోటీ పడిన ప్రతి విభాగంలో ఏదో ఓ పతకం సాధించి భవిష్యత్‌పై ఆశలను రేకెత్తించారు. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో తన ట్రేడ్ మార్క్ ‘ఫిటిల్’ (లెగ్ ట్విస్టింగ్) టెక్నిక్‌తో అలరించిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్తో పాటు బబిత కుమారి ఫైనల్లోనూ ‘పసిడి’ పట్టును నిలుపుకున్నారు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో యోగేశ్వర్ 10-0తో జీవోన్ బాల్ఫోర్ (కెనడా)పై గెలిస్తే... మహిళల 55 కేజీల కేటగిరీలో బబిత 9-2తో బ్రిటాని లావెర్డుర్ (కెనడా)ను ఓడించి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. అయితే మహిళల 63 కేజీల విభాగంలో గీతికా జకార్ రజతంతో సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో గీతికా 0-7తో డానియెల్లి లాపాగే (కెనడా) చేతిలో ఓడింది. రెండుసార్లు రిఫరీ నుంచి హెచ్చరికలు ఎదుర్కొన్న భారత రెజ్లర్ టెక్నికల్ పాయింట్లు సంపాదించడంలో విఫలమైంది. పురుషుల 86 కేజీల కాంస్య పతక పోరులో పవన్ కుమార్ విజేతగా నిలిచాడు. మహ్మద్ ఇనామ్ (పాకిస్థాన్) జరిగిన బౌట్లో ఇద్దరు రెజ్లర్లు చెరో 6 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే పవన్ ఒక టెక్నికల్ పాయింట్‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా గురువారంతో ముగిసిన రెజ్లింగ్‌లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, రెండు కాంస్యాలు గెలిచింది. 1 నిమిషం 53 సెకన్లలోనే... బాల్ఫోర్తో జరిగిన బౌట్లో యోగేశ్వర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభంలోనే పట్టు దొరికించుకుని 1:53 సెకన్లలోనే ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి రౌండ్లోనే బాల్ఫోర్ను కిందపడేసిన యోగేశ్వర్ పట్టు జారకుండా జాగ్రత్తపడటంతో చకచకా 10 పాయింట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ లేకుండా బౌట్‌ను నిలిపేయడంతో భారత రెజ్లర్ పసిడిని సొంతం చేసుకున్నాడు. లావెర్డుర్తో జరిగిన బౌట్లో బబితా పాయింట్ల వర్షం కురిపించింది. తొలి రౌండ్లోనే ఐదు పాయింట్లు నెగ్గిన ఆమె రెండో రౌండ్లో 4 పాయింట్లు గెలిచింది. ప్రత్యర్థి కేవలం రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. కామన్వెల్త్లో భారత్ రౌండప్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో కశ్యప్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగాల్లో భారత షట్లర్లు దూసుకెళ్తున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో జెఫ్ తో (ఆస్ట్రేలియా)పై , గురుసాయిదత్ 21-13, 21-9తో ఆండ్రూ డిసౌజా (కెనడా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. శ్రీకాంత్ కూడా ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి క్వార్టర్స్‌కు చేరారు. బాక్సింగ్ విజేందర్కు పతకం ఖాయం కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మిడిల్ వెయిట్ (75 కేజీలు) విభాగంలో క్వార్టర్ఫైనల్లో విజేందర్ 3-0తో ఆరోన్ ప్రిన్స్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. కాబట్టి కనీసం కాంస్య పతకమైనా దక్కుతుంది టేబుల్ టెన్నిస్ సెమీస్‌లో శరత్ జోడి పురుషుల డబుల్స్‌లో భారత జోడి శరత్ కమల్-ఆంథోని అమల్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో శరత్-ఆంథోని జంట 12-10, 11-6, 7-11, 11-8తో ఇంగ్లండ్‌కు చెందిన డానీ రీడ్-శామ్ వాకర్ ద్వయంపై గెలుపొందింది. అయితే మరో పురుషుల డబుల్స్ జోడి హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ క్వార్టర్స్‌లో సింగపూర్ జంట చేతిలో ఓటమిపాలైంది. ఇక మిక్స్డ్ డబుల్స్‌లోనూ శరత్ కమల్- షామిని కుమరేశన్ జోడి క్వార్టర్స్‌లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలున్న మానికా బాత్రా కూడా క్వార్టర్స్‌లో ఓడింది. స్వర్ణ ‘వికాసం పురుషుల డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ వికాస్ గౌడ స్వర్ణం గెలిచాడు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో అతను డిస్క్‌ను 63.64 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలో 60.63 మీటర్లు మాత్రమే విసిరిన వికాస్ క్రమంగా దూరాన్ని పెంచాడు. రెండో ప్రయత్నంలో 62.09 మీటర్లు, మూడో ప్రయత్నంలో 63.64 మీటర్లు నమోదు చేశాడు. తర్వాతి మూడు ప్రయత్నాల్లో కాస్త నిరాశపరిచినా... 63.64 మీటర్లకు స్వర్ణం దక్కింది. అపోస్టోలస్ పారెల్లిస్ (సైప్రస్-63.32 మీటర్లు), జాసన్ మోర్గాన్ (జమైకా-62.34 మీటర్లు) వరుసగా రజతం, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. మహిళల 800 మీటర్ల పరుగులో టింటూ లుకా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. సెమీస్‌లో ఆమె 2:03.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంలో నిలిచింది. -
‘పట్టు’ సడలింది
పసిడి నెగ్గలేకపోయిన భారత రెజ్లర్లు - ఫైనల్స్‌కు చేరిన అన్ని విభాగాల్లోనూ ఓటమి - నాలుగు రజతాలు, కాంస్యంతో సరి రెజ్లింగ్ తొలి రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు... రెండో రోజు నాలుగు విభాగాల్లో ఫైనల్‌కు... ఇక స్వర్ణాలు లెక్కబెట్టుకోవడమే అనుకున్నారంతా! కానీ సగటు భారత క్రీడాభిమాని ఆశ ఆవిరైపోయింది. రెండో రోజు ఫైనల్‌కు చేరిన నాలుగు విభాగాల్లోనూ ఓటములతో భారత రెజ్లర్లు రజతాలతో సరిపెట్టుకున్నారు. అయితే నాలుగు రజతాలతో పాటు ఓ కాంస్యం కూడా సాధించి మొత్తం ఐదు పతకాలతో భారత్ పతకాల సంఖ్యను రెజ్లర్లు పెంచారు. గ్లాస్గో: పసిడి పంట పండిస్తారనుకున్న వేదికపై భారత రెజ్లర్లు ‘పట్టు’ సడలించారు. ప్రత్యర్థి పట్టు పట్టాల్సిన చోట తాము పట్టు కోల్పోయారు. నమ్మశక్యంకాని పద్ధతిలో తడబాటుకు లోనై పరాజయాల మూట గట్టుకున్నారు. ఫైనల్లో పురుష రెజ్లర్లకు కెనడా కుస్తీ వీరులు ‘షాక్’ ఇవ్వగా... మహిళల రెజ్లర్లకు నైజీరియా అమ్మాయిలు ‘చెక్’ పెట్టారు. కామన్వెల్త్ గేమ్స్ ప్రమాణాలతో పోలిస్తే ఎంతో పటిష్టమైన ప్రత్యర్థులు ఉండే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గతేడాది కాంస్యం నెగ్గిన బజరంగ్ (61 కేజీల)... ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సత్యవర్త్ (97 కేజీలు) ‘గ్లాస్గో’లో మాత్రం పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు. తేరుకునేలోపే... డేవిడ్ ట్రెమ్‌బ్లే (కెనడా)తో జరిగి 61 కేజీల ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బజరంగ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పటిష్ట శరీర నిర్మాణంతో ఉన్న ట్రెమ్‌బ్లే తన శక్తినంతా కూడదీసుకొని బజరంగ్‌పై మొదట్లోనే నియంత్రణ సంపాదించాడు. బజరంగ్‌ను ఒక్కసారి మ్యాట్‌పై కిందపడేశాక ట్రెమ్‌బ్లే పూర్తిగా పట్టుబిగించాడు. బజరంగ్ కాళ్లను కదలనీయకుండా తానే ఆధిపత్యం చలాయిస్తూ వెంటవెంటనే పాయింట్లు గెల్చుకున్నాడు. 3 నిమిషాల వ్యవధిగల తొలి అర్ధభాగంలో 84 సెకన్లు ముగిసే సమయానికి ట్రెమ్‌బ్లే 12-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దాంతో నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై ఎవరైనా కనీసం 10 పాయింట్లు ఆధిక్యం సంపాదిస్తే బౌట్‌ను నిలిపివేయాలి. ఫలితంగా ట్రెమ్‌బ్లే విజేతగా అవతరించాడు. అతి జాగ్రత్తకు మూల్యం. వరుసగా మూడు బౌట్లలో నెగ్గి 97 కేజీల విభాగంలో ఫైనల్ చేరుకున్న 20 ఏళ్ల సత్యవర్త్ కడియాన్ టైటిల్ పోరులో అతి జాగ్రత్తకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. అర్జున్ గిల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో సత్యవర్త్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే రెండో అర్ధభాగంలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకునే క్రమంలో జోరు తగ్గించి రక్షణాత్మకంగా వ్యవహరించాడు. ఇదే అదునుతో అర్జున్ గిల్ జోరు పెంచి 2-2తో స్కోరును సమం చేశాడు. రిఫరీ హెచ్చరించినా దూకుడు పెంచని సత్యవర్త్‌కు 30 సెకన్ల ‘కాషన్’ ఇచ్చారు. ఈ సమయంలో అతను పాయింట్ సంపాదించకపోవడంతో అర్జున్‌కు అదనంగా పాయింట్ వచ్చింది. ఆ తర్వాత తేరుకున్న సత్యవర్త్ పాయింట్ సాధించి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని అర్జున్ గిల్ తన బలాన్నంతా కూడదీసుకొని చివరి సెకన్లలో సత్యవర్త్‌ను ఎరీనా బయటకు పంపించి నిర్ణీత సమయానికి స్కోరును 4-4తో సమం చేశాడు. దాంతో బౌట్ సందర్భంగా సత్యవర్త్ ‘కాషన్’ పొందడం... చివరగా అర్జున్ గిల్ పాయింట్ సంపాదించడంతో నిబంధనల ప్రకారం అర్జున్ గిల్‌ను విజేతగా ప్రకటించారు. చేతులెత్తేశారు... మహిళల 53 కేజీల ఫైనల్లో ఒడునాయో అడెకురోయి (నైజీరియా) కేవలం 31 సెకన్లలో లలిత (భారత్)ను చిత్తు చేసింది. ఆరంభంలోనే లలితను ఒడిసిపట్టుకున్న ఒడునాయో ఆమెను మ్యాట్‌పై పడేసింది. అదే జోరులో లలిత భుజాన్ని ఈ నైజీరియా రెజ్లర్ కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు ఆనించడంతో రిఫరీ ‘బై ఫాల్’ పద్ధతిలో ఒడునాయోను విజేతగా ప్రకటించారు. 58 కేజీల విభాగంలో అమినాత్ అడెనియి 2 నిమిషాల 43 సెకన్లలో సాక్షి మలిక్ (భారత్) ఆట కట్టించింది. బౌట్ మొదలైన క్షణం నుంచే దూకుడుగా వ్యవహరించి మంచి టెక్నిక్‌తో అడెనియి వరుసగా పాయింట్లు సంపాదించింది. ఈ క్రమంలో అడెనియ 10-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లడంతో రిఫరీ బౌట్‌ను ముగించారు. ఇక 69 కేజీల కాంస్య పతక పోరులో నవజ్యోత్ కౌర్ 13-0తో సారా జోన్స్ (స్కాట్లాండ్)ను ఓడించింది. -
మాలికి కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 94 కేజీల విభాగంలో చంద్రకాంత్ మాలి 338 కేజీల (స్నాచ్ 150+క్లీన్ అండ్ జర్క్ 188) బరువు ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి రెండు ప్రయత్నాల్లో 146, 150 కేజీలు ఎత్తిన మాలి మూడో ప్రయత్నంలో 153 కేజీల బరువును లేపడంలో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 183, 188 కేజీలను సునాయసంగా ఎత్తిన లిఫ్టర్ 194 కేజీల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. స్టీవెన్ కుకునా కారీ (పపువా న్యూగినియా), సింప్లిక్ రిబోయెమ్ (ఆస్ట్రేలియా)లు చెరో 349 కేజీల బరువు ఎత్తినా... శరీరం బరువు తక్కువగా ఉండటం వల్ల కారీకి స్వర్ణం, రిబోయెమ్కు రజతం దక్కాయి. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు లభించాయి. సంతోషికి అధికారికంగా రజతం మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం మత్స సంతోషికి అధికారికంగా రజత పతకాన్ని అందజేశారు. భారత్‌కే చెందిన స్వాతి సింగ్‌కు కాంస్యం దక్కింది. స్వర్ణం గెలిచిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలహా డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
బాక్సింగ్‌లో నాలుగు పతకాలు ఖాయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ‘పంచ్’ అదిరింది. వివిధ విభాగాల్లో కనీసం నాలుగు పతకాలను ఖాయం చేశారు. మహిళల ఫ్లయ్ (48-51 కేజీలు) వెయిట్ క్వార్టర్ఫైనల్లో పింకి జాంగ్రా 3-0తో జాక్వలిన్ వాంగి (పపువా న్యూగినియా)పై; లైట్ వెయిట్ బౌట్లో లశిరామ్ సరితా దేవి 3-1తో చార్లెని జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల వెల్టర్ వెయిట్ (69 కేజీలు) క్వార్టర్ఫైనల్లో మన్దీప్ జాంగ్రాకు వాకోవర్ లభించడంతో సెమీస్ బెర్త్ ఖాయమైంది. బౌట్‌కు ముందు జాంగ్రా ప్రత్యర్థి డానియెల్ లెవిస్ (ఆస్ట్రేలియా) వైద్య పరీక్షల్లో విఫలమయ్యాడు. ప్రిక్వార్టర్స్ బౌట్లో లెవిస్ కంటి పైభాగంలో తగిలిన గాయం ఇంకా నయంకాకపోవడంతో డాక్టర్లు పోటీకి అనర్హుడిగా తేల్చారు. పురుషుల లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు)లో దేవేంద్రో లశిరామ్ 3-0తో అక్విల్ అహ్మద్ (స్కాట్లాండ్)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. బాక్సింగ్‌లో ఒకవేళ సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం లభిస్తుంది. కాబట్టి కనీసం నాలుగు కాంస్యాలు లేదా అంతకంటే మంచి పతకాలు భారత్ ఖాతాలో చేరినట్లే. -
వెయిట్ లిఫ్టింగ్‌లో మారిన పతకాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం మత్స సంతోషి (53 కేజీలు)కి పతకం మారింది. ఆమెకు రజత పతకం దక్కింది. అంతకుముందు ఆమె కాంస్య పతకం నెగ్గింది. స్వర్ణం సాధించిన నైజీరియన్ వెయిట్ లిఫ్టర్ చికా అమలాహా డోపింగ్‌లో విఫలం కావడంతో ఆమె నుంచి పతకం వెనక్కు తీసుకున్నారు. దీంతో కాంస్యం నెగ్గిన సంతోషికి రజత పతకం ఇచ్చారు. నాలుగో స్థానంలో నిలిచిన మరో భారత లిఫ్టర్ స్వాతి సింగ్ కు కాంస్య పతకం అందజేశారు. దీనిపై తమకు అధికారిక సమాచారం అందిందని భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సహదేవ్ యాదవ్ తెలిపారు. దీంతో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 3 బంగారు, నాలుగు రజతం, ఐదు కాంస్య పతకాలున్నాయి. -
బుల్లెట్ దిగింది!
'ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా బుల్లెట్ దిగిందా, లేదా...' పోకిరి సినిమాలో హీరో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షూటర్లకు ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. బరిలోకి దిగింది మొదలు అదరగొడుతున్నారు. 'షూటింగ్'లో సత్తా చాటి పతకాల పంట పండించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ షూటర్లు దుమ్ము రేపారు. ఒక్క షూటింగ్ ఈవెంట్ లోనే అత్యధికంగా 17 పతకాలు సాధించిపెట్టారు. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. మంగళవారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 35 పతకాలు చేరాయి. ఒకరిద్దరు మినహా షూటర్లు అందరూ సమిష్టిగా రాణించి అభిమానుల అంచనాలను నిలబెట్టారు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ మాత్రం నిరాశపరిచాడు. ఫైనల్‌కు చేరుకోవడంలో ఫలమయ్యాడు. మనో షూటర్ రవి కుమార్ ఫైనల్లో తడబడ్డాడు. సీనియర్ షూటర్లుతో ఔత్సాహిక షూటర్లు పతకాలు సాధించడం ఈసారి విశేషం. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ అంచనాలకు తగినట్టు రాణించారు. నారంగ్(రజతం, కాంస్యం) రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళా షూటర్లు శ్రేయాసి సింగ్, అపూర్వి చండేలా, అయోనికా పాల్, మలైకా గోయల్ పతకాల పంట పండించారు. జీతూ రాయ్, గుర్పాల్ సింగ్, మహమ్మద్ అసబ్, ప్రకాశ్ నంజప్ప, లజ్జా గోస్వామి, మానవ్‌జిత్ సింగ్ సంధూ, సంజీవ్ రాజ్‌పుత్, హర్‌ప్రీత్ సింగ్ 'గురి' తప్పకుండా పతకాలు సాధించారు. భారత పతాకాన్ని అంతర్జాతీయ క్రీడా యవనికపై రెపరెపలాడించిన మన షూటర్లకు అభినందలు తెలుపుతూ.. మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
షూటింగ్లో భారత్‌కు మరో ఐదు పతకాలు
-
ఒకే రోజు మూడు స్వర్ణాలు, రజతం
-
సంతోషికి రజతం అవకాశం!
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం మత్స సంతోషి (53 కేజీలు)కి రజత పతకం దక్కే అవకాశాలున్నాయి. స్వర్ణం సాధించిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలాహా డోపింగ్‌లో విఫలం కావడం ఏపీ అమ్మాయికి కలిసిరానుంది. అలాగే ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన స్వాతి సింగ్‌కు కాంస్యం లభించొచ్చు. పోటీల సందర్భంగా అమలాహా ఇచ్చిన ఎ-శాంపిల్ పాజిటివ్‌గా తేలింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షలో నిర్ధారణ కావడంతో ఆమెను గేమ్స్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే బి-శాంపిల్‌లో కూడా పాజిటివ్‌గా తేలితే అమలాహా నుంచి పతకాన్ని వెనక్కి తీసుకుంటామని గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హూపర్ తెలిపారు. రూ. 5 లక్షల నజరానా మత్స సంతోషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు నజరానా ప్రకటించింది. -
100మీ. చాంపియున్ బెయిలీ
గ్లాస్గో: వంద మీటర్ల పరుగులో తవుకు తిరుగులేదని జమైకా వురోసారి నిరూపించింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 100మీ. పరుగులో కెవుర్ బెయిలీ కొలె(జమైకా) చాంపియున్‌గా నిలిచాడు. బెయిలీ తన పరుగును 10 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన అడమ్ జెమిలి 10.10 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన వురో అథ్లెట్ నికెల్ అష్మెది 10.12 సెకన్లతో 3 స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ రేసుకు దూరంగా ఉన్న జమైకా స్టార్ ఉస్సేన్ బోల్ట్ ఆగస్ట్ 1న 4x 100 మీటర్ల రిలేలో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియూ జోరు: పతకాల పట్టికలో ఆస్ట్రేలియూ హవా కొనసాగుతోంది. పలు విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పతకాలు కొల్లగొడుతోంది. ఆస్ట్రేలియూ పతకాలు వందకు చేరువయ్యూయి. -
రజత వికాసం
85 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్ ఠాకూర్‌కు రెండో స్థానం గ్లాస్గో: ఓ వైపు వెన్నునొప్పి... మరో వైపు ప్రత్యర్థుల జోరు... అయినా తనలో మాత్రం పతకం నెగ్గాలనే కసి.. ఈ కసితోనే భారత వెయిట్ లిఫ్టర్, 20 ఏళ్ల వికాస్ ఠాకూర్ అద్భుతం చేశాడు. వెన్ను నొప్పి వేధిస్తున్నా... పంటి బిగువున బాధను అనుచుకుంటూ అద్భుత ప్రదర్శనతో రాణించి కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన 85 కేజీల విభాగంలో ఠాకూర్ స్నాచ్‌లో 150 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 183 కేజీలు (మొత్తం 333 కేజీలు) బరువు ఎత్తాడు. అయితే పతకం విషయంలో తనకు కాస్త ‘అదృష్టం’ కూడా తోడైంది. కాంస్యం సాధించిన పాస్కల్ ప్లమోండన్ కూడా 333 కేజీ (151+182)ల బరువు ఎత్తి సమానంగా నిలిచాడు. దీంతో లిఫ్టర్ల శరీర బరువు కీలకమైంది. వికాస్ 84 కేజీల బరువు ఉండగా కెనడాకు చెందిన పాస్కల్ 85 కేజీల బరువున్నట్టు తేలింది. దీంతో వికాస్ రజతంతో మెరిశాడు. ఇక ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ ప్యాటర్సన్ (335 కేజీ; 151+184) దక్కించుకున్నాడు. -
‘గన్’ గర్జన
షూటింగ్లో భారత్‌కు మరో ఐదు పతకాలు రెండు రజతాలు, మూడు కాంస్యాలు స్థాయికి తగ్గ ప్రదర్శనతో భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ వేటను పతకంతో మొదలుపెట్టి పతకంతోనే ముగించారు. షూటింగ్ పోటీల చివరిరోజు మంగళవారం మనోళ్లు మరో ఐదు పతకాలు గెల్చుకున్నారు. ఈ ఒక్క క్రీడాంశంలోనే భారత్ 17 పతకాలు సాధించడం విశేషం. గ్లాస్గో: అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా రాణించిన భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌ను ఘనంగా ముగించారు. షూటింగ్ ఈవెంట్ చివరిరోజు మంగళవారం భారత క్రీడాకారులు తమ ఖాతాలో మరో ఐదు పతకాలను జోడించారు. అయితే ఇందులో స్వర్ణం లేకపోయినా... రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో హర్‌ప్రీత్ సింగ్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాలు నెగ్గారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనే హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో లజ్జా గోస్వామి.... ట్రాప్ ఈవెంట్లో మానవ్‌జిత్ సింగ్ సంధూ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా షూటింగ్లో భారత్‌కు 17 పతకాలు వచ్చాయి. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో హర్‌ప్రీత్ సింగ్ 21 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా-23 పాయింట్లు) స్వర్ణం... క్రిస్టియన్ కాలఘన్ (ఇంగ్లండ్-17 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. అయితే లండన్ ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. అందివచ్చిన అవకాశంతో... పురుషుల ట్రాప్ ఈవెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూకు అదృష్టం కూడా కలిసివచ్చింది. ‘డబుల్ ఒలింపిక్ మాజీ చాంపియన్’ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)తో జరిగిన కాంస్య పతక పోరులో మానవ్‌జిత్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. నిర్ణీత 15వ షాట్ తర్వాత మానవ్‌జిత్ 11 పాయింట్ల వద్ద ఉండగా... డైమండ్‌కు మరో షాట్ మిగిలి ఉంది. అయితే చివరి షాట్లో డైమండ్ విఫలమవ్వడంతో ఇద్దరూ 11 పాయింట్లతో సమమయ్యారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ ఇచ్చారు. డైమండ్ గురి తప్పగా... మానవ్‌జిత్ లక్ష్యాన్ని ఛేదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో మానవ్జిత్కిది మూడో పతకం. గగన్ ‘10’ గ్లాస్గో గేమ్స్‌లో బరిలోకి దిగిన రెండు ఈవెంట్స్‌లోనూ గగన్ నారంగ్ పతకాలు గెలుపొందడం విశేషం. సోమవారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో రజతం నెగ్గిన గగన్... మంగళవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 436.8 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో గగన్‌కిది 10వ పతకం కావడం విశేషం. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన సంజీవ్ రాజ్‌పుత్ 446.9 పాయింట్ల స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ షూటర్ డానియల్ రివర్స్‌కు (452.9 పాయింట్లు) స్వర్ణం దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో లజ్జా గోస్వామి 436.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. జాస్మిన్ సెర్ (సింగపూర్-449.1) స్వర్ణం, జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-446.6) రజతం సాధించారు. -
పోరాడి ఓడిన భారత్
కామన్వెల్త్ హాకీ 4-2తో ఆస్ట్రేలియా విజయం గ్లాస్గో: వరుస విజయాలతో ఊపుమీదున్న భారత హాకీ జట్టుకు కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. మంగళవారం జరిగిన ప్రిలిమినరీ మ్యాచ్‌లో భారత్ 2-4తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. రూపిందర్ సింగ్ (34వ ని.), రమన్‌దీప్ సింగ్ (48వ ని.)లు భారత్‌కు గోల్స్ అందిస్తే... క్రిస్ సిరిల్లో (14, 49వ ని.), సిమోన్ ఆర్చర్డ్ (16వ ని.), జాకబ్ వాటెన్ (26వ ని.)లు ఆసీస్ తరఫున గోల్స్ చేశారు. బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-5, 21-12తో బి లీ (ఐల్ ఆఫ్ మాన్)పై; కిడాంబి శ్రీకాంత్ 21-3, 21-4తో డుయాని మార్చ్ (సెయింట్ హలెనా)పై గెలిచి శుభారంభం చేశారు. బాక్సింగ్: పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీల) క్వార్టర్ఫైనల్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ నిరాశపర్చాడు. 0-3 (27-30, 27-30, 27-30)తో శామ్యూల్ మాక్స్వెల్ (ఇంగ్లండ్)చేతిలో ఓడాడు. మహిళల లైట్ వెయిట్ (50-60 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో లశిరామ్ దేవి 3-0 (20-18, 20-18, 20-18)తో ఒబారెహ్ (నైజీరియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. లాన్ బౌల్స్: మహిళల పెయిర్స్ సెక్షన్-బి రౌండ్-2 మ్యాచ్‌లో భారత్ 20-12తో కెన్యాపై గెలిచి రౌండ్-3 మ్యాచ్‌లో 11-24తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ట్రిపుల్స్ సెక్షన్-ఎ, రౌండ్-3లో భారత్ 10-8తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. పురుషుల ఫోర్స్ సెక్షన్-బి, రౌండ్-3 మ్యాచ్‌లో భారత్ 17-12తో నమీబియాను ఓడించింది. పురుషుల సింగిల్స్ సెక్షన్-బి, రౌండ్-3 మ్యాచ్‌లో బహదూర్ 10-21తో రెయాన్ బెస్టర్ (కెనడా) చేతిలో ఓడాడు. స్క్వాష్: పురుషుల డబుల్స్ పూల్-జీలో సౌరవ్ ఘోశల్-హరీందర్ పాల్ సంధు 9-11, 11-3, 11-2తో జెర్విస్-బ్లెయిర్ (కెమాన్ ఐలాండ్)పై గెలిచి; 0-2తో వేల్స్ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సౌరవ్-దీపికా పల్లికల్ 11-3, 11-4తో రవీందు లక్సిరి-నడుని గుణవర్ధనే (శ్రీలంక)పై గెలిచారు. అథ్లెటిక్స్: హ్యామర్ త్రోలో నారాయణ్ సింగ్ చంద్రోదయ ఫైనల్ రౌండ్‌కు చేరినా ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలిచి కమల్‌ప్రీత్ సింగ్ ఫైనల్స్‌కు దూరమైంది. షాట్‌పుట్టర్ ఓమ్ ప్రకాశ్ ఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు. -
పసిడి ‘పట్టు’
మెరిసిన భారత రెజ్లర్లు ఒకే రోజు మూడు స్వర్ణాలు, రజతం అలరించిన సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత ఆరో రోజు ఎవరూ ఊహించని విధంగా భారత క్రీడాకారులు పసిడి పంట పండించారు. రెజ్లర్లు తమ పట్టు ప్రదర్శించి ఒకే రోజు మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం సొంతం చేసుకున్నారు. మరోవైపు షూటర్లు కూడా రాణించడంతో... మంగళవారం ఒక్కరోజే భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఆరో రోజును స్వర్ణం లేకుండానే ముగిస్తామా అని అనుకుంటున్న తరుణంలో... భారత రెజ్లర్లు తమ ఉడుంపట్టును ప్రదర్శించారు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించి మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం గెల్చుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్ (74 కేజీలు), అమిత్ కుమార్ దహియా (57 కేజీలు)... మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు) పసిడి పతకాలు సంపాదించగా... పురుషుల 125 కేజీల విభాగంలో రాజీవ్ తోమర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. 107 సెకన్లలోనే... కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి 74 కేజీల విభాగంలో పోటీపడిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఎలాంటి పోటీనే ఎదురుకాలేదు. ఫైనల్లో సుశీల్ కేవలం 107 సెకన్లలో తన ప్రత్యర్థి ఖమర్ అబ్బాస్ (పాకిస్థాన్)ను చిత్తు చేశాడు. సుశీల్ 6-2తో ఆధిక్యంలో ఉన్న దశలో అబ్బాస్ భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టడంతో రిఫరీ పోటీని నిలిపివేసి ‘బై ఫాల్’ పద్ధతిలో సుశీల్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు తొలి రౌండ్లో సుశీల్ 11-1తో లారెన్స్ (ఆస్ట్రేలియా)పై; క్వార్టర్ ఫైనల్లో 10-0తో కుశాన్ సంద్రాగె (శ్రీలంక)పై; సెమీఫైనల్లో 8-4తో మెల్విన్ బిబో (నైజీరియా)పై గెలిచాడు. 57 కేజీల ఫైనల్లో అమిత్ కుమార్ 6-2 పాయింట్ల తేడాతో వెల్సన్ (నైజీరియా)ను ఓడించగా... మహిళల 48 కేజీ ఫైనల్లో వినేశ్ 11-8 పాయింట్ల తేడాతో యానా రటిగన్ (ఇంగ్లండ్)పై అద్భుత విజయం సాధించింది. ఇక పురుషుల 125 కేజీల ఫైనల్లో రాజీవ్ తోమర్ (భారత్) 0-3 పాయింట్లతో కోరె జార్విస్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. -
ఒకే రోజు స్వర్ణం, రెండు రజతాలు
-
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో నాలుగు
-
వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు స్వర్ణం
గ్లాస్గో : కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. నాలుగో రోజు కూడా భారత్ ఓ బంగారు, రజిత పతకాలు సాధించింది. పురుషుల 77 కిలోల వెయిట్‌లిప్టింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు సతీష్ శివలింగం బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా, రవి కాటులు సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నారు. కాగా ఇప్పటివరకూ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ మొత్తం తొమ్మిది పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. దాంతో పతకాల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఇప్పటివరకూ 6 బంగారు, 9 రజిత, 7 కాంస్యాలతో మొత్తం 22 పతకాలు సాధించింది. -
క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్
గ్లాస్గో: భారత బాక్సర్ మనోజ్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోరులో మనోజ్ 2-1తో కెనడా బాక్సర్ ఆర్థర్ బియూర్స్లనోవ్పై గెలిచాడు. వుంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో వునోజ్.. ఇంగ్లండ్ బాక్సర్ శావుూ్యల్ వూక్స్వెల్తో తలపడనున్నాడు. సెమీస్‌కు పూవమ్మ: వుహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూవవ్ము వుచ్చెత్తిరా సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్ హీట్-1లో పూవమ్మ 54.01 సెకన్లలో పరుగు పూర్తి చేసి వుూడో స్థానంలో నిలిచింది. వురో భారత స్ప్రింటర్ శ్రద్ధ నారాయణ 100 మీటర్ల పరుగులో సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. తొలి రౌండ్ హీట్-3లో పోటీపడ్డ ఎనిమిది వుంది అథ్లెట్లలో శ్రద్ధ ఐదో స్థానం(11.81 సెకన్లు)లో నిలిచింది. ఫైనల్‌కు ఓం ప్రకాశ్: పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాష్‌సింగ్ కర్హానా ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫరుుంగ్ గ్రూప్ ‘బి’లో ప్రకాశ్ సింగ్ గుండును 18.98 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంతో ఫైనల్‌కు చేరాడు.భారత్ హాకీ జట్టుకు తొలి ఓటమి: కావున్వెల్త్ క్రీడల వుహిళల హాకీలో భారత జట్టు తొలి పరాజయూన్ని చవిచూసింది. ఆదివారం పూల్ ‘ఎ’లో జరిగిన ప్రిలిమినరీ వ్యూచ్‌లో భారత్ 0-3తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. -
జోరు తగ్గినా...
భారత్ ఖాతాలో నాలుగు పతకాలు శ్రేయాసికి రజతం, అసబ్‌కు కాంస్యం ఓంకార్, పూనమ్లకూ కాంస్యాలు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో నాలుగు పతకాలతో మెరిసింది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు జోరు కాస్త తగ్గినా... షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లలో రజత, కాంస్య పతకాలు దక్కడంతో మురిసింది. అయితే ఈ రెండు క్రీడాంశాల్లో స్వర్ణావకాశాలు చేజార్చుకోవడంతోపాటు టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతక పోరులో మహిళల జట్టు విఫలమై కాస్త నిరాశపరిచింది. గ్లాస్గో: పతకాల వేటలో భారత్ మున్ముందుకు దూసుకెళుతోంది. ఆదివారం భారత క్రీడాకారులు పసిడి వెలుగులు విరజిమ్మకపోయినా.... ఓ రజతం, మూడు కాంస్యాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తం పతకాల సంఖ్యను 20కి పెంచుకున్నారు. శ్రేయాసి వెండి వెలుగులు... అసబ్ కంచు మోత భారత్‌కు పతకాల పంట పండిస్తున్న షూటింగ్... ఆదివారం మరో రెండు పతకాలనందించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాసి సింగ్ రజతం సాధించగా, పురుషుల డబుల్ ట్రాప్‌లో మహమ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు. ఈ ఇద్దరికీ ఇవే తొలి కామన్వెల్త్ పతకాలు కావడం విశేషం. మహిళల ఫైనల్స్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల శ్రేయాసి మొత్తం 92 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం ద్వారా వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ షూటర్లు కెర్వుడ్ 94 పాయింట్లతో స్వర్ణం, రాచెల్ పారిష్ 91 పాయింట్లతో కాంస్యం దక్కించుకున్నారు. అయితే మరో భారత మహిళా షూటర్ వర్ష వర్మన్ 81 పాయింట్లు మాత్రమే సాధించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల డబుల్ ట్రాప్‌లో నాథన్ జురెబ్ (మాల్టా)తో చివరిదాకా ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ‘మీరట్ వీరుడు’ అసబ్ 26 పాయింట్లు నమోదు చేసి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. జురెబ్ 24 పాయింట్లు మాత్రమే నమోదు చేయగలిగాడు. మరో భారత షూటర్ అంకుర్ మిట్టల్... క్వాలిఫికేషన్స్‌లో రెండో స్థానంతో సత్తా చాటినా తుదిపోరులో ఐదో స్థానానికి పడిపోయి నిరాశ పరిచాడు. కాంస్యాలు నెగ్గిన ఓంకార్, పూనమ్ భారత్‌కు పతకాలు సాధించిపెడుతున్న మరో క్రీడాంశం వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు కాంస్యాలు భారత్ సొంతమయ్యాయి. పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ ఒటారి, మహిళల 63 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్‌లు కాంస్య పతకాలు సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ మొత్తం 296 కేజీలు (స్నాచ్‌లో 136 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు) ఎత్తాడు. ఇక ఆదివారం జరిగిన మహిళల 63 కేజీల పోటీల్లో పూనమ్ 202 కేజీలు ఎత్తి మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన పూనమ్... క్లీన్ అండ్ జెర్క్‌లో 114 కేజీలు నమోదు చేసింది. అయితే మరో భారత లిఫ్టర్ వందనా గుప్తా 198 కేజీలతో నాలుగో స్థానానికే పరిమితమైంది. మహిళల టీటీ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో భారత్ 1-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. -
జూడోలో రజ్వీందర్‌కు కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున జూడోలో భారత్‌కు ఒక కాంస్యం దక్కింది. మహిళల 78+ విభాగం క్వార్టర్స్‌లో రజ్వీందర్ కౌర్.. రటుగీ (కెన్యా)ని ఓడించింది. అయితే 78 కేజీల విభాగం కాంస్య పతక పోరులో జీనా దేవి జోంగ్తమ్ 0-1 తేడాతో కామెరూన్‌కు చెందిన ఎంబల్లా చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 100కేజీ కాంస్య పతక పోరులో సాహిల్ పఠానియా 0-2 తేడాతో న్యూజిలాండ్‌కు చెందిన స్లైఫీల్డ్ చేతిలో ఓడిపోయాడు. స్క్వాష్‌లో దీపికాకు నిరాశ: భారత స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో అలిసన్ వాటర్స్ (ఇంగ్లండ్) 3-1తో దీపికను ఓడించింది. మరో క్రీడాకారిణి అలంకమోని 3-0తో ఎలీ వెబ్‌పై (పపువా న్యూగినియా)పై గెలిచి సెమీస్‌కు చేరింది. పరుషుల విభాగంలో సౌరవ్ ఘోశల్ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సౌరవ్ 3-2తో స్టీవెన్ ఫింటిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. దీంతో 1998లో ఈ గేమ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్వార్టర్స్‌కు చేరుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. పురుషుల క్లాసిక్ ప్లేట్ ప్రిక్వార్టర్స్‌లో మహేశ్ మంగనోకర్ 3-0తో క్రీడ్ (వేల్స్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. టేబుల్ టెన్నిస్: టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో 3-0తో స్కాట్లాండ్పై గెలిచింది. మహిళల జట్టు సెమీస్‌లో సింగపూర్ చేతిలో 1-3తో ఓడింది. ఇక కాంస్యం కోసం ఆసీస్‌తో తలపడుతుంది. లాన్‌బౌల్స్: అంతగా అంచనాలు లేని లాన్‌బౌల్స్‌లో ఊహించిందే జరిగింది. మహిళల ఫోర్స్ సెక్షన్-బి రౌండ్ 5లో భారత జట్టు 12-13తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడింది. ప్రి క్వార్టర్స్‌లో విజేందర్, మనోజ్: బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్, మనోజ్ కుమార్‌లు తొలిరౌండ్‌ను అలవోకగా అధిగమించారు. పురుషుల 74 కేజీల విభాగం తొలి రౌండ్లో విజేందర్ 3-0తో ఆండ్రూ కొమెటా (కిరిబతి)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 64 కేజీల విభాగం తొలి రౌండ్లో మనోజ్‌కుమార్ 3-0తో మోకహచనా మోషోషి (లీసోతో)పై సునాయాసంగా గెలిచాడు. మీనా కుమారి నిరాశ: మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది. వయసు 60... పతకాలు 18 ఇంగ్లండ్‌కు చెందిన షూటర్ మైకేల్ గల్ట్ 60 ఏళ్ల వయసులోనూ పతకాల పంట పండిస్తున్నాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సొంతం చేసుకున్న అతను కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక పతకాల రికార్డు (18)ని సమం చేశాడు. ఢిల్లీ ఎందుకు రాలేదంటే... గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ లేకపోవడం పెద్ద లోటుగా అనిపించింది. దీనిపై ఇప్పుడు బోల్ట్ మాట్లాడాడు. ‘ఢిల్లీలో అక్టోబర్-నవంబర్లలో గేమ్స్ జరిగాయి. అప్పుడు సీజన్ ముగింపు దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను పోటీ పడాల్సి ఉంది. అందుకు సన్నాహకాల కోసమే ఢిల్లీ గేమ్స్ నుంచి తప్పుకున్నాను’ అని బోల్ట్ చెప్పాడు. -
స్వర్ణ కాంతలు
షూటింగ్లో రెండు స్వర్ణాలు సాధించిన భారత మహిళలు భారత మహిళల సత్తా ఇది. వారి ఏకాగ్రత, నైపుణ్యానికి నిదర్శనం ఇది. కామన్వెల్త్ షూటింగ్లో శనివారం మహిళల విభాగంలో రెండు ఈవెంట్లు జరిగితే... రెండింటిలోనూ స్వర్ణాలు, రజతాలు కూడా మనోళ్లే సాధించారు. రైఫిల్ అయినా, పిస్టల్ అయినా తమకు ఎదురులేదని నిరూపిస్తూ... భారత శిబిరంలో స్వర్ణ కాంతులు నింపారు. గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల షూటింగ్లో శనివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. ఇందులో నాలుగు పతకాలు మహిళా క్రీడాకారిణులే సాధించడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో, 25 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు లభించాయి. ఇవే ఈవెంట్లలో రెండు రజతాలు కూడా మన సొంతమయ్యాయి. అపూర్వి చండేలా, రాహీ సర్నోబత్ బంగారు పతకాలతో చమక్కుమనిపించగా...అయోనికా పాల్, అనీసా సయ్యద్ వెండి వెలుగులు కురిపించారు. అటు పురుషుల విభాగంలో 10మీ. ఎయిర్ పిస్టల్‌లో ప్రకాశ్ నంజప్ప కూడా రజతం సాధించాడు. బింద్రా స్ఫూర్తితో: బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం గెలవడంతో స్ఫూర్తి పొంది... షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న రాజస్థాన్ అమ్మాయి అపూర్వి చండేలా కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి కాంతులు పూయించింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 206.7 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణం పతకం సాధించింది. మరో షూటర్ అయోనికా పాల్ 204.9 పాయింట్లతో రెండో స్థానంతో రజతం గెలుచుకుంది. మహ్మద్ తైబీ (మలేసియా-184.4 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకుంది. అనీసా వెనక్కి...: 25మీటర్ల పిస్టల్ విభాగంలో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం ప్రదర్శించారు. చేతికి ఫ్రాక్చర్ కావడంతో మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న రాహీ సర్నోబత్... ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి స్వర్ణం గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో ఢిల్లీ క్రీడల్లో స్వర్ణం సాధించిన అనీసాను రాహీ వెనక్కి నెట్టింది. సెమీఫైనల్లో రాహీ 16 పాయింట్లు, అనీసా 14 పాయింట్లు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఫైనల్లో రాహీ 8-2 తేడాతో సహచర భారత క్రీడాకారిణిని చిత్తు చేసింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన యౌహ్లయుస్కయ కాంస్యం గెలుచుకుంది. మెరిసిన ప్రకాశ్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ప్రకాశ్ నంజప్ప 198.2 పాయింట్లతో రజత పతకాన్ని సాధించాడు. రెండో సిరీస్ ఎలిమినేషన్ వరకు పూర్తి ఆధిక్యంలో ఉన్న భారత షూటర్.. ఆరో షాట్ గురి తప్పాడు. ఈ షాట్‌కు 7.7 పాయింట్లు మాత్రమే రావడంతో రెండో స్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. డానియెల్ రెప్‌చోలి (ఆస్ట్రేలియా-199.5 పాయింట్లు) స్వర్ణం, మైకేల్ గల్ట్ (ఇంగ్లండ్-176.5 పాయింట్లు) కాంస్య పతకాలను సాధించారు. పురుషుల స్కీట్ ఈవెంట్లో మైరాజ్ అహ్మద్ ఖాన్ 7వ, బాబా బేడీ 19వ స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరడంలో విఫలమయ్యారు. -
రోజుకూలీ కొడుకు.. పతకం కొట్టాడు!!
ఆయన పేరు చంద్రకాంత్ మాలి. రోజు కూలీగా పనిచేస్తుంటారు. పొద్దున్నే లేచి కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. కానీ, గురువారం మాత్రం రాత్రంతా ఆయన మేలుకునే ఉన్నారు. స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల ప్రసారాన్ని టీవీలో చూస్తూనే ఉండిపోయారు. అర్ధరాత్ర 1.30 గంటలయ్యింది. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి ఆనందంగా అరిచారు. అవును.. ఆయన కొడుకు గణేశ్ మాలి కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం సాధించాడు!! మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకా కురుండ్వాడ్ గ్రామంలోని బసవేశ్వర్ కాలనీలో ఉన్న వాళ్ల బంధువులంతా ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. వెయిట్ లిఫ్టింగ్‌లోని 56 కిలోల విభాగంలో 21 ఏళ్ల గణేశ్ మాలి కాంస్య పతకం సాధించాడు. చంద్రకాంత్ మాలి పెయింటర్‌గా పనిచేసుకుంటుంటే, ఆయన భార్య అనిత పొలాల్లో కూలికి వెళ్తారు. వాళ్ల ఏకైక కొడుకు గణేశ్. అతడు దేశం తరఫున ఆడి పతకం సాధించాడని తెలిసి తన ఆనందానికి అంతులేదని, అతడే తమ ఆశాకిరణమని చంద్రకాంత్ చెప్పారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మాలి దంపతులు పనిలోకి కూడా వెళ్లలేకపోయారు. అయినా.. ఇప్పుడు గణేశ్ పతకం సాధించడంతో వాళ్ల ఆవేదన మొత్తం ఒక్క క్షణంలో తీరిపోయింది. గణేశ్ మాలి ఇంటర్మీడియట్ వరకు చదివి, ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చి, తల్లిదండ్రులకు సాయం చేస్తుంటాడు. -
‘గురి' కుదిరింది
10 మీ. ఎయిర్ రైఫిల్‌లో బింద్రాకు స్వర్ణం కామన్వెల్త్ గేమ్స్‌కు గుడ్‌బై చెప్పిన అభినవ్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో మలైకాకు రజతం గ్లాస్గో: వరుస పాయింట్లతో సహచరుడు దూసుకుపోయినా... మధ్యలో కాస్త ఏకాగ్రత చెదిరినా... లక్ష్యం మాత్రం చెదరలేదు. సిరీస్.. సిరీస్‌కు.. ఒక్కొక్క షాట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పాయింట్లు సాధించిన భారత్ మేటి షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో ‘పసిడి’ గురితో అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 205.3 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా గేమ్స్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. బ్యారీ బుడాన్ షూటింగ్ సెంటర్లో జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో మూడో స్థానంలో నిలిచినా ఫైనల్లో మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా లక్ష్యాన్ని చేరుకున్నాడు. సగం టైమ్ వరకు అగ్రస్థానంలో ఉన్న మరో షూటర్ రవి కుమార్ (162.4 పాయింట్లు) చివరకు నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. బాకీ (బంగ్లాదేశ్-202.1 పాయింట్లు) రజతం, రైవర్ (182.4 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఇవే నా చివరి గేమ్స్.... స్వర్ణం గెలిచిన తర్వాత బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నాకు ఇవే చివరి గేమ్స్. మొత్తం 9 పతకాలు గెలిచా. ఇక చాలు. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. వీటి కోసం చాలా కష్టపడ్డా. నా శ్రమకు తగిన ఫలితాలు వచ్చాయి’ అని మీడియాతో వెల్లడించాడు. రియో ఒలింపిక్స్ చివరిదా? కాదా? అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతానికి వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిపెట్టానన్నాడు. రజతం సాధించిన 16 ఏళ్ల మలైకా మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్, 16 ఏళ్ల మలైకా గోయల్ భారత్‌కు రజతాన్ని అందించింది. 197.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయిలో ఈమెకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇదే ఈవెంట్లో హీనా సిద్ధు నిరాశపరిచింది. షున్ జి టియో (సింగపూర్-198.6 పాయింట్లు) స్వర్ణం, డోర్తీ లుడ్విగ్ (కెనడా-117.2 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు. నెల రోజుల క్రితమే డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలినా.. పారా పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లడాన్ని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు అతనిపై జీవితకాల నిషేధం విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పీసీఐ కార్యదర్శి జె.చంద్రశేఖర్ వెల్లడించారు. సంతోషికి కాంస్యం కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం మత్స సంతోషి కాంస్యంతో మెరిసింది. మహిళల 53 కేజీల గ్రూప్-ఎ విభాగంలో ఆమె 188 (స్నాచ్ 83 + క్లీన్ అండ్ జర్క్ 105) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. క్లీన్ అండ్ జర్క్ మూడో ప్రయత్నంలో 20 ఏళ్ల సంతోషి 109 కేజీల బరువు ఎత్తే ప్రయత్నం చేసి విఫలమైంది. దీంతో తొలి రెండు స్థానాలకు దూరమైంది. విజయనగరానికి చెందిన సంతోషి గేమ్స్‌కు ముందు సిమ్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మరో భారత లిఫ్టర్ స్వాతి సింగ్ 183 (స్నాచ్ 83 + క్లీన్ అండ్ జర్క్ 100) కేజీలు ఎత్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. క్లీన్ అండ్ జర్క్‌లో స్వాతి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికా అమల్హా (నైజీరియా-196 కేజీలు) స్వర్ణం, డికా టౌవా (పపువా అండ్ న్యూగినియా-193 కేజీలు) రజత పతకాలను కైవసం చేసుకున్నారు. -
ఇంగ్లండ్, ఆసీస్ హోరాహోరీ
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పతకాల వేట హోరాహోరీగా కొనసాగుతోంది. తొలిరోజు సాధించిన మొత్తం పతకాల్లో సమానంగా నిలిచినా.. స్వర్ణాలు ఎక్కువగా దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు కూడా అదే ఆధిపత్యం ప్రదర్శించింది. సైక్లింగ్‌లో ఒక స్వర్ణంతోపాటు రెండు రజతాలు సాధించింది. జూడోకాలు ఓ పసిడి, రెండు కాంస్య పతకాలను ఇంగ్లండ్‌కు అందిస్తే, షూటింగ్‌లోనూ ఓ కాంస్యం దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా శుక్రవారం సైక్లింగ్‌లో ఏకంగా ఐదు పతకాలు కొల్లగొట్టింది. ఇందులో ఒక స్వర్ణంతోపాటు మూడు రజతాలున్నాయి. 4 x100 మీ. స్విమ్మింగ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రపంచ రికార్డు (3 నిమిషాల 30:98 సెకన్లు) నెలకొల్పారు. ఇక ఆతిథ్య స్కాట్లాండ్ సైక్లింగ్, జూడోల్లో ఒక్కో స్వర్ణంతోపాటు మొత్తం ఆరు పతకాలు సాధించి తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంది. -
‘బరువు’ పెరిగింది
వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట పురుషుల హాకీ జట్టు బోణీ బ్యాడ్మింటన్‌లో జైత్రయాత్ర కామన్వెల్త్ క్రీడల రెండో రోజు భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు పతకాలతో పరువు నిలబెట్టారు. న్యూఢిల్లీలో జరిగిన గత క్రీడలతో పోలిస్తే ఈసారి కాస్త జోరు తగ్గినా... ఓవరాల్‌గా తొలి రెండు రోజలు భారత క్రీడాకారుల ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్లు పతకాల పంట పండించారు. తొలి రెండు రోజుల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి సత్తా చాటారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 56 కేజీల కేటగిరీలో సుకేన్ డే 248 (స్నాచ్ 109 + క్లీన్ అండ్ జర్క్ 139) కేజీల బరువు ఎత్తి స్వర్ణం గెలవగా, గణేశ్ మాలి 244 (స్నాచ్ 111 + క్లీన్ అండర్ జర్క్ 133) కేజీలతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. మహిళల జూడో 63 కేజీల విభాగం కాంస్య పతక పోరులో సునీబాల హుడ్రోమ్... సాలీ కాన్వే (స్కాట్లాండ్) చేతిలో ఓడి పతకానికి దూరమైంది. రెప్‌చేజ్ రౌండ్లో ఆమె... మోనికా బార్గెస్ (కెనడా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. గరిమా చౌదరీ (భారత్) క్వార్టర్స్ బౌట్లో క్లార్క్ (స్కాట్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 5-0తో కెన్యాను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీకాంత్-జ్వాల 21-8, 21-8తో మోబోగో-జోసెఫ్‌లపై; పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో విక్టర్ ముంగాపై; మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసీ 21-4, 21-2తో లావినా మార్టిన్స్‌పై; పురుషుల డబుల్స్‌లో గురుసాయిదత్-ప్రణవ్ చోప్రా 21-5, 21-6తో జోసెఫ్ గితిటూ-మోబోగోపై; మహిళల డబుల్స్‌లో పి.వి.సింధు-జ్వాల 21-4, 21-5తో మార్టిన్స్-జోసెఫ్‌లపై గెలిచారు. పురుషుల బాక్సింగ్: సూపర్ హెవీ వెయిట్ (+91 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో పర్వీన్ 0-3తో హెండర్సన్ (స్కాట్లాండ్) చేతిలో ఓడాడు. టేబుల్ టెన్నిస్: పురుషుల గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గువానాపై గెలిచింది. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్: సందీప్ సెజ్వాల్ సెమీస్‌కు అర్హత సాధించాడు. హీట్స్‌లో 1:02.97 సెకన్ల టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 16 మంది స్విమ్మర్లు సెమీస్‌కు చేరారు. మరోవైపు 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో సాజన్ ప్రకాశ్ 1:53.82 సెకన్ల టైమింగ్‌తో 22వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సైక్లింగ్: భారత్ సైక్లిస్ట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 4 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్ విభాగంలో మంజిత్ సింగ్ (4:55.164 సెకన్లు) 16వ; సోంబీర్ (4:57.202 సెకన్లు) 17వ; అమిత్ కుమార్ (4:58.444 సెకన్లు) 18వ స్థానాల్లో నిలిచారు. మహిళల 3 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్లో సునీతా ఎంగ్లమ్ (4:07.614 సెకన్లు) 17వ స్థానంతో సరిపెట్టుకుంది. స్క్వాష్: స్టార్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3-11, 8-11, 11-8, 5-11తో మూడోసీడ్ జోలీ కింగ్ (న్యూజిలాండ్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల ప్లేట్ రౌండ్లో ఆనక అలకమోని 3-0తో నడుని గుణవర్ధిని (శ్రీలంక)పై నెగ్గింది. హాకీలో బోణీ: పెనాల్టీ కార్నర్లతో విజృంభించిన భారత పురుషుల హాకీ జట్టు గేమ్స్‌లో శుభారంభం చేసింది. పూల్-ఏ ప్రిలిమినరి మ్యాచ్‌లో 3-1తో ప్రపంచ 31వ ర్యాంకర్ వేల్స్‌పై విజయం సాధించింది. రఘునాథ్ (20వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (42వ ని.), గుర్విందర్ సింగ్ చండి (47వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. వేల్స్ తరఫున ఆండ్రూ కార్నిక్ (23వ ని.) ఏకైక గోల్ చేశాడు. -
లిఫ్టర్ల బలం... జూడోకాల పట్టు
-
సిగ్గుచేటు
డోపీగా తేలిన భారత పారా అథ్లెట్ సచిన్ గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. పతకాల ఖాతా తెరవకముందే దేశానికి అప్రతిష్ట తెచ్చిపెట్టాడు పారా పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి. డోప్ టెస్టులో పట్టుబడి ఇంటిబాట పట్టాడు. అయితే ఈ టెస్టు జరిపింది ఇప్పుడు కాదు. కామన్వెల్త్ పోటీలకు బయలుదేరకముందే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గత నెలలో జరిపిన ‘అవుట్ ఆఫ్ కాంపిటీషన్’ టెస్టులో సచిన్ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు ఆలస్యంగా వెల్లడైంది. దీంతో అతని పేరును పోటీల జాబితా నుంచి తొలగించినట్లు పారా స్పోర్ట్స్ సభ్యుడొకరు తెలిపారు. అతను మళ్లీ గ్లాస్గోకు వచ్చే అవకాశం లేదన్నారు. అనుభవజ్ఞుడైన సచిన్ చౌదరి నిష్ర్కమణతో పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకం సాధించే అవకాశం కోల్పోయినట్లయింది. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ తోమర్ తెలిపారు. -
స్టింప్సన్‌కు తొలి స్వర్ణం
గ్లాస్గో: బ్రిటిష్ రాణిగారి ఆటలుగా పరిగణించే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాల బోణీ ఇంగ్లండ్‌కే దక్కింది. గురువారం తొలిరోజు జరిగిన మహిళల ట్రయథ్లాన్‌లో జోడీ స్టింప్సన్ విజేతగా నిలిచి ఇంగ్లండ్‌కు పసిడి పతకాన్నందించింది. 1500 మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్‌తో కూడిన ఈ మల్టీ స్పోర్ట్ ఈవెంట్‌ను స్టింప్సన్ గం.1:58:56 ని. సమయంలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన కిర్‌స్టెన్ స్వీట్లాండ్ గం.1:59:01ని. సమయం నమోదు చేసి రజతం సాధించగా... ఇంగ్లండ్‌కే చెందిన విక్కీ హాలండ్ గం. 1:59:11ని.తో కాంస్యం దక్కించుకుంది. -
తొలిరోజు ఇంగ్లండ్ హవా
గ్లాస్గో: అంగరంగ వైభవంగా ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు పోటీలు కూడా అంతే స్థాయి హంగామా మధ్య జరిగాయి. గురువారం జరిగిన పలు క్రీడాంశాల్లో ఊహించినట్లుగానే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య పోటీ నెలకొనగా.. ఆతిథ్య స్కాట్లాండ్ కూడా పతకాల పరుగును వేగంగా ప్రారంభించింది. ఆ వెనకే మేమున్నామంటూ భారత అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడుతూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. తొలిరోజు జరిగిన పలు పోటీల్లో ఇంగ్లండ్ 4 స్వర్ణాలతో సహా మొత్తం 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతూ హవా ప్రదర్శిస్తోంది. స్కాట్లాండ్ అనూహ్యంగా చివర్లో మూడు స్వర్ణాలతో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా 9 పతకాలతో మూడో స్థానంలో ఉంది. తొలుత ట్రయథ్లాన్‌లో సాధించిన స్వర్ణంతో బోణీ కొట్టిన ఇంగ్లండ్.. ఆ ఈవెంట్లో పురుషుల విభాగంలోనూ పసిడిని దక్కించుకుంది. సైక్లింగ్‌లో ఒకే స్వర్ణం గెలుచుకోగలిగినా.. ఆ క్రీడాంశంలో మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. హాకీలో జరిగిన ప్రిలిమినరీ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మిహ ళల జట్టు ఏకంగా 16-0 తేడాతో ట్రినిడాడ్ అండ్ టొబాగోపై ఘన విజయం సాధించింది. -
లిఫ్టర్ల బలం... జూడోకాల పట్టు
తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం సహా 5 పతకాలు కామన్వెల్త్ గేమ్స్ తొలిరోజు భారత అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించారు. దీంతో తొలి రోజు మన ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. వెయిట్ లిఫ్టర్ సంజిత దేశం తరఫున తొలి స్వర్ణం సాధించింది. గ్లాస్గో: ఊహించినట్లుగానే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ కండ బలాన్ని చూపించి రెండు పతకాలను కొల్లగొట్టారు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సంజితా కుమ్‌చమ్ 173 (స్నాచ్ 77+ క్లీన్ అండ్ జర్క్ 96) కేజీల బరువు ఎత్తి స్వర్ణం సాధించింది. మీరాబాయి చాను 170 (స్నాచ్ 75+ క్లీన్ అండ్ జర్క్ 95) కేజీలతో రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. కెచీ ఓప్రా (నైజీరియా) 162 కేజీలతో (స్నాచ్ 70+ క్లీన్ అండ్ జర్క్ 92) కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల జూడో 48 కేజీల కేటగిరీ ఫైనల్లో సుశీలా లిక్మాబామ్ 0-1తో రెనిక్స్ (స్కాట్లాండ్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తిపడింది. పురుషుల 60 కేజీల పతక పోరులో నవజ్యోత్ చనా (పంజాబ్) కూడా మెకంజీ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. 52 కేజీల విభాగంలో కల్పన తౌడమ్... క్రిస్టియాని లెజెంటిల్ (మారిషస్)పై గెలిచి కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల 66 కేజీల విభాగం రెప్‌చేజ్ రౌండ్లో గెలిచిన మంజీత్ నందాల్ కాంస్య పతక పోరులో సియెబులా మబుల్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అంతకుముందు జరిగిన పోటీల్లో సుశీల తొలి రౌండ్లో మరియా మెడ్జా ఈఫా (కామెరూన్)పై; క్వార్టర్స్‌లో మేయర్ (ఆస్ట్రేలియా)పై; సెమీస్‌లో... రైనర్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో నవజ్యోత్... ప్రత్యర్థి డానియెల్ లీ గ్రాంజీ (దక్షిణాఫ్రికా)ను ఒక నిమిషం 51 సెకన్లలో నాకౌట్ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు. బ్యాడ్మింటన్‌లో హవా: మిక్స్డ్ టీమ్ గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్ 5-0తో ఘనాపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-6, 21-16తో డానియెల్ సామ్‌పై; మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 21-7, 21-5తో స్టెల్లా అమసాహ్పై; పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా 21-7, 21-11తో ఇమాన్యుయేల్ డోంకోర్-అబ్రమ్ అయెటీలపై; మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని 21-4, 21-10తో ఆర్చర్-బోట్వేలపై; మిక్స్డ్ డబుల్స్‌లో పి.సి.తులసీ-శ్రీకాంత్ 21-5, 21-9తో సామ్-అమసాహ్లపై గెలిచారు. టీటీలోనూ ఎదురులేదు: టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఆకట్టుకుంది. పురుషుల గ్రూప్-3 తొలి మ్యాచ్‌ల్లో 3-0తో వనౌత్పై గెలిచి ముందంజ వేసింది. మహిళల గ్రూప్-4 మ్యాచ్‌ల్లో భారత్ 3-0తో బార్బడోస్పై; 3-1తో నైజీరియాపై విజయం సాధించింది. స్క్వాష్: మహిళల రెండో రౌండ్లో దీపికా పల్లికల్ 3-0తో చార్లెటీ నాగ్స్ (ట్రినిడాడ్)పై; జోష్న చినప్ప 3-1తో డియోన్ సఫెరీ (వేల్స్)పై; ఆనక అలకమోని 3-0తో డాలియా ఆర్నాల్డ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. హాకీలో మహిళల శుభారంభం: మహిళల హాకీ ప్రిలిమినరీ రౌండ్లో భారత్ 4-2తో కెనడాపై నెగ్గింది. స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. హీట్స్‌లో అతను 3:59:29 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 20వ స్థానంలో నిలిచాడు. 100 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో పారా స్విమ్మర్ ప్రశాంత కర్మాకర్ 1.04.86 సెకన్లలో రేసును ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. సైక్లింగ్‌లో భారత సైక్లిస్ట్‌లు నిరాశపర్చారు. పురుషుల స్ప్రింట్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో అమర్జిత్, అమ్రిత్, అలన్ బాబీలు వరుసగా 22, 23, 25వ స్థానాల్లో నిలిచారు. 400 మీటర్లలో భారత బృందం ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. -
కలర్‌ఫుల్
అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం తొలుత మార్చ్‌పాస్ట్ చేసిన భారత బృందం వీడియోలో తలకిందులైన భారత పతాకం గేమ్స్ ప్రారంభ వేడుకల్లో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ అధికారిక గీతం ‘లెట్ ద గేమ్స్ బిగిన్’ను వీడియో రూపంలో చిత్రీకరించి ప్రారంభ వేడుకల్లో ప్రదర్శించారు. ఇందులో అన్ని దేశాల పతాకాలు కనిపిస్తాయి. అయితే భారత్‌కు సంబంధించిన త్రివర్ణ పతాకాన్ని మాత్రం తలకిందులుగా చూపారు. గ్లాస్గో: స్కాట్లాండ్ సంస్క ృతి, చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతూ 20వ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గ్లాస్గోలోని సెల్టిక్ పార్క్‌లో 40 వేల మంది ప్రేక్షకుల ముందు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమవుతున్నట్టు ప్రకటించారు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడియో సందేశం ద్వారా అభిమానులను పలుకరించారు. 71 దేశాల నుంచి వచ్చిన 4500 మంది అథ్లెట్లకు స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ఇటీవలి మలేసియా విమాన దుర్ఘటనకు నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటించారు. రాణితో పాటు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, స్కాటిష్ మంత్రి అలెక్స్ సాల్మండ్, కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య అధ్యక్షుడు ప్రిన్స్ ఇమ్రాన్ టుంకు తదితరులు పాల్గొన్నారు. ►ముందుగా ప్రపంచ ప్రఖ్యాత స్కాటిష్ సింగర్లు రాడ్ స్టివార్ట్, సుసాస్ బోలే తమ పాటలతో హోరెత్తించారు. ► 100 మీ. వెడల్పుతో స్టేడియంలోని దక్షిణ స్టాండ్ ముందు 11మీ. ఎత్తు కలిగిన ఎల్ఈడీ భారీ స్క్రీన్ ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ► స్టేడియం మీదుగా తొమ్మిది జెట్ విమానాలు ఎగురుతూ ప్రేక్షకులను కట్టిపడేశాయి. వందలాది నృత్య కళాకారులు తమ డ్యాన్స్‌లతో ఉర్రూతలుగించారు. ►గత క్రీడలకు ఆతిథ్యమిచ్చిన భారత్ తమ అథ్లెట్లతో ముందుగా మైదానంలోకి అడుగుపెట్టింది. షూటర్ విజయ్ కుమార్ భారత పతాకాన్ని చేతపట్టగా ఇతర అథ్లెట్లు అతడిని అనుసరించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సంగీతం వినిపించింది. ►ఆ తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ కొద్దిసేపు వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఆర్థికంగా సహాయపడాలని యూనిసెఫ్ రాయబారి హోదాలో కోరాడు. ►మలేసియా జట్టు తమ జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయగా, ఆ దేశ అథ్లెట్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు. ► దేశాల రాక అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ►చివర్లో కామన్వెల్త్ బ్యాటన్‌ను జమైకాకు చెందిన చిన్నారి తీసుకురాగా తన నుంచి 32 మంది డెలిగేట్స్ మధ్య చేతులు మారి చివరికి రాయల్ బాక్స్‌కు చేరింది. దీన్ని ఇంగ్లండ్ అథ్లెట్ దిగ్గజం సర్ క్రిస్ హాయ్ సీజీఎఫ్ చీఫ్ ప్రిన్స్ ఇమ్రాన్‌కు అందజేశారు.అనంతరం రాణి ఎలిజబెత్ క్రీడలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. -
అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడలు
-
వైభవంగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు
-
మువ్వన్నెలు మురిసేనా!
భారత బృందంపై పెరిగిన అంచనాలు టాప్-3 లక్ష్యం నూట ఇరవై కోట్ల జనాభా... కానీ ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం కోసం కళ్లు కాయలు కాస్తున్నాయి. పసిడి గెలవడానికి ప్రమాణాలు సరిపోవడం లేదంటున్నారు.పోనీ ఆసియా గేమ్స్‌లోనైనా సాధిద్దామంటే చైనా డ్రాగన్‌కు భయపడిపోతున్నారు.అందుకే భారత క్రీడాకారులకు కామన్వెల్త్ గేమ్స్ ఓ పండుగలాంటిది. పెద్ద సంఖ్యలో పసిడి పతకాలు సాధించాలన్నా... అసాధారణ ప్రతిభతో రికార్డుల మోత మోగించాలన్నా ఈ గేమ్స్ వేదికగా నిలుస్తున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా భారీ బృందంతో బరిలోకి దిగుతున్న భారత్... ఢిల్లీ గేమ్స్‌ని దాటాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుత గేమ్స్‌లో కొన్ని ఈవెంట్లను తప్పించడంతో పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా ... టాప్-3 లక్ష్యంగా పెట్టుకుంది. గ్లాస్గో : స్వదేశంలో జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ (2010)ను ఊహించని వివాదాలు చుట్టిముట్టినా... ఆట పరంగా భారత్‌కు మధురస్మృతులే మిగిలాయి. సొంతగడ్డను అనుకూలాంశంగా మల్చుకుని భారత అథ్లెట్లు చెలరేగిపోయారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. రికార్డు స్థాయిలో 38 స్వర్ణాలు గెలిచి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. జిమ్నాస్టిక్స్‌లో ఆశిష్ కుమార్ పతకాలు గెలవడం, 52 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించడంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ మరుపురాని విజయాలను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల కిందటి ప్రదర్శనను పునరావృతం చేయాలనే భారీ ప్రణాళికతో భారత్ గ్లాస్గోకు బయలుదేరి వెళ్లింది. 14 విభాగాల్లో 213 మంది బరిలోకి దిగుతున్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో 32 మంది పోటీపడుతున్నారు. 2010 గేమ్స్‌లో 12 పతకాలు అందించిన ఆర్చరీ, టెన్నిస్‌లను ఈసారి తొలగించారు. దీంతో భారత్ పతకాల సంఖ్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవరాల్‌గా 60 పతకాలు సాధించి టాప్-3లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అభినవ్ బింద్రా, నారంగ్, విజేందర్, సుశీల్, యోగేశ్వర్ దత్, కృష్ణ పూనియా, ఆశిష్ కుమార్, శరత్ కమల్ స్వర్ణాలపై కన్నేశారు. బ్యాడ్మింటన్ గాయం కారణంగా స్టార్ సైనా నెహ్వాల్ గేమ్స్‌కు దూరమైనా.. ఈ విభాగంలో పతకం వచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీలో సైనా, కశ్యప్, జ్వాల-అశ్విని జోడి స్వర్ణాలు గెలిచింది. ఇప్పుడు రైజింగ్ స్టార్ పి.వి.సింధుపై ఆశలు అధికంగా ఉన్నాయి. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ పోటీల నుంచి వైదొలగడంతో కశ్యప్ ఏదో ఓ పతకం లభించే అవకాశం ఉంది. శ్రీకాంత్, గురుసాయిదత్లు సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్వాల జోడీకి గట్టిపోటీ ఎదురుకానుంది. బాక్సింగ్ ఈసారి కూడా భారత్ ‘పంచ్’ బలంగా పడనుంది. దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్ కుమార్, విజేందర్ సింగ్, సుమిత్ సాంగ్వాన్, ప్రవీణ్ మోరెలు పతకాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ స్వర్ణం నెగ్గే అవకాశాలున్నాయి. ఇక తొలిసారిగా ఈ టోర్నీలో మహిళా బాక్సింగ్‌ను ప్రవేశపెట్టగా పింకీ జాంగ్రా, ఎల్.సరితా దేవి, పూజా రాణి తమ పంచ్ రుచి చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. హాకీ ఢిల్లీ గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న హాకీ జట్టు ఈసారి కూడా తుది పోరుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీస్‌లో న్యూజిలాండ్ లేదా ఇంగ్లండ్లను ఓడించాల్సి వస్తుంది. మహిళల జట్టు తమ గ్రూప్‌లో టాప్-2లో నిలవాలనే ఆశయంతో ఉంది. టేబుల్ టెన్నిస్ భారత్ కనీసం రెండు పతకాలు గెలవొచ్చు. 2010లో ఒక స్వర్ణంతో పాటు ఐదు పతకాలు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ జట్టు కోచ్ పీటర్ ఎంగెల్ ఈసారి మూడు పతకాలు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వెటరన్ ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్, పౌలోమి ఘటక్, అంకితా దాస్‌పై అంచనాలు అధికంగా ఉన్నాయి. జిమ్నాస్టిక్స్ ఢిల్లీ గేమ్స్‌లో ఆశిష్ కుమార్ అనూహ్యంగా ఓ రజతం, కాంస్యంతో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈసారి అంచనాలను అందుకోగలడా? లేదా? అనేది వేచి చూడాలి. స్క్వాష్ స్టార్ ప్లేయర్లు దీపికా పల్లికాల్, జోష్న చినప్ప, సౌరవ్ ఘోశల్ బరిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అథ్లెటిక్స్ గతంలో ఈ విభాగంలో 2 స్వర్ణాలతో 12 పతకాలు సాధించిన భారత్... ఈసారి పతకాలు కోల్పోయే అవకాశాలున్నాయి. చాలా మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు సరైన ఫామ్‌లో లేకపోవడం ప్రతికూలంగా మారింది. కృష్ణ పూనియా, సీమా పూనియా, వికాస్ గౌడ (డిస్కస్ త్రో), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్)లు పతకాలు తేవొచ్చు. షూటింగ్ భారత్‌కు భారీగా పతకాలు వచ్చే విభాగంలో ఇదీ ఒకటి. 2010లో 14 స్వర్ణాలతో కలిపి మొత్తం 30 పతకాలు దక్కాయి. అయితే ఈసారి 18 ఈవెంట్స్‌ను తగ్గించి 19 విభాగాలకే పరిమితం చేశారు. 10మీ. ఎయిర్ రైఫిల్‌లో బింద్రా స్వర్ణంపై గురిపెట్టగా, 50మీ. రైఫిల్ ప్రోన్‌లో నారంగ్, 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో విజయ్ కుమార్, 10మీ. ఎయిర్ పిస్టల్‌లో హీనా సిద్ధు రూపంలో పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ భారత లిఫ్టర్లు ఈసారి కూడా ఎనిమిది పతకాలు సాధించే అవకాశం ఉంది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు రవి కుమార్ (69కేజీ), సంగీతా చాను (48కేజీ) గత నెల రోజులుగా బర్మింగ్‌హామ్‌లో శిక్షణ పొందారు. రవికుమార్‌కు సహచరుడు సతీష్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. రెజ్లింగ్ ఈ విభాగంలో భారత్‌కు ఈసారి ప్రతికూలతలు ఎదురుకానున్నాయి. క్రితంసారి రెజ్లింగ్‌లో భారత్ 19 పతకాలు సాధిస్తే... ఒక్క గ్రీకో రోమన్ విభాగంలోనే భారత్‌కు 7 పతకాలు దక్కాయి. ఇందులో 4 స్వర్ణాలున్నాయి. అయితే ఈసారి ఆ విభాగాన్ని తొలగించారు. సుశీల్ కుమార్ (74కేజీ), యోగేశ్వర్ (65కేజీ), రాజీవ్ తోమర్ (125కేజీ), అమిత్ కుమార్ (57కేజీ)పై అంచనాలు అధికంగా ఉండటంతో ఈసారి కనీసం 10 పతకాలను ఆశిస్తున్నారు. పారా స్పోర్ట్స్ పురుషుల 50మీ. ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో కాంస్యం గెలిచిన కర్మాకర్ ఈసారి కూడా పతకం రేసులో ఉన్నాడు. భారత ఆటగాళ్లు లాన్ బౌల్స్, జూడో, సైక్లింగ్, అక్వాటిక్స్లో కూడా బరిలోకి దిగుతున్నారు. -
గో...గో...గ్లాస్గో
నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్ చిరుతను మించిన వేగంతో పరిగెత్తే అథ్లెట్లు... ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టే రెజ్లర్లు... ఒక్క పంచ్‌తో చుక్కలు చూపించే బాక్సర్లు... ఇక 12 రోజుల పాటు కావలసినంత క్రీడల వినోదం. ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్ధమైంది. రాణిగారి ఆటలుగా ముద్రపడ్డ ఈ క్రీడలకు నేడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో తెరలేవనుంది. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం నుంచి ఆటలు మొదలవుతాయి. ఆగస్టు 3 వరకు ఈ సంబరం కొనసాగుతుంది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్... ఈసారి కూడా భారీ బృందంతోనే బరిలోకి దిగుతోంది. గ్లాస్గో: ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రీడా పండుగ ‘కామన్వెల్త్ గేమ్స్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి 12 రోజుల పాటు జరగనున్న ఈ మెగా ఈవెంట్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన మేటి అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. గతంలో రెండుసార్లు ఈ పోటీలకు వేదికైన స్కాట్లాండ్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1970, 1986లో ఎడిన్బర్గ్లో పోటీలు జరిగాయి. మొత్తం పోటీలను కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) పర్యవేక్షిస్తుంది. మెరిసిపోతున్న గ్లాస్గో అబుజా (నైజీరియా), హలిఫాక్స్ (కెనడా)ల నుంచి గట్టిపోటీ తట్టుకుని కామన్వెల్త్ బిడ్‌ను గ్లాస్గో దక్కించుకోవడంతో నిర్వాహకులు ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అథ్లెట్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేటి అర్ధరాత్రి సెల్టిక్ పార్క్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 3న జరిగే ముగింపు వేడుకకు హంప్డెన్ పార్క్ ఆతిథ్యమిస్తుంది. స్కాట్లాండ్ జాతీయ ఫుట్‌బాల్ స్టేడియమైన ఈ పార్క్ సీటింగ్ సామర్థ్యం 52, 025. ఈ స్టేడియంలోనే అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. గ్లాస్గోకు బిడ్‌ను కేటాయించే సమయానికి దాదాపు 70 శాతం వేదికలను పూర్తి చేశారు. పోటీలు జరిగే ప్రదేశాలను మూడు ప్రాంతాలుగా విడగొట్టారు. ఈస్ట్ ఎండ్ క్లస్టర్ మొత్తం క్రీడా గ్రామానికి కేటాయించారు. 6500 మంది అథ్లెట్స్, 2500 మంది అధికారులు ఇందులో బస చేస్తారు. ఇక్కడి నుంచి సెల్టిక్ పార్క్‌లోని ఎమిరేట్స్ ఎరెనాకు ప్రత్యేకంగా రోడ్‌ను నిర్మించారు. బాడ్మింటన్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు ఇక్కడ జరుగుతాయి. గ్లాస్గో గ్రీన్‌లో మారథాన్, హాకీ, రోడ్ సైక్లింగ్ రేస్ పోటీలను నిర్వహిస్తారు. టోలోక్రాస్ అక్వాటిక్ సెంటర్ స్విమ్మింగ్ పోటీలకు ఆతిథ్యమిస్తుంది. దీని సామర్థ్యం 5 వేల మంది. ఈసారి మొత్తం 17 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. గతంలో 2010లో ఢిల్లీలో నిర్వహించిన వాటిలో ఆర్చరీ, టెన్నిస్, వాకింగ్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లను పోటీల నుంచి తప్పించారు. ట్రయథ్లాన్ మిక్స్డ్ రిలే ఈవెంట్‌తో పాటు మహిళల బాక్సింగ్‌ను అదనంగా చేర్చారు. మస్కట్ ‘క్లైడ్’ గ్లాస్గో మధ్య నుంచి పారే నది పేరు ‘క్లైడ్’. గేమ్స్ అధికారిక మస్కట్‌కు ఈ పేరు పెట్టారు. స్కాట్లాండ్లో మూడో అతి పెద్దదైన ఈ నది గ్లాస్గోలోని పెద్ద పట్టణాలను కలుపుతూ పారుతుంది. ఇప్పటి వరకు గేమ్స్‌కు సంబంధించి 11 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఇంకా పెద్ద మొత్తంలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణ బోల్ట్ ఈసారి గేమ్స్‌లో జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 4ఁ100 రిలేలో అతను సత్తా చూపనున్నాడు. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మో ఫరా, డేవిడ్ రుడిషా, సైక్లిస్ట్ సర్ బ్రాడ్లీ విగ్గిన్స్, వేల్ష్ సైక్లిస్ట్ గెరాంట్ థామస్, స్విమ్మర్ మైకేల్ జెమీసన్, ఆస్ట్రేలియాకు చెందిన అలికా కౌట్స్, స్ప్రింటర్ కిరాణి జేమ్స్లాంటి మేటి అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాదే ఆధిపత్యం ఇప్పటి వరకు 19సార్లు జరిగిన ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 12సార్లు పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఇంగ్లండ్ (6 సార్లు) ఉంది. ఈసారి గేమ్స్‌లో కూడా కంగారులే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 803 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఓవరాల్‌గా 2 వేల పతకాలు సాధించిన దేశం కూడా ఇదే. 13 క్రీడలు జరిగే వేదికలు 17 పోటీలు జరిగే క్రీడాంశాలు. ఓవరాల్‌గా 261 పతక పోటీలు జరుగుతాయి. 71 క్రీడల్లో పాల్గొనే దేశాలు, దీవులు 213 పోటీల్లో పాల్గొనే భారత అథ్లెట్లు 1385 అథ్లెట్లకు ఇచ్చేపతకాలు 6500 పాల్గొంటున్న అథ్లెట్లు విశేషాలు ఈ క్రీడల కోసం 50 వేల 811 మంది వాలెంటర్లు పని చేయనున్నారు. అథ్లెట్ల కోసం 5 లక్షల పండ్లు, 60 టన్నుల ఆలుగడ్డలు సిద్ధంగా ఉంచారు. క్రీడా గ్రామం విస్తీర్ణం 35 హెక్టార్లు. 54 ఫుట్‌బాల్ మైదానాలకు ఇది సమానం. 840 షటిల్కాక్స్ను బాడ్మింటన్ పోటీల్లో వాడనున్నారు. ఆరు క్రీడల కోసం 3వేల బంతులను ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా హంప్డెన్ పార్క్ ఉపరితలాన్ని 1.9 మీటర్ల ఎత్తుకు పెంచారు. ఒరిజినల్ కామన్వెల్త్ గేమ్స్‌లో 11 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో 10 కోర్ స్పోర్ట్స్ ఉంటే, మిగతా వాటిని ఆతిథ్య దేశం ఎంపిక చేస్తుంది. క్వీన్స్ బ్యాటన్ 288 రోజుల పాటు 1 లక్షా 18 వేల మైళ్లు ప్రయాణించింది. 1958లో కార్డిఫ్ గేమ్స్‌లో తొలిసారి క్వీన్స్ బ్యాటన్‌ను ప్రవేశపెట్టారు. చేపల పోటీలతో మొదలు.. పూర్వకాలంలో బ్రిటిష్ రాజుల మధ్య సరదాగా జరిగే చేపల పోటీలు కాల క్రమంలో కామన్వెల్త్ గేమ్స్‌కు దారితీశాయి. 1891లో జాన్ ఆష్లే కూపర్ నాలుగేళ్లకొకసారి క్రీడల పండుగలు నిర్వహిస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనతో వీటికి బీజం పడింది. బ్రిటిష్ రాజుల మధ్య అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ క్రీడలను వేదికగా చేసుకున్నారు. 1911 లండన్ క్రిస్టల్ ప్యాలెస్‌లో జరిగిన కింగ్ జార్జ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇంటర్ ఎంపైర్ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, యూకేలు మాత్రమే బరిలోకి దిగాయి. బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్‌లో పోటీలు జరిగాయి. 1930లో ఒంటారియోలోని హామిల్టన్‌లో తొలిసారి బ్రిటిష్ ఎంపైర్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మహిళలు కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. 1934 నుంచి కొన్ని అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. 1954 నుంచి 1966 వరకు బ్రిటిష్ అంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970 నుంచి 1974 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా నిర్వహించారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ పేరుతో పోటీలు జరుగుతున్నాయి. అందగత్తె బరువులెత్తుతోంది సాధారణంగా అందగత్తెలు మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంటారు.. మూడు స్టేజ్ షోలు.. ఆరు క్యాట్ వాక్‌లతో ఈ రంగంలో దూసుకుపోతారు. కానీ.. ఇంగ్లండ్‌కు చెందిన 21 ఏళ్ల బ్యూటీ క్వీన్ సారా డేవిస్ మోడలింగ్‌ను వదులుకుని, మహిళలు అంతగా ఇష్టపడని వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. సారా త్యాగానికి కారణం ఆమె ప్రియుడు జాక్ ఒలివర్. ఇంగ్లండ్ తరఫున వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతుండటంతో అతన్ని స్ఫూర్తిగా తీసుకుని... ఈ క్రీడలోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే సత్తా చాటిన సారా ప్రస్తుతం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగుతోంది. ఆమె ప్రియుడు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ చిన్నది ఇప్పుడు ‘స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ’ అంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ 2012లో మిస్ లీడ్స్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఓ స్కూల్లో పీఈటీగా పనిచేస్తోంది. ప్రధాని శుభాకాంక్షలు న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. ‘గ్లాస్గో గేమ్స్‌లో బరిలోకి దిగుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్నాను. వారు మన దేశం గర్వపడేలా ఆడతారని భావిస్తున్నాను. కామన్వెల్త్ లాంటి ఈవెంట్స్‌లో పోటీపడి క్రీడాకారులు పేరు ప్రఖ్యాతులు సాధించడమే కాకుండా... ఈ గేమ్స్ దేశాల మధ్య సమైక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు తోడ్పడతాయి’ అని మోడి అన్నారు. ‘సౌకర్యాలు దారుణం’ గత కామన్వెల్త్ గేమ్స్ లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సౌకర్యాలతో పోలిస్తే ఇక్కడి గేమ్స్ విలేజి పరిస్థితి దారుణంగా ఉందని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ ఆరోపించారు. అప్పట్లో పరిశుభ్రత, సౌకర్యాలు లేవని చాలా దేశాలు తమను విమర్శించినా గ్లాస్గోలో పరిస్థితులు అంతకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. ‘ఇక్కడి విలేజి చాలా తక్కువ విస్తీర్ణంలో కట్టారు. చాలీచాలని బాత్రూమ్స్తో పాటు తక్కు వ టీవీ సెట్స్‌తో ఇబ్బందిపడుతున్నాం. ఇక్కడితో పోల్చుకుంటే 2010లో ఢిల్లీలో గొప్ప సౌకర్యాలు అందించాం’ అని రాజ్ సింగ్ పేర్కొన్నారు. -
నల్ల చిరుత.. మళ్లీ వస్తోంది!
ట్రాక్ మీదకు వచ్చాడంటే చాలు.. ఎప్పుడు మొదలుపెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియనంత వేగంగా పరుగులు తీస్తాడు. అలాంటి నల్ల చిరుత ఉసేన్ బోల్డ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా కొంతకాలంగా ట్రాక్‌కు దూరంగా ఉన్న బోల్ట్.. వచ్చే నెలలో మళ్లీ పరుగులు మొదలుపెడుతున్నాడు. వచ్చే నెలలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ క్రీడలతో మొదలుపెట్టి, వరుసపెట్టి నాలుగు ఈవెంట్లలో బోల్ట్ పాల్గొంటాడు. భూమ్మీద ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా పేరు పొందిన ఉసేన్ బోల్ట్.. తన రేసింగ్ షెడ్యూలును విడుదల చేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో జమైకా తరఫున స్ప్రింట్ రిలేలో కూడా పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్, వెబ్సైట్ ద్వారా తెలిపాడు. My race schedule finalized: CWG 4x100m, Brazil- Rio-Sun 17 Aug, Poland-Warsaw Sat 23 Aug, Zurich-Thurs 28 Aug ..#SeenUsoon #Cantwait — Usain St. Leo Bolt (@usainbolt) July 20, 2014 -
ఈసారి స్వర్ణంపై గురి: కశ్యప్
న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యంతో సంతృప్తి పడిన భారత అగ్రశ్రేణి షట్లర్ పారుపల్లి కశ్యప్ ఈసారి స్వర్ణ పతకంపై గురి పెట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) వైదొలగడంతో పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. ‘లీ చోంగ్ వీ తప్పుకోవడంతో నేను పసిడి పతకంపై దృష్టి సారించాను. రెండో సీడ్‌గా ఉన్న నేను స్వర్ణం సాధించగలనని తెలుసు. అయితే వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) నుంచి గట్టిపోటీ తప్పదు. నాతోపాటు శ్రీకాంత్, గురుసాయిదత్లకూ పతకాలు నెగ్గే సత్తా ఉంది’ అని కశ్యప్ తెలిపాడు. క్రితంసారి న్యూఢిల్లీలో భారత బ్యాడ్మింటన్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగు పతకాలు గెలిచింది. గ్లాస్గో క్రీడల్లో భారత్ దీనికంటే మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఈ హైదరాబాద్ ప్లేయర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.